విజ్ఞాన శాస్త్రం రుజువులతో వాస్తవాల్ని బయటపెట్టాలి. సత్యాన్ని పరమధర్మంగా భావించాలి. సంకుచిత ధోరణి నుంచి మళ్లించి సమాజానికి విశాల దృక్పథం కలిగించాలి. విశ్వమానవత్వం దాని అంతిమలక్ష్యంగా వుండాలి. దాని పరిశోధనల్లో, సూత్రీకరణల్లో స్వీయ మానసికతకు, స్వార్ధపర శక్తుల ప్రయోజనాలకు తావుండరాదు. అధిపత్య వర్గాల చేతుల్లో పావుగా మారి, సైన్సు పేర వారి చేతికి కొత్త పరికరాలు అందించరాదు. ఒక్క మాటలో చెప్పాలంటే సైన్సు నుంచి మనం సత్యాన్ని ఆశిస్తాం. శాస్త్రవేత్తలు ఏ వైపుకు ఒరిగిపోకుండా సత్యం పక్షాన, ప్రజల పక్షాన నిటారుగా నిలబడాలని కోరుకుంటాం.
కానీ సైన్సు చరిత్రలో వక్రధోరణులూ తక్కువేమీ కాదు. పరిశోధనలు సూత్రీకరణలూ అన్నీ రుజుమార్గంలోనే నడిచాయని, నడుస్తున్నాయని ఏమీ చెప్పలేము. ఎగుడు దిగుడు సమాజంలోని అవలక్షణాలు సైన్సును నిక్కచ్చిగా నిలబడనీయవు. వాటిని తట్టుకొని నిలబడడం విజ్ఞాన శాస్త్రానికి అంత సులభం కూడా ఏమీ కాదు.
మరి శాస్త్రం కూడా కట్టుకథల్ని వల్లిస్తే ఏమవుతుంది ? పరిశోధన పేర శాస్త్రం పచ్చి అబద్దాల్ని సూత్రీకరించి మరీ వెదజల్లితే ఎలా వుంటుంది ? సైన్సు కూడా జాత్యహంకారానికి వత్తాసు పలికితే ఇంకేమనాలి? ఇలాంటి వికృత ధోరణుల్ని ఇప్పుడు మనం కొన్నిటిని చూద్దాం. ప్రస్తుతానికి ఆదిమ మానవులపై కొందరి పరిశోధనల్లో ఎంత వికారం దొర్లిందో పరిశీలిద్దాం.
తొలి మానవుడు పరమక్రూరుడా ?
తొలి మానవుని గురించి మనలో చాలామంది మనసులో ఉన్న చిత్రం ఎలా ఉంటుంది? “అతడు గుహల్లో జీవించేవాడు. మొరటువాడు. క్రూరుడు. తనలో సహజంగా వున్న క్రౌర్యాన్ని తీర్చుకోడం కోసం జంతువులను చంపి తినేవాడు. తనకు శారీరకంగా తృప్తినిచ్చి, తనకు పిల్లల్ని కని, తిండి పెట్టే స్త్రీని జుట్టుబట్టి ఈడ్చేవాడు. కొట్టేవాడు.” ఇలాంటి చిత్రం ఇప్పుడు మనలో లేకపోవచ్చు. కానీ ఈ ప్రయత్నం తక్కువేమీ జరగలేదు.
నిజానికి ఇంతకంటే చరిత్ర వక్రీకరణకు చక్కటి ఉదాహరణంటూ ఏమీ వుండదు. ఇందులో వాస్తవం కంటే పురుష దురహంకారం పేరుకుపోయిన చరిత్రకారుల, పురాతత్వ శాస్త్రవేత్తల అతి ఊహాశక్తి ఎక్కువ. బహుశా వారికి ‘ఇలా జరిగి వుంటే బాగుండేది’ అన్న కోరిక కూడా వుంటే వుండొచ్చు. ఈ కల్పన దాన్నే వ్యక్తీకరిస్తుంది.
డార్విన్ తర్వాత శిలావశేషాలను, ఆస్థిపంజరాలను లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభమైంది. ఇలా అధ్యయనం చేసిన వారు “మానవుడు పరిణామక్రమంలో తన శక్తినంతా తన శరీరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కాకుండా మెదడును అభివృద్ధి చేసుకోవడానికి ఎందుచేత ఉపయోగించాడు”? అనే ప్రశ్నను లేవదీసారు. ఇందుకు సమాధానంగా ఈ “నిపుణులు” మానవుడి అభివృద్ధికి వేట కీలకమైందనీ, అందులో పురుషుడి క్రూరత్వం, ఆధిపత్యం దాగి వున్నాయనీ సూత్రీకరించారు. ఈ పరిణామక్రమాన్ని క్రూర మానవులకూ జంతువులకూ మధ్య పోరాటంగా చిత్రీకరించారు.
కానీ వాస్తవమేమిటి? మనిషికి తిండి కోసం ప్రాణాలకు తెగించి మరీ వేటాడ్డం మినహా గత్యంతరం లేని కాలమది. అందులో పురుషులదెంత పాత్రో స్త్రీలదీ అంతే పాత్ర.
పురుషుడి కోసమేనా స్త్రీ ?
సుప్రసిద్ధ జంతు శాస్త్రవేత్త డెస్మండ్ మారిన్ అభిప్రాయం ప్రకారం “ఈనాటి స్త్రీ శరీర నిర్మాణం కూడా వేటగాడైన పురుషుని కోసమే ఉద్దేశించబడింది! తొలి హోమనిడ్లు రెండు కాళ్ళ మీద నడవడం ప్రారంభించగానే వారిలో పురుషులు ముందు భాగం నుంచి సెక్సును కోరారు. స్త్రీలు వారిని ఉత్సాహపరచడం కోసం రొమ్ములు పెంచుకున్నారు. పురుషులను ఉత్సాహపరచడానికి పిరుదులు మాత్రమే చాలవని తెలుసుకోడంతో ఇలా జరిగింది”. ఇంతకంటె వికృత వ్యాఖ్యానం ఎక్కడైనా వుంటుందా? రొమ్ములు పెరగడానికి కారణం పిల్లలకు పాలివ్వాల్సి రావడం అన్న చిన్న సంగతి అతనికి ఎందుకు గోచరించ లేదో మనకు తెలియదు.
అలాగే “స్త్రీలో భావప్రాప్తి కలగడం వేటలో అలసిపోయి ఇంటికి వచ్చిన పురుషుడికిచ్చే బహుమతి” అని రాబర్ట్ ఆర్ద్రె అనే అమెరికన్ అంటాడు. అంతే గానీ స్త్రీ ఆనందంతో గానీ, జాతిని కొనసాగించాలన్న కోరికతో గానీ స్త్రీలలో భావవ్యక్తికరణకి సంబంధం లేదంటాడు. ఈ అభిప్రాయాన్ని ప్రస్తుతం ఏ మాత్రం ఇంగితజ్ఞానమున్న సైంటిస్టయినా తిరస్కరిస్తాడు.
వేటంతా పురుషుడిదేనా?
ఈనాటికీ చాలా రాతియుగం తెగలు మిగిలివున్నాయి. తొలి మానవుల జీవితాన్ని అర్థం చేసుకోవడానికివి చక్కగా ఉపయోగపడతాయి. ఈ తెగల్లో నూటికి 95 పాళ్ళు వేటను పురుషులే నిర్వహిస్తారు. కానీ వేట వారికి కావలసినంత ఆహారాన్నందించలేదు. అంతేకాదు ఆఫ్రికా వాతావరణంలో మాంసం నిలువ వుండదు కూడా. ఉదాహరణకు బోట్స్ వానా దేశంలోని ఆదివాసులు నెలలో వారం రోజులు మాత్రమే వేటాడతారు. మిగిలిన సమయాల్లో వారూ, ఇతర తెగల వారు కూడా స్త్రీలు సేకరించిన దుంపల్ని, పండ్లనీ, తృణధాన్యాలనూ తింటారు. ఇది వారి మొత్తం ఆహారంలో దాదాపుగా 80 శాతం వుంటుంది. ఇలా చూస్తే స్త్రీలు ఆహారం కోసం పురుషుల మీదనే ఆధార పడవలసిన అవసరం వుండేది కాదని సులభంగా చెప్పవచ్చు.
ఆహార సేకరణకు తవ్వకపు పనిముట్లతో పాటు మంచి జ్ఞాపకశక్తి, దుంపల్ని ఎంపిక చేసుకోగల నైపుణ్యం అవసరం.
స్త్రీలే మానవజాతిని నిలబెట్టారు.
మెదడు అభివృద్ధి చెందడానికి స్త్రీలు చేసిన దోహదం ఇంతకంటే ముఖ్యమైనది. అది పిల్లల పోషణ. వానరజాతుల పిల్లల కంటే మానవజాతి పిల్లలు స్వతంత్రంగా బతకడానికి ఎక్కువ కాలం తీసుకుంటారు. వారికి శారీరకంగా మాత్రమే గాదు బౌద్ధికంగాను పెరుగుదల కావాలి. దీని కోసం వారికి ఎంతో ఇష్టమైన సమాజాన్ని పెద్దలు పరిచయం చేయాలి. వారి ఊహాశక్తిని పెంచాలి. ఆటపాటల్లో, ఇతర కార్యక్రమాల్లో పిల్లల్ని పాల్గొనేలా చెయ్యాలి. ఇదంతా తల్లులు తప్ప ఎవరు చేస్తారు?
మానవజాతి పరిణామంలో అత్యంత కీలక పరిణామం వేట అనీ, మానవులు జీవించడానికీ, ఈ భూగోళాన్ని మానవాధీనం చెయ్యడానికీ దోహదం చేసింది వేట మాత్రమేననీ మనం అనుకుంటూ వుంటాం. కానీ మనం గుర్తించాల్సింది ఏమంటే స్త్రీ శరీరం లోపల ఇంతకంటే ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. జంతువులకు సహజమైన ఈస్ట్రన్ (ఒక నిశ్చితమైన పద్ధతిలో కామోద్రేక కాలం – హీట్- రావడం) నుంచి స్త్రీ శరీరం నెలవారీ బహిష్టు అయ్యే రూపంలోకి పరిణామం చెందింది. ఉన్నత దశకు చెందిన వానరజాతులైన చింపాంజీల్లో, గొరిల్లాల్లో, ఒరాంగ్ ఉటాంగ్ ల ఆడ జంతువుల్లో ఒక కామోద్రేక కాలం ఎప్పుడో గాని వచ్చేది కాదు. ఇవి ఏ ఐదారు ఏళ్లకో ఒక పిల్లను కనేవి. అందుచేత వాటికి భద్రత వుండేది కాదు. తమకనుకూలమైన వాతావరణంలో తప్ప అవి బతక గలిగేవి కావు. మానవ స్త్రీలకు గర్భం ధరించడానికి ఏడాదికి 12 అవకాశాలు ఉండడం చేత వారికి సంతాన ఉత్పత్తి సామర్థ్యం చాలా ఎక్కువ. అందుచేతనే మానవజాతి ఎంతో ప్రతికూల వాతావరణంలో కూడా బతికి బట్ట కలిగింది.
మానవజాతి అభివృద్ధిలో పురుషుడు కూడా గొప్ప పాత్ర నిర్వహించాడు. కానీ స్త్రీ నిర్వహించిన పాత్రను మాత్రం ఇంతవరకు అందరూ దాదాపు విస్మరించడం చేత దాన్ని నొక్కి చెప్పవలసి వచ్చింది.
రాతియుగం సంస్కృతి మనం ఈనాడు కార్టూన్లలో చూస్తున్నట్టుగా వుండేదేమీ కాదు. అప్పటి మానవులు చంపడం ద్వారా ఆనందం పొందేంత క్రూరులేమీ కాదు. అప్పటి పురుషులు విచ్చలవిడిగా దుర్మార్గాలు చేయడానికి పరిగెత్తలేదు. వేట పురుషులకు మాత్రమే పరిమితమైన వీరకృత్యం కూడా కాదు. వేటలో వలలు పన్నడం లాంటి సామూహిక చర్యలుండేవి. పోరాటంలో ప్రమాదాల్ని తప్పించుకోవడానికి చాలా జాగ్రత్తలవసరమయ్యేవి. వేటలో స్త్రీలు, పురుషులు సమంగా, సమన్వయంతో భాగస్వాములయ్యే వారు.
“సహజమైన పోరాట శీలత వుండటం చేత పురుషులు వేటగాళ్ళయ్యారు. కాబట్టి స్త్రీ పురుషుల మధ్య తేడా వుండడం అనివార్యం” అని చెప్పే వారి విషయంలో మనం కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఇలా చెప్పేవారు పాపం ఊహల్లో తేలిపోతుంటారు.
– విఠపు బాలసుబ్రహ్మణ్యం
ఆధారం: క్రిస్ బ్రేజియర్. “ప్రపంచ చరిత్ర” (వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారి అనువాదం)
కళ్ళు తెరిపించే విషయాలు ఇందులో ఉన్నాయి. ఆర్టికల్ ను బాగా అనువందించారు.