డా. యం.గేయానంద్

క్రీ.పూ. 7 వేలకు ముందే భారత ఉపఖండంలో బార్లీ, గోధుమ పండించారు. సింధూ నాగరికత సమయంలో ఎద్దుల బళ్ళు (2500-1900 BC) ఉండేవి. క్రీ.పూ.3000 సం.ల నాటికే వరి ఉంది. వరి పంటతో పాటు అడవి జంతువుగా ఉన్న నీటి దున్న మచ్చిక అయింది. క్రీ.పూ.900 నాటికి చెరకు పంట ఉంది. క్రీ.పూ.350 నాటి పాణిని అవిసె గింజల గురించి, జనుము, నీలిమందు అద్దకపు పంటల గురించిన ప్రస్తావనలు చేశాడు. క్రీ. పూ. 300 ప్రాంతం లో పత్తి మొక్కలు వరుస లలో నాటడం కనిపిస్తుంది. క్రీ.పూ.150 నాటికి దున్నటానికి రాతి నాగలి బదులుగా ఇనుప కర్రు వాడారు.

వ్యవసాయ సాంకేతిక ప్రక్రియల్లో అత్యంత ప్రధానమైన పరిణామం వరి నాట్లు. క్రీ.శ.1 వ శతాబ్ధం – 4 వ శతాబ్ధాల మధ్య వరి  నాట్లు పూర్తిగా వాడుకలోకి వచ్చాయి. అశోకుడి కాలానికే (270 – 234 BC) మామిడి తోటలున్నాయి. క్రీ.శ.2 వ శతాబ్ధంలో పశ్చిమ తీర ప్రాంతంలో కొబ్బరి చెట్లు వ్యాప్తి చెందాయి.ఇదంతా మధ్యయుగాలకు( క్రీ.శ.650 – 1750) ముందు మాట.

ఈ పూర్వ రంగంలో మధ్యయుగాలలో వ్యవసాయంలో వచ్చిన సాధనాలు, సాంకేతికతలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం. ఆనాటి ప్రజలు అనుభవాల నుండి, శ్రమ నుండి ఈ జ్ఞానాలను పొందారు. ఒక తరం నుంచి ఇంకో తరానికి అందిస్తూ పోయారు. ఆనాటి సమాజాల అస్తిత్వానికి వ్యవసాయమే కీలకం. వ్యవసాయంలో వచ్చే అదనపు విలువలే సామ్రాజ్యాలకు కారణమయ్యాయి. ఇప్పుడు మనకు పెద్ద విషయంగా అనిపించవు కానీ, చిన్న చిన్న సాంకేతిక మార్పులు, సాధనాలే నాటి ఉత్పత్తిలో మార్పులు తెచ్చాయి. సామాజిక జీవితాలను ప్రభావితం చేశాయి. వాటిని క్లుప్తంగా పరిశీలిద్దాం.

నాగలి:
నాగలి లేని సాగును ఊహించడం కష్టం. కాని ఎద్దుల కట్టి, భూమిని దున్నే నాగలి రూపురేఖల్లో వందల సంవత్సరాలుగా మౌలికమైన మార్పులు పెద్దగా కనిపించవు. క్రీస్తు శకం తొలి శతాబ్ధాల కాలంలో ఎలా ఉండేదో క్రీ.శ.15వ శతాబ్ధంలో కూడా నాగలి ఆకృతి అలానే ఉండేది. అయితే విత్తనాలు విత్తడానికి జడ్డిగం (Seed – Drill) మధ్యయుగాలలో కొత్తగా నాగలికి అమరింది. స్థానికంగా ఉండే నేల తేలికైనదా, గట్టిదా అనే దాన్ని బట్టి కొన్ని మార్పులు ఉండేవి.

ఎరువులు:
పశువుల పేడ తప్ప మరేమీ వాడలేదు. 17 వ శతాబ్ధంలో పశ్చిమ కోస్తా ప్రాంతంలో చేపల్ని ఎరువుగా వేశారు. కానీ అదొక మినహాయింపు మాత్రమే.

జంతువులు:
క్రీ.శ.7 వ శతాబ్ధం వచ్చేసరికి ఒంటి మూపురం ఒంటెను లాగుడు కోసం ఉపయోగించారు. వేడికి, వర్షం లేమి తట్టుకోగలిగే బలమైన ఈ జంతువు వల్లా బహుళ ప్రయోజనాలు ఉండేవి.

నూర్పిడి:
ధాన్యాన్ని నూర్పిడి చేయడం మధ్యయుగాలలోనే ప్రారంభం అయింది. పశువులను వృత్తాకారంలో తిప్పి, ధాన్యాన్ని నూర్పిడి చేసే, నూర్పిడి సాధనం (రోటరీ మిల్) ఉండేది. దీన్ని నడపడానికి అవసరమైన లాగుడు కొయ్య (డ్రా బార్) ఒక ప్రత్యేకమైన సాధనం. అది మధ్యయుగాలలో కనిపిస్తుంది. చేతితో గుండ్రంగా తిప్పే పూర్తిస్థాయి తిరుగలి (రోటరీ హాండ్ మిల్) వాడకంలోకి రావడం 5 వ శతాబ్ధంలోనే. డ్రా బార్ వాడకం, ఎడ్లతో నూర్పిడి చేయడం, మర పట్టడం – లాంటి సాంకేతికతలు క్రీ.శ.5 – 10 శతాబ్ధాల మధ్య ఉపఖండ మంతటా వ్యాపించాయి.

మధ్యయుగాల పంటలేవి?
స్థానికంగా ఇక్కడే అభివృద్ధి చేసుకున్న పంటలుండగా, ఎన్నో విదేశీ పంటలు ఈ కాలంలో ప్రవేశించాయి. క్రీ.శ.16 వ శతాబ్ధం ఆఖరు నాటికి రబీ పంటలు 16 నుండి 21, ఖరీఫ్ పంటలు, 17 నుండి 29 నమోదు అయ్యాయి.

ఇస్లామిక్ ప్రపంచం నుండి వచ్చిన పంటలు గోరింట, నల్లమందు (క్రీ.శ.11 – 14 శతాబ్ధాలలో). పోర్చుగీసు నుండీ, (కొలంబస్ తరువాత – క్రీ.శ.1492) పొగాకు వచ్చింది. దేశమంతటా వ్యాపించింది. దాదాపు అదే సమయంలో మొక్కజొన్న కూడా వచ్చి చేరింది. మిరపకాయ 18 వ శతాబ్ధం నాటిది. ఉత్తర, దక్షిణ అమెరికాలలో అభివృద్ధి చేసిన ఇంకా అనేక పంటలు భారతదేశానికి వచ్చాయి. వేరుశనగ, బంగాళదుంప, గెనుసు గడ్డ, బెండ, టమోటా లాంటి పంటలెన్నో అలా వచ్చినవే. అయితే ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా వాటిని, పండించడం నే ర్చుకున్నారు.

పంటల మార్పిడి:
మొదట్లో సంవత్సరానికి రెండు పంటలు పండించే వారు కాదు . ఒక పొలాన్ని రబీకో, ఖరీఫ్ కో మాత్రమే వినియోగించేవారు. తరువాత సీజను బీడు పెట్టేవారు. తగినంత భూమి అందుబాటులో ఉండేది కాబట్టి సరిపోయేది. 18 వ శతాబ్ధంలో పంట మార్పిడి పద్ధతిని కొన్నిచోట్ల పాటించేవారు. వరి – పొగాకు – పత్తి ని పంట మార్పిడి పద్ధతిలో పండించడం బెంగాల్ లో ఉండేది. సాగుభూమి కొరత క్రమేణా ఏర్పడే కొద్దీ, పంట మార్పిడి అనే పరిజ్ఞానం అవసరం పెరిగి, వ్యాప్తి చెందింది.

పట్టు:
మధ్యయుగాలకు ముందు దేశంలో పట్టు ఉత్పత్తి లేదు. మల్బరీ పట్టు కానీ, సహజ పట్టు కానీ లేదు. చైనా నుండి పట్టు పురుగులు తెచ్చుకున్నారు. 15 వ శతాబ్ధం తరువాత పట్టు  ప్రస్తావనలు కనిపిస్తాయి. ఆ తరువాత రెండు శతాబ్ధాలకే ప్రపంచ పట్టు ఉత్పత్తి కేంద్రాలలో ఒకటిగా మన దేశం ప్రఖ్యాతిగాంచింది.

అంటు:
అట్లే పండ్ల చెట్లను కూడా అంటుకట్టే విధానం మొఘలులకు ముందు లేదు. స్వీట్ బెర్రీ, ఆప్రికాట్, దబ్బ జాతి పండ్లను రకరకాలుగా అంట్లు కట్టడం మొఘలుల కాలంలో జరిగింది. 16,17 శతాబ్ధాలలో పోర్చుగీసు వారు అమెరికాలకు చెందిన అనాస, బొప్పాయి, జీడి, జామ లాంటి ఫల వృక్షాలను ప్రవేశపెట్టారు. మామిడిపండ్లను మొట్టమొదట అంటుకట్టి అభివృద్ధి చేసింది పోర్చుగీసువారే.

నీటి యంత్రాలు:
వ్యవసాయానికి నీరు అవసరం. అయితే మధ్యయుగాలలో నీటి పారుదల పరిస్థితులేమిటి? ‘నోరియా’ అనే నీటి యంత్రం ప్రస్తావన క్రీ.శ.300 లో కనిపిస్తుంది. బండి చక్రం ఆకారంలో ఉన్న పెద్ద చక్రానికి మట్టి కుండలు కట్టి, ఆ చక్రాన్ని నీరున్న చోటు నిలువుగా పెట్టి, చేతితో చక్రాన్ని తిప్పడం ద్వారా నీటిని తోడారు. అట్లే లోతుగా నీరున్న చోట్ల (బావి) ఒక దండలాగా కుండలను చక్రానికి వేలాడదీసి నీటిని తోడేవారు (532 AD).

అయితే ఇటువంటి నీటి యంత్రాలను ‘పూనిక’ (గేర్లు) అమర్చడం, బాబర్ కాలానికే కనిపిస్తుంది. ఈ గేర్లు కొయ్య కూసాలతో చేసేవారు (పిన్ డ్రమ్). బహుశా క్రీ.శ.1400 నాటికి ఇది (పర్షియన్ వీల్) మధ్యధరా, ఇరాక్ ప్రాంతాల నుండి భారతదేశంలోకి వచ్చి వుండొచ్చు. ఈ పర్షియన్ వీల్ ను నడపడానికి ఎద్దులను, ఒంటెలను వాడి ఉంటారు. 19 వ శతాబ్ధంలో లోహపు చక్రం, బొక్కెన వచ్చేదాకా ఈ కొయ్య సాధనమే వాడేవారు. కొయ్య పర్షియన్ వీల్ గేరింగ్ ను ఆ తరువాత అనేక సందర్భాలలో వాడారు. అక్బరు కాలంలో ధాన్యం దంచడానికీ, తుపాకి గొట్టాలను నునుపుగా చేయడానికి, బాగా ఎత్తుకు నీటిని ఎత్తి పోసేందుకూ వాడే ప్రయత్నం చేశారు.

అట్లే ‘డెంకలి’ అనే సాధనం కూడా ఉండేది. ఇదొక లీవరు. కౌంటర్ వెయిట్ తో చేదగా పని చేసేది. ఒకవైపున బరువు కట్టి, కట్టని వైపు కాలితో తొక్కుతూ నీరు తోడేవారు.

నీటి పారుదల:
సింధూ నాగరికత కాలంలోనే చెరువులు, కాలువలు గురించి మనకు తెలుసు. అశోకుడి కాలంలో (270 – 234 BC) చెరువుల నుండి కాల్వలు తవ్వి, దిగువన ఉండే భూములకు నీరు ఇచ్చేవారు.

అయితే మధ్యయుగాలలో దక్షిణ భారతంలో భారీస్థాయి సాగునీటి వ్యవస్థలుండేవి. క్రీ.శ.11 వ శతాబ్ధం ప్రాంతంలో కావేరి నదిపై 30 మీటర్ల పొడవున, 5.5 మీటర్ల ఎత్తు, 18 మీటర్ల మందం ఉండే భారీ ఆనకట్ట నిర్మించారు. అక్కడ ఏర్పడ్డ సువిశాల జలాశయం నుండి కాల్వల ద్వారా పొలాలకు సాగునీరు వచ్చేది. విజయనగర కాలంలో (క్రీ.శ.1346 – 1565) తూములతో, అరుగులతో, మట్టి ప్రాకారాలతో, రాతి దిమ్మెలతో అసంఖ్యాకమైన చిన్న చిన్న నీటి వ్యవస్థలు కనిపిస్తాయి. పూడికను దృష్టిలో పెట్టుకొని తగు ఏర్పాట్లతో ఈ నిర్మాణా లుండేవి.

ఉత్తర భారతదేశంలో ఢిల్లీ చుట్టు పక్కల 1 వ శతాబ్ధంలో కొత్త నిర్వహణ వ్యవస్థలు వచ్చాయి. సున్నపురాయి, జిప్సంల మిశ్రమం అందుబాటులోకి రావడం వల్లా, విలు వంపు (Arcuate Technic) సాంకేతికతలు తెలియడం వల్లా ఇవి సాధ్యమయ్యాయి. పొడవైన రాతి కట్టుబడులు, తూముల నియంత్రణలు, పొడవైన బ్రిడ్జిలు, వంతెనల వ్యవస్థలు కాల్వల నెట్‍వర్క్‌‌లు, నీటి పారుదలా వ్యవస్థలు నిర్మించారు.

అప్పుడు కాంటూరు – సర్వే పటాలు లేవు. నీటి ప్రవాహ దిశను అనుసరించి కాల్వల తవ్వకాలు చేసేవారు. నదుల నీటిని మళ్ళించడానికి పదేపదే ప్రయత్నించేవారు,విఫలమయ్యేవారు.తరువాత ఎలివేటేడ్ మౌండ్ పద్ధతిలో ఎత్తైన మట్టంలో కాల్వలను నిర్మించడం నేర్చుకున్నారు.

వ్యవసాయ ఉత్పత్తులు:
ధాన్యాన్ని పిండిగా మార్చేవిసుర్రాయి / తిరుగలి క్రీ.శ.5 వ శతాబ్ధంలో కనిపిస్తుంది. అర్ధ వృత్తాకారంలో చలనం ఉండే రుబ్బు రాయి లాంటివి క్రీ.శ. 1 వ శతాబ్ధంలో కనిపిస్తాయి. వీటికి పిడులు పెట్టడానికి రంధ్రాలున్నాయి. ఒంటి నిలువు పిడితో ధాన్యాన్ని విసరడం పని భారాన్ని బాగా తగ్గించింది.

క్రీ.శ. 5 వ శతాబ్ధంలోనే, వర్తులాకార నూనె మర వాడుకలోకి వచ్చింది. క్రీ.శ.9 వ శతాబ్ధానికంతా ఎద్దులతో, లాగుడు కొయ్యలతో నూనె మరలు పనిచేశాయి. 16 వ శతాబ్ధానికి చెరకు నుండి రసం తీయడానికి పశువులతో గానుగలు ఆడించారు. పళ్ళ చక్రాలతో పనిచేసే మర యంత్రాలు క్రీ.శ.1400 ప్రాంతంలోనే కనిపెట్టారు. పత్తి గింజలు తీయడానికి వీటిని వాడారు. క్రమేణా ఇటువంటి యంత్రాలను నడపడానికి నీటిని ఒక శక్తిగా కొన్ని చోట్ల ఉపయోగించారు.

ధాన్యం దంపుడు కోసం వాడే మరో సాధనం బండిమర. ఇది 17 వ శతాబ్ధంలో కనిపిస్తుంది. యూరప్ లో ఇటువంటిది ఉనికిలోకి రాకముందే, మన దేశంలో ఆవిష్కృతమైంది.

కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు స్వేదన ప్రక్రియకు దారి తీశాయి. స్వేదన ప్రక్రియ తెలిసిన తొలి ప్రాంతాలలో మనది ఒకటి. చక్కర, ద్రాక్ష, బార్లీ, కల్లు, కొబ్బరి, విప్ప లాంటి వాటికి మత్తెక్కించే గుణం ఉంది. స్వేదన ప్రక్రియ ద్వారా వాటి నుండి సారాయి చేసేవారు. అయితే మెరుగైన, ఎక్కువ స్వచ్ఛత గల సారాయిని తయారు చేసే కొత్త సమీకృత బట్టీలు ఇస్లామిక్ ప్రపంచం నుండి మన దేశానికి వచ్చాయి. 13 వ శతాబ్ధంలో ఇటలీ, ఇస్లామిక్ ప్రభావాలతో వచ్చిన ఈ బట్టీలు దేశమంతా వ్యాపించాయి. 15 వ శతాబ్ధానికంతా సువాసన ద్రవ్యాల తయారీలోకి స్వేదన ప్రక్రియ విస్తరించింది. బహుశా 15 వ శతాబ్ధం లో గులాబీలు దేశంలోకి వస్తే, 17 వ శతాబ్ధం వచ్చేసరికి గులాబి అత్తరును స్వేదన ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేశారు.

నీలిమందు తయారీ కూడా దేశంలో చాలా పురాతనమైనదే (350 BC). నీలి మొక్క ఆకుల్ని భారీ పాత్రలలో వేసి, నానబెట్టి ఎండకు ఆరబెట్టితే నీరు ఆవిరై రంగుపొడి మిగిలేది. ఈ పద్ధతి క్రీ శ.13 వ శతాబ్ధం చివర్లో కనిపిస్తుంది. 17వ శతాబ్ధం వచ్చేసరికి, మరింత సులువైన బట్టీల పద్ధతి వచ్చింది.

ముగింపు:
మధ్యయుగాలలో భారతదేశంలో వ్యవసాయం చుట్టూ ఆవిష్కరించబడిన సాధనాలు, ప్రక్రియలు చూశాము. ఆనాటి సమాజ గమనంతో ముడిపడినవే ఇవి. నిదానంగా ఇవి నడిచాయి. ఈ కాలంలో ఇతర నాగరికతల, ప్రాంతాల నుండి మన దేశంలోకి ఎన్నో కొత్త సాంకేతికతలు ప్రవేశించాయి. అవి లేకుండా ఆనాటి సమాజం లేదు. బయటి నుండి ప్రవేశించిన కొత్తను ఆనాటి సమాజం స్వీకరించింది. అది కూడా నిదానంగానే జరిగింది. వీటికి కారణాలు తరువాత చూద్దాం.

(ఈ వ్యాసంలో ఉన్న విషయాలు – ఇర్ఫాన్ హబీబ్ రాసిన ‘మధ్యయుగాల భారతదేశంలో టెక్నాలజీ’ – అనే మోనోగ్రాఫ్ నుండి స్వీకరించబడినవి.)

(వచ్చే నెల – మధ్యయుగాల సాంకేతికతలు – వృత్తులూ, యుద్ధాలూ, ప్రయాణాలు గురించి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *