డా. విరించి

డార్విన్‌ను సరిగా అర్థం చేసుకోవడం నిజానికి చాలా అవసరం. నేటికీ అతడిని సరైన రీతిలో అర్థం చేసుకుంటున్నామా అన్నది ప్రశ్న. డార్విన్ నుంచి సరిగ్గా అర్థం చేసుకోకపోతే అతడు వాడుకోబడతాడు; అతడి సిద్ధాంతమూ వాడుకోబడుతుంది—చరిత్ర ఇది ఎన్నోసార్లు నిరూపించింది కూడా. డార్విన్‌ను “జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త”గా మాత్రమే నిర్వచించిన క్షణంలోనే, అతడి మేధో ప్రాముఖ్యతను మనం సంకుచితం చేస్తున్నట్టు. డార్విన్‌ను అర్థం చేసుకోవడం అంటే అతడు చెప్పిన పరిణామ సిద్ధాంతాన్ని మాత్రమే అర్థం చేసుకోవడం కాదు; అతడికి ముందు జీవశాస్త్రం ఏ ప్రశ్నలను అడిగింది, ఆ ప్రశ్నలు ఏ హేతుబుద్ధి ఆధారంగా ఉద్భవించాయి, మరియు ఆ హేతుబుద్ధి చరిత్రలో ఎలా రూపాంతరం చెందుతూ ముందుకు సాగిందో తెలుసుకోవడం. అంటే, డార్విన్ కి ముందు ఉన్న జీవశాస్త్రంలో the journey of Reason ని అర్థం చేసుకోవడం అందుకే చాలా ముఖ్యమైన అంశం అవుతుంది. 

డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకృతి ఎంపికతో ముడిపడి ఉందని మనకు తెలుసు‌ . ఐతే ఈ మేథో ఆలోచన అరిస్టాటిల్ సమయంలో ఉన్న జీవశాస్త్రంలో వస్తుందని ఊహించలేం. అలాగే నైతిక మత తత్వ జ్ఞానం అబ్బిన మధ్య యుగాల్లోనూ ఇటువంటి ఆలోచన ఒకదానిని ఊహించలేం. అలాగే డార్విన్ థియరీని భూగర్భ శాస్త్రం, శరీర నిర్మాణ శాస్త్రాలు, జనాభా శాస్త్రాల contribution లేకుండా ఊహించలేం. అంటే డార్విన్ కి ముందు జీవశాస్త్రం మొదలై, అది ఒక విధమైన హేతుబద్ధ విచారణతో ముందుకు సాగింది. అంటే అదేమీ అహేతుకంగా లేదు. ఐతే ఆ హేతుబద్ధ ఆలోచనలు పరిపక్వ దశకు చేరిన తర్వాతే డార్విన్ సిద్ధాంతం రూపుకడుతుంది‌. ఇదంతా ఒక క్రమం. Continuous process. దీనిని మనం అర్థం చేసుకోవాలి. 

డార్విన్ ముందు ఉన్న జీవశాస్త్ర హేతుబద్ధ పరిమాణాన్ని పునర్నిర్మించే ప్రయత్నం ఇక్కడ మొదట చేస్తున్నాను.

టీలియాలజీ (ఉద్దేశ్య సిద్ధాంతం) కాంట్ vs మతం : 
1755 లో ఇమాన్యువల్ కాంట్ ఒక అజ్ఞాత వ్యక్తిగా తన పేరు ప్రకటించకుండా రాసిన గ్రంథం Theory of Heavens. అందులో అజీవ ప్రపంచం యొక్క ఆవిర్భావాన్నీ, పరిణామాన్నీ విశ్వ క్రమతను న్యూటన్ సూత్రాలకు అనుగుణంగా ఏ లక్ష్యమూ లేని యాంత్రిక విషయాలుగా వివరించాడు. ఐతే ఒక గొంగళి పురుగు, ఒక విత్తనం లో ఉండే క్రమబద్ధతను యాంత్రికంగా వివరించడానికి ముందే గ్రహాల్లో, వాటి కక్షల్లో, విశ్వావిర్భావంలోని క్రమత యాంత్రికంగా వివరించబడుతుంది అని అతడు జోస్యం చెప్పాడు.. ( తర్వాత నూరు సంవత్సరాలకు డార్విన్ వచ్చాడు ). ప్రకృతి మొత్తం ,నక్షత్రాల నుంచి జీవుల వరకు – సహజ నియమాల ద్వారానే క్రమంగా అభివృద్ధి చెందుతాయనీ, జీవ నిర్మాణానికి కావలసిన క్రమత (order) కూడా యాంత్రిక నియమాల నుంచే ఉద్భవిస్తుందనీ అందుకే జీవం కూడా ఒక emergent phenomenon అనీ అన్నాడు‌. అంటే ,కాంట్ వివరించిన ద్వైతం ( explanatory dualism) జీవరహిత ప్రపంచపు ఉనికినీ పరిణామాన్నీ ఉద్దేశ్య రహితంగానూ జీవప్రపంచాన్ని ఉద్దేశ్య సహితంగానూ ఉంది. కాంట్ నాస్తికుడు కాదు. కానీ కాంట్ దేవుడు మతానికి చెందిన దేవుడు కాదు. హేతుబద్ధ దేవుడు. జ్ఞానోదయ యుగంలో దైవ వాదాన్ని హేతుబద్ధ దైవవాదం లేదా ప్రకృతి దైవ వాదం అనికూడా అంటారు. ఈ దైవం గడియారం తయారీ దారువంటి వాడు. ఒకసారి గడియారం తయారు చేశాక అతడి ప్రమేయం లేకుండానే గడియారం నడుస్తూ ఉంటుంది‌. విశ్వంలోని క్రమతను దైవం ఏర్పరిచాక దైవ స్పర్శ అవసరమే లేదు. 

మతవాదం ప్రకారం : సృష్టికర్త జీవులను సృష్టిస్తాడు. వివిధ రకాలైన జీవులను అవి ఉన్నది ఉన్నట్లుగా ఏ మార్పు చెందని వాటిగా సృష్టిస్తాడు (Fixity of species) ఈ జీవులన్నీ వాటి ఉన్నత సృష్టి ఆధారంగా ఒక నిచ్చెన పై కింది నుండి పైకి అమర్చబడి ఉంటాయి (Ascending Ladder of Being) సృష్టిలో అన్ని జీవుల కంటే మానవుడు ఉన్నతుడు, చివరి వాడు. దేవుడు తన రూపంలోనే మనిషిని సృష్టించాడు. మానవుని కోసమే మిగితా అన్నింటినీ సృష్టించాడు. దీన్నే మానవ కేంద్రక ఉద్దేశ్య వాదం anthropocentric teleology అంటారు.

కాంట్ ప్రకారం: దైవ ఉద్దేశ్య సిద్ధాంతం జీవులలోని సంక్లిష్టతను వివరించడానికి ఒక హేతుబద్ధ సహాయక సూత్రంగా ఉపయోగపడుతుందే తప్ప దానిని సత్యమని అతడు ఒప్పుకోలేదు. కాంట్ ప్రకారం, జీవులలో కనిపించే purposiveness ను మన మానవ బుద్ధి, కారణ–కార్య సంబంధాల ద్వారా పూర్తిగా వివరించలేకపోతుంది కాబట్టి, మనం దైవబుద్ధి ఉన్నట్టుగా (as if an intelligent designer) ఊహించుకుంటే అర్థం చేసుకోవడం సులభమవుతుంది. అంటే మన బుద్ధి పరిమితుల వల్ల దైవబుద్ధిని ఊహించుకోకుండా జీవులను అర్థం చేసుకోలేం అంటాడు కాంట్. 

1804 సంవత్సరంలో కాంట్ మరణించే సమయానికి జీవశాస్త్రం ప్రాథమిక దశలో ఉన్నది. మౌలికమైన సిద్ధాంతాలు లేవు. పరిశీలనలు లేవు. డార్విన్ కి ముందు ఉన్న ఈ తొలి కాలపు జీవశాస్త్రంపై కాంట్ ప్రభావం ఏమీ లేదు‌‌. అందువల్ల కాంట్ కి ముందూ కాంట్ తర్వాత కూడా “ఈ సృష్టికి అంతిమ లక్ష్యం మానవుడే”అనే భావం అలాగే ఉండిపోయింది. 

డార్విన్ కి ముందున్న జీవశాస్త్రం: 
డార్విన్ కి ముందు ఉన్న జీవశాస్త్రం, మతవాదానికి ప్రత్యక్షంగా లోబడకపోయినా, కాంటియన్ ఉద్దేశ్య వాదం పరిమితిని దాటి, అది తనదైన హేతుబద్ధ ఆలోచనతో ముందుకు సాగింది‌. అరిస్టాటిలియన్ అంతర్గత ఉద్దేశ్య భావనను సహజీకరించి ఉపయోగించింది. అంటే జీవులలోనే అంతర్గతంగా ఉద్దేశ్యం ఉన్నట్టుగా భావిస్తూ ప్రకృతిని వివరించడానికి ప్రయత్నించింది. ఈ వివరణలో దైవ ఉనికి మాత్రమే తొలగించబడింది, కానీ ఆ తర్కబద్ధతలో ఇంకా “అంతర్భూత టెలియాలజీ”, “జాతుల స్థిరత్వం”అలాగే “ల్యాడర్ ఆఫ్ అసెంట్” వంటి శ్రేణీ సంబంధ భావనల నుంచి బయట పడలేదు. లినేయస్ జీవజాతులను స్థిరమైన, సహజ రకాలుగా (natural kinds) వర్గీకరించాడు. జీవజాతుల వర్గీకరణ ద్వారా అతడు ప్రకృతి లోనే ఉన్న క్రమాన్ని కనుగొన్నాడు. జాతులు ఒకసారి సృష్టించబడ్డాక మార్పు చెందవు అనేది అతడి కేంద్ర భావన. ఈ ఉద్దేశ్యవాద హేతుబుద్ధి జాన్ రే వద్ద మతపరమైన సహజ ధర్మశాస్త్ర (Natural Theology) రూపంలో స్పష్టంగా కనిపిస్తే, కువియర్ వద్ద జీవుల నిర్మాణం–కార్యాల మధ్య ఉన్న అంతర్గత అనుసంధానంగా, మరింత సహజీకరించిన రూపంలో వ్యక్తమవుతుంది.

లామార్క్ మొదటిసారిగా జీవశాస్త్రంలో ఒక కీలకమైన మేధో మలుపును తీసుకువచ్చాడు. అతడు జీవ పరిణామంలోకి చరిత్రను, అంటే కాలాన్ని ప్రవేశపెట్టాడు. జీవజాతులను స్థిరమైన నిర్మాణాలుగా కాకుండా, కాలంలో మార్పులకు లోనయ్యే చారిత్రక సత్యాలుగా అర్థం చేసుకున్నాడు. ఈ మార్పు బయట నుంచి విధించబడిన దైవ సంకల్పంగా కాకుండా, ప్రకృతి అంతర్గత ప్రక్రియగా జరుగుతుందని వివరించాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే—లామార్క్ వివరణ ఇంకా ఉద్దేశ్య సిద్ధాంతాన్ని పూర్తిగా వదల్లేదు. జీవ పరిణామానికి ఒక దిశను, లక్ష్యాన్ని అతడు కల్పించాడు; పరిణామం ఒక నిర్దిష్ట, non-random దిశలో—సరళత నుంచి సంక్లిష్టత వైపు—కదులుతుందని భావించాడు. ఈ అంతర్గత, దిశానిర్దేశిత పురోగతి భావన అరిస్టాటిలియన్ అంతర్గత ఉద్దేశ్య వాదానికి దగ్గరగా ఉన్నప్పటికీ, దాని చారిత్రక–పురోగమన స్వరూపం వల్ల దానితో పూర్తిగా సమానమైనది కాదు. జీవుల మధ్య తేడాల ఆధారంగా ఏర్పడే ‘విభిన్న జీవనావకాశాలను’ (differential survival) వివరించగల అనుద్దేశిత (non-intentional) ప్రక్రియ అతనికి అందుబాటులో లేదు. ఇదే రకమైన మేధో పరిమితి చార్లెస్ డార్విన్ తాతగారైన ఎరాస్మస్ డార్విన్ వద్ద కూడా కనిపిస్తుంది. ఎరాస్మస్ డార్విన్ జీవజాతుల స్థిరత్వాన్ని తిరస్కరించినప్పటికీ, పరిణామాన్ని ఒక అంతర్గత పురోగతి ధోరణిగా, టెలియాలజికల్ ప్రకృతి భావనలోనే అర్థం చేసుకున్నాడు. లామార్క్ వద్ద కనిపించే ఉపయోగ–అనుపయోగ పద్ధతి వంటి స్పష్టమైన జీవశాస్త్ర యంత్రాంగం ఎరాస్మస్ డార్విన్ వద్ద లేకపోవడంతో ఇతడి సిద్ధాంతం లామార్క్ సిద్ధాంతంతో పోలిస్తే బలహీనమైనది.

డార్విన్ నేపథ్యం: 
డార్విన్ ముందటి జీవశాస్త్ర హేతుబద్ధతలో ఉద్దేశ్య వాదం పరుచుకుని ఉంది. దానిలోకి లామార్క్, ఎరాస్మస్ డార్విన్లు చరిత్రను ప్రవేశ పెట్టారు. అంటే కాలానుగుణంగా జీవులు మార్పును చెందుతాయనుకున్నారు. లామార్క్ ప్రకారం, జీవులు తమ పరిసరాలకు అనుగుణంగా అవయవాలను ఉపయోగించడం లేదా వదలడం (use disuse) వల్ల జీవనకాలంలో పొందిన ఆకార మార్పులు అనువంశికంగా సంక్రమించి, జాతి స్థాయిలో ఒక దిశానిర్దేశిత పురోగతికి దారితీస్తాయి. ఐతే ఒకే రకమైన జీవుల మధ్య ఉండే తేడాను వివరించేందుకు లామార్క్ వద్ద సమాధానం లేదు. అతడు దైవాత్మక ఉద్దేశ్యాన్ని వదిలినా, అంతర్భూత ఉద్దేశ్య వాదాన్ని వదులుకోలేదు. ఈ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, డార్విన్ ప్రాముఖ్యత ఒక పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడంలో కాదు, జీవశాస్త్ర హేతుబద్ధత స్వరూపాన్ని మార్చడంలో ఉంది. అతడు చరిత్రను ఉద్దేశ్యం నుంచి విడదీసి జీవ పరిణామాన్ని లక్ష్యోన్నత పురోగతిగా కాకుండా, జనాభా స్థాయిలో జరిగే అంధ, అనుద్దేశిత ప్రక్రియగా— విభిన్న జీవనాకాశాలను ఒకే జాతి లోని విభిన్నతలను వివరించగల సహజ ఎంపిక (natural selection) రూపంలోకి మలిచాడు. ఈ విధంగా డార్విన్ జీవశాస్త్రాన్ని టెలియాలజీ నుంచి విముక్తం చేసి, తొలిసారిగా జీవన ప్రపంచాన్ని పూర్తిగా చారిత్రకమైన, కానీ లక్ష్యరహితమైన సహజ ప్రక్రియల ఫలితంగా నిలబెట్టాడు. ఈ విధంగా చూసినప్పుడు మత వాదనలతో విభేదం డార్విన్ తోనే మొదలైందనేది అవాస్తవమనీ అది జీవశాస్త హేతుబద్ధతగా డార్విన్ కంటే చాలా ముందునుంచే ఉందనీ అర్థమౌతుంది.

డార్విన్ తప్పుగా అర్థం కావడానికి కారణం: 
గమనిస్తే డార్విన్ ముందు ఉన్న జీవశాస్త్ర హేతుబద్ధ పరిమాణాన్ని పునర్నిర్మించడం ద్వారానే మనం డార్విన్ సిద్ధాంత విలువను పెంచడమే కాకుండా డార్విన్ ని తప్పుగా అర్థం చేసుకునే స్థితినుండి కాపాడగలుగుతాం. ఈ అధ్యయనా పద్ధతిని పునర్నిర్మాణం చేయకపోవడం వలన డార్విన్ నాలుగు రకాలుగా తప్పుగా అర్థం చేసుకోబడ్డాడు. 

1. డార్విన్ సిద్ధాంతం అంటే శుద్ధ అనుభవవాదం (Darwin theory as Pure Empiricism )
డార్విన్ సిద్ధాంతాన్ని కేవలం పరిశీలనలు, వాస్తవాలు, సేకరణల ఫలితంగా మాత్రమే చూడటం ఒక తీవ్రమైన పొరపాటు. ఈ దృష్టిలో డార్విన్ ఒక గొప్ప naturalist గానే మిగిలిపోతాడు. డార్విన్ ముందటి జీవశాస్త్ర Reason ను అర్థం చేసుకోకుండా అది ఎక్కడ ఆగిపోయిందో అర్థం చేసుకోకుండా అతడిని empirical data collector గా చూడటం. 

2. డార్విన్ సిద్ధాంతం అంటే ఒక భావజాలం ( Darwin theory as an Ideology)
డార్విన్ సిద్ధాంతాన్ని ఒక సామాజిక లేదా నైతిక సిద్ధాంతంగా మార్చడం తో Social Darwinism అనే మరింత ప్రమాదకర ధోరణి రావడం జరిగింది. ఇక్కడ సహజ ఎంపిక ఒక వివరణాత్మక ప్రక్రియగా కాకుండా, ఒక సామాజిక నియమంగా, ఒక సామాజిక న్యాయంగా మార్చబడటం. ఈ దుర్వినియోగానికి మూలకారణం ఏమిటంటే—డార్విన్ ముందటి జీవశాస్త్ర Reason లో ఇంకా ఉన్న టీలియాలజికల్ ఆలోచనలను డార్విన్ మీదకు తిరిగి projection చేయడం. పరిణామం “పురోగతి” అని, “బలమైనవారి విజయం” అని చదవడం, డార్విన్ విరమించిన దిశానిర్దేశిత Reason ను తిరిగి ప్రవేశపెట్టడమే.

3. డార్విన్ సిద్ధాంతం లో దాగి ఉన్న అదిభౌతికత ( Darwin theory as Metaphysics in disguise)
డార్విన్ సిద్ధాంతాన్ని ఒక కొత్త అది భౌతిక సిద్ధాంతంగా చదవడం వలన సహజ ఎంపిక ఒక వివరణాత్మక యంత్రాంగం కాకుండా, ఒక సర్వవ్యాప్తమైన, తప్పనిసరి నియమంగా మారుతుంది. దేవుని స్థానంలో Natural selection/ ప్రకృతి వచ్చి చేరుతుంది(Biological determinism). ఈ పఠనం డార్విన్ సిద్ధాంతాన్ని చారిత్రక, జనాభా-ఆధారిత ప్రక్రియగా కాకుండా, ఒక నిర్ధిష్ట భవితవ్యాన్ని నిర్దేశించే సిద్ధాంతంగా మారుస్తుంది. ఇది డార్విన్ పూర్తిగా తిరస్కరించిన ఆలోచన.

4. డార్విన్, మత వ్యతిరేకుడు
అత్యంత సాధారణంగా, డార్విన్‌ను మతంపై ప్రత్యక్ష దాడి చేసిన వ్యక్తిగా చూడటం. డార్విన్ తన సిద్ధాంతం ద్వారా మతాన్ని డైరెక్ట్ గా ఖండించిన శాస్త్రవేత్త కాదు. అతని ప్రాముఖ్యత మతాన్ని ఎదురుదాడి చేయడంలో కాదు, మతపరమైన వివరణలు అవసరం లేని జీవశాస్త్ర హేతుబద్ధతను—తనకంటే ముందే జీవశాస్త్రంలో ప్రారంభమైన దానిని—సిద్ధాంతపరంగా పూర్తిచేయడంలో ఉంది. అంటే జీవశాస్త్రంలో మతాన్ని వివరణాత్మకంగా అప్రాసంగికం చేసే ప్రక్రియను అతడు తర్కపరంగా పూర్తి చేశాడు. ఈ కారణంగానే డార్విన్ మతానికి ప్రత్యక్షంగా వ్యతిరేకుడిగా కనిపిస్తాడు.

అందువల్ల, డార్విన్ సిద్ధాంతాన్ని కాపాడేది అతడి సిద్ధాంతమే కాదు; డార్విన్‌కు ముందే జీవశాస్త్రంలో జరిగిన హేతుబద్ధ మార్పుల పరిణామాల చరిత్ర కూడా. జీవశాస్త్ర Reason యొక్క అంతర్గత ప్రయాణాన్ని పునర్నిర్మించకుండా డార్విన్‌ను అర్థం చేసుకోవడం అసాధ్యం. ఈ ప్రయాణం నిరంతరం డార్విన్ తరువాత కూడా నేటికీ కొనసాగుతూనే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *