కృత్రిమమేధ చెపుతున్న కొత్త పాఠం
చిన్నప్పుడు మన పాఠశాలల్లో మనల్ని వారానికో, మాసానికో ఒకసారి ఏదో ఒక అంశంపై స్వంతంగా వ్యాసం రాయమనేవాళ్ళు. కిందామీదా పడి ఎక్కడెక్కడ నుంచో సమాచారం సేకరించుకొని రాసేవాళ్ళం. అందులో ఏవేవో ఆలోచనల్ని చొప్పించే వాళ్ళం. అందంగా రాయడానికి కుస్తీ పట్టేవాళ్ళం. మనకంటూ ఏదో ఒక ప్రత్యేకత వుండాలని తాపత్రయం పడేవాళ్ళం. ఇందులో కాపీలు ఉండేవి కావు. ఒకరి మీద ఆధారపడ్డం అసలే వుండేది కాదు. డౌన్లోడ్ చేసుకోడానికి తావే లేదు అంతా సొంత ప్రయత్నం.
ఏ శుక్రవారమో వక్తృత్వ పోటీలు పెట్టేవారు ఒక్కోసారయితే అప్పటికప్పుడు ఏ విషయం మాట్లాడాలో చెప్పేవారు. ఎలా మొదలు పెట్టాలి ? ఎలా ముగించాలి ? అనేదానిపై తర్జనబర్జన పడేవాళ్ళం బెరుగ్గా ఉండేది. అయినా సవాలుగా స్వీకరించేవాళ్ళం. అప్పటికి తోచింది గడగడా చెప్పేవాళ్ళం. చప్పట్లు కొట్టించుకొనే వాళ్లం. అప్పుడు మనకు చాట్ పిజిటి లేదు, గూగుల్ శోధన లేదు.
వారాంతాల్లో ఏదో ఒక పుస్తకం నవలో నాటకమో చదవమనేవాళ్లు. పుస్తకాలు ఇంటికిచ్చేవాళ్ళు చదివే రమ్మనే వాళ్ళు ఎలాగో ఒకలాగున వాటితో కుస్తీ పట్టేవాళ్ళం. తిరగేసి మరగేసి చదివే వాళ్ళం. ఏవేవో ఆలోచనలు కొత్త కొత్తవి ముసురుకునేవి. ఎక్కడెక్కడికో వెళ్లే వాళ్ళం. చదివిన దాని గురించి క్లాసులో చెప్పమనేవాళ్లు ముందు బెరుగ్గా అనిపించినా ఇష్టం వచ్చింది చెప్పేవాళ్ళం. ఇతర పిల్లలు చెప్పే దానితో పోల్చుకొనే వాళ్లం, నేర్పుకొనే వాళ్లం. అప్పుడు మనకు కృత్రిమమేధ తోడుండేది కాదు.
చదువుకొనే రోజుల్లో ఇవన్నీ మనల్ని ఊహాలోకంలో విహరింపజేసేవి. ఆలోచన తరంగాల్లో ఓలలాడించేవి. భాషా క్రీడలకు పురమాయించేవి. పఠనసామర్థ్యాన్ని, తార్కికతను ననలెత్తించేవి. తెలియని భరోసానిచ్చేవి. ఒక క్రమంలో ఇవన్నీ మనల్ని మనంగా తీర్చిదిద్దేవి. ఇందులో స్వప్రయత్నం వుంది . మనకు మనం మెదడుకు పదును పెట్టుకోవడం వుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ సహజాతం ఇందులో ఇమిడి ఉంది. ఒక క్రమానుగత వికాసం వుంది. అన్నిటికీ మించి మొగ్గలు తొడిగే సృజనాత్మకత వుంది.
ముందు తరం కంటె తర్వాతి తరపు మానవ సంతతి తన తెలివితేటలు, సామర్థ్యాలు పెంచుకుంటూ పోతోందంటే దాని రహస్యం ఇక్కడే ఉంది ఏదో గొప్ప వారసత్వం. మానవజాతిని మహోన్నత తీరాలకు చేర్చిన వారసత్వం.
ఇప్పుడిదంతా కృత్రిమమేధతో తారుమారయ్యేలా కనిపిస్తోంది. మన పిల్లలు ఏ ప్రశ్నకైనా, ఏ ప్రాజెక్టుకైనా, ఏ సమాచారానికయినా గూగుల్ నో, చాట్ పిజిటినో, మరొక దాన్నో ఆశ్రయిస్తున్నారు. ఆగమేఘాల మీద ఏదో ఒక తక్షణ సమాచారం, సహకారం వాటి నుంచి లభిస్తోంది. ఏ విచక్షణా, స్వీయ ప్రయత్నం లేకుండా దాన్ని వాడేస్తున్నారు. ఇందులో తమదంటూ బుర్ర ఏమీ వుండడం లేదు.
ఈ ధోరణి ఎంత దూరం వెళ్లిందంటే డెన్మార్క్ లాంటి దేశాలు ఫోన్లను, టాబ్ లను, ఇతర డిజిటల్ పరికరాలను చదువుల్లో పిల్లలు వాడరాదని నిషేధం పెట్టాయి. పాత పద్దతికి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి.
ఇదిక్కక్కడితో ఆగడం లేదు. మన పరిశోధన రంగానికి కూడా పాకి దాన్ని సైతం భ్రష్టు పట్టిస్తోంది. గత రెండేళ్లుగా ఇబ్బడి ముబ్బడిగా పరిశోధనా పత్రాలు వెలవడ్డానికి కారణం మన అన్వేషణలు పెరగడం కాదు, కృత్రిమ మేధ అందిస్తున్న రెడీమేడ్ సమాచారం మాత్రమేనంటున్నారు తప్పుడు పద్ధతులు, ఎక్కడెక్కడి చెత్తా పరిశోధనగా మారడం ఈరోజుల్లో సాధారణమైపోయాయనీ, చివరికి ఇది మన మేధాసంపత్తి మీదా, నిజాయితీగా కష్టించి చేసే అన్వేషణల మీదా తీవ్ర ప్రభావం కలిగిస్తున్నాయనీ ఆందోళన మొదలైంది. గంగోటియా విశ్వవిద్యాలయం వారి చైనా కృత్రిమ కుక్క ఎలా మన పరువు తీసిందో చూచాం.
క్రమంగా మన విద్యాసంస్థలకు కూడా దేనికి తగినట్టే మారిపోతున్నాయి. స్వీయ పఠనం, రచన, ఆలోచన, వ్యక్తీకరణలకు మన చదువుల్లో కాలం చెల్లుతోంది. కార్పొరేట్ నైపుణ్యాలు అందించడమే మన గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలకు సైతం పరమావధిగా మారుతోంది. దీంతో భాషలకు, సామాజిక శాస్త్రాలకు తావు లేకుండా పోతోంది. సర్వం స్టెమ్ (STEM) మయమవుతోంది.
భాషను పోగొట్టుకున్న విద్యావంతులు ఏమవుతారు ? సామాజిక శాస్త్రాలు చదవని పిల్లల మానసిక స్థితి ఎలా వుంటుంది? ఇది ప్రజాస్వామ్యం అంతర్జానం కావడానికి దారితీయదా? ఊహలు, కలలు ,భావోద్వేగాలు లేని జీవితం సారహీనంగా మారదా? మనిషిని మనిషి గాకుండా చేసి డొల్లగా మార్చదా? చివరికి మనిషి యంత్రంగా మారిపోడా? ఆఖరికిది హోమో సేపియన్ల అంతానికి దారి తీసినా ఆశ్చర్యం వుండదు గదా!
మన దగ్గర ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఎన్ని సులభ పద్ధతులు, ఏ వేగం వున్నాయని కాదు. ఇవన్నీ ఎంత మానవ కేంద్రంగా ఉన్నాయన్నది ముఖ్యం. మనిషికి ఎంత గౌరవం, ఎంత సామర్థ్యం, ఎంత విచక్షణ అందిస్తాయన్నది కీలకం. అంతిమంగా ఇవి మనల్ని సమానత్వం,సామాజిక న్యాయాల వైపు నడిపిస్తాయా మరిన్ని గోడలు నిర్మిస్తాయా అన్నది అసలు విషయం.
మనలాంటి ఇప్పుడే ఎదుగుతున్న దేశాల్లో ఈ సమస్యలు మరింత క్లిష్టంగా వుంటాయి. మన సమాజమే ఎగుడుదిగుడు సమాజం మనవి అరకొర చదువులు. మిడిమిడిజ్ఞానపు మధ్య తరగతి మంచీచెడుల్ని వింగడిస్తున్న కాలం మనది. ప్రైవేటు రంగం ఏ అదుపూ బాధ్యతా లేకుండా సకల రంగాల్లోకి అల్లుకుపోయిన దేశం మనది.
ఇప్పటికే మన దేశంలో 80 కోట్ల వైఫై కనెక్షన్లున్నాయి. దాదాపు పది కోట్ల మంది నిత్యం చాట్ పిజిటి వాడే వాళ్ళున్నారు. అయినా ఈ రంగంలో మనవి ఇంకా ఓనమాలే! రాబోయే రెండేళ్లలో కృత్రిమమేధ విశ్వరూపాన్ని మనం చూడబోతున్నాం. బహుళజాతి ఐటి సంస్థల చుట్టూ సకల వ్యవస్థలు పరిభ్రమించే ధోరణి ఇప్పటికే మొదలైంది. మనకిష్టం వున్నా లేకున్నా ఈ పరిణామం అనివార్యం.
కానీ వీటివల్ల ఫ్లోరిడా అమ్మాయి సీవెల్ సెడ్జర్ లాగా కృత్రిమమేధతో కృత్రిమ మానవాకారాలను సృష్టించి, వాటితో సంభాషిస్తూ ఎక్కడెక్కడికో వెళ్లిపోయి, తిరిగి రాలేక ఆత్మహత్య చేసుకునే దుస్థితి మన పిల్లలకొస్తే ఎంత విషాదం మనకు మిగులుతుంది ?
ఇప్పటికే ఆధార్ లాంటివి మన గోప్యతను హరిస్తున్నాయి. అమెరికా బ్రిటన్ లాంటి దేశాలు ఇలాంటి డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థలపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ముందుకు పోలేకపోతున్నాయి కానీ మనం అలా లేము. రేపు ప్రభుత్వాలు నియంతల పిడికిట్లోకి వెళితే, నిరంతర నిఘాలోకి మనం వెళ్లాల్సి వస్తే ఏమవుతుంది ?
మన జనాభాలో దాదాపు ఒక శాతం ఐటి ఉద్యోగులున్నారు. జీడీపీలో ఏడు శాతం ఐటి నుంచే వస్తోంది. రేపు కృత్రిమమేధ వీరి ఉద్యోగాలను హరిస్తే మనమేమవుతాం ?
మన యువత ఈ కొత్త సాంకేతికాన్ని ఎలా వాడతారు? మన ప్రభుత్వాలు దీంతో ఏం చేస్తాయి? సంపన్న దేశాలు దీన్ని గుప్పెట్లో పెట్టుకొని ప్రపంచాన్ని ఏ దరకి చేరుస్తాయి? ఐటి కంపెనీల అధిపత్యంలోకి రాజ్యాలే వెళ్ళిపోతాయా? వాళ్లే ధరాధిపతులై తెర వెనకనుంచి ఇక ప్రపంచాన్ని నడిపిస్తారా? మనకైతే ఇవేమీ ఇంకా అర్థం కావడం లేదు కొత్త సాంకేతికాన్ని ఎలా వాడాలి? అనే దగ్గరే తచ్చాడుతున్నాం.

ఒకవైపు కారెన్ హావో (Empire of Al రచయిత్రి) లాంటివారు “ఇది మానవ వ్యతిరేకం. మనిషి స్వీయమేధతో సాంకేతికతను సృష్టించి దూసుకుపోతుంటే మళ్ళీ ఆ మేధకే కృత్రిమ ప్రత్యామ్నాయం దేనికి?” అంటారు.
“కాదు మనకు కొత్తగా 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటి 10 లక్షల ఉద్యోగాలు రూపాంతరం చెందుతాయి. అంతే. “ఈ శ్రామ్” ను, “నేషనల్ సర్వీస్ పోర్టల్”ను చూడండి, ఎలా 31.5 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులను సామాజిక భద్రతా పథకాలకి చెరువు చేయగలిగిందో ! రేపు కృత్రిమమేధ కూడా అంతే” అంటుంది అంతర్జాతీయ కార్మిక సంస్థ.
“అన్ని సవాళ్లకు ప్రభుత్వం సిద్ధం. ఆరోగ్యం, విద్య వ్యవసాయం, ప్రజాపాలన లాంటి ప్రతి రంగానికి కృత్రిమ మేధను విస్తరిస్తాం. మన యువతను దీనికి సన్నద్ధం చేస్తాం. రెండేళ్లలో మన దేశం ప్రపంచానికే పాఠాలు చెప్పగల స్థితిలోకి చేరుకుంటుంది” అంటాడు మన ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్.
వీటిలో ఎవరి మాట నిజమవుతుంది ? ఇదంతా మన విజ్ఞత మీద ఆధారపడి ఉంది. మన అప్రమత్తత మాత్రమే దీనికి జవాబు చెప్ప గల్గుతుంది. ప్రజల కోసమే సైన్సూ, సైన్సు విధానాలూ వున్నంతకాలం ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనిషికి తోడుగానే నిలబడుతుంది. మనిషి బలహీనపడితే, సైన్సు సామాన్యుడికి వ్యతిరేకంగా మారితే, అలా మార్చి లబ్ధి పొందగల వారి చేతిలోనే అది బందీ అయితే మానవాళికి శాపంగా మారుతుంది. ఇప్పటిదాకా చరిత్రలో మనం నేర్చుకుంటున్న పాఠం ఇది. కృత్రిమ మేధ మనం కొత్తగా నేర్పబోయే పాఠం కూడా ఇదే!



