జె.వి. నార్లికర్

[ఈ వ్యాసం ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జయంత్ వి. నార్లికర్ రాసినది. ఇది మొదట 1985 ఏప్రిల్‌లో Science Age అనే పత్రికలో వెలువడింది. ఆ పత్రికను బొంబాయిలోని నెహ్రూ సెంటర్ ప్రచురించింది. ఈ వ్యాసం  4 దశాబ్దాల పాతదైనా, నకిలీ శాస్త్రంపై వచ్చిన విమర్శలలో ఎక్కువ భాగంలాగే ఇది ఇప్పటికీ ప్రాసంగికంగానే ఉంది.

అమెరికన్ తత్వ వేత్త  మాస్సిమో పిగ్లియూచ్చి (Massimo Pigliucci) తన పుస్తకం Nonsense on Stilts – How to Tell Science from Bunk లో సూడో సైన్సును ఎదుర్కోవడానికి కొన్ని పుస్తకాలను రిఫరెన్స్ గా ఇస్తూ సూడో సైన్స్ వాదనలకు పాత పుస్తకాలు సరిపోతాయని అంటాడు. ఎందుకంటే సూడోసైన్సు ఎప్పుడూ పురోగమించదని, దాని వాదాన్ని పూర్వపక్షం చేయడానికి పాత వాదనలే చాలని అంటాడు. భారతదేశంలో సూడోసైన్సు ను ప్రోత్సహించే వారికి — ముఖ్యంగా “వేద శాస్త్రం” గురించి అతి విచిత్రమైన వాదనలు చేసే వారికి — ఇది వర్తిస్తుంది.]

మన పురాణాలలో అత్యంత అభివృద్ధి చెందిన శాస్త్రీయ, సాంకేతిక ఆవిష్కరణల వివరణలు ఉన్నాయని కొందరు నమ్ముతారు. మహాభారతంలోని సంజయుడు మొదటి టీవీ వ్యాఖ్యాతా? కౌరవులు టెస్ట్ ట్యూబ్ శిశువులా? మన పురాణాలలోని యుద్ధాలు గైడెడ్ మిసైళ్లతో జరిగాయా? పుష్పక విమానం ఒక హెలికాప్టరా? ఇవన్నీ సాంకేతికతకు ఉదాహరణలు. కానీ మన వేదకాల పూర్వీకులు శాస్త్రీయంగా అభివృద్ధి చెందారా? వారు లేదా వారి వెంట వచ్చిన వారు అధునాతన సాంకేతికతను ఉపయోగించారా? ఈ ప్రశ్నలకు మీ సమాధానం “అవును” అయితే, దాన్ని మీరు శాస్త్రీయ ఆధారాలతో నిరూపించాలి.

“శాస్త్రీయ ఆధారం” అంటే ఏమిటో నేను స్పష్టంగా చెప్తాను. ఒక ఆపిల్,  చెట్టు నుంచి కిందపడుతుంది (అది పండిపోవడం వల్ల కొమ్మ నుంచి వేరైపోతుంది), ఎందుకంటే భూమి వైపు లాగుతున్న గురుత్వాకర్షణ శక్తి ఉంది అని మాత్రమే చెప్తే సరిపోదు. కేవలం ఆ పరిశీలనతోనే న్యూటన్ తన సహ శాస్త్రవేత్తలను గురుత్వాకర్షణ నియమంపై ఒప్పించలేడు. ఆ నియమం వెనుక కెప్లర్ గ్రహగమన పరిశీలనల సూక్ష్మ విశ్లేషణ, న్యూటన్ గమన నియమాలు, కాల్కులస్ గణితం ఉన్నాయి; అలాగే హాలీ ధూమకేతువు రాక, నెప్ట్యూన్ గ్రహ ఆవిష్కరణ వంటి అంచనాలు కూడా దాని ఫలితాలు. అంటే, శాస్త్రం అనేది అస్పష్టమైన గుణాత్మక ప్రకటనల సమాహారం కాదు; అది విపులమైన ప్రయోగాలు మరియు గణిత పునాదులపై ఆధారపడుతుంది.

అయితే సాంకేతికత అంటే ఏమిటి? అది అద్భుత వస్తువుల జానపద కథ కాదు; అలాంటి వస్తువులను తయారు చేయడానికి అవసరమైన అన్ని భాగాలను సూక్ష్మంగా వివరించే మాన్యువళ్ల సమాహారం. శాస్త్రీయ ఆధారాలు అలాంటి విపుల వివరణలను ఇవ్వాలి.

గ్రీకు ఎపిసైక్లిక్ సిద్ధాంతాన్ని తీసుకోండి. అది తప్పు సిద్ధాంతంగా తేలినా, ఇప్పటికీ దాన్ని శాస్త్రీయ సిద్ధాంతంగానే పరిగణించవచ్చు, ఎందుకంటే టాలమీ రచించిన Almagest ను పరిశీలిస్తే, గ్రహాల ఆకాశస్థానాలను పునరుత్పత్తి చేయడం, భవిష్యత్తులో అవి ఎక్కడ కనిపిస్తాయో ఊహించడం కోసం రూపొందించిన విపులమైన జ్యామితీయ నిర్మాణాలు అందులో ఉన్నాయి.

అరుణాచలం “గ్రీకు శాస్త్రం గురించి చాలా తెలిసిన భారతీయ శాస్త్రవేత్తలలో చాలామందికి భారతీయ శాస్త్రం గురించి పూర్తిగా అవగాహన లేదు” అని ఫిర్యాదు చేస్తాడు. అతను వేద శాస్త్రం గురించి మాట్లాడుతున్నందున, గ్రీకు శాస్త్రంలో ఉన్నట్లే పరిమాణాత్మక వివరాలతో వేద శాస్త్రం కూడా ఉందని భావిస్తున్నాడనుకోవాలి. దురదృష్టవశాత్తు, ఇప్పటివరకు అలాంటి విపులమైన వివరణ ఏదీ బయటకు రాలేదు.

శాస్త్రం స్పష్టంగా పేర్కొన్న ఊహాగానాల ఆధారంగా సందేహం లేని ప్రకటనలు చేస్తుంది. దురదృష్టవశాత్తు, సంస్కృతం (నాకు కొద్దిగా తెలిసి, ఎంతో అభిమానమున్న భాష) శాస్త్ర వివరణలకు తగిన మాధ్యమం కాదు. దాని వాక్యనిర్మాణం, అర్థాల్లో ఉన్న సౌలభ్యం వల్ల ఒకే వాక్యానికి అనేక అర్థాలు ఇవ్వవచ్చు. దీనికి ప్రసిద్ధ ఉదాహరణ ఆర్యభటుని శ్లోకం — భూమి స్థిర నక్షత్రాల నేపథ్యానికి వ్యతిరేకంగా తన అక్షంపై తిరుగుతుందని సూచించే శ్లోకం. కానీ ఆ సమయంలో, అలాగే తరువాతి శతాబ్దాల్లో భూకేంద్ర సిద్ధాంతమే ప్రబలంగా ఉండటంతో, ఆర్యభటుని తరువాతి వారు ఆ శ్లోకాన్ని వేరే విధంగా అర్థం చేసుకున్నారు.

ఇదే సంస్కృత భాషలోని లోపం. ఆ భాషలోని ప్రకటనలు వాటిని అర్థం చేసుకునే వ్యక్తిపై చాలా ఆధారపడతాయి. శాస్త్రీయ నిర్ధారణలు మాత్రం ఇందుకు విరుద్ధంగా నిర్పక్షపాతంగా ఉంటాయి. ఐన్‌స్టీన్ ఒక పరిశోధనా పత్రం రాస్తే, అతను ఏమి చెప్పాలనుకున్నాడో అర్థం చేసుకోవడానికి వేరే వ్యాఖ్యాత అవసరం ఉండదు. అతను ఇంత అస్పష్టమైన పదజాలంతో పత్రం రాసి ఉంటే, ఏ శాస్త్రీయ జర్నల్‌లోనూ అది ప్రచురణకు అంగీకరించబడేది కాదు.

చాలా ప్రాచీన రచనల ఉదాహరణలు వ్యాఖ్యాతపై  ఆధారపడుతున్నాయి. ఉదాహరణకు, “సూర్యుడు తన శక్తిని అపరిమిత పరిమాణంలో ఉన్న వాయువులో నుంచి పొందుతున్నాడు” అనే వాక్యాన్ని తీసుకోండి. ఆధునిక శాస్త్రం సూర్యశక్తికి గురుత్వ సంకోచాల వల్ల వచ్చే కెల్విన్-హెల్మ్‌హోల్ట్జ్ సిద్ధాంతాన్నే సరైన సమాధానంగా గుర్తించి ఉండి ఉంటే, ఈ వాక్యాన్ని దానికి మద్దతుగా చూపించవచ్చు. కానీ ఆ సిద్ధాంతం తప్పు; అంతేకాదు, “అపరిమిత” అనే విశేషణానికి అర్థమేంటి? సూర్యుడికి పెద్దదైనా పరిమితమైన ద్రవ్యరాశి ఉంది. అదే ఉద్దేశమా? అయితే ఈ వ్యాఖ్యానాలు బలవంతపు అర్థాలుగా కనిపిస్తాయి. “మన్వంతర” కాల పరిమాణం (30 కోట్ల సంవత్సరాలు) ను సూర్యుడి గెలాక్సీ చుట్టూ పరిభ్రమణ కాలంతో పోల్చడం కూడా, సూర్యుడి గెలాక్సీ చుట్టూ గమనాన్ని ఎక్కడైనా స్పష్టంగా పేర్కొనకపోతే, అంతే అసంబద్ధంగా ఉంటుంది.

నేను ఒకప్పుడు అధ్యయనం చేసిన విమాన శాస్త్రం కూడా నన్ను సంతృప్తిపరచలేదు. శాస్త్ర పరంగా చూస్తే, ఆధునిక విమానాలకు ఆధారమైన ఏరోడైనమిక్ లిఫ్ట్ సిద్ధాంతాన్ని  (గుణాత్మకంగా కూడా) భారతీయ ప్రాచీన విమాన శాస్త్రం అని చెప్పబడే విమాన శాస్త్రం ఇవ్వలేదు. విమానాలు ఎందుకు ఎగురుతాయో చెప్పే శాస్త్రీయ వివరణను కూడా అందించలేదు. సాంకేతికత పరంగా చూస్తే, విమానాన్ని ఎలా తయారు చేయాలో చెప్పే మాన్యువల్‌ను అసలే లేదు.

శాస్త్రీయ కాని వర్ణనల్లో “శాస్త్రాన్ని” బలవంతంగా వెతకడం తప్పు. రామాయణం , కుమారసంభవం గొప్ప సాహిత్య కృతులు. వాటిని Principia Mathematica లేదా Review of Modern Physics వంటి గ్రంథాలతో కలపకూడదు. వేదాల విషయానికి వస్తే, “ఒక పదాన్ని తప్పుగా ఉచ్చరించినా పాపమే” అని సంప్రదాయాలు చెబుతాయి — ఇది శాస్త్ర భావనకు పూర్తి విరుద్ధం! శాస్త్రం కూడా అలాంటి సంప్రదాయాన్ని అనుసరించి ఉంటే, నేడు మన పాఠశాల పిల్లలు లేదా కళాశాల పట్టభద్రులు Almagest ను పదేపదే పఠిస్తూ ఉండేవారు.

చివరగా, భారతదేశంలో శాస్త్రీయ గ్రంథాలు లేవని నేను చెప్పడం లేదని స్పష్టంచేయాలనుకుంటున్నాను. చరక, సుశ్రుత సంహితలు ప్రాచీన భారతదేశంలో తెలిసిన, అర్థం చేసుకున్న, ఆచరించిన వైద్యశాస్త్రాన్ని తెలియజేస్తాయి. ఆర్యభటుడు, భాస్కరాచార్యుల రచనలు స్పష్టతను చూపించే ఖగోళశాస్త్ర గ్రంథాలకు ఉదాహరణలు (సంస్కృతంలో ఉన్నప్పటికీ!). లీలావతి గణితం, బీజగణితం, జ్యామితిలో అద్భుతమైన గ్రంథం. కాబట్టి ప్రాచీన శాస్త్రీయ రచనల ఉదాహరణల కోసం తప్పనిసరిగా పాశ్చాత్య శాస్త్రాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు.

ఇదంతా చూస్తే, వేదకాలానికి చెందిన శాస్త్రీయంగా రాసిన గ్రంథాలను కనుగొనడం మరింత ముఖ్యమవుతుంది. అలాంటి గ్రంథాలు దొరికే వరకు, నా శీర్షికలోని ప్రశ్నకు నేను “అవును” అని సమాధానం చెప్పలేను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *