సంపాదకీయం

“ఉన్నత విద్యారంగం ఎలా వుంది ? ఏ వైపు పయనిస్తోంది “అనేదాన్ని బట్టి “మన సమాజం ఎలా వుంది ? అది ఏ వైపు నడుస్తోంది” అని మనం సులభంగా అంచనా వెయ్యొచ్చు. కాకుంటే కొంచెం ఓపికతో, వాస్తవిక దృష్టితో మనం చూడగలగాలి.

శాస్త్ర సాంకేతిక రంగం ప్రపంచాన్ని శాసిస్తున్న యుగంలో ఉన్నత విద్య ఏ దేశాన్నయినా ఆ పోటీలో దీటుగా ఎంత నిలబడగలిగేలా చెయ్యగలదో మాత్రమే గాదు, ఒకానొక చారిత్రక సంధ్యలో సమాజపు ఆలోచనలు, విలువలు, తాత్విక ధోరణులు ఎలా వున్నాయో కూడా కూడా ఒక రకంగా నిర్ణయిస్తుంది, ప్రతిబింబిస్తుంది. అంతే కాదు లోతుగా ఉన్నత విద్యారంగాన్ని విశ్లేషించడం ద్వారా సామాజిక ధోరణుల పట్ల సమస్యల పట్ల మన ఆలోచనల్ని మనం పదును పెట్టుకోగలం, సరి చేసుకోగలం కూడా.

మరి ప్రస్తుత ఉన్నత విద్యారంగపు ధోరణులు ఏమిటి ? దాని పయనం ఎటువైపు?

ఈ మధ్యనే “అఖిలభారత ఉన్నత విద్యా సర్వే -2025 (AISHE) గణాంకాలు కొన్ని బయటకొచ్చాయి. వీటి ప్రకారం 2022 -23 లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 60.9 శాతం. జనరల్ విద్యార్థుల కంటే వీరు 95 లక్షలు ఎక్కువ. ఎదో వానకాలపు డిగ్రీ చదువుల్లోనే కాదు అత్యున్నత, ఆధునిక కోర్సులన్నిటిలోనూ వెనకబడిన వర్గాల పిల్లలు బాగా పెరిగారు. వైద్య విద్యలో వీరు 47.7% వుంటే, పీజీ వైద్య విద్యలో 40 శాతం వున్నారు. ఎంటెక్ లో అయితే 63 శాతం ఈ వర్గపు పిల్లలే. ఇంకా విశేషమేమంటే బాలుర కన్నా బాలికలు ఎక్కువ మంది ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇదే వరవడి కొనసాగితే 2027 -28 నాటికి వెనకబడిన వర్గాల పిల్లలు మూడింట రెండు వంతులవుతారు.

ఏ విధంగా చూసినా ఇది అద్భుతమైన విషయమన్పిస్తుంది. ఒకరకంగా చరిత్ర తిరగబడ్డదన్పిస్తుంది కూడా. ఇప్పటిదాకా ఎవరు పల్లకీలు మోసారో, ఎవరు కులవృత్తులకు అతుక్కు పొయ్యారో వారు బంధనాలు తెంచుకోడమిది. సమాజపు అట్టడుగు పొర వేగంగా ఊర్ధ్వచలనానికి సమాయత్తం కావడమిది.మన సమాజపు రూపురేఖలే మారిపోతున్నాయనడానికి కూడా ఇదో సాక్ష్యం. బహుశా మరో 10 -15 ఏళ్లలో ‘వెనకబడిన వర్గాలు’ అన్న పదబంధమే అర్థం లేనిది అవుతుందన్న ఆశనిది రేకెత్తిస్తుంది. తరతరాల లింగవివక్షకు ఇంత తొందరగా ముగింపు లభించిందా అని కూడా ఆశ్చర్యమేస్తుంది. ఈ రిపోర్టు వ్యాఖ్యానం సైతం మనల్ని ఊహాలోకవిహారం చేయిస్తుంది!

దీనికి తగ్గట్టు అగ్ర వర్ణాల విద్యార్థుల నమోదు శాతమే కాదు ఆశ్చర్యకరంగా సంఖ్య కూడా పడిపోతోంది. ప్రస్తుతం వీరి నమోదు 39 శాతం మాత్రమే. గత దశాబ్దంలో వీరి సంఖ్య 11 లక్షలు పడిపోయింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే వీరు 7.12 లక్షల నుంచి 6.20 లక్షలకు తగ్గి పొయ్యారు. తమిళనాడులోనూ, కేరళలోనూ ఇదే స్థితి. ఇలా ఎందుకు జరుగుతోందో మరింత లోతుల్లోకి వెళ్ళి చూడాల్సి వుంది. పై వర్గాల జనాభా వేగంగా తగ్గిపోవడాన్నిది సూచిస్తోందని కొందరు దీనిపై వ్యాఖ్యానిస్తుండగా ; విదేశాలకు వెళుతున్న వారిలో ఎక్కువ మంది ఈ వర్గాల వారనీ, వారు AISHE గణాంకాల్లోకి ఎక్కడం లేదనీ మరికొందరు విశ్లేషిస్తున్నారు.

కానీ ఓపిగ్గా తరచి చూస్తే మరో కోణం ఆవిష్కృతమవుతుంది. వాస్తవానికి మనదేశంలో ఉన్నత విద్యలోకి వెళుతున్న వారే 2022 నాటికి 28.4 శాతం. ఇది ఏడాదికి 0.67 శాతం మాత్రమే పెరుగుతోంది. మరి ఉన్నత విద్యకు దూరంగా ఉన్న 71.6% విద్యార్థులెవరు? ఖచ్చితంగా వెనుకబడిన వర్గాల వారే. అంటే కళాశాలలో నమోదైన వారిలో వెనుకబడిన వర్గాల వారు పెరిగినంత మాత్రాన మనం ఆశావహస్థితిలోకి వెళ్ళలేము. సమాజంలో ఏదో పెద్ద సంచలనం జరిగిపోతోందని మురిసిపోలేము. అలాగే కళాశాల్లో వున్న 60.9 శాతం బలహీన వర్గాల వారెవరు ? దీని ఆరా తీస్తే ఈ వర్గాల్లోనూ కింది పొరల్లోని పెద్ద వర్గం పైచదువులకు దూరంగానే వున్నట్టు అర్థమవుతుంది.

ఎందుకంటే రోహిణి కమిషన్ ప్రకారం 37% వెనకబడ్డ వర్గాల కులాల వారికి ఉద్యోగాల్లో ఏ ప్రాతినిధ్యం లేదు. వారికి రిజర్వేషన్ల వల్ల దక్కింది సున్నా. అంతే కాకుండా 994 కులాలకు 2.68% ఉద్యోగావకాశాలు మాత్రమే దక్కాయి. ఇదే లెక్క ఉన్నత విద్యారంగ ప్రవేశాలకూ వర్తిస్తుంది. అంటే బలహీన వర్గాల్లో ఒక పెద్ద వర్గం పైచదువులకు దూరంగానే వుందన్న మాట.

ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది వీరి గురించి. మన పథకాలు, ప్రోత్సాహాలు అందాల్సింది వీరికి. సామాజికా భివృద్ధి అంటే వీరి అభివృద్ధి. మన ఆలోచనల్లో దీనికి తగ్గ మార్పు రావలసి వుంది.

అలాగే మన విద్యారంగం కూడా వర్గాలకతీతంగా ఏమీ లేదు. అదీ అత్యున్నత, ఉన్నత, మధ్య, పేద వర్గాల వారీగా విడిపోయింది. అశోక విశ్వవిద్యాలయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒకే వర్గాల పిల్లలేమీ చేరడం లేదు. మనం గాట్ ఒప్పందంపై సంతకం పెట్టాక జ్ఞానం సరుకుగా మారి, దానికి తగ్గట్టు విద్యాసంస్థలు పుట్టుకొస్తున్నాయి

ఒక వైపు చూస్తే మన పిల్లలు 13.8 లక్షల మంది విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. ఒక్కొక్కరు 30 లక్షల రుణాలు తీసుకొని మరీ విదేశాలకు వెళుతున్నారు. ఇంకో వైపు ఓపెన్ విశ్వవిద్యాలయాలు., ఆన్లైన్ కోర్సులు, ఒకేషనల్ కోర్సులు, తూతూ సర్టిఫికేట్ల కళాశాలలు వున్నాయి. మన ప్రభుత్వ కళాశాల్లో చదువుతున్న వారంతా గీత గీసినట్టు పేద విద్యార్థులే.

ఈ విభజనను పట్టించుకోకుండా కేవలం సంఖ్యలతో, శాతాలతో సంతృప్తి పడలేము.

ఇలా చూస్తే మన సమాజంలోని ఒక పెద్ద వర్గం సర్వశక్తులు వొడ్డీ ముందడుగు వెయాలని ఎంత ప్రయత్నిస్తున్నా వారి సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులు అంతే బలంగా వెనక్కి లాగుతున్నట్టూ, అక్కడితో ఆ వర్గం సర్దుకుపోతున్నట్టు స్పష్టమవుతోంది. కాకుంటే ఒక చిన్న వర్గాన్ని ఆధునిక కూలీలుగా చవకగా మనం ఎగుమతి చేస్తున్నామంతే !

మరో కోణం మన విద్యా ప్రమాణాలది. ఒకసారి విద్య సరుకుగా మారాక ఏ చెత్త సరుకునైనా ఆకర్షణీయంగా అమ్మడం మార్కెట్ లక్షణమవుతుంది. ఉదాహరణకి 2019 -20 నుంచి 2022 -23 దాకా మన ఇంజనీరింగ్ కళాశాల నుంచి 34.3లక్షల మంది బయటికొస్తే వీరిలో కేవలం 16.4 లక్షల మందికి – అంటే 47.7 శాతానికి మాత్రమే ప్రాంగణనియామకాలు లభించాయి. ఫలితంగా 30 శాతం సీట్లు భర్తీ కాకుండా మిగిలి పోతున్నాయి. మన గ్రాడ్యుయేషన్ ఎంప్లాయింటు కేవలం 42.6 శాతం మాత్రమే. ప్రపంచ స్థాయి 500 విశ్వవిద్యాలయాల్లో 11 మాత్రమే మనవి. ఇలా నిరుద్యోగులుగా మిగులుతున్న వారిలో ఎక్కువ మంది ఎవరు? బలహీన వర్గాల వారే!

తోసుకొస్తున్న కృత్రిమ మేధ మన 70 శాతం ఉద్యోగాల రూప రేఖల్ని మార్చేస్తుందంటున్నారు. కొత్తగా అది 17 కోట్ల ఉద్యోగాలు తెస్తుందనీ, 9.2 కోట్ల ప్రస్తుత ఉద్యోగాలను హరిస్తుందనీ ప్రపంచ ఆర్థిక వేదిక లెక్కిస్తోంది. మన పిల్లలు కేవలం ఏడు రకాల కెరీర్లనే ఎన్నుకొని వాటికి తగ్గ కోర్సులనే ఎంచుకుంటున్నారు. దీనికి తగెనట్టే మన విద్యా సంస్థలున్నాయి. ఒక లెక్క ప్రకారం 65 శాతం విద్యార్థులు తమకిష్టం లేని, తాము చెయ్యలేని కోర్సుల్లో చేరుతున్నారని భారతీయ నైపుణ్య నివేదిక చెబుతోంది. మరిలాంటి నాసిరకం విద్య మన పిల్లల్ని -మరీ పేద పిల్లల్ని ఏం చేస్తుంది ? ఇలా చూస్తే ‘చదివే సంపదనీ, అదే సర్వోద్ధారకమనీ’ పేదల్ని ఊరిస్తూ చెప్పేవి ఎంత డొల్ల మాటలు!

పైపైన చూస్తే మన ఉన్నత విద్యారంగ విస్తరణ కళ్ళు మురిమిట్లు కొలుపుతుండవచ్చు. ప్రపంచ ర్యాంకింగుల కోసం మన విశ్వవిద్యాలయాల ఎంట్రీలు వేగంగా పెరుగుతున్నాయనీ, నేడు 28 దేశాలతో మనకు అకడమిక్ భాగస్వామ్యం వుందనీ మన విధాననిర్ణేతలు చెపుతున్నదంతా మనల్ని ఊహాలోకవిహారుల్ని చెయ్యవచ్చు.

కానీ నిజంగా మన ఉన్నతవిద్య సమాజపు రూపురేఖల్ని మార్చేసి, సమీప భవిష్యత్తులో దాని ఎగుడుదిగుడుల్ని తుడిచేసే వైపు పయనిస్తోందా? ఈ ప్రశ్నకు ఆశావావహ సమాధానం లభించక పోగా ఉన్న అంతరాలకు తోడుగా కొత్త అంతరాల్ని కొనితెస్తోందా అని భయమేస్తుంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *