విఠపు బాలసుబ్రహ్మణ్యం
పర్యావరణం అంటే నదులూ, కొండలేనా? అడవులూ, చెట్లేనా? పక్షులూ, జంతువులేనా? మరి వాటి మధ్య బతుకుతున్న మనుషుల సంగతేమిటి? వారి మనుగడ మాటేమిటి ?
ఈ ప్రశ్నలు మన నాగరిక పర్యావరణ మిత్రులకు చాలామందికి ఎదురు గావు. కొండ కోనల్ని నమ్ముకొని తరాల తరబడి వాటి చుట్టూ తమ జీవితాల్ని అల్లుకున్న మూల ప్రజల గురించి వారు పట్టించుకోరు. చాలా సందర్భాల్లో ప్రజలకు, జీవావరణానికి మధ్య వాళ్లు పోటీ పెడతారు. ప్రకృతి పక్షాన వాదిస్తూ ప్రజల్ని దానికి వ్యతిరేకంగా నిలబెడతారు. ఏ మృగాల సంరక్షణ కోసమో, ఏ పిట్టల భద్రత కోసమో, ఏ మొక్కల జాగ్రత్తల కోసమో లక్షల ఎకరాలను సంరక్షణా ప్రాంతాలుగా మార్చి అక్కడి అడవి మనుషులని నిర్దాక్షిణ్యంగా తరలించడాన్ని సమర్థిస్తారు.
ప్రజాపర్యావరణం
మొన్న జనవరి 7న పూనాలో, 83 ఏళ్ల వయసులో మరణించిన మాధవ్ గాడ్గిల్ దీనికి భిన్నంగా భారతీయుల పర్యావరణ స్పృహనూ, ఉద్యమాన్నీ ప్రజల వైపు మళ్లించిన వాడు. ప్రజలు కేంద్రంగా పర్యావరణాన్ని దర్శించి ప్రేమించి ప్రపంచంలోనే ఈ దృక్పథాన్ని ఒక సిద్ధాంతంగా, ఒరవడిగా ప్రకృతి మిత్రులకు అందించి ఒప్పించినవాడు.
మాధవ్ గాడ్గిల్ అనగానే మనకు పడమటి కనుమలు గుర్తుకొస్తాయి. గుజరాత్ నుంచి కేరళ దాకా పరుచుకున్న ఆ కొండల్లో, కోనల్లో ఆయనకు తెలియని జాతులు లేవు. ఆయన పలకరించని మనుషులు లేరు. ప్రతి చెట్టూపుట్టా ఆయనకెరుకే. ఎప్పుడో చిన్నప్పుడు పక్షుల మిత్రుడు సలీంతో కలిసి వైతాళ్ కొండల్లో బైనాక్యులర్ పట్టుకుని పిట్టల్ని చూడ్డంతో, వాటి వెంట పరుగెత్తడంతో ఆయనకా కొండలతో నెయ్యం మొదలైంది. జీవితమంతా వాటి చుట్టూనే గడిచిపోయింది. అందుకే కాబోలు తన ఆత్మకథకు “కొండ కోనల్లో నడక – ప్రజలతో ప్రకృతితో జీవితం” ( A Walk Up the Hill – Living With People and Nature) అని పేరు పెట్టాడు
మొదట గాడ్గిల్ కూడా అందరి లాగే అడవి జంతువుల గురించీ, వృక్షజాలం గురించీ మాత్రమే పరిశీలన చేసేవాడు, పట్టించుకునేవాడు. కానీ 1980ల నాటికి ఆయన దృక్పథం పూర్తిగా మారిపోయింది. భారతీయ సామాన్య ప్రజలు (Common people of India) ఆయనకు పర్యావరణంలో విడదీయరాని భాగంగా (Constituent of Ecosystem) కనిపించసాగారు. దీంతో ప్రజల హక్కులు ముందుకు వచ్చాయి. అందులోనూ ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టున్న చిన్న చిన్న జాతులు, గిరిజనులు, సంచార సమూహాలూ ఆయన కార్యక్షేత్రానికి కేంద్రంగా మారారు.
ఆచరణాత్మక దృక్పథం
తొందర్లోనే ఆయన 1972 అటవీ ప్రాణుల చట్టం అధికారుల చేతిలో ఆయుధంగా మారిందని గురించాడు. సామాన్య జనాన్ని అణచడానికీ, వాళ్ల బతుకు తెరువునే కాదు నివాసాలను కూడా హరించడానికీ సాధనమై పోయిందనీ అర్థం చేసుకొన్నాడు.
అసలు అడవుల చుట్టూ, అందులోని ప్రాణుల చుట్టూ వున్న జీవావరణమంతా అక్కడి ప్రజలకు వాటితో గల బాంధవ్యంతోనే సజీవంగా వుండగల్గుతున్నాయని గాడ్గిల్ గాఢంగా నమ్మాడు. మన కొండకోనల్లోని పలు చిన్న చిన్న జనసమూహాలు అద్భుతంగా ఈ జీవావరణాన్ని జీవితంలో భాగంగా చేసుకొని, ఒకవైపు దాన్ని ఉపయోగించుకుంటూ మరోవైపు సంరక్షిస్తున్నాయని ఆయన అవగాహనకొచ్చాడు. దీన్నుంచి ఒక నూతన దృక్పథాన్ని రూపొందించుకున్నాడు.
ఉదాహరణకు మహారాష్ట్రలోని గడ్చిరోలీలోని గోండు సంఘాలు ఉసిరికాయలు పరిపక్వం అయ్యాక మాత్రమే “పోలో వేడుక” దాకా ఆగి కోస్తారు. కానీ ఫారెస్ట్ అధికారుల ప్రవేశం తర్వాత విచక్షణా రహితంగా కాయల్ని కోయడం, కొమ్మలను నరకడంతో ఆ చెట్లు సర్వనాశమయ్యాయి. తర్వాత 2009లో కమ్యూనిటీ ఫారెస్ట్ హక్కులొచ్చి , సంప్రదాయ పద్ధతుల పునరుద్ధరణ జరగాక గానీ ఈ నష్టం భర్తీ కాలేదు.
వెదురు గరిష్టంగా పెరగాల్సినంత పెరగకముందే కొట్టడం వల్ల వచ్చే నష్టాన్ని కూడా గాడ్గిల్ ఇలానే అంచనా వేసి చెప్పాడు. ఒకవైపు పేపర్ మిల్లులకు నిరంతరాయంగా సరఫరా జరగాలి. మరోవైపు వెదురు కుదుళ్ళు దెబ్బతిని పోకూడదు. ఈ రెండింటికి మధ్యే మార్గాన్ని ఆయన అద్భుతంగా చూపించాడు.
ఇలా గాడ్గిల్ భౌతికావసరాలకతీతంగా పర్యావరణాన్ని ఎప్పుడూ చూడని గొప్ప ఆచరణవాది. ప్రజల జోక్యాన్ని ప్రకృతి ధ్వంసకరంగా చూడ్డం కాదు, వారి జీవితావసరాల కోసం చేసే ప్రయత్నంగా ఎలా చూడాలో మనకాయన నేర్పించాడు.
లాభార్జనాపరుల, వ్యాపార సంస్థల జోక్యం దీనికి భిన్నమైంది. వాళ్ళకి అటు ప్రకృతితో ఇటు ప్రజలతో నిమిత్తం లేదు. భూమిని, నీటిని, కొండల్ని, అడవుల్ని వాళ్ళు తమ లాభాల కోసం ఏమైనా చేస్తారు. ప్రజల జోక్యం, పారిశ్రామికుల జోక్యం రెండూ ఒకటి గావు. వీటిని ఒకే గాటగట్టి చూడ్డం పర్యావరణకారుల పెద్ద లోపం. దీన్నాయన శక్తి వంతంగా ముందుకు తెచ్చాడు.
పడమటి కొండలపై అపారప్రేమ
పారిశ్రామికీకరణయుగంలో కొండల్ని తవ్వడాలతో పర్యావరణానికి ఎలాంటి హాని జరుగుతుందో పరిశీలించడానికి సలహా కోరుతూ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం “పడమటి కనుమల పర్యావరణ రిపోర్టు ” కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.తన అనుభవాన్నంతా ఆయన దానికోసం వెచ్చించాడు. అప్పటికే 1980ల లోనే “పశ్చిమ కనుమలని రక్షించండి ” పేరుతో ఆయన పెద్ద ఉద్యమాన్ని నడిపినవాడు. వందల జన సమూహాలతో నిరంతర సంబంధాలు నెరపుపుతున్నవాడు. దీంతో ఆయన పడమటి కనుమలకు ప్రత్యేకంగా ఒక అథారిటీని నెలకొల్పాలని ప్రతిపాదించాడు. మొత్తం 142 తాలూకాల్లోని ఈ కొండల్ని మూడు పర్యావరణ సున్నిత ప్రాంతాలుగా(ESZ) విభజించాలన్నాడు. బొగ్గు ఆధారత పరిశ్రమల్ని వీటిలో స్థాపించవద్దన్నాడు. పర్యావరణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలంటూనే అది ప్రజాపక్షపాతంగా వుండాలన్నాడు.
దీంతో గాడ్గిల్ కి ఓ పెద్ద వీరాభిమానుల వర్గం, పచ్చి వ్యతిరేకుల గుంపు రెండూ ఏర్పడ్డాయి. రెండో వర్గం ఆయనపై అభివృద్ధికి వ్యతిరేకి అంటూ పెద్ద దుమారం లేపింది. గిరిజనులు ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం ఆయనకు ఇష్టం లేదనింది. ఎక్కడెక్కడి శక్తులనూ కూడగట్టింది. దీంతో ప్రభుత్వం కస్తూరి రంగన్ నాయకత్వాన మరో కమిటీ వేసింది. ఆయన పశ్చిమ కనుమల్లో 37 శాతం మాత్రమే సున్నితమైందనీ, మిగిలింది పారిశ్రామిక అవసరాలకు వాడుకోవచ్చుననీ సిఫార్సు చేసాడు. సహజంగానే ప్రభుత్వం గాడ్గిల్ Western Ghats Ecology Experts Panel (WGEEP) రిపోర్టును మూలబడేసింది. కానీ పడమటి కనుమల సున్నితత్వంపై, వాటి పర్యావరణప్రాధాన్యతపై, వాటి రక్షణ కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలపై ఈ రిపోర్టు ఎప్పటికీ అధికారిక మార్గదర్శకపత్రంగా నిలిచి పోయింది. గాడ్గిల్ పరిశోధనకూ, పాండిత్యానికే గాదు ఆయన హృదయానికీ దర్పణంగా మిగిలి పోయింది.
సైలెంట్ వాలీది మరో కథ
చలిక్కోడి నది మీద 163 మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టు నిర్మాణం సైలెంట్ వ్యాలీలో నిర్మించాలన్న నిర్ణయం జరిగాక ఆయన దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇదో పెద్ద చర్చగా మారి కేరళను నిట్టనిలువునా విడదీసింది. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్తు లాంటి ప్రజాసైన్సుఉద్యమసంస్థలకాయన వాదన కొండంత అండగా తోడ్పడింది. చివరకు ప్రభుత్వమే 1985లో ఆ ప్రాంతాన్ని నేషనల్ పార్కుగా ప్రకటించి, ఆ ప్రాజెక్టును అటకెక్కించక తప్పలేదు. బహుశా మన దేశంలో ఇంత చర్చా, ఇంత పోరాటమూ, ఇంత రాజకీయాలూ నడిచిన ఒక పర్యావరణాంశం ఏదీ లేకపోవచ్చు. ఈ ఉద్యమం కేరళ చరిత్రను కూడా సైలెంట్ వ్యాలీకి వెనకా, సైలెంట్ వాలీకి ముందూ అన్నట్టు మార్చేసింది.. అందుకే గాడ్గిల్ కు నివాళులర్పిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ” ఆయన కృషి పెద్ద పర్యావరణ చర్చకు నాంది పలికింది ” అన్నాడు
ఇక నీలగిరి కొండలకూ, దాని జీవావరణానికీ ఆయనే ప్రపంచ గుర్తింపు తెచ్చాడు. ఆయన విద్యార్థులే నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ (NBR) రూపొందించారు. అలాగే ఆసియా ఏనుగుకు రక్షణ లభించిందీ ఆయన వల్లనేనంటే అతిశయోక్తి కాదు.
వైజ్ఞానిక శిఖరం
గాడ్గిల్ ఎందరో శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశాడు. వారిలో స్వామినాథన్ ఒకరు. బెంగళూరులోని “ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్” లో “సెంటర్ ఫర్ ఎకలాజికల్ సైన్స్” ఏర్పాటుకు అది దారి తీసింది. స్వామి నాథన్ మాటల్లో చెప్పాలంటే గాడ్గిల్ రూపొందించిన “పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్స్” ప్రపంచానికే గొప్ప మార్గనిర్దేశం చేశాయి. దాని ఫలితంగానే ఆయనకు ‘మానవ అభివృద్ధితో పాటు ప్రకృతి పరిరక్షణకు చేసిన కృషికి ‘ గాను టైలర్ అవార్డు లభించింది. ఆ తర్వాత శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డూ, పద్మభూషణ్ పురస్కారమూ లభించాయి. ఇందిరా గాంధీ ప్రధానిగా వుండగా ప్లానింగ్ కమిటీలో భాగంగా పర్యావరణం మీదా, అటవీశాఖ మీదా ఏర్పాటైన సలహా మండలిలో కూడా స్వామినాథన్ తో కలిసి గాడ్గిల్ పని చేశాడు. దాన్ని స్వామినాథన్ ఆయన ఎంతో గొప్ప జ్ఞాపకంగా చెప్పుకుంటాడు
ప్రజాసంప్రదాయాలూ పర్యావరణం
ముందే మనం చెప్పుకున్నట్టు భారతదేశం వేల ఎండో గామస్ సమూహాల దేశం. ఒక్కో సమూహానికి ఒక్కో భౌగోళిక పరిస్థితీ, ఒక్కో వంశపారంపర్య జీవనోపాధీ, ఒక్కో నిర్దిష్ట పర్యావరణంలో సముచిత స్థానం వుంటాయి. ఇవన్నీ సహజ వనరులపై ఆధారపడ్డ సమూహాలు. వీటిని లోతుగా పరిశీలించి ఆయన 1983లో “భారత దేశ కుల వ్యవస్థ, దాని అనుకూల ప్రాముఖ్యత” అనే పత్రం రూపొందించాడు. తిరుమల నందివాలాలూ, వైదులూ ఎలా కుక్కలపై ఎలా ఆధారపడి జీవించారో కూడా ఈ పత్రం చర్చిస్తుంది. అంత సూక్ష్మ పరిశీలన ఆయనది. భారతీయ కుల వ్యవస్థ పై విస్తృత అధ్యయనం చేసిన ఐరావతి కర్వే తన పక్కింట్లోనే వుండడం ఈ కృషిలో తనకెంతో లాభించిందని ఆయన వినయంగా, గర్వంగా చెబుతారు. అలాగే ఈ సముదాయాలు. వాటి పంచాయతీలు. గ్రామ సభలు, వాటి చర్చలు తీర్మానాలు పర్యావరణానికి ఎంత దోహదకారిగా వుండేవో, ఆ సంప్రదాయాలు విచ్ఛిన్నమవుతూ రావడంతో ఎంత నష్టం జరుగుతోందో ఆయన లోతుల్లోకి వెళ్లి మరీ వివరిస్తాడు. ప్రత్యామ్నాయంగా ప్రస్తుత కాలానికి అనుగుణంగా వీటిని కమ్యూనిటీ కేంద్రాలుగా మార్చాలనీ, అడవుల్ని స్థానిక వనరుల్ని వీటికి అప్పచెప్పాలని ప్రతిపాదిస్తాడు.
ఇంత చెప్పిన గాడ్గిల్ ఈ దృక్పథాన్ని మన బ్యూరోక్రాట్లు, నిపుణులు ఏమాత్రం తలకెక్కించుకోలేకపోయారని బాధపడతాడు. వారదంతా ” అభివృద్ధి పేర ధనికుల సేవ “అంటూ ఎద్దేవా చేస్తాడు
విశ్వమానవ హృదయం
గాడ్గిల్ ది ఎంత గొప్ప హృదయం. ఆయన తన ఆత్మకథను బిస్మార్క్ డయాస్ కు అంకితం చేస్తాడు. బిస్మార్క్ దక్షిణ గోవాలో మండోవీ నది మధ్య వున్న సుందరమైన కొండమీద జీవిస్తూ, ఆ కొండను దాని పరిసరాలను రక్షించే గావ్గరీ తెగ కమిటీకి అధ్యక్షుడుగా వుండే వాడు. దాన్నొక పర్యాటక రిసార్ట్ గా మార్చాలని ఒక పలుకుబడి గల రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ చేస్తున్న పన్నాగానికి వ్యతిరేకంగా ఆయన ఆ కొండపై తిష్టవేసి కూర్చున్నాడు. ఏం జరిగిందో ఇప్పటికీ తెలియదు గానీ బిస్మార్క్ 2017 నవంబర్ 5వ తేదీన ఈతకు వెళ్లి అదృశ్యమయ్యాడు. నిజానికి ఆయన గొప్ప ఈతగాడు. అతని మృతదేహం 36 గంటలకు గానీ నదిలో చిక్కలేదు. అప్పటికే దాన్ని సగభాగం చేపలు తినేసాయి ! గ్రామస్తులు మాత్రం ఆయన మృతి వెనక ఏదో కుట్ర దాగి వుందని ఈనాటికీ నమ్ముతారు. ఎప్పుడో 2011 జనవరిలో గావ్గరీల పోరాటాన్ని ప్రత్యక్షంగా చూడ్డానికి వెళ్లి, అక్కడి ప్రాంతాన్ని, దాని అద్భుత వనరుల్నీ చూచి ముగ్ధుడై, వాటి కోసం ఆ కమ్యూనిటీ ప్రజలు చేస్తున్న పోరాటంతో కొత్త ఉత్తేజం నింపుకొని వచ్చానంటాడు గాడ్గిల్. అందుకే తన ఆత్మకథను బిస్మార్క్ కు అంకితమిచ్చానంటాడు!
జయరాం రమేష్ అన్నట్టు మాధవ్ గాడ్గిల్ గొప్ప అకడమిక్ సైంటిస్టు. స్థానిక, క్షేత్ర పరిశోధకుడు. సైంటిఫిక్ వ్యవస్థల నిర్మాత. ప్రజల్ని ప్రజాసంఘటనన్ని నమ్ముకున్న పర్యావరణవేత్త. అన్నిటికంటే మించి ఆయన గొప్ప యోధుడు. ఎందరికో మిత్రుడు, తాత్వికుడు, మార్గదర్శి.
నిజమైన నివాళి
“మన స్వేచ్ఛా భారతం స్వాతంత్ర్యానంతరం పుట్టిన మూడవ తరం చేతిలో వుంది. వీరు సామాజిక న్యాయం, సమానత్వం, లింగ సమానతల కోసం పోరాడాలి. సామాన్య ప్రజల పక్షాన నిలబడాలి. గాలి, నీరు, పక్షులు, పాటలే గాదు సామాన్య మానవులూ మన ప్రకృతిలో భాగాలని గుర్తెరగాలి. ఈ తరం వాళ్ళు మన ధనికస్వామ్యం గురించీ, ప్రస్తుత ఆర్థిక సంస్కరణల గురించీ, దాని ఫలితాల గురించీ, అందులో సామాన్యుల స్థితి గతుల గురించీ మాట్లాడడం నేర్చుకోవాలి” అన్న మాధవ్ గాడ్గిల్ మాటల్ని ఆచరణలో పెట్టడమే ఆయనకు మనమిచ్చే నివాళి !



