రవి రాజా పోతినేని

అది 1975 ఏప్రిల్ 19 తెల్లవారుజాము. కాస్పియన్ సముద్రానికి ఉత్తరాన ఉన్న సోవియట్ అంతరిక్ష కేంద్రపు కపుస్టిన్ యార్ ప్రయోగస్థల వాతావరణమంతా ఉత్కంఠతో నిండిపోయివుంది. భారత ఇంజనీర్లు సోవియట్ శాస్త్రవేత్తలతో కలిసి ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నారు. చుట్టూ ఉద్వేగభరిత నిరీక్షణ ఆవరించి వుంది.

పురాతన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట పేరు మీద భారతదేశపు మొదటి ఉపగ్రహాన్ని కాస్మోస్ 3-ఎం ప్రయోగ వాహనం సాయంతో అంతరిక్షంలోకి పంపేందుకు భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు దక్షిణ రష్యాలోని ఈ మారుమూల ప్రదేశానికి చేరుకున్నారు. సాపేక్షంగా ఇది తేలికైన ఉపగ్రహం. శాస్త్రీయ పరికరాలతో 360 కిలో గ్రాముల పేలోడ్ కలది. ఇదో కాస్మిక్ కిరణాల ప్రయోగం. సౌర ఎక్స్ రే ప్లక్స్ కెమెరాలతో పాటు భూ వాతావరణ సాంద్రతను కొలిచేందుకు ఇందులో ఫోటో ఎలక్ట్రిక్ సెన్సార్ వంటి పరికరాలు కూడా నిండి వున్నాయి.

కఠిన పరీక్షలు-జాగ్రత్తలు
ఆర్యభటను మన దేశం నుండి సురక్షితంగా రవాణా చేసేందుకు ఎన్నో లాజిస్టికల్ జాగ్రత్తలు తీసుకొన్నారు. సుదూర ప్రయాణంలో అది ఎదుర్కొనే సమస్యల్ని తట్టుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సురక్షిత షాక్ ప్రూఫ్ కంటైనర్లో దీన్ని వుంచారు. ఉపగ్రహంతో పాటు దాని సున్నితమైన భాగాలు చెక్కుచెదరకుండా వుండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆర్యభట విడిభాగాలు కాస్మొడ్రోమ్ చేరుకున్నాక వాటిని ఎంతో శ్రద్ధతో ఉపగ్రహంగా అమర్చారు. షాక్ నిరోధక ధర్మల్ సైక్లింగ్, వైబ్రేషనల్ సమగ్రత కోసం అన్నీ జాగ్రత్తగా అంచనా వేసి కఠినమైన పరీక్షల శ్రేణిని నిర్వహించారు.

అప్పటికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో ఇంకా బాల్య దశలోనే వుంది. ఇస్రో బృందంలో కేవలం 200మంది సభ్యులు మాత్రమే వున్నారు. వారు గతంలో సౌండింగ్ రాకెట్లు, చిన్న సహకార ప్రాజెక్టులపై పనిచేశారు గానీ ఆర్యభట మిషన్ స్థాయి వారికి లేదు. వీరిలో చాలామంది మొదటిసారి ఇలాంటి ప్రయోగాల్లో పాల్గొంటున్న వారు.

ఈ మిషన్ మనకు ఒక సాంకేతిక సవాలు మాత్రమే కాదు, అంతర్జాతీయంగా అంతరిక్ష సాంకేతిక విజ్ఞానంలో గట్టి పోటీ దారుడిగా నిలవాలన్న భారతదేశ ఆశయసాధనలో గొప్ప ముందడుగు కూడా!

ప్రయోగం విజయవంతమైంది. ఉపగ్రహం కచ్చితమైన కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో భారత దేశ అంతరిక్ష పరిశోధనకు ఒక వ్యవస్థీకృత రూపం ఏర్పడినట్లయింది. అంతరిక్ష సామర్థ్యాల్ని అభివృద్ధి చేసుకుంటున్న అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకిది ఒక నమూనాను అందించింది. ఇస్రో ఖ్యాతిని ఇనుమడింపజేసింది. మనకు గొప్ప ప్రేరణగా నిలిచింది. దీంతో అంతరిక్ష వైజ్ఞానిక ప్రయోగాలకు ప్రభుత్వ పెట్టుబడులు కూడా బాగా పెరిగాయి. ఇప్పుడు ఆర్యభట ప్రయోగించి 50 ఏళ్ళవుతోంది. భారతదేశం నేడు వెనకబడ్డ, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉపగ్రహ ప్రయోగ సేవల్ని చవకగా అందించే స్థాయికి చేరుకుంది. అనేక ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్ దేశాల అంతరిక్ష ఆశయాల్ని సాకారం చేస్తోంది. ఆర్యభట ప్రయోగం ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, నీటి శుద్దీకరణతో సహా అనేక రంగాలపై విస్తృత ప్రభావాన్ని కలిగించింది. దేశానికో గర్వకారణంగా మారింది. మన భారతీయ శాస్త్రవేత్తల్లో, ఇంజనీర్లలో శాస్త్ర పరిశోధన పట్ల, సాంకేతికత పట్ల మక్కువను పెంచింది.

సరళ సాంకేతికత

ఆర్యభటను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాని కంటే ఆచరణాత్మక అనుభవానికి ప్రాధాన్యతనిస్తూ రూపొందించారు. దానివి చాలా సరళమైన సౌరఫలకాలు. దాని అన్ని భాగాలు భారతదేశంలోనే తయారయ్యాయి. సాంకేతిక విజ్ఞానంలో స్వయం సమృద్ధి పట్ల మన నిబద్ధతనిది ప్రతిబింబించింది. ప్రాజెక్టు డైరెక్టర్ యు. ఆర్. రావు ఈ సరళ సాంకేతిక విజ్ఞానాన్ని సమర్ధించారు. కమ్యూనికేషన్ల కోసం రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల వైపు మనం ముందుకు సాగడానికి దీన్నొక పునాది దశగా భావించారు. ఒక ప్రయోగాత్మక ఉపగ్రహంగా దీన్నాయన విశ్వసించారు.
కాస్మోస్ 3-ఎం రాకెట్ ఆర్యభట ఉపగ్రహాన్ని మాత్రమే కాదు వలస పాలన నుండి విముక్తి చెంది 30 ఏళ్లు కూడా పూర్తికాని భారత దేశపు చిరకాల స్వప్నాలను, ఎందరో శాస్త్రవేత్తల ఆశయాలను కూడా అంతరిక్షంలోకి మోసుకెళ్లింది! ఈ ఉపగ్రహాన్ని 619 కిలోమీటర్ల “అపోజి” (భూమి నుండి అత్యంత దూరపు స్థానం), 563 కిలోమీటర్లు “పెరిజి” (సమీప స్థానం) గల కక్షలో 50.7° వంపు వద్ద వుండేలా ప్రయోగించారు.

ఉపగ్రహా పేరు, దాని నేపథ్యం
ఈ ఉపగ్రహానికి ఆర్యభట అని పేరు పెట్టడంలో ఎంతో విలువైన మన సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యం దాగి వుంది. ఇస్రో, భారత ప్రభుత్వం రెండూ ఈ పేరును మన జాతీయ గౌరవాన్ని వారసత్వాన్ని ప్రతిబింబించేదిగా అంగీకరించాయి. మొదట ఇస్రో దీనికి “ఇస్రో శాటిలైట్ -1” అని పేరు పెట్టింది కానీ పూర్తయ్యేసరికి ఇది ఆర్యభటగా మారిపోయింది. అప్పటి ఇస్రో చైర్మన్ సతీష్ ధావన్ భారత దేశపు గొప్ప వారసత్వం, శాస్త్రీయ మేధోజ్ఞానం, చరిత్రా ఇందులో ప్రతిబింబిస్తున్నాయని ఈ పేరును ఎంపిక చేసి, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేత ఒప్పించారు. ఈ పేరు ఒక గొప్ప ప్రతీక ! భారతదేశపు శాస్త్రసాంకేతికాల చరిత్రను పునరుద్ఘాటించే ప్రతీక ! మన పురాతన మేధో విజయాల్ని ఆధునిక సాంకేతిక పురోగతితో అనుసంధానించే ప్రతీక!

డిజైన్ -పే లోడ్
ఆర్యభట ఉపగ్రహం 26 ముఖాల పాలిహెడ్రాన్‌ఆకారంలో, 360 కిలోగ్రాముల బరువు కలిగి వుంది. దీని రూపకల్పన కాలానికి ఇంజనీరింగ్ లో ఇదో గొప్ప అద్భుతం. దాని వ్యవస్థలకు శక్తినిచ్చేందుకు అమర్చిన సౌరఫలకాల ఉపరితల వైశాల్యంపై ఎంతో దృష్టి పెట్టడం జరిగింది. ఆర్యభట పేలోడ్ ముఖ్యంగా మూడు నిర్దిష్ట రంగాల పరిశోధన వైపు దృష్టి సారించింది:

– ఎక్సరే ఖగోళ శాస్త్రం : ఖగోళ శాస్త్ర మూలాలను అధ్యయనం చేయడం. వాటి ప్రవర్తనను అర్థం  చేసుకోవడం.
– ఏరోనామిక్స్ : భూమి ఎగువ వాతావరణం లేదా అయానోస్పియర్ లక్షణాల్ని పరిశోధించడం.
– సౌర భౌతిక శాస్త్రం : సూర్యుడి నుండి వెలువడే న్యూట్రాన్లను, గామాకిరణాలను అధ్యయనం చేయడం.

మిషన్ పనితీరు
మిషన్ ప్రారంభ దశ అద్భుత విజయాన్ని సాధించింది ఒక దేశపు హృదయ స్పందనంతా ఇందులో అల్లుకొని వున్నందున ఈ విజయం ఏంతో కీలకమైందని మళ్ళీ చెప్పనక్కరలేదు. అందుకనే ఆర్యభట కక్ష్యలోకి చేరుకున్నవెంటనే శ్రీహరికోట రేంజ్ గ్రౌండ్ స్టేషన్ వద్ద కన్సోల్ ల చుట్టూ గుమికూడిన ఇంజనీర్లంతా ఊపిరి పీల్చుకున్నారు! కానీ కక్ష స్థిరత్వానికి కీలకమైన ఉపగ్రహపు స్పిన్ ప్రారంభించడంలో వాల్వు రిలేకు సంబంధించిన సమస్య తలెత్తింది. భూమి మీద నుంచి మన ఇంజనీర్లు ఒక దిద్దుబాటు సందేశం పంపారు. నాలుగు రోజులపాటు ఆర్యభట్ట పంపే ఎక్సరే మూలాలను, ఆయనోస్పెరిక్ ఎలక్ట్రాన్ల డేటాను సేకరించారు. అయిదవ రోజు మరో లోపం తలెత్తింది. మూడు శాస్త్రీయ ప్రయోగాలకు (ఎక్స్ రే ఖగోళ శాస్త్రం, సౌర y కిరణాలు, వైమానిక శాస్త్రం) శక్తినిచ్చే విద్యుత్ సరఫరా విఫలమైంది. అప్పుడు ప్రయోగాలను ఆపివేసి ఆర్యభటను సాంకేతిక పరీక్షలకు వేదికగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇది కఠినమైన నిర్ణయం కానీ ఆచరణాత్మక నిర్ణయం కూడా మిషన్ లక్ష్యం ఎప్పుడూ దాని సామర్థ్యాలను పెంచడంగా వుంటుంది. శాస్త్రీయ ప్రయోగాలు బోనస్ మాత్రమే. ఆ తర్వాత దాని 45వ కక్ష్యలో బ్యాకప్ స్పిన్ ప్రారంభించబడింది. ఉపగ్రహం నిమిషానికి 50 సార్లు తిరగడంతో వేగం స్థిరపడింది. మిషన్ కంట్రోల్ వద్ద హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. దీంతో భారతదేశం తన మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించడమే కాకుండా నియంత్రించడం కూడా చేయగలిగింది.

ఉపగ్రహం అనుకున్నట్టు శాస్త్రీయంగా పనిచేయనప్పటికీ అది తదుపరి రెండు సంవత్సరాలు విశ్వసనీయమైన డేటాను ప్రసారం చేస్తూనే వుంది. ముఖ్యంగా దాని చివరి ప్రదర్శన మరీ విలువైంది. ఆర్యభట మానవ హృదయ స్పందన రికార్డింగ్ అనే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ సిగ్నల్ ను శ్రీహరికోట నుండి 360 కిలోమీటర్లదూరంలో ఉన్న బెంగళూరు ఉపగ్రహ కేంద్రానికి ప్రసారం చేసింది. ఇది టెలిమెడిసిన్ లో ఒక ముందంజ!

ఉపగ్రహ వ్యవస్థలన్నీ ఊహించిన విధంగానే పనిచేసాయి. ఎంతో విలువైన డేటాను గ్రౌండ్ స్టేషన్ కు ప్రసారం చేసాయి. అయితే కక్ష్యలో నాలుగు రోజుల తర్వాత విద్యుత్ వైఫల్యం కారణంగా దాని శాస్త్రీయ పరికరాలు మూగపోవడంతో మిషన్ కు ఎదురు దెబ్బ తగిలింది.








శాశ్వత వారసత్వం
ఆర్యభట ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా వార్తలకెక్కింది. అది భారతదేశానికి దౌత్య పరంగాను, శాస్త్ర సాంకేతిక పరంగాను ఒక మైలురాయిగా మారింది ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించిన రెండో రోజుల్లోనే భారత ప్రభుత్వం రెండవ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సోవియట్ తో ఒప్పందంపై సంతకం చేసింది. అది భారతీయ శాస్త్రవేత్తల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. దేశ అంతరిక్ష కార్యక్రమాలకు దృఢమైన ప్రణాళిక కూడా దీంతో ఏర్పడింది. డేటా సేకరణ అకాలంగా ముగిసినప్పటికీ

ఆర్యభట మిషన్ విఫలం కాలేదు. అది భారతీయ శాస్త్రవేత్తలకు గొప్ప అనుభవాన్నందించింది. దీంతో భారతదేశం ఉపగ్రహాల్ని నిర్మించి, నిర్వహించగల సామర్థ్యం గల దేశంగా అంతర్జాతీయ గుర్తింపును పొందింది. మన శాస్త్రవేత్తల్లో ఆత్మ విశ్వాసాన్నిది ఎంతగానో పెంచింది. ఆర్యభట విజయం కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ తదితర వైజ్ఞానిక పరిశోధనల కోసం, మరింత సంక్లిష్టమైన

అధునాతన ఉపగ్రహాల అభివృద్ధి కోసం మన మార్గాన్ని సుగమం చేసింది. తర్వాతి ప్రయోగాలకు మార్గదర్శకంగా నిలిచింది. ఈ మిషన్ జ్ఞానంతో, అనుభవంతో చంద్రయాన్, మంగళయాన్ లాంటి ప్రయోగాల్ని మనం చెయ్యగలిగాం. మన ఆశయాలకు, ప్రపంచ అంతరిక్ష రంగంలో ఒక పాత్ర పోషించడానికి, ఇప్పటిదాకా ఇస్రో సాగిస్తున్న ప్రయాణానికి ఇది చేసిన దోహదం మాటల్లో చెప్పలేనిది. ఈ ప్రయోగానికి నాయకత్వం వహించిన యు.ఆర్.రావు లాంటి వారి సారథ్యంలో ఈ మిషన్ మన స్వావలంబనకు, ప్రపంచ స్థాయి అంతరిక్ష ప్రయోగాలకు బలమైన పునాది

వేసింది అయిదు దశాబ్దాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆర్యభట్ట అనుభవం మనకు చాలా చిన్నదిగా కనిపించవచ్చు. కానీ దాని ప్రభావం బహుశా అప్పటినుంచి ప్రయోగించిన ఏ భారతీయ ఉపగ్రహం కన్నా విలువైంది. మన లాంటి అల్పాదాయం గల దేశం బయటి అగ్రరాజ్యాల సహాయం సాంకేతిక జ్ఞానం లేకుండా, వారి బ్లూప్రింట్లపై ఆధారపడకుండా సంక్లిష్ట అంతరిక్ష హార్డ్ వేర్ ను రూపొందించి నిర్వహించగలదని ఈ ప్రాజెక్టు నిరూపించింది.

Prof MGK Menon (2nd from left), Prof UR Rao (4th from left),
K Kasturirangan (extreme right) and a few others from team Aryabhatta

చివరి మాట
మనం 78 సంవత్సరాల క్రితం వలస పాలన నుండి స్వాతంత్య్ర కక్ష్యలోకి ప్రవేశించాం. ఇప్పుడు మనం మన ఖగోళ గమనాన్ని నిర్దేశించుకొని స్వేచ్ఛగా ముందుకు సాగుతున్నాం. క్రమంగా మన దేశం అద్భుతమైన నిర్దిష్ట పథంలో తన ప్రయాణం కొనసాగిస్తోంది.

మన దేశపు శ్రేయస్సును, జ్ఞానాన్ని, సమున్నత కక్ష్యలో స్థిరంగా నిలబెట్టి; నూతన ఆవిష్కరణలూ, ఐక్యతా అనే ఇంజన్ల సాయంతో విశాల విశ్వంలో ఒక దీప స్థంభంగా నిలుద్దాం. మన త్రివర్ణ పతాకాన్ని పైపైకి ఎగరవేద్దాం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

రచయిత: రవి రాజా పోతినేని, డాక్టోరల్ రీసెర్చ్ కాండిడేట్,  డిపార్ట్మెంట్ అఫ్ ఆస్ట్రానమీ, ఉస్మానియా యూనివర్సిటీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *