ప్రొఫెసర్ A. రామచంద్రయ్య

శక్తి రూపాలన్నీ ఉష్ణరూపంలోకి మారుతున్నాయి.
(Energy Tends to Reform into Heat)

విశ్వంలో మనచుట్టూ రకరకాల శక్తి రూపాలున్నాయి. కాంతి శక్తి, గురుత్వ శక్తి, కేంద్రక శక్తి, రసాయనిక శక్తి ఇలా ఎన్నో రకాలైన శక్తి రూపాలు మనకు తెలుసు. ప్రతి చోటా ప్రతిక్షణం మార్పులు (సంఘటనలు) జరుగుతున్నాయి. ఈ సంఘటనలలో శక్తిమార్పిడులు (Exchange among Forms of Energy) కూడా జరుగుతున్నాయి. అయితే కాలక్రమేణా శక్తిరూపాలన్నీ ఉష్ణరూపంలోకి మారడానికి ఎక్కువ సంభావ్యతను ప్రదర్శిస్తాయి. ఉష్ణమంటే అర్ధం ఏమిటి? పదార్ధాలలోని అణువులు లేదా పరమాణువులు లేదా ఇతర కణ సంబంధిత ప్రకంపనలే. అంటే చలనాన్ని ఎక్కువ చేసే మరో శక్తిరూపంలోకి మిగిలిన శక్తి రూపాలు మారుతున్నట్టు దీనర్ధం.

నీటిలో ఉప్పు వేస్తే తనంతతాను కరిగిపోవడం, టపాసులు పెద్ద శబ్దంతో ప్రేలడం, చిన్న బెజ్జం చేస్తే బెలూన్ పగిలిపోవడం, బిగ్ బ్యాంగ్, అత్తరు సీసా మూత తీస్తే వాసన గది అంతా విస్తరించడం, పొగ గాలిలో కలవడం ఇలాంటివెన్నో ఈ నియమానికి తార్కాణాలు. రిఫ్రిజిరేటర్లు, ఏ.సీ. మెషిన్లు, కూలర్లు పని చేసే విధానంలో కూడా ఈ నియమం ఇమిడి ఉంది. ప్రతి జీవి ఏదో ఒక రోజు మరణించడం కూడా ఈ నియమానుసారమే ! గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ అనే పేరుతో భూగోళ ఉష్ణోగ్రత క్రమేపీ హెచ్చుతుందన్న (Global Warming) వాస్తవం కూడా దీని వల్లనే. అన్ని శక్తి రూపాలకన్నా ఉష్ణశక్తి రూపానికి పని చేసే సామర్ధ్యం తక్కువ. అందువల్ల ఉష్ణం కొంతలో కొంత విశ్వంలో పోగు పడుతుంది. ఈ నియమాన్ని ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు.

‘బాగా ఉపయోగపడే రూపాల్లోంచి శక్తి తక్కువగా ఉపయోగపడే రూపంలోకి చేరుకుంటోంది (Energy flows form useful from into less useful form).’

దీనికి ఉదాహరణ చూద్దాం. చలికాలంలో 15°C దగ్గరున్న చన్నీళ్లను 45°C వరకు వేడిచేసి వాడుకొన్నామనుకొందాం. ఇలా 50 లీటర్ల నీటిని వేడి చేయడానికి సుమారు 15 లక్షల కేలరీల విద్యుచ్ఛక్తి అవసరం. మరి వేసవి కాలంలో నీరెటూ 45°C వద్ద ఉంటుంది. ఆ నీటిని 15°C వరకు చల్ల బర్చాలంటే అందులోంచి 15 లక్షల కేలరీల ఉష్ణశక్తిని తీసేసి దాన్ని విద్యుచ్ఛక్తిగా మార్చాలని ప్రయత్నించామనుకొందాం. ఆ క్రమంలో మనమెంత గొప్ప పరికరాన్ని వాడినా 15 లక్షల కేలరీల విద్యుచ్ఛక్తిని రాబట్టలేము. అంటే నీటిని 15°C దగ్గరకు తిరిగి అంతే శక్తిని లాగి తీసుకెళ్ళలేము. వేడి చేయడం కన్నా చల్లబర్చడం కష్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *