మిఠాయి యుగంధర్ బాబు
కాకి ఒకటి నీళ్లకి కావు కావు మనెను….
చిన్నప్పుడు ఈ పద్యాన్ని పాటలాగా ప్రతి పిల్లవాడు, ప్రతి ఒక్కరూ పాడుకొనే ఉంటారు. ఒక కాకికి దాహం వేసి నీటి కోసం చూస్తే దానికి మట్టికుండ కనిపించింది. కానీ కుండలో నీరు అడుగున ఉండటంతో దానికి అందలేదు. అప్పుడు ఉపాయంతో గులకరాళ్లు ఒక్కొక్కటి తీసుకువచ్చి కుండలో వేసింది. నీళ్లు పైకి వచ్చినవి. వెంటనే దాని దాహం తీర్చుకుంది. యాక్షన్ రైం లాగా ఈ పాట తెలుగులో చాలా ప్రసిద్ధి. అలా చిన్నప్పుడు నుంచి మనము కాకితో అనుబంధాన్ని పెంచుకుంటూ వస్తాము. కానీ రాను రాను కాకి అంటే ఓ విధమైన వెగటు, జుగుప్సా అలవాటవుతుంది. కాకులను చిరాకు తెప్పించే కౄరమైన పక్షులుగా చూస్తాము. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. అది నల్లగా ఉంటుంది, అంద వికారంగా ఉంటుంది (???).. దాని అరుపు వినసొంపుగా ఉండదు.
“కాకి కోకిల అవుతుందా! కంచు కనకం అవుతుందా” అని ఓ కవి పాటే రాసేసాడు. స్కూల్లో పిల్లలు అరుస్తూ, గలాటా చేస్తూ ఉంటే “ఏందిరా కాకి గోల” అని అంటాడు గురువు. ఇంటి పైన కాకి అదే పనిగా అరుస్తూ ఉంటే తరిమేస్తాం (ఇప్పుడు ఇంటిపైన కాకులు వాలడం తగ్గిపోయింది అనుకోండి) అలా కాకులు పైన అన్యాపదేశంగా మనలో ఓ విధమైన అభిప్రాయాన్ని ఏర్పాటు అయిపోతుంది.
కానీ ఈ కాకులపై.. కాకుల చుట్టూ రకరకాల అపోహలు, రకరకాల ఆచారాలు పెనవేసుకొని ఉన్నాయి. కాకి అరిస్తే ఇంటికి ఎవరో వస్తారని, పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కాకి అరిస్తే అది శుభ సంకేతం అని, నిండు కుండపై కూర్చుంటే చూసినవారికి ధన యోగం పడుతుందని, నోట ఏదైనా కరుచుకొని వెళితే ఏదో శుభవార్త వినబోతున్నామని, తలను తాకుతూ వెళితే త్వరలో అవమానాల పాలవడానికి అవకాశం ఉందని. . ఇలా అనేక రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి వీటిని నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. విదేశాలలో ప్రేతాత్మలకు, దయ్యాలకు ప్రతీకగా కాకిని చూపిస్తారు. ఓమన్ సిక్స్ సిక్స్ సిక్స్ అనే సినిమాలో కాకిలో దయ్యం ఉంటుంది. ఇలా కాకులు – ప్రేతాత్మ అంశం పైన అనేక సినిమాలు వచ్చాయి.
ఇది కాకుండా అసలైన నమ్మకం ఇంకొకటి మనదేశంలో వుంది. మత సంప్రదాయాల ప్రకారం పూర్వీకులు కాకుల రూపంలో వస్తారని నమ్మకం. ఆ నమ్మకంతో కాకులకు అన్నం పెడతారు. ఓ ప్రవచనకారుడు అంటాడు… “పితృ దేవతలకు అన్నం పెట్టాలంటే కాకికి అన్నం పెట్టండి. కాకి అన్నం తింటే ఆ వెంటనే ఆహారం పితృదేవతలకు చేరుతుంది. వారికి కడుపు నిండుతుంది.”
ఎవరైనా చనిపోయిన తర్వాత ఉత్తర క్రియ అంటే దినాల రోజున పిండ ప్రదానం లో భాగంగా కాకులకు పిండం పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కాకి ముట్టకపోతే చనిపోయిన వారి ఆత్మ శాంతించలేదు. వారు ఏదో బాధపడుతూ ఉన్నారని ప్రచారం. దీనికి ఒక కథ ఉంది. పురాణాల ప్రకారం రావణునికి భయపడి దేవతలు అందరూ తలా ఒక్కొక్క జంతువులోకి ప్రవేశించారట. తొండలోకి కుబేరుడు, కాకిలోకి యముడు, లేడి లోకి ఇంద్రుడు, నెమలిలోకి వరుణుడు ఇలా ప్రవేశిస్తారట. అయితే రావణుడు వెళ్లిపోయాక ఆ జంతువుల నుండి వీళ్ళందరూ బయటికి వచ్చి వాటికి వరాలు ఇస్తారట. అందులో భాగంగానే యముడు కాకికి వరం ఇచ్చాడట. అది కాకి బలవన్మరణం.అంటే కాకి తనంతట తాను స్వయంగా చనిపోతే తప్ప దానికి మరణం ఉండదని వరం ఇస్తాడట. అంతే కాకుండా కాకులకు ఎవరైనా పిండం పెడతారో కాకి ఎవరి పిండమైతే తింటుందో వారికి నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పారట. అందరూ భయపడే శనీశ్వరుడికి కాకి వాహనంగా ఉందట.
ఇలా కాకులకు పిండ ప్రమాదం చేయడం ఆనవాయితీగా మారిపోయింది. కానీ కాకుల సంఖ్య నానాటికి తగ్గిపోయింది. దానికి అనేక కారణాలు కావచ్చు. కాబట్టి కాకులకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ నేపద్యంలో తమిళనాడు మరియు దేశంలో కొన్నిచోట్ల కాకులను అద్దెకి తిప్పుతున్నారు. కాకి కావలసిన వాళ్లు పిండం పెట్టవలసిన వాళ్ళు ముందుగానే బుక్ చేసుకుంటే వాళ్ళు కాకిని తీసుకొస్తారు. అంటే అడ్వాన్స్ బుకింగ్ అన్నమాట, డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి. ఆ కాకి సింగల్ గా రావాలంటే కాకి అద్దె, దాని యజమాని ప్రయాణ ఖర్చులు చాలా అవుతుంది. కాబట్టి ఒక ఏరియాలో కాకి కావలసిన వాళ్ళందరూ ఒక గుంపుగా ఏర్పడి ఒకేసారి వాళ్ల పితృ దేవతలకి సామూహికంగా పిండాలు పెడుతున్నారు. ఈ వ్యాపారం లాభసాటిగా ఉందని కాకులని పెంచే వాళ్ళు చెబుతున్నారు.
ఈ తతంగం పైనే ఈ మధ్య “బలగం” అనే ఓ సినిమా కూడా చాలా సక్సెస్ ఫుల్ అయింది. ఇందులో కాకి వచ్చి పిండం తినకపోవడం, అంటే చనిపోయిన ఇంటి యజమాని బాధపడుతూ ఉన్నాడు అన్నది సమస్య. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని కలహాలు ఉంటాయి. ఈ నేపద్యంలో కుటుంబంలో మనస్పర్ధలు, కలహాలు, ప్రేమలు, ఆప్యాయతలు డైరెక్టర్ చాలా చక్కగా చూపించి కలిసిమెలిసి ఉంటేనే ప్రేమలు చిగురుస్తాయని, అదే కుటుంబం అని సందేశం ఇస్తాడు. చివరికి గ్రాఫిక్స్ లో కాకి వచ్చి పిండం తినడంతో కథ ముగుస్తుంది. కానీ మనవాళ్లు కుటుంబం, ప్రేమ ఆప్యాయతలు అనే అసలు పాయింట్ వదిలిపెట్టి దానికంటే. …”కాకి పిండం తినడం” పైనే ఎక్కువ ప్రచారం జరిగి దాన్ని ఒక హైలెట్ చేసుకొని పిండం కాకి తినకపోతే నిజంగానే పితృదేవతలు కోపంగా ఉన్నారని, బాధపడుతున్నారని, అసంతృప్తితో ఉన్నారని, ఇంక వారిని తృప్తి పరచడానికి లేనిపోని తతంగాలతో ఆర్థికంగా చితికి పోతున్నారు.
దాదాపు 350 ఏళ్లకు ముందే 17 శతాబ్దంలో ప్రజా కవి వేమన గారు ఇలా అన్నారు
“పిండములను చేసి పితురుల తలపోసి
కాకులకును బెట్టు గాడ్దెలారా
పియ్యి తినెడు కాకి పితరుడెట్లాయరా
విశ్వదాభిరామ వినురవేమ”
ప్రజల అజ్ఞానం పైన ఆయన కాస్త కోపంగా, కఠినంగా, ఆవేదనతో ఈ పద్యం రాశారు. తన పద్యాలలో సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, తాత్విక అంశాలను విమర్శకు పెట్టాడు వేమన. అవి ఈ ఆధునిక కాలంలో కూడా కొనసాగుతూ ఉన్నాయి. సగం పాత, సగం కొత్తల మధ్యలో ఇరుక్కుని ఉన్నాము. ఆ పాతను వదులుకోవాలని అంటే వేమనను చదవాలి. నిజానికి కాకి ఒక స్కావింజర్ లాగా పనిచేస్తుంది. చనిపోయిన జంతువులను, కుళ్ళిపోయిన వాటిని, చెత్తాచెదారం, పురుగులను తిని మన పరిసరాలను శుభ్రపరుస్తూ ఉంటుంది. ఆ అవగాహనతోనే వేమన పై పద్యాన్ని చెప్పారు. కాకులు ఉచితంగా చెత్త బుట్టలు శుభ్రం చేసి మూగ మరియు హాని చేయని పక్షులు.
కాకులు చాలా సామాజికమైనవి. వాటికి తమదైన సమాజం ఉంటుంది. ఓ కాకి చనిపోతే వందల కాకులు దాని చుట్టుముట్టి తమ సంతాపం తెలియజేయడం మీరు చూసే ఉంటారు. దాని చావు కారణమైన వారిని వదలకుండా వెంట పడడం గమనించి ఉంటారు. అంటే కాకి స్వతహాగా చచ్చిపోవడం అన్నది ఓ అద్భుత కల్పన అని పిలుస్తోంది. కాకిని సంస్కృతంలో వాయసం అంటారు కదా. మాల కాకి, జంగిల్ క్రో లాంటి కాకులను పట్టి వాటి మాంసం తినడం వల్ల కాకులు తగ్గిపోతున్నాయి. తమిళంలో కాకముట్టె అని ఓ సినిమా కూడా వచ్చింది. పేద పిల్లలు పిల్లలు కాకి గుడ్లను దొంగలించి అట్టు వేసుకొని తినడం. దీని వల్ల కూడా కాకుల సంతతి తగ్గిపోతుంది.
పెద్ద పెద్ద చెట్లు వేప, మర్రి, రావి ఇలాంటి వాటిని నరికి వేయడం కాకులు గూళ్లు కట్టడానికి అవకాశాలు తగ్గిపోవడం, పట్టణాలలో కట్టిన గూళ్లను తొలగించడం, వీధుల్లో వేస్ట్ చెత్త తగ్గిపోవడం, వ్యవసాయ పొలాల్లో ప్రమాదకర పెస్టిసైడ్ వాడడం, వాటిని తిన్న పురుగులను కాకులు తినడం అవి చనిపోవడం లాంటి కారణాల వల్ల కూడా కాకుల సంఖ్య నానాటికి తగ్గిపోతుంది.
ఎరుపంటే కొందరికి భయం భయం… చిన్నపిల్లల వాళ్ళ కంటే నయం నయం అని ఎవరో అన్నారు. ఎరుపు కంటే నలుపు అంటే చాలా మందికి ఇంకా భయం. కొంతమంది భక్తులు చలికాలంలో భక్తి మాల వేసుకున్నప్పుడు నల్ల బట్టలే కడతారు. నలుపు రంగు వేడిని గ్రహిస్తుంది అందులో సైన్స్ ఉంది. కానీ కొంతమందికి నలుపు రంగు అంటే భయం, సెంటిమెంట్ వాళ్లు కాషాయం రంగులు బట్టలు ఇతర రంగు బట్టలు కడతారు. ఎవరైనా చనిపోయినప్పుడు ఉత్తర క్రియలు, దినాల వివరాలు ముద్రించిన కార్డు ఇస్తే అందులో ఓ మూల నల్ల రంగు ముద్రించి ఉంటుంది. అది అశుభం గనుక. ఆ కార్డును ఇంటి లోపలికి తీసుకువెళ్ళడం కోసం మూలన నల్లరంగు ముక్కను చించి తీసుకెళ్తారు. నలుపు అంటే అంత భయం. ఇందుకే అనుకుంటా అధికంగా పాలు ఇచ్చినా నల్లగా ఉన్న ఎనుముని (బర్రెను ) “ఎనుము మాత” అనడానికి మనస్కరించడం లేదు మనవాళ్ళకి.
ఇలా ఓ నల్ల రంగుతో కాకిని అలా ముద్ర వేసి చూడడం అసమంజసము. కాకి కూడా మిగతా పక్షులాగే మనతో సహజీవనం చేస్తున్నటువంటి అమాయక జీవి. వాటిపై హింసను తగ్గిద్దాం. నమ్మకాల పేరుతో వాటిని బంధించి వ్యాపారం చేయడానికి వ్యతిరేకిద్దాం. నీళ్ల కోసం వెతికే కాకికి “గులకరాళ్ల” అవసరం లేకుండా ఇంటి ముందర ముంతలలో మూకుడులో నీళ్లు పెడతాం. వాటికి కాస్త తిండి పెడతాం. కాకుల సంతతిని రక్షించుకుందాం. అవి పర్యావరణాన్ని రక్షిస్తాయి. “కాకి రక్షతి రక్షితః’