ఎస్. వెంకట్రావు

ఈ భూమ్మీద జీవులను భగవంతుడనే అగోచర శక్తి ఏదీ సృష్టించలేదనీ, పదార్ధ పరిణామ క్రమంలో భాగంగా సూక్ష్మజీవులూ వాటినుండి ఉన్నతమైన జీవులూ ఆవిర్భవించాయని ‘పరిణామ వాదం’ ఎన్ని సాక్ష్యాలు చూపించి చెబుతున్నప్పటికీ ఇంకా దాన్ని నమ్మని వారూ, ‘సృష్టి వాదాన్నే’ పట్టుకు వేలాడే వారూ చాలా మంది ఉన్నారు..

శాస్త్ర ప్రపంచంలో ప్రతిదాన్నీ సవాలు చేస్తున్నట్లే చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన పరిణామ వాదాన్ని కూడా సవాలు చేయడం ఆరంభించారు. వానరుడు నరుడుగా మారాడన్నదానికి ఆధారం ఏది? భూమ్మీద జంతువులు ఆకాశంలో ఎగిరే జంతువులుగా మారాయన్నదానికి ఆధారం ఏమిటి? జలచరాలు, భూచరాలుగా మారాయన్నదానికి ఆధారం ఏమిటి?… అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. జీవపరిణామాన్ని నిరూపించే ఆధారాలు ఒక్కొక్కటే లభిస్తున్నా వారి వాదనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఉంటాయి కూడా. అయితే జలచరాలు భూ సంచారులుగా మారే క్రమం ఎలా జరిగిందో నిరూపించే కీలకమైన ‘శిలాజ’ ఆధారాన్ని ఇటీవల అమెరికన్ శాస్త్ర వేత్తలు కొందరు కనుగొనడంతో సృష్టి వాదులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పరిణామ వాదానికి మరో మంచి ఆధారం లభించింది.

కెనడాలోని ఆర్కిటిక్ ప్రాంతంలోగల ‘ఎల్లెస్మిర్ ఐలాండ్స్’ లో శిలాజాల కోసం వెదుకుతున్న ముగ్గురు అమెరికన్ శాస్త్రవేత్తలకు 2004లో ‘మొసలి’ ఆకారంలో ఉన్న ఒక జంతువు శిలాజం లభించింది. రాతి పొరల్లో నిక్షిప్తమై ఉన్న ఈ శిలాజం 37.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. అంటే ఆనాడు అటువంటి జంతువులు ఈ ప్రాంతంలో నివసించేవన్న మాట. చనిపోయిన జంతువులు సాధారణంగా కుళ్లిపోయి మట్టిలో కలిసిపోతాయి. కాని అసాధారణ పరిస్థితుల్లో కొన్ని జంతువులు చనిపోయి మట్టిలో కప్పబడి కొన్ని కోట్ల సంవత్సరాలు కుళ్లిపోకుండా ఉండిపోతాయి, మట్టి మీద తరువాతి

కాలంలో మరింత మట్టిపేరుకుపోయి కిందనున్న పొరలు శిలలుగా మారిపోతాయి. ఆ రాతి పొరల్లో ఇరుక్కున్న పురాతన జీవుల దేశాలను ‘శిలాజాలు’ అంటారు. కెనడాలో కనుగొన్న మొసలి ఆకారపు శిలాజానికి ‘టిక్తాలిక్ రోసీ’ అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఆర్జిటిక్ ప్రాంతంలో నివసించే ఎస్కిమో ప్రజలు బురద చేపలను ‘టిక్తాలిక్’లు అంటారు. వారి భాషలోని పేరునే శాస్త్రవేత్తలు ఈ శిలాజాలకు పెట్టారు. ఇవి చూడ్డానికి చేపల్లా ఉన్నాయి. చెపలకున్నట్లే రెక్కలున్నాయి. పొలుసులున్నాయి. ఇతర ఆకారం, గుణాలు అంతా చేపలకు ఉన్నట్లే ఉన్నాయి. అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే వాటిముందు రెక్కల లోపల అప్పుడే తయారవుతున్న చేతులున్నాయి. భూచరాల చేతులకు ఉండే వేళ్ల ఎముకలు, మణికట్టు, కంటె ఎముకలు, భుజపుటెముకలు తయాయ్యే స్థితిలో ఉన్నాయి. వాటి పుర్రెలు మొసలి పుర్రెల మాదిరి మట్టసంగా ఉన్నాయి కాని చతుష్పాద (నాలుగుకాళ్ల) జంతువుల మాదిరిగానే వాటికి మెడ ఎముకలు, పక్కటెముకలు ఉన్నాయి. అలాగే పుర్రె భాగంలో చిన్న చెవులు కూడా ఏర్పడే దశలో ఉన్నాయి. అచ్చం చేపల్లా ఉండి అప్పుడప్పుడే చతుష్పాదులైన భూచరాల మాదిరి లక్షణాలు సంతరించుకుంటున్న ఈ జంతువులు జలచరాలకూ, భూచరాలకూ మధ్య ‘లింకు’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకు ముందు కూడా ఇటువంటి కొన్ని లింకులు దొరికాయి. 38.5 కోట్ల సంవత్సరాల క్రితం నివసించిన జంతు శిలాజం లభించింది. ఇది చేపమాదిరిగా ఉన్నప్పటికీ బురద నేలల్లో ముందు రెక్కలతో నడిచేది. తరువాత 36.5 కోట్ల సంవత్సరాల క్రితం నివసించిన మరోరకం ‘శిలాజం’ అభించింది. దీని ముందు కాళ్లు అభివృద్ధి చెంది ఉన్నాయి. అంటే చేపలు భూచరాలుగా లేకుంటే ఉభయచరాలుగా మారే క్రమంలో రెండు వైపులా ఉన్న జీవులు లభించాయి గాని చేపలకూ, చతుష్పాద భూచరాలకూ ఖచ్చితంగా మధ్యస్థంగా ఉండే జీవులు అవశేషాలు లభించలేదు. ఆ ‘మిస్సింగ్ లింకు’ కాస్తా ఇప్పుడు ‘టిక్తాలిక్’ రూపంలో అభించింది.

ఈ లింకులన్నీ ‘భౌమ్య కాలమానం’ప్రకారం డివోనియన్ యుగానికి చెందినవి. అంటే ఆ కాలంలో చేపలనుండి క్రమంగా భూచరాలు అభివృద్ధిచెందాయన్నమాట. ‘నేచర్’ అనే సైన్సు పత్రికలో ఇటీవల వెలువడిన రెండు వ్యాసాల్లో అమెరికన్ శాస్త్రవేత్తలు తమ పరిశోధన విజయాల గురించి వివరించారు. ఈ శాస్త్రవేత్తల్లో ఒకరు చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన డా|| నీల్ హెచ్ సుబిన్, మరొకరు ఫిలడెల్ఫియాలోని అకాడమీ ఆఫ్ నేచురల్ సైన్సెస్కు చెందిన ఎడ్వార్డ్ బి. డీప్లెర్, మూడో వ్యక్తి హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిణామ జీవశాస్త్రవేత్త ఫారిష్ ఎ జెంకిన్స్. తాము కనిపెట్టితెచ్చిన ‘శిలాజాలను’ వారు లండన్ సైన్సు మ్యూజియంలో ఉంచారు. ‘టిక్తాలిక్’ అవశేషాలు లభించిన ‘ఎల్లెస్మిర్ ఐలాండ్స్’ ఉత్తర ధృవానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి విమానం మీద వెళ్లాల్సిందే. ఇది శిలాజాలు లభ్యమయ్యే అవకాశాలున్న ప్రాంతమని ఒక పాఠ్యపుస్తకంలో రాసి ఉంది. అది చూసిన డా॥ సుబిన్, డీప్లెర్ లు 1999లో ఆ ప్రాంతంలో శిలాజాల కోసం వెదకడం ప్రారంభించారు. స్థానికులు మినహా బయటివారు అక్కడ సంవత్సరానికి రెండు మాసాలకన్నా నివసించడం అసాధ్యం. మంచి స్పాన్సరర్లు లభించడంతో వారు పరిశోధన కొనసాగించారు. 2004లో ఒక మధ్యహ్నం డా॥ సుబిన్ భోంచేస్తుండగా ఎదురుగా రాతిపొరలనుండి ‘టిక్తాలిక్’ మోర బయటకు పొడుచుకుని వచ్చి కనిపించింది. దాన్ని వెలికి తీసి పరిశోధించడంతో తాము కనుగొన్నది ఒక ‘మిస్సింగ్ లింక్’ అని వారికి అర్ధమైంది. జీవపరిణామానికి అనేక నిదర్శనాలున్నా ఇటువంటి ‘మిస్సింగ్ లింక్స్’ కోసం వెదుకులాట కొనసాగుతూనే ఉంటుంది.

జీవపరిణామం అనే కథలో ఇవన్నీ కీలకమైన ‘మలుపులు’ అన్నమాట. ఇంతకు ముందు శాస్త్రవేత్తలకు లభించిన ‘ఆరియోప్టెరిక్స్’ అనే జంతువు భూచరాలనుండి పక్షలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోడానికి ఒక మంచి ‘లింకు’గా ఉపయోగపడింది. డైనోసార్ల ముందుకాళ్లు ఈ ‘ఆరియోప్టెరిక్స్’లో రెక్కలుగా మారాయి. ‘ఆరియోపెరిక్స్’లు భూచరాలకూ, పక్షులకూ మధ్యస్థజీవులు కాగా ‘టిక్తాలిక్’లు జలచరాలకూ, భూచరాలకూ మధ్యస్థ జీవులని శాస్త్రవేత్తలు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *