వి. రాహుల్జీ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ ఇలాంటి పదాలు ఈమధ్య చాలానే వింటూ ఉన్నాం. ఇదే పత్రికలో ఇంతకుముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే చాట్ జిపిటి లాంటివి మనుషుల భాషను ఎలా అర్థం చేసుకుంటాయి అని చర్చించాం.

ఇంతవరకు ఏదైనా విషయం మీద సమాచారం కావాలంటే మనం గూగుల్ ని ఉపయోగించే వాళ్ళం. గూగుల్ మనకు కావలసిన సమాచారం ఎక్కడెక్కడ ఉంటుందో చూసి ఆ వెబ్సైట్ల వివరాలు ఇచ్చేది. అయితే ఇప్పుడు చాట్ జిపిటి, డీప్ సీక్ లాంటి సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తున్నాం. ఈ సాఫ్ట్వేర్లు సమాచారాన్ని తామే విశ్లేషించి ఒక మనిషి చెప్పినట్టుగా సమాధానం చెప్తాయి. అంటే మన కంప్యూటర్లో మనం ఇచ్చిన సూచన మేరకు సమాచారాన్ని అర్థం చేసుకొని మళ్లీ మనకు దాన్ని ఒక సమగ్రమైన సమాధానంగా మార్చి ఇవ్వడం ఇక్కడ జరుగుతుంది. అమెరికాలో ఇప్పటికే దాదాపు 40 శాతం మంది జనాలు తమకు కావాల్సనిన సమాచారం కోసం గూగుల్ సర్చ్ బదులు ఏఐ తో సంభాషించడం మొదలుపెట్టారు.

ఏఐకి కావాల్సిన వివిధ వెబ్సైట్లో సమాచారం ఎక్కడ ఉంటుంది? అది డేటా సెంటర్లలో ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ పని అంతా అక్కడే జరుగుతుంది. దీనికోసం వేల కంప్యూటర్లు డేటా సెంటర్ల లో పనిచేస్తాయి. ఈ డేటా సెంటర్ల విస్తీర్ణం 30 వేల చదరపు అడుగుల నుంచి 10 లక్షల చదరపు అడుగుల వరకు ఉంటుంది.

ఒక ఏఐ డేటా సెంటర్లో కేవలం మనకు కావలసిన దాన్ని వెతకడం మనకు ఇవ్వడం మాత్రమే జరగదు. మొదట ఏఐ మోడల్స్ నిరంతరం తాము నేర్చుకుంటూ ఉంటాయి. మనతో అవి చేసే ప్రతి సంభాషణ దానికి ఒక శిక్షణ. ఈ శిక్షణ కోసం అవి చాలా వేల సంఖ్యలో కంప్యూటర్ల సహాయంతో పెద్ద మొత్తంలో డేటాని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ట్రైనింగ్ అయ్యాక వినియోగదారుడు అడిగిన సమాచారాన్ని విశ్లేషించి కావలసిన విధంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

మనతో చేసే సంభాషణలో AI ఒక్కోపదానికి దాని అర్థం మాత్రమే తెలుసుకుంటే చాలదు. ఆ పదంతో సంబంధం ఉండగలిగిన అన్ని పదాలను కూడా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే అది మనుషుల లాగా మనుషులతో సంభాషించగలుగుతుంది. మనం ఎన్ని ఎక్కువ పదాలు ఇస్తే అంత ఎక్కువ విశ్లేషణ జరగాలి. అంటే అంత ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. అంత విద్యుత్తు అవసరం అవుతుంది. ఏఐ మౌలికంగా విపరీతంగా విద్యుత్తుని వాడుతుంది. గూగుల్ సెర్చ్ తో పోలిస్తే ఏఐ విద్యుత్ వాడకం 10 రెట్లు ఎక్కువ. అలాగే మనం ఏఐ తో చేసే ఒక్కో సంభాషణకీ ఒక బాటిల్ నీళ్లు డేటా సెంటర్ల కూలింగ్ కోసం ఖర్చవుతాయి.

Floating Data centers in US. Source: The Guardian

ఏఐ డేటా సెంటర్లు వాటికి కావాల్సిన విద్యుత్తును దగ్గర్లోని విద్యుత్ గ్రిడ్ నుండే తీసుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి భారతదేశంలో విద్యుత్తు ఇంకా శిలాజ ఇంధనాలైన బొగ్గు, గ్యాస్ నుంచి తయారు చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో విద్యుత్ వినియోగం అంటే ఎక్కువ కాలుష్యం కూడా.

డేటా సెంటర్లో విపరీతమైన విద్యుత్ వాడకం చాలాసార్లు చుట్టుపక్కల గృహ వినియోగదారులకు విద్యుత్ అంతరాయాన్ని కలిగిస్తుంది. ఇది ప్రజలకు ఇబ్బంది కరం. ఇది అమెరికా ప్రజల అనుభవం.

ఇది కాక డేటా సెంటర్లకు కొత్త సర్వర్లు వచ్చి చేరినప్పుడల్లా విద్యుత్ వినియోగం పెరుగుతూ ఉంటుంది. విద్యుత్ గ్రిడ్ కూడా దానికి తగ్గట్టు విస్తరించాల్సి ఉంటుంది. అది కూడా అక్కడి ప్రజలకు భారమవుతుంది. డేటా సెంటర్లకి విద్యుత్ రాయితీలు ఇవ్వడం లేదా ఏళ్ల తరబడి ఒకే ధరకు విద్యుత్ ఇవ్వడం చేస్తారు కాబట్టి గృహ వినియోగదారులే ఆ ఖర్చును భరించాల్సి వస్తుంది.

పర్యావరణముప్పు
టెక్నాలజీ ఇండస్ట్రీ లేదా ఐటీ పరిశ్రమ ఇప్పటికే తమ కార్బన్ ఉద్గారాలు పెరిగిపోవడం గుర్తించాయి. అమెజాన్ 2023లో 64.8 టన్నుల కర్బన ఉద్గారాలు వెలువరించింది. అది 2024 కల్లా 68.25 టన్నులకు చేరింది. ఇది ప్రధానంగా దాని డేటా సెంటర్లు పెరగడం వల్ల వచ్చింది. గూగుల్ గ్రీన్ హౌస్ ఉద్గారాలు 2019 నుంచి 2023 కి వచ్చేసరికి 48 శాతం పెరిగింది. దీనికి కూడా ప్రధాన కారణం డేటా సెంటర్లే.

Microsoft Underwater Data center. Source: Microsoft website

డేటా సెంటర్ల వల్ల పర్యావరణం పై కలిగే ప్రభావానికి ఇంకొక కారణం కూడా ఉంది. అది అవి వాడే నీళ్లు. శక్తివంతమైన కంప్యూటర్లు చాలా త్వరగా విపరీతంగా వేడెక్కుతాయి. వీటిని నీటి ద్వారా చల్లబరుస్తారు. ఈ కంప్యూటర్లను చల్లపరిచే ప్రక్రియలో వేడెక్కిన నీళ్లను కూలింగ్ టవర్ లోకి పంపి వాటిని అక్కడ చల్లబరిచి మళ్ళీ వాటిని కంప్యూటర్లను చల్లబరిచేందుకు పంపిస్తారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. అయితే ఈ చల్లబరిచే ప్రక్రియలో ఎక్కువ భాగం నీళ్లు ఆవిరైపోతాయి. ఇలా ఆవిరైపోయిన నీళ్లు మళ్ళీ వర్షం ద్వారా భూమికి చేరుకోవడం అనేది వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుంది. అవి వర్షం ద్వారా ఎక్కడ ఆవిరి అయ్యాయో అక్కడికే తిరిగి చేరాలని ఏమీ ఉండదు.

2023లో అమెరికాలో డేటా సెంటర్లు 6600 కోట్ల లీటర్ల నీటిని వాడాయి. కరెంటు, నీళ్ళే కాదు. ఈ కంప్యూటర్లలో వాడే జిపియులకు అవసరం అయిన రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకం కోసం జరిగే పర్యావరణ విధ్వంసం కూడా చిన్నదేమీ కాదు.

అలాగే ఈ డేటా సెంటర్లలో ఏసీలు జనరేటర్లు గ్యాస్ టర్బైన్లు నుంచి వచ్చే శబ్దాలు చుట్టుపక్కల ప్రాంతాన్ని నివాసానికి యోగ్యం కాకుండా చేస్తాయి. ఇది కూడా అమెరికా అనుభవం.

మరి దారేది?
శిలాజ ఆధారిత శక్తి వనరుల మీద ఆధారపడడం తగ్గించుకోవాలి. అయితే ఏఐ డేటా సెంటర్లు అభివృద్ధి చెందినంతగా పునరుత్పాదక శక్తి( Renewable energy లేదా Green Energy) వృద్ధి చెందడం లేదు. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం డేటా సెంటర్ల వృద్ధి 33% గా ఉంటే పునరుత్పాదక శక్తి వృద్ధి 15.1 శాతం మాత్రమే ఉంది.

అలాగే నిజంగా ఈనాడు ఇంత పెద్ద ఎత్తున డేటా సెంటర్ల అవసరం ఉందా? నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం అవసరం లేదు. భవిష్యత్తులో అవసరం రావచ్చు. ఇప్పుడే వాటిని భవిష్యత్తు అవసరాల కోసం సిద్ధం చేసుకోవడం ఒకరకంగా అనవసరం. ఎందుకంటే అవి అనవసరంగా ఉంటూ విద్యుత్ వాడుతూ పర్యావరణ హానికి తోడ్పడుతున్నాయి.

ఇప్పుడున్న ‘డేటా స్కేలింగ్’ కంటే మెరుగైన అల్గారథమ్స్ వాడడం వల్ల తక్కువ శక్తితో సమర్ధంగా పనిచేసే మోడల్ తయారు చేయొచ్చు.

ఇవే కాకుండా మనందరం కూడా ఏఐ ఎంత వాడాలి? ఎక్కడ ఆపాలి? అనే స్పృహ కలిగి ఉండి ప్రతి చిన్న దానికి ఏఐ మీద ఆధారపడటం తగ్గించాలి. తద్వారా ఏఐ సర్వర్ల మీద ఒత్తిడి తగ్గుతుంది.

ప్రపంచానికి ఉన్న ఈ అనుభవాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని డేటా సెంటర్లని భారతదేశానికి ఆహ్వానించాలి. మన ప్రభుత్వాలు అలా చేస్తాయని, చేసేలా ప్రజలు అడుగుతారని ఆశిద్దాం.

ఆరిజోనా రాష్ట్రంలో నిరసన తెలుపుతున్న ప్రదర్శన కారులు
వర్జీనియాలో Data Center వద్దని నిరసన

One thought on “డేటా సెంటర్లు – పర్యావరణం

  1. ఆశ్చర్యకరమైన అంశాలు వివరించారు ఈ వ్యాసంలో..Ai వాడుకలో ఇంత విధ్వంసం ఉందని చాలా మందికి తెలియదు. భూమి, విద్యుత్, నీటి వినియోగాలు ఇంతగా అవసరమౌతాయని తెలుసుకోవడం ఆశ్చర్యంగా తోచింది. ఏ నష్టమూ జరగకుండా టెక్నాలజీ అభివృద్ధి కాదేమో అనే భయమూ నెలకొంది. Eye opening essay. Thank you

Leave a Reply to Virinchi Virivinti Cancel reply

Your email address will not be published. Required fields are marked *