అది 1881 ఏప్రిల్ 7వ తేదీ. రెండవ అలెగ్జాండర్ జార్ను పై బాంబు విసిరి చంపినందుకు టెర్రరిస్టులపై విచారణ జరుగుతోంది. బాంబు విసిరిన వాడు రిస్సాకఫ్. బాంబునెలా ప్రయోగించాలో నేర్పిన వాడు కిబాల్చిచ్.

క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతోంది. నేరం నిర్ధారణ కాక తప్పదని తెలిసిపోతూనే ఉంది. ఏం జరుగుతున్నా తనకేమీ సంబంధం లేనట్టే ఉంది కిబాల్చిచ్ ముఖం. ఏదో తప్పనిసరి బేరంగా కోర్టులో ఏదో తమాషా చూడ్డానికి వచ్చినట్టే ఉంది అతని వాలకం. ఒకవైపు నేరారోపణ పత్రం చదువుతుంటే అతి ముఖ్యమైన తన పని చెడగొడుతున్నట్టు విసుగ్గా ఉంది అతని ధోరణి.
ఇంతలో పేలుడు పదార్థాల నిపుణుడు వచ్చాడు. తన అభిప్రాయాన్ని వివరించడం మొదలు పెట్టాడు. అంతే ఒక్కక్షణంలో కిబాల్చిచ్ ముఖం దేదీప్యమానంగా వెలిగిపోయింది. బాంబు తాలూకు ఫ్యూజు తయారీలో తనక్కొన్ని సందేహాలున్నాయి. అవన్నీ ఆ నిపుణుణ్ణి ఒక్కొక్కటీ అడుగుతున్నాడు కిబాల్చిచ్. కోర్టు వాతావరణమంతా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎన్నో నిగూఢమైన శాస్త్ర సాంకేతిక విషయాలు నిపుణుడూ, కిబాల్చిచ్ వాదించుకొంటున్నాడు. చూస్తే అది కోర్టులా లేదు. కేసులా లేదు. ఏదో మహాపండితుల గోష్టిలా ఉంది. నిపుణుడు ఏవేవో గ్రంథాల్ని ఉట్టంకిస్తున్నాడు. కిబాల్చిచ్ తాను ఆ వివరాలున్న శాస్త్ర గ్రంథం చదవలేక పోయానని ఎంతో విచారంగా ఉంది అన్నాడు.
చివరకు నిపుణుడు జార్ చక్రవర్తిపై విసిరిన బాంబు అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో తయారైందని కోర్టుకు నివేదించినప్పుడు మన కిబాల్చిచ్ ముఖం వేయిరేకుల పద్మంలా వికసించింది. అతని ఉత్సాహం కట్టలు తెంచు కొంది. ఆ నిపుణుడితో కృతజ్ఞతాపూర్వకంగా ‘సృశీబ’ అంటూ కరచాలనం చేశాడు.
ముద్దాయిలు ఆరుగురికీ ఉరిశిక్ష పడింది. వారిలో మన కిబాల్చిచ్ కూడా ఉన్నాడు. అతనికి ఉరిశిక్ష పడ్డం కన్నా అతని శాస్త్ర పాండిత్యం ప్రముఖ వార్తగా పత్రికల ద్వారా ప్రాకిపోయింది. ఒక మహా మేధావి ఉరికంబం ఎక్కుతున్నాడని ఎక్కడలేని సానుభూతి, ఆందోళనా వ్యక్తం కాసాగాయి.
ఉరిశిక్ష పడినా కిబాల్చిచ్ ముఖంలో పిసరంత చింతైనా లేదు. ఏదో దీర్ఘ ఆలోచనల్లో ఆయన మునిగి తేలుతున్నాడు. ఈ లోకంలో లేడు. ఇంతలో అతన్ని కలుసుకునేందుకు ప్రభుత్వ లాయరు వచ్చాడు. కన్నీళ్ళు గుక్కుకొంటూ ‘ఏమైనా కావాలా’ అన్నాడు. ఇప్పుడు కిబల్చిచ్ కుమిలిపోవడం లేదు. నిర్వికారంగా ఉన్నాడు. ‘రాసుకోవడానికి కాగితాలూ, కలమూ కావాలి’ అన్నాడు ముక్తసరిగా. అవి వచ్చేశాయి. `పేజీలకు పేజీలే కిబాల్చిచ్ ఏదో రాస్తున్నాడు. డిజైన్లు వేస్తున్నాడు. అంతా పూర్తిచేసి దానికి ‘రాకెట్టు విమానపు డిజైన్’ అని పేరు పెట్టాడు. దాన్ని భద్రంగా నిపుణుల కమిటీకి అప్పగించాలని కోరాడు. లాయరు ఆ కాగితాల కట్టను జైలు అధికారికి అప్పజెప్పాడు.
కిబాల్చిచ్ తన కర్తవ్యం పూర్తి చేసుకొన్న అపరిమిత సంతృప్తితో చిరునవ్వుతో ఉరికంబం ఎక్కాడు. అతని కథ విషాదగాథగా అలా మిగిలిపోయింది. అప్పటికే అతనికి ఎనలేని గౌరవాదరాలు దేశమంతా ఉన్నై. ఈ రాకెట్టు విమానం తెలిస్తే ఇంకేమైనా ఉందా? గగ్గోలు కాదూ అందుకే కిబాల్చిచ్ పత్రాల్ని భద్రంగా రికార్డులో పెట్టి తాళం వేశారు. 37 ఏళ్ళ తర్వాత 1918లో సోవియట్ అధికార్లు జైలు రికార్డుల్ని తిరగేస్తున్నపుడు ఈ పత్రాలు బయటపడ్డాయి.

ఇంతకూ వాటిలో ఏముంది?
ఓ అద్భుతమైన రాకెట్ డిజైన్ అందులో ఉంది. కిబాల్చిచ్ డిజైను చేసిన ఈ రాకెట్టు విమానం మధ్యలో మంటగది ఉంటుంది. అందులోకి పేలుడు గుళికలు వరుసగా వస్తూ పేలుతూ ఉంటాయి. ప్రతిక్రియ వల్ల విమానం నిట్టనిలువుగా పైకి లేస్తుంది. ఆ తర్వాత నాజిలును పక్కకు వంచడం ద్వారా విమానం భూ సమాంతరంగా ప్రయాణిస్తుంది. మందు గుళికల సైజును మార్చడం ద్వారా గానీ, మంట గదిలోకి అవి ప్రవేశించే రేటును తగ్గించడం ద్వారా గానీ విమాన వేగాన్ని మార్చవచ్చు. ఇది ఇందులో సారాంశం.
అప్పటిదాకా ఇంజనీర్లకు అందుబాటులో ఉన్న శక్తులు మూడు. వాటిలో ఆవిరిశక్తి చాలా బరువైంది. స్ప్రింగు శక్తి చాలా బలహీనమైంది. రసాయన ఇంధనశక్తి రాకెట్టుకు అనుకూలమైందని భావిస్తున్న కాలంలో ఈ రాకెట్ డిజైన్ని కిబాల్చిచ్ రూపొందించాడు. రాకెట్ నిర్మాణ శకంలో ఒక మహాద్భుత కీలక ఘట్టం ఇలా ఉరికొయ్య నీడలో నాందీ ప్రస్తావన చేసుకొంది! మృత్యుచ్ఛాయలు ముసురుకొంటున్న వేళ ఒక మహావిష్కరణ ఇలా పురుడు పోసుకొంది.
అనుసృజన – విఠపు బాలసుబ్రమణ్యం



