ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య

భూమ్మీద జీవం నిర్జీవ పదార్ధాల నుండే పుట్టంది. జీవం పరిమాణం చెందుతూ పలురూపాల్లోకి ప్రకృతికి అనుగుణంగా విస్తరిస్తోంది. మానవుడు జీవపరిమాణం ద్వారానే సంభవించాడు.
(Life Originated from Inanimate Matter and Has Been Diversifying by Natural Selection;
Man is part of the Organic Evolution)

విశ్వం పుట్టిన దాదాపు వేయి కోట్ల సంవత్సరాల తర్వాతనే భూమిపుట్టింది. 1500 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ ద్వారా  విశ్వం ఆవిర్భవించిందనీ అందులోంచి నెబ్యులాలు, నక్షత్ర రాశులున్న గెలాక్సీలు ఏర్పడ్డాయనీ ఖగోళశాస్త్రం చెబుతోంది. సుమారు 600 వందల కోట్ల సంవత్సరాల క్రిందట పాలపుంత గెలాక్సీలో తన చుట్టూ తాను తిరుగుతున్న వేడి ముద్దలోని మధ్యభాగం సూర్యుడుగానూ అంచుల్లో భాగాలు గ్రహాలుగానూ మారాయి. అదే సౌరమండలం. సౌరకుటుంబంలోని సూర్యుడు, దాని గ్రహాలు ఒకే ముద్దలోని భాగాలే. సూర్యుడు పుట్టాక అందులో కొంత భాగం గ్రహాలుగా మారాయని అనుకోవడం అశాస్త్రీయం. భూమి సూర్యుని నుంచి మూడవ గ్రహం. సుమారు 550 కోట్ల సంవత్సరాల క్రితం ఇది సౌరకుటుంబంలో ఏర్పడింది. అప్పుడది చాలా వేడిగా ఉండేది. కొంతలో కొంత స్వయం ప్రకాశకంగా కూడా ఉండేది. క్రమేపీ వేడి చల్లారింది. ఆ వేడికి భూమిలో ఉన్న హైడ్రోజన్, హీలియం వంటి వాయువులు ఎన్నో కేంద్రక చర్యలకు లోనయి పెద్ద పెద్ద పరమాణువులున్న మూలకాలను ఏర్పరచాయి. అందులో ఇనుము మూలకం అత్యంత స్థితమైంది. అందుకే భూమిలో మొత్తంగా చూస్తే హెచ్చు భాగం ఇనుము ఉంది. ఇనుముతో పాటు సిలికేట్లు ఇతర లవణాలు ఏర్పడ్డాయి. అత్యంత వేడిలో కొన్ని సిలికేట్లు, బోరేట్లు, అల్యుమినేట్, ఫెర్రేట్ల నుంచి ఆక్సిజన్ పుట్టింది. ఆక్సిజన్ తో పాటు కొంత ఇనుము విచ్చిత్తి చెంది కార్బన్ గాను, మెగ్నిషియంగానూ కూడా మారింది. కార్బన్, ఆక్సిజన్ తో కలిపి చాలా మటుకు కార్బన్ డై ఆక్సైడ్ రూపొంది వాయు రూపంలో భూమ్యాకర్షణ వల్ల వాతావరణంలో ఉండిపోయింది. కొంత హైడ్రోజన్ తో ఆక్సిజన్ కలిసి అత్యంత వేడిగా ఉన్న నీటి ఆవిరి ఏర్పడింది. వాయువులు రావడంవల్ల ఇవి వార్తాహరుల్లాగా భూమి నుండి వేడిని గ్రహించి వికిరణం చేయసాగాయి. వేడి ఎప్పుడూ అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతాలకు ప్రవహిస్తుంది. గ్రహాల మధ్య వేడి లేకపోవడం వల్ల భూమి లోని వేడి చాలా మట్టుకు గాలి ద్వారా బయటకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో గాలి అతి శీతలీకరణం చెంది ఒక్కసారిగా ద్రవరూపంలోకి వెళ్లింది. CO₂, N₂ ల కన్నా నీటి అణువులకే బంధాల నేర్పర్చుకొనే లక్షణం ఉండడం వల్ల వర్షం ధారావాహికంగా కురవసాగింది. అప్పటికే నేల పగుళ్ళ వల్ల అగ్నిపర్వతాల ఉత్పన్నం (Upsurge) వల్ల కొండలు, లోతట్టు ప్రాంతాలు, మైదానాలు ఏర్పడి ఉన్నాయి. ఈ వర్షం కొన్ని వందల సంవత్సరాలపాటు కురవసాగింది.

ఇలా జరిగాక భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 50° నుండి 60° వద్ద వుండేది. ఆ పరిస్థితిలో నీటిలో కరిగిన సేంద్రియ (Organic), నిరీంద్రియ(Inorganic) పదార్ధాల నుంచి జీవకణాలు ఏర్పడ్డాయి. ఆ కణాలే పరిణామం చెంది అనేక జంతు జాలాలుగా, వృక్ష జాతులుగా అభివృద్ధి చెందాయి. సుమారు 300 కోట్ల సంవత్సరాల క్రితమే జీవకణాలు భూమ్మీద ఏర్పడ్డట్టు ప్రబలమైన ఆధారాలున్నాయి.

ఎన్నో వందల కోట్ల సంవత్సరాల క్రిందట జీవం ఏర్పడ్డాకా మానవ జాతి ఆవిర్భావం జరిగింది సుమారు 20 లక్షల సంవత్సరాల క్రితమే. ఒక కాలెండరు సంవత్సరంలో భూమి జనవరి 1న పుట్టిందనుకొంటే మానవుడు ఈభూమ్మీదకు డిసెంబరు 31నాడు రాత్రి 8 గంటల సమయంలో వచ్చాడని దీని అర్ధం. ఈ భూమ్మీద జీవం వయస్సు ఒక కాలెండర్ సంవత్సరం అయితే (అంటే జనవరి 1వతేదీన తొలి జీవకణం ఆవిర్భవించిందను కొంటే) మానవుడు ఈ భూమ్మీద ఆ జీవనాటక గమనంలో డిసెంబర్ 28వ తేదీనాడు వేదిక మీదకు వచ్చాడని అర్ధం. భూమి మీద జీవం నిర్జీవ పదార్ధాల నుంచి పుట్టిందని ఎన్నో ప్రయోగాలు ఋజువు చేశాయి. అందులో మిల్లర్ ప్రయోగం అత్యంత ప్రసిద్ధి చెందింది. మామూలు వాయు పదార్ధాలు నీటిని అత్యంత వేడిమికి, వెలుతురుకు గురిచేయగా, జీవానికి మూల కణాలైన అమ్మోనియా తదితర పదార్ధాలు తయారయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *