మిఠాయి యుగంధర్ బాబు
బెల్లం చీమల్ని ఆకర్షిస్తుంది. అది ప్రకృతి నైజం. అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది. అది పదార్థ నైజం. ధనం మనుషుల్ని ఆకర్షిస్తుంది. ఇది ఆధునిక సమాజపు నైజం కదా! మరి దీనికి వ్యతిరేకంగా అంటే రివర్స్ గేర్ లో ఆ ధనాన్ని మనం ఆకర్షించ గలమా? అలా ఆకర్షించడానికి ఏదైనా యంత్రం ఉందా? (ఉంటే, గింటే దేశమంతా జనాలకు తలా ఒక యంత్రం ఇచ్చేస్తే పోలా). “ధనమేరా అన్నిటికి మూలం” అని ఓ సినీ కవి అన్నాడు కదా. ఆకర్షించడాన్ని లేక తన వైపుకు లాక్కోవడాన్ని ఇంగ్లీషులో “పుల్లింగ్” అని అనుకోవచ్చు. బియ్యాని తనవైపు లాక్కునే (పుల్లింగ్) ఓ యంత్రం ఉంద’ట’. ఆ యంత్రం మీ ఇంట్లో ఉంటే ఒక బియ్యాన్నే కాదు, ధనాన్ని, అదృష్టాన్ని, సకల సంపదలనూ మీ దగ్గరకు లాగుతుంద”ట”. అదే “రైస్ పుల్లింగ్” అనే ఓ యంత్రం అట.
అల్లావుద్దీన్ అద్భుత దీపం
“ఇప్పటివరకు ఉన్న దురదృష్టం పోవాలన్నా, అదృష్టం బంకలాగా, జలగలగా పట్టుకోవాలన్నా పట్టిందల్లా బంగారం కావాలన్నా ఈ యంత్రం ఒకటి ఉంటే చాలు ఇక కోటీశ్వరులు అయిపోయినట్లే. అంతేకాదు ఏది కావాలన్నా అది మీ సొంతం అవుతుంది. మీరు అడగడం ఆలస్యం అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఈ యంత్రం మీ కోరిక తీరుస్తుంది. అదే మా అద్భుత, ఆతీంద్రియ శక్తులు కలిగిన రైస్ పుల్లింగ్ యంత్రం. రండి కేవలం ఒక్కటి మాత్రమే ఉంది. మీ అదృష్టం పరీక్షించుకోండి”.
ఇలాంటి ప్రకటనలు విని, మీడియేటర్లు, బ్రోకర్ల మాటలు విని వాట్సాప్ లో వీడియోలు చూసి నిరాశాపరులు, అత్యాశపరులు జీవితంలో అలసిపోయి అదృష్టం కోసం ఎదురు చూసేవారు, రాత్రికి రాత్రి లక్షాధికారులు అయిపోవాలని కలలు కనేవారు, కష్టపడకుండా అడ్డగోలుగా సంపాదించాలనుకునే వాళ్ళు ఈ యంత్రం మాయలో పడతారు. వాట్సాప్ లో మెసేజ్ లు, వీడియోలు ఫేస్ బుక్ లో ప్రకటనలు, ఇంకా రకరకాలుగా ఈ రైస్ పుల్లింగ్ యంత్రం గురించి ఊదరగొడుతూ ఉంటారు. ఈ మోసాల్లో దిగితే అడుసులో కాలుపెట్టి అదః పాతాళానికి పోయినట్లే.
ఈ రైస్ పుల్లింగ్ అనేది ఓ అభూత కల్పన. ఓ స్కాం. ఓ మోసపూరిత పన్నాగం, కుట్ర”. రైస్ పుల్లింగ్” అంటే “బియ్యపు గింజల్ని ఆకర్షించడం”. ఇండియాలో మోసగాళ్లు లోహ వస్తువులైన రాగి, ఇరిడియం లాంటి వాటికి అద్భుత శక్తులు ఉన్నాయని బియ్యం గింజలను ఆకర్షిస్తాయని వాటికి దివ్య శక్తులు ఉన్నాయని, వీటిని అధిక ధరలకు అమ్ముకోవచ్చు, లేకపోతే పూజా మందిరంలో ఉంచి కామధేనువు లాగా వాడుకోవచ్చని చెప్పి మోసం చేసి, అధిక ధరలకు అమ్ముతారు. కొనేవారికి లేనిపోని ఆశలు చూపించి అంటగడతారు.

ఎందరు మోసపొయ్యారో!
సాధారణ రాగితో తయారు చేసిన వస్తువులను, పాత్రలను అతి పురాతన వస్తువులుగా నమ్మిస్తారు. ఉన్నవి, లేనివి కల్పించి కథలు అల్లుతారు. రాగి వస్తువు లేక పాత్ర ఉరుములు, మెరుపుల తాకిడికి గురై అద్భుత శక్తులు పొందిందనీ, రేడియో ధార్మికతను, మాంత్రిక శక్తిని కలిగి ఉందని ప్రచారం చేసి అత్యధిక ధరలకు అమ్ముతారు. వాటిని కొన్న వారు ఆర్థికంగా చాలా మోసపోతున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో ఓ డాక్టర్ దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించి ఇలాంటి భూటకపు రైస్ పుల్లింగ్ యంత్రం కొని మోసపోయి అప్పుల బాధ తాళలేక ఇంటిల్లిపాది ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీకు తెలిసే ఉంటుంది.
చిత్తూరు జిల్లాలో “అమెరికా నాసా (NASA)” వాళ్ళు వెతుకుతున్న లోహం ఈ రైస్ పుల్లింగ్ యంత్రం లో ఉందని ఓ పెద్ద మనిషికి అంటగట్టి లక్షల రూపాయలు మోసం చేసారు. అనంతపురంలో ఎంతో మహిమ గల రైస్ పుల్లింగ్ యంత్రాలు మా దగ్గర ఉన్నాయని, అవి మీ చెంత ఉంటే మీ దశ తిరగబోతోందని నమ్మించి మోసం చేసిన ముఠా బయటపడింది. చంద్రయాన్ సక్సెస్ కు ఈ రైస్ పుల్లింగ్ యంత్రమే కారణమని నమ్మించి హైదరాబాద్ చెందిన ఓ వ్యాపారి దగ్గర కోట్ల రూపాయలు దోచుకున్నట్లు సమాచారం. డబ్బులు కోల్పోయిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి ఎంతోమంది తనువులు చాలించిన విషాద సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.

దీని కథాకమామీషు ఏమిటంటే?
అసలు ఈ రైస్ పుల్లింగ్ యంత్రం ఏమిటో, దాని కథా కమామీషు ఏమిటో ఓసారి పరికిద్దాం. ఈ రైస్ పుల్లింగ్ యంత్రం అనేది ఓ ప్రత్యేక లోహపు వస్తువు. సాధారణంగా రాగి లోహంతో చేసిన గ్లాసులు ,గిన్నెలు, బిందెలు, మూతలు వంటి వస్తువులు ఇంకా నగలు పూర్వపు నాణేలు వీటీలో ఏవైనా కావచ్చు . దానిని రైస్ పుల్లింగ్ యంత్రం లాగా తయారు చేసుకుంటారు. ఎలాగంటే ఆ వస్తువును రకరకాల రసాయాలతో రుద్ది పాతబడినట్టు చేసి అది ఇరిడియం అనే లోహంతో చేసినట్టుగా నమ్మిస్తారు. రైస్ పుల్లింగ్ అనబడే ఈ వస్తువు చుట్టూ బియ్యం పోస్తారు. ఆ బియ్యాన్ని ఆ పాత్ర ఆకర్షిస్తుంది. (ఎలా ఆకర్షిస్తుందో తర్వాత వివరిస్తాను). బియ్యాన్ని ఆకర్షించినట్టే మీ అదృష్టాన్ని కూడా ఈ పాత్ర ఆకర్షిస్తుందని ప్రచారం చేస్తారు.
ఇంకొంతమంది పురాతన పాత్ర లో దేవుడి విగ్రహం అమర్చి ఓ పరికరం తయారు చేసి మధ్యలో విగ్రహం కింద క్వార్ట్జ్ అమర్చి దాని క్రింది కనబడకుండా బ్యాటరీలు అమరుస్తారు. ఈ పాత్రలో నీళ్ళు పోయేగానే ఆ వత్తిడికి బ్యాటరీలు పనిచేసి ఎరుపు ఆకుపచ్చ రంగులు మారుతుంది. ఆ పాత్ర మహత్యం వల్ల లైటింగ్ వస్తోందని నమ్మిస్తారు. ఇదే రైస్ పుల్లింగ్ పాత్ర అని చెబుతారు.
ఇంకొంతమంది నిధులు, రైస్ పుల్లింగ్ పాత్ర భూమిని పెకలించుకుని వస్తుందని “మీ ఇంట్లో రాత్రి పూట శబ్దాలు వినిపిస్తోందని, ఘల్ ఘల్ శబ్దం వస్తోందని” సైకలాజికల్ ఫీలింగ్ కల్పిస్తారు. మీ ఇంట్లో రైస్ పుల్లింగ్ యంత్రం బయట పడుతుందని, దానిని తవ్వడానికి లక్షల ఖర్చు అవుతుందని డబ్బులు వసూలు చేసి పూజ ప్రారంభిస్తారు. తవ్వే చోట చుట్టూ పరదా కడతారు. కాస్త మట్టి తవ్వి తీసి అక్కడ ఓ బిందె కంఠాన్ని కత్తిరించి భూమి లో పెట్టి ” బిందె కంఠం బయటపడింది. ఇంకా పూర్తిగా రావాలంటే నరబలి ఇవ్వాలని” దానికి ఇంకా లక్షలు ఖర్చు అవుతుందని డబ్బులు వసూలు చేసి వెళ్లిపోతారు. ఆపై తిరిగి రారు. తీరా ఇంటివారు పరదా తీసి చూస్తే బిందె కంఠం మాత్రమే కనిపిస్తుంది. మోస పోయినట్టు అర్థమవుతుంది.
ఒక పండితుడి ప్రవచనం
ఈ రైస్ పుల్లింగ్ యంత్రం గురించి యూట్యూబ్ లో దాదాపు 37 వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఓ పండితుడు ఇలా చెప్తున్నాడు. అతని మాటల్లోనే….
“RP అని ముద్దుగా పిలుచుకొనే రైస్ పుల్లింగ్ గురించి ఎవరో ప్రశ్న అడిగారు నేను వివరిస్తున్నాను. ప్రకృతి ఎన్నో రకాల చిత్ర విచిత్ర వస్తువులను అందజేస్తోంది. అలాగే భారీగా వర్షాలు తుఫాను ఉరుములు, మెరుపులు తో పాటు పిడుగులు పడతాయి. ఆ పిడుగు కాపర్ (రాగి) ఐటమ్ పై పడితే దానికి ఒక పవర్ అనేది జనరేట్ అవుతుంది. దేవాలయాలపై కలశాలు కాపర్ తో తయారు చేసి ఉంటారు. వాటి పైన పిడుగు పడితే పవర్ జనరేట్ అవుతుంది. దాని పేరే ఇరిడియం. దీనిని సిమ్ కార్డుల తయారీలో రాకెట్ల తయారీలోను వాడుతారు. దీనిని ఐసోటోప్ (?) అంటారు. వాటికి పవర్ రాంగానే రేడియేషన్ క్రియేట్ అవుతుంది. తక్కువ మెటీరియల్ ఉన్న వస్తువుల్లో తక్కువ రేడియేషన్, ఎక్కువ మెటీరియల్ ఉన్న వస్తువులో హై లెవెల్ రేడియేషన్ ఉంటుంది.”

“ఈ వస్తువులు కొనడానికి ఇండియాలో ఎవరూ లేరు. విదేశాల్లో ఉన్న డెమరాన్ కంపెనీ వారు వీటిని కొని డి ఆర్ డి ఓ (DRDO) కు సప్లై చేస్తారు. మరి ఈ రేడియేషన్ ఎలా కొలుస్తారు దానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి MR పద్ధతి. అంటే ‘మెటీరియల్ టు రైస్’ (M material R rice). అంటే ఈ వస్తువు చుట్టూ బియ్యం (రైస్) పోస్తే , బియ్యాన్ని లాక్కునే వేగాన్ని బట్టి రేడియేషన్ నిర్ధారిస్తారు. ఈ ఆకర్షింపబడిన బియ్యం నల్లగా మారిపోతుంది. రెండవది RR. అంటే రైస్ టు రైస్ (Rice to Rice). MRలో నల్లగా మారిపోయిన బియ్యం చుట్టూ తెల్లని బియ్యం పోయాలి. నల్ల బియ్యం తెల్ల బియ్యాన్ని ఆకర్షించే వేగం బట్టి రేడియేషన్ నిర్ణయిస్తారు.“
“ఇంకొక పద్ధతిలో ఈ నల్ల బియ్యం పై టార్చ్ లైట్ వేస్తే అది సెకండ్లలో మాడిపోతుంది.
మరొక పద్ధతిలో ఓ గ్లాసు నీళ్లలో ఈ నల్ల బియ్యం వేసి దానిపై మంట పెట్టగలిగితే ఆ మంట నీలిరంగులో మండుతుంది.”
“ఇలా నిర్ధారించిన రేడియేషన్ స్థాయి బట్టి లక్షల్లో ఈ వస్తువులను కొంటారు. ఎవరు కొంటారు? భారతదేశంలో దీనికి సంబంధించి కంపెనీలు లేవు. వేరే వేరే దేశాల్లో రెండు మూడు కంపెనీలు ఉన్నాయి. విలువ ఎంత ? అన్కౌంటబుల్ . అంటే….. లెక్కలేనంత.” కానీ ఇది చాలా మందికి దొరకకపోవచ్చు లక్షల్లో ఒకరి మాత్రమే అదృష్టం కొద్దీ లభిస్తుంది.” అని ఆ పండితుడు తన ఫాలోయర్స్ కి RP అంటే రైస్ పుల్లింగ్ గురించి వివరిస్తున్నాడు. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇదంతా అర్థం లేని, అవగాహన లేని అన్ సైంటిఫిక్ ట్రాష్ అని. దీనికి లైకింగ్ 37 వేలమంది. అంటే అశాస్త్రీయ భావజాలాన్ని కొన్ని సైన్స్ పదాలతో, అర్థం లేని మాటలతో ఎంత లాగా సైన్స్ అని నమ్మేలా ప్రచారం చేస్తున్నారు. అది నిజమని కొన్ని వేల మంది నమ్మేస్తున్నారు. అది సోషల్ మీడియా దుష్ప్రభావం.
ఈ పండితుడు చెప్పిన దాంట్లో అశాస్త్రీయత ఏముందో గమనిద్దాం.
1. మెరుపు అన్నది మేఘాల మధ్య జరిగే విద్యుత్ ఉత్సర్గము (electrical discharge) అని మనకు తెలుసు. ఆ మెరుపు భూమి మీదకు ఉత్సర్గము అయితే పిడుగు పడింది అంటాం. అంటే అధిక విద్యుత్తు భూమిని చేరుతుంది. ఈ విద్యుత్ వల్ల చెట్టు మాడిపోవడం ఇల్లు కాలిపోవడం మన గమనించి ఉంటాం.
2. పిడుగు వల్ల రాగి ‘ఇరిడియం’ గా మారడం ఓ అబద్ధం. రాగి (copper) ఓ లోహము మరియు మూలకం (element). అదేవిధంగా ఇరిడియం (iridium) కూడా ఓ మూలకం. ఈ రెండు కూడా రేడియేషన్ (రేడియో ధార్మికత) లేని మూలకాలు. ప్రకృతిలో ఒక మూలకాన్ని మరొక మూలకంగా మార్చలేము.
3. ఇనుము అయస్కాంత పదార్థము. అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుందని ముందే చెప్పుకున్నాం. బియ్యము అనయస్కాంత పదార్థం కాదు. బియ్యము ప్రోటీన్. బియ్యాన్ని దేనితోనూ ఆకర్షించ లేము.
4. ఐసోటోప్ అంటే అర్థమే వేరు. (ఐసోటెప్ అంటే ఒకే మూలకం యొక్క రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల అణువులు).
5. రాగికి ఇరిడియంకి రేడియోధార్మిక లక్షణాలు అయితే లేనేలేవు.
కాబట్టి ఎన్ని రకాలుగా చూసినా ఆయన వివరించినవన్నీ అసలు సైన్స్ ఏమాత్రం కాదు. ఈ విధంగా సూడో సైన్స్ తో ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈయన వీడియో చూసి, విన్న వాళ్ళందరూ నిజంగానే రైస్ పుల్లింగ్ యంత్రం ఉందని భావిస్తారు కదా! వాటి కోసము ఎగబడతారు కదా!?
ఈయన మాటలు వింటుంటే మరొకటి గుర్తుకొస్తుంది. పూర్వకాలంలో “రసవాదం” (Alchemy ) అని ఓ పద్ధతి ఉండేది. భారత్, చైనా, ముస్లిం, యూరప్ దేశాలలో కొందరు దీన్ని ఆచరించేవారు. వీళ్ళని రసవాదులు (Alchemists) అనేవారు. కొన్ని లోహాలను శుద్ధి చేసి, మెరుగుపరిచి, వాటిని పరిపూర్ణమైన లోహాలుగా అంటే బంగారంగా మార్చాలని ప్రయత్నం చేసే వాళ్ళు. ఎంతోమంది ఎంతో డబ్బును, శ్రమను, కాలాన్ని వృధా చేసుకున్నారు కానీ అది సాధ్యం కాలేదు. సాధ్యం కాదు కూడా. (ఓ మూలకాన్ని వేరే మూలకంగా మార్చలేమని చెప్పుకున్నాం కదా) అలాంటిదే ఈ రైస్ పుల్లింగ్ యంత్రం.
రాగి గురించి మనం తెలుసు. అదేవిధంగా ఇరిడియం అనేది వెండి లాగా తెల్లగా ఉండే ఒక కఠినమైన, పెళుసైన , ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే ఒక మూలకం. భూమి పొరలలో దొరికే అతి అరుదైన లోహం. దీనికి చిలుము (rust) అంత సులభంగా పట్టదు. అధిక ఉష్ణోగ్రత (2446°C) వద్ద మాత్రమే కరుగుతుంది. ఇది ప్లాటినం గ్రూప్ లో ఉండే లోహము. దీనిని మిశ్రమ లోహాల తయారీలో ఎలక్ట్రానిక్స్ లో, ఆటో కెమికల్ ఇండస్ట్రీలో ఉత్ప్రేరకంగా వాడుతారు. సా.శ1803 లో స్మిత్సన్ టెన్నెంట్ అనే శాస్త్రవేత్త క్రూడ్ ఆయిల్ ను విశ్లేషించేటప్పుడు ఇరిడియం ను మరొక మూలకము ఒస్మియం (Osmium) తో పాటు కనుగొన్నాడు. రాగి ఇరిడియం గా మారడం అన్నది అసంభవం.

తస్మాత్ జాగ్రత్త !
ఇలా ఏమాత్రం ఎలాంటి అద్భుత శక్తులు లేని ఈ రైస్ పుల్లింగ్ యంత్రం పనిచేసే విధానంపై కొన్ని నకిలీ వీడియోలు పెడతారు. అందులో నిజంగా బియ్యాన్ని ఆ యంత్రం ఆకర్షిస్తూ ఉంటుంది. దీనికోసం ఆ యంత్రం కింద అయస్కాంతాన్ని అమర్చుతారు. బియ్యాన్ని ఇనుప రజను (iron filings) లో పోసి చాలా సేపు అంటే రెండు మూడు రోజుల పాటు గట్టిగా రుద్దితే బియ్యానికి చిన్న చిన్న ఇనుప రజను అంటుకు పోతాయి. అప్పుడు ఈ బియ్యము అయస్కాంతం ద్వారా ఆకర్షింపబడుతుంది. క్వార్డ్జ్ రంగులు ఎలా మారుతుందో ఇదివరకే చెప్పుకున్నాం.
RP రైస్ పుల్లింగ్ ప్రచారం దక్షిణ భారతదేశంలో సా.శ.2000 లో ప్రారంభమైందని ఓ అంచనా. RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మరియు ఇతర ఆర్థిక సంస్థలు ఈ రైస్ పుల్లింగ్ యంత్రము గురించి హెచ్చరిస్తూ వీటిని నమ్మవద్దని ప్రజలకు చెబుతూ ఉన్నారు. IPC సెక్షన్ 415, 420 ప్రకారము రైస్ పుల్లింగ్ అమ్మడం చట్టరీత్యా నేరము.

ఆ రైస్ పుల్లింగ్ యంత్రానికి నిజంగా అంత శక్తి ఉంటే అమ్మేవాళ్లు దాన్ని వేరే వాళ్ళకి ఎందుకు అమ్ముతారు. ఆ ఫలాల్ని, ఆ అదృష్టాన్ని వాళ్ళ దగ్గరే పెట్టుకోవచ్చు కదా. ఇది సింపుల్ లాజిక్. ఈ మాత్రం కూడా అత్యాశాపరులు ఆలోచించరు. మనీ సర్క్యులేషన్స్ స్కీములు, గొలుసు కట్టు సభ్యులను చేర్చే స్కీములు, సొమ్ముకు తక్కువ సమయంలో అధిక వడ్డీ ఇస్తామని చెప్పే స్కీములు ఇవన్నీ ఓగూటి పక్షులే. ప్రభుత్వాలు ఎంత హెచ్చరిస్తున్నా, చాలా చోట్ల ఈ ముఠాలు పట్టుబడుతున్నా, ఎంతో మంది మోసపోయి ప్రాణాలు కోల్పోతున్నా…. తెగిపోయిన కొద్దీ మళ్లీ పుట్టుకొచ్చే పురాణాల్లో రావణాసురుని తలల్లాగ మళ్లీ మళ్లీ ఏదో ప్రాంతంలో ఈ రైస్ పుల్లింగ్ ముఠాలు పుట్టుకొస్తున్నాయి. జనాలు పుక్కిటి పురాణం, పుష్పక విమానం నిజమని నమ్మినంత కాలం ఈ బోగస్ రైస్పులింగ్ యంత్రం కూడా ప్రజల్ని నమ్మిస్తూ సమాజంలో గిరికీలు కొడుతూనే ఉంటుంది. ప్రజల్లో వాటిని కొంటూ… మోసపోతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూనే ఉంటారు.
ఇలా ఎన్నో మూఢ నమ్మకాలతో పేద ప్రజలను కూడా దోచుకునే ముఠాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మూఢ నమ్మకాల నిరోధక చట్టం తీసుకురావలసిన అవశ్యకత ఎంతైనా ఉంది.