సంపాదకీయం

రంగస్థలం పైకి మహాభారత సీరియల్ యోధుడి గెటప్ తో నటుడు మనోజ్ బాజ్ పాయి స్వగతంలో భారత యుద్ధవీరుల్ని మననం చేసుకుంటూ ప్రత్యక్షమవుతాడు. కృష్ణుడి, కర్ణుడి రథాల్ని కీర్తిస్తూ నేపథ్యగానం వీనులవిందు చేస్తుంది. ఇంతలో గ్రాఫిక్స్ మాయాజాలం మధ్య రెండు చక్రాల గుర్రాల రథం సాక్షాత్కరిస్తుంది. అది కొయ్యదే గానీ చక్రాలతో సహా మొత్తం రాగి రేకుల తాపడంతో ధగధగలాడుతుంటుంది. ఓ నిమిషం తర్వాత రంగురంగుల ఫ్లడ్ లైట్ల మధ్య మన హీరో రథారోహణం చేస్తాడు. గాలిలోకి చేతులు వూపుతూ అచ్చం మహాభారత యుద్ద వీరుడి లాగే వీరవిన్యాసాలు చేస్తాడు. ఇంతలో ధోవతి ధరించి మన రాణీ రుద్రమ ఆహార్యంతో ఒక వీరయోధురాలు రంగస్థలంపైకి దూసుకొస్తుంది. తర్వాత పురాతత్వ శాఖ అధికారుల కథనం, ఇంటర్వ్యూలు మొదలవుతాయి. ఇదంతా “సీక్రెట్స్ ఆఫ్ సినౌలీ” డాక్యుమెంటరీ ప్రారంభ పుట్టం. ఇది మనల్ని నేరుగా కురుక్షేత్రంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో భారత పురాతత్వ శాఖ వారు ‘చెమటోర్చి’ తీసి రక్తి గట్టించిన లఘుచిత్రం.

ఉత్తరప్రదేశ్ భాగ్ పేట్ జిల్లాలోని “సినౌలీ” ప్రాంతంలో దాదాపు వంద చోట్ల 2005 – 2018 మధ్య జరిపిన తవ్వకాల్లో కత్తులు, బాణాలు, శిరస్త్రాణాలు, టెర్రాకోట్ కుండలతో పాటు తొలిసారిగా కొయ్య చక్రాల రథాలు కూడా బయటపడ్డాయి. ఇప్పుడీ రథాలే పురాతత్వ శాఖ వారి చేతుల్లో పావులుగా మారి చరిత్రనంతా తిరగరాయిస్తున్నాయి. ఈ డిస్కవరీ+ డాక్యుమెంటరీ చిత్రం సదరు తిరగరాతలో ఒక భాగం!

ఈ తవ్వకాల ముఖ్య అధికారి సంజయ్ కుమార్ మంజిల్ మాటల్లో చెప్పాలంటే సినౌలీలో దొరికినవన్నీ సా.శ.పూర్వం 2000 సంవత్సరాల నాటివి. అంటే కొంచం అటూఇటూ సింధు నాగరికత చివరి నాటివి ప్రపంచంలోనే మనది అత్యంత ప్రాచీన యుద్ధ వీరుల భూమి అనేందుకివి సాక్ష్యాలు. మహాభారతానికి ఋగ్వేదానికీ మధ్య గల సంబంధాన్ని కూడా ఇవి ధ్రువీకరిస్తున్నాయి. హరప్పా నాగరీకులు హరప్పా పతనానంతరం తూర్పు వైపు గంగా యమునా తీరాలకు తరలి వచ్చారు. అక్కడి స్థానికులతో కలిసి పోయి వారి నాగరికతను కొనసాగించారు. వైదిక నాగరికతగా మారి అది నిర్విరామంగా ముందుకు సాగింది. దీంతో సింధూ నాగరికత తర్వాత మన చరిత్ర ఏమీ అజ్ఞాతంలోకి వెళ్ళి పోలేదనీ (తెగిపోలేదనీ), అనుస్యూతంగా వేల యేళ్లు కొనసాగిందని కూడా స్పష్టమవుతోంది.

సినౌలీ తవ్వకాల ఆధారంగా పురాతత్వ శాఖ చెబుతున్న వాటిల్లో రెండు ప్రధానాంశాలున్నాయి. మొదటిది హరప్పా నాగరికత నిరంతరాయంగా సాగిందనేది, రెండోది మనది ప్రపంచంలోనే మొదటి అశ్వరథ యుద్ధ వీరుల జాతి అనేది. మంజుల్ చెపుతున్న దాని ప్రకారం సినౌలీ తవ్వకాల్లో లభించిన రథపు కాడి పొడవుగా వుంది. గుర్రాలు లాగే రథాలకు మాత్రమే ఇలాంటి కాడి వుంటుంది. ఈ రథాల సంస్కృతి, ప్రాభవం మన సొంతం. ఇది మన ఘనమైన వారసత్వం. రాముడి తండ్రి దశ‘రధుడు’. ఆనాటి రథాల సాంకేతిక పరిజ్ఞానం ఈనాటి మిసైళ్ళ పరిజ్ఞానంతో సమానం.

ఆ కాలంలో మహారథికులే విజేతలు. ఇలాంటి రథాల్ని ప్రపంచంలో మొదట మనదేశంలోనే వాడారు. మహాభారతయుద్ధ వీరులంతా గొప్ప రథాలపై నుంచే పోరాడ్డం గమనార్హమని కూడా ఆయన వాదిస్తున్నాడు. సినౌలీ రథాల, గుర్రాల, అశ్వరథ వీరుల ఆనవాళ్ళు సా.శ. పూర్వం 2000 నాటివని పురాతత్వ శాఖ అధికార్లు చెపుతున్నారు. పశుపాలకార్యులు గుర్రాలు, రథాలు ఎక్కి మధ్యాసియా నుంచి ప్రపంచమంతా విస్తరిస్తూ మనదేశానికి వచ్చారన్న ప్రస్తుత చరిత్రను ఈ సాక్ష్యాలు తిరస్కరించినట్టు కూడా వీరు వాదిస్తున్నారు. దీనర్థం వైదిక నాగరికత హరప్పా నాగరికతకు కొనసాగింపని ! ఆర్యులు భారతీయులేనని!

రాగి తాపడాల శవపేటికలు, శవాల పక్కన పెరుగు, నెయ్యి, పవిత్ర వృక్షావశేషాలు, ఖనన వేళ మంత్ర పఠనం లాంటివన్నీ ఋగ్వేదంలో కనిపిస్తాయనీ, అచ్చం ఇవన్నీ సినౌలీ తవ్వకాల్లో కనపడ్డాయని విశ్లేషిస్తూ పురాతత్వ శాఖ సినౌలీ నాగరికతను వైదిక నాగరికతగా నిరూపించే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఆర్యుల భారతీయ మూలాలను నిర్ధారించినట్లు కూడా అవుతుంది.

సహజంగానే ప్రభుత్వం దీనికి మహదానందపడింది. ప్రధానమంత్రి పురాతత్వ శాఖ అధికారులను ప్రశంసలతో ముంచెత్తారు. మహాభారతం పురాణం కాదనీ, చరిత్రకు కొత్త ద్వారాలు తెరుచుకున్నాయనీ, ఇదొక అద్భుతమైన ముందడుగనీ ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త తరుణ్ అజయ్ ట్విట్టర్లో వీరావేశం ప్రదర్శించాడు.

కథ ఇక్కడితో ఆగలేదు. జూలై 2024 లో ఢిల్లీలో జరిగిన యునెస్కో వారసత్వ కమిటీ సమావేశాల్లో 2000 మంది దేశ విదేశీ ప్రతినిధుల మధ్య ప్రధాని మోడీ “భారతదేశం అత్యంత ప్రాచీన దేశమనీ, సినౌలీ సాక్ష్యాలు తిరుగులేని రీతిలో దీన్ని నిరూపిస్తున్నాయనీ, 2018 లో అక్కడ నాలుగు వేల ఏళ్ల నాటి అశ్వరథం దొరికిందనీ, దీంతో చరిత్రను కొత్త దృక్పథంతో చూడాల్సిన రోజులు వచ్చా”యని ప్రకటించాడు! ఇక అధికారుల ఉత్సాహానికి అంతేముంటుంది? వారు Archaeology and Epic in the light of new researches పేర దీనిపై ఒక ప్యానెల్ చర్చ జరిపారు. “సినౌలీ మహాభారత సాక్షి” అంటూ మంజుల్ ఒక పత్రం అందులో సమర్పించాడు. నిజానికీ పురాణాల శోధన ఆర్కియాలజిస్టుల పని గాకున్నా ఒక ప్రయోగంగా దీన్ని చేపట్టామన్నాడు. మహాభారతం లాంటి గొప్ప ఇతిహాసపు మూలాలు తమకు లభించడం తమ సుదీర్ఘ కృషి ఫలితమన్నాడు. కానీ తాను ఒక అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతున్న సంగతి కొంచెం గుర్తు చేసుకొని, “సినౌలీ మహాభారతం జరిగిన స్థలం కాదు గానీ ఇక్కడి అవశేషాలు మహాభారతాన్ని ప్రతిఫలిస్తున్నాయి” అంటూ గొంతు సవరించుకున్నాడు!

మాజీ ఏ యస్ ఐ డైరెక్టర్ జనరల్ డివి శర్మ కూడా సినౌలీ అవశేషాలకూ, ఋగ్వేదానికీ లింకు వుందంటున్నాడు. రామాయణ భారతాల అవశేషాల కోసం 1968 నుంచి తవ్వకాలు జరుగుతూనే వున్నాయి. బి బి లాల్ భారత ఆర్కియాలజీ అధిపతిగా ఆ పురాణాలు పేర్కొన్న స్థలాలన్నిటిలో అన్వేషణలు చేపట్టాడు. ఎప్పుడో 1952లో దొరికిన కుండలు (Painted Grey Ware) సా.శ. పూర్వం 1100-800 నాటివనీ, అవి మహాభారత కాలానివనీ పేర్కొని ఆయన అభాసు పాలయ్యాడు. అప్పుడే డి.ఎం. ఝా దీన్ని పథకం ప్రకారం పురాతత్వ శాఖను బ్రష్టు పట్టించడంగా ఎండగట్టాడు. ఢిల్లీ పురానా ఖిల్లాలో పాండవుల ఇంద్రప్రస్థ నగరపు ఆనవాళ్ళ కోసం గతంలో ఏఎస్ఐ ఏళ్ల తరబడి తవ్వి తవ్వి అలసిపోయింది. మొదటినుంచి హిందుత్వవాదులు “ఆర్యుల ఆక్రమణ సిద్ధాంతం” మార్షల్ లాంటి పాశ్చాత్యపండితులదని వాదిస్తున్నారు. ఆర్యులు భారతీయులేనని, మొదటి ఆక్రమణదారులు ముస్లింలని వారి దృఢ విశ్వాసం. పాశ్చాత్యులు తమను గొప్ప జాతిగా కీర్తించుకునేందుకు, భారతీయుల్ని బానిసలుగా చూపేందుకు ఈ ఆర్య ద్రావిడ వివాదం తెచ్చారన్నది వారి ఆరోపణ. అసలు ఆర్యవాదమే ఒక ఊహాజనిత వాదమని వారి అభిప్రాయం. దీని కోసం వారు గతంలో సింధూ నాగరికతా శిథిలాల్లో గుర్రాన్ని “కనిపెట్టి” కొంత కాలం దబాయించారు. తర్వాత ఇది మార్ఫింగ్ అని తేలడంతో వెనక్కి తగ్గారు.

ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పురాతత్వ శాఖను తమకు తోడు తెచ్చుకునే పనిలో పడ్డారు. వారి కోసం ఏ యస్ ఐ “శాస్త్రీయ ఆధారాల్ని” వెలికి తీసి నూతన “సత్యాల్ని” ఆవిష్కరిస్తోంది. “సరికొత్త” చరిత్రకు సామగ్రిని సమకూరుస్తోంది. ఏఎస్ఐ పట్టుకున్న సినౌలి రహస్యమంతా కొయ్య చక్రపు రథం చుట్టూ తిరుగుతుంది. అది గుర్రపు రథమేనా అనేది మొదటి సందేహం. కేవలం కాడి పొడవు ఆధారంగా చేసిన ఊహ మీద ఆధారపడి ఈ కథనమంతా సాగుతుంది. కానీ ఆ ప్రాంతంలో జరిపిన ఏ తవ్వకాల్లోనూ గుర్రపు ఎముకల ఆనవాళ్లు దొరకలేదు. గుర్రాలు లేని గుర్రపు రథాలెక్కడుంటాయి? అందువల్లే వియన్ ప్రభాకర్ (ఐఐటి గాంధీనగర్) లాంటివారు మరింత పరిశోధన జరగకుండా ఏ నిర్ధారణకు రాలేమంటాడు. ఆంటోని జోసఫ్ (The Early Indians రచయిత) “ఈ చక్రాలకు ఎలాంటి ఆకులు (స్పోక్స్) లేవని, ఇవి సాలిడ్ గా వున్నాయని వీటిని ఏ జంతువులో, ఎద్దులో తప్ప గుర్రాలు లాగవని అంటాడు. ఆస్కో పర్కోసా (ఇండాలజిస్టు ) సినౌలీ రకాల బండ్ల లాంటివి మహారాష్ట్రలో డైమాబాద్ లోని సింధూ నాగరికతలో కూడా దొరికాయంటాడు.

హరప్పా కన్నా ముందే సింతాష్ట సంస్కృతిలో రథాలున్నాయి. వీటిని 1992లో కనుగొన్నారు. అవి సా.శ. పూర్వం 2200-1900నాటివి. ఇవే అన్నిటికన్నా ప్రాచీనాలు. వీరే మొదటి ఆర్యులు. వారి ఖనన సంప్రదాయాలు ఋగ్వేదంలో వున్నాయి. సింతాష్ట బలులు,ఋగ్వేద బలులు, జెండ్ అవేస్తా బలులు ఒకే రకంగా వున్నాయి. వీరి రథాలు పశుపాలక యామ్నాయ సంస్కృతివి. వారు తమ బండ్లను శవాలతో పాటు పూడ్చి పెట్టేవారు. యామ్నాయులు సంతాష్టులకు వారసులు. అందువల్ల వారి వలసొచ్చిన ఏ ప్రాంతంలోనైనా ఈ బండ్లు (రథాలు) దొరికే అవకాశం వుంది. ఈ బండ్లే తర్వాత రథాలుగా పరిణతి చెందాయి.

ఇలా చూస్తే ఈ కథంతా సింతాష్టలు మధ్య ఆసియా నుంచి ఇక్కడికి వలస వచ్చారనే దగ్గరకే వస్తోంది! అంటే సినౌలీ త్రవ్వకాలు ఆర్యుల రాకనే నిర్ధారిస్తున్నాయి. హరప్పాలో లేని గుర్రాలు ఋగ్వేదంలో కనపడ్డం ఇందువల్లనే అనేదీ స్పష్టమవుతోంది. సినౌలీ రథాల రహస్యం తేలాల్సింది వాటి డిఎన్ఏ పరీక్షలో. ఆంటోని జోసెఫ్ ప్రకారం అవి ఎలాంటి రథాలనేది కాదు ముఖ్యం. వాటిని సా శ. పూర్వం 1900 కాలంలోనే (సింధూ నాగరికత తర్వాతే) ఎందుకు పూడ్చారన్నది అసలు విషయం. రాగి తాపడపు శవపేటికలు, శిరస్త్రాణాలు, షీల్డులు, కొరడాలు హరప్పాలో లేనివి సినౌలీలో దొరికాయంటే ఏం జరిగిందనేది కీలకం. దీన్నిబట్టి పెద్ద పెద్ద వలసలు జరిగి వుండాలి లేదా భారీగా స్థానికులు ఇతర సంస్కృతుల్లోకి మారి వుండాలి. ఇదంతా తేలాలంటే డిఎన్ఏ పరీక్షలే మార్గం ఈ డాక్యుమెంటరీలో డి.యన్.ఏ వివరాలు లేవు. ఏ.ఎస్.ఐ నేటికీ వీటిని ప్రకటించడం లేదు.

ఆర్యుల రాకను నిర్ధారిస్తున్నది ఒక్క పురావశేషాలే కాదు భాషా శాస్త్రం, జన్యుశాస్త్రం కూడా.. ఇండో యూరోపియన్ భాషల విస్తృతి మధ్య ఆసియా నుంచి యూరపు దాకా, పశ్చిమాసియా నుంచి దక్షిణాసియా దాకా స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే యూరేషియన్ల జన్యువారసత్వం కూడా ఉత్తరభారతీయులపై స్పష్టంగా విస్తారంగా నిరూపితమైంది.

ఇన్ని నిరూపణలున్నా, వైజ్ఞానిక ప్రపంచంలో ఇంత చర్చ జరుగుతున్నా కొందరు పురాతత్వ శాఖాధిపతులు మాత్రం (ముఖ్యంగా రావత్ లాంటి వారు) “ఏదో కొద్దిగా డిఎన్ఏ సాక్ష్యాలు దొరికినంతమాత్రాన స్థానికతను ఎలా కొట్టి పారేస్తారు? నాలుగు శాతం ఇరానియన్, ఒకటో రెండో శాతం అదీ ఇదీ ఎలా నిర్ణాయకాలవుతాయి? చరిత్ర లేకపోతే పురాణాలు ఆకాశం నుంచి ఎలా పుడతాయి? హరప్పన్లే గంగాతీరానికి వచ్చేసరికి వైదికార్యులయ్యారు. ఋగ్వేదం వారిదే” అనడంతో పాటు ఇంకా కొంచం ముందుకెళ్ళి రొమిల్లా థాపర్ లాంటి పాశ్చాత్యభావ ప్రభావిత చరిత్రకారులకు ఇవన్నీ మింగుడు పడవని కూడా ఎదురుదాడికి దిగుతున్నారు!

ఇలాంటి ప్రభుత్వ ప్రియసత్యాల్ని వెలికి తీసిన ఏఎస్ఐ అధికారులకు ప్రమోషన్లు లభిస్తున్నాయి! అయోధ్య తవ్వకాల సూత్రధారి బి ఆర్ మనికి పదవీవిరమణ చెయ్యగానే నేషనల్ మ్యూజియం డైరెక్టర్ పదవి లభించింది. జ్ఞానవాపి అన్వేషణాధిపతి త్రిపాఠీని అదనపు డైరెక్టర్ జనరల్ గా నియమించేందుకు నిబంధనల్నే మార్చేసారు. సర్కారుకు అప్రియసత్యమైతే తమిళనాడు నుండి అస్సాంకి అర్ధాంతర బదిలీల పురస్కారం లభిస్తోంది. అందువల్ల ఇప్పుడు ఏ.ఎస్.ఐ అధికారులు ఆశ్చర్యంగా ప్రపంచంలో ఎక్కడా లేనట్లు చరిత్రకారులైపోతున్నారు! పురాణాల్ని చరిత్రగా మార్చే పనిలో పడుతున్నారు. ఈ క్రమంలో ఏ.ఎస్.ఐ కార్యరంగంలో కూడా పెద్ద మార్పు వచ్చింది. హడావిడిగా ముఖ్యమంత్రి కార్యాలయాలు ఆదేశిస్తే, అవి ఏదో ఒక “నూతనావిష్కరణను” ఆశిస్తే మిగతావన్నీ పక్కనపెట్టి ఆ ప్రదేశాలపై దాని అధికార్లు వాలిపోవలసి వస్తోంది. అలాంటి ప్రాజెక్టులకు (వాద్ నగర్ పరిశోనకు లాగా) నిధుల వర్షం కురుస్తోంది. వీటికి ప్రభుత్వాశ్రయంతో పాటు కావల్సినంత ప్రచారం కూడా లభిస్తోంది. గతంలో పురాతత్వ శాఖ గ్రామాలు తిరిగి, జానపద గాథల్ని రికార్డు చేసుకొని, పెద్దలతో మాట్లాడి, ఇతరత్రా ఆధారాలు లభించాక తవ్వకాలను జరిపేది. ఇప్పుడా స్వేచ్ఛా, పద్ధతీ వారికి లేకుండా పోయాయి. నిజానికి పురాణాల నిజనిర్ధారణ ఆర్కియాలజిస్టుల పని గాదు. పాలక పార్టీల విశ్వాసాలకు ఆధారాల్ని వెతికి పెట్టే పని వారిదసలే కాదు. అయినా గత పదేళ్ళ నుంచి ఆ శాఖ తన స్వభావాన్ని మార్చుకొని దీనికంకితమవుతోంది. దీనికి మరో పెద్ద ధోరణి కూడా తోడైంది. ఏవో కొన్ని సంస్థలు ఎక్కడో ఒక మసీదు కింద దేవాలయం వుందంటాయి. గొడవ చేస్తాయి. ఎవరో ఒకరు కోర్టుకు పోతారు. స్థానిక కోర్టులు ఆగమేఘాల మీద త్రవ్వకాలు జరిపి నిజాల్ని నిగ్గు తేల్చమంటాయి. దీనికి “తగ్గ” అధికారులు రంగ ప్రవేశం చేస్తారు. ప్రజల “మనోభావాలు” దెబ్బ తినకుండా అన్వేషణా ఫలితాలు వస్తాయి. బాబ్రీ మసీదు నుంచి జ్ఞానవాపి దాకా, షాహిజామా మసీదు నుంచి కమాల్ మౌలా మసీదు దాకా వరసపెట్టి జరుగుతున్న కథంతా ఇదే!

పురాతత్వ శాఖ అన్వేషణలన్నీ గంగా యమునా తీరాలకే ఎందుకు ఎక్కువగా పరిమితమవుతున్నాయి? వైగై, గోదావరీ తీరాల్నెందుకు విస్మరిస్తున్నాయి? ఉత్తరాది ఋగ్వేదార్య సంస్కృతి మీదే పరిశోధనంతా ఎందుకు జరుగుతోంది? దక్షిణాది సంగమ సంస్కృతి ప్రస్తావనకైనా ఎందుకు నోచుకోవడం లేదు? ఎంతసేపూ హిందూ దేవాలయాల వెలికితీతేనా? బౌద్ధ జైనారామాలసంగతి ఏమిటి? ఈ ప్రశ్నలకు కూడా పురాతత్వ శాఖ జవాబు చెప్పాల్సి వుంది. ఈ నింద ఇటీవల ఎందుకు తీవ్రంగా దానికెదురవుతోందో కూడా అది ఆత్మ విమర్శ చేసుకోవాల్సి వుంది.

మన ఏఎస్ఐకి గొప్ప చరిత్ర వుంది. అది 1861 నాటిది. అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ లాంటివారు సొంత నిధులు వెచ్చించి బ్రిటిష్ కాలంలోనే అద్భుతమైన కృషికి చేసిన చరిత్ర దానిది! జాన్ మార్షల్ డైరెక్టర్ జనరల్ అయ్యాక 1924 లో సింధూ నాగరికతను ప్రపంచానికి మొట్టమొదట వెల్లడి చేశాడు. భారతదేశ చరిత్రలోనే అదొక అద్భుత ఘట్టం. జాన్ ప్రిన్సెస్ 1837లో బ్రాహ్మీ లిపి చదివి ‘దేవానాం ప్రియ’ ను అశోకుడని నిర్ధారించాడు అప్పటిదాకా అశోక చక్రవర్తి అజ్ఞానంలోనే వుండిపొయ్యాడు! ఒక్క మెకంజీ 14 భాషల్లో, 16 లిపుల్లో 1568 గ్రంథాలు, 2070 స్థానిక చరిత్రలు, 8076 శాసనాలు, 6218 నామాలు సేకరించి ఇచ్చి పోయాడు ఇవన్నీ భారతదేశ ప్రాచీన వారసత్వ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినవి. నిజానికివి వలస పాలకుల దృక్పథానికి విరుద్ధమైనవి. అయినా ఆనాటి పురాతత్వ శాస్త్రవేత్తలకివేమీ అడ్డం కాలేదు సత్యాన్వేషణే వారిని నడిపించింది.

స్వాతంత్ర్యానంతరం కూడా మన పురాతత్వ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకమైందిగా పేరొందింది. వనరులు తక్కువైనా అద్భుతమైన కృషి చేసింది. హెచ్ డి సంకాలియా ఆధునిక పురాతత్వశాస్త్ర పితామహుడు. శాస్త్రీయరీతుల్ని ఈ రంగంలో ప్రవేశపెట్టి స్థిరపరిచిన వాడు. బి బి లాల్, రాఖల్ దాస్ బెనర్జీ సింధూ నాగరికతలోని కొత్త కోణాల్ని ఆవిష్కరించిన వారు. ఆర్ నాగస్వామి (దక్షిణ భారత నాగరికత), కెకె మహమ్మద్ (బటేశ్వర ప్రాజెక్టు) , దెబాలామిత్ర(బౌద్ధం), దిలీప్ కుమార్ చక్రవర్తి (దక్షిణాసియా సంస్కృతి), శారదా శ్రీనివాసన్ (ప్రాచీన లోహకళ) లాంటి వారు ఒక్కరూ ఒక్కో రంగంలో దిగ్గజాలు! సత్యాన్వేషణే జీవితలక్ష్యంగా పనిచేసిన వారు. బాధాకరం ఏమంటే క్రమంగా ప్రస్తుత పురాతత్వ శాస్త్ర వేత్తలు వీరినందరినీ చరిత్ర పొరల్లోకి తోసేస్తున్నారు! తమ వారసత్వాన్నే తాము కాలదన్నుకొంటున్నారు!

తవ్వకాలు జరిగేటప్పుడు వెలువడ్డ వాటిని ఆర్కియాలజిస్టులు భావవేశంతో, భేషజంతో చూడరు. వారికవి ఒకానొక కాలపు నాగరికతకు, నిర్మాణాలకు, సంస్కృతికి, పనితనానికి ఆనవాళ్లుగా మాత్రమే కనిపిస్తాయి. కానీ మన వారీదృక్పథాన్ని ఉద్దేశపూర్వకంగా వదిలేసారు. అసలు పురాతృత శాస్త్రం ఇప్పుడొక ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం. భాషా శాస్త్రం, జన్యు శాస్త్రం, పురామానవశాస్త్రం కూడా దాన్నుంచి విడదీయరానివయ్యాయి. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏ తవ్వకంలో ఏది బయటపడ్డా అది ప్రపంచ వారసత్వ సంపదగా మారుతోంది. దానిపై జరిగే పరిశోధనకు సర్వాంగీకృత విధానం, ప్రమాణాలు వుంటున్నాయి. దొరికిన ప్రతిదాన్నీ ప్రపంచంలోని ఇతర ఆధారాలతో పోల్చుకున్న తర్వాతనే ఒక నిర్ధారణకు వస్తున్నారు. కొత్త ఆధారం దొరికితే వినయంగా, నిర్మొగమాటంగా తమ పాత అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. ఆధునిక పురాతత్వ శాస్త్రం ఆ పరిణతికి చేరుకున్న కాలంలో మనమన్నాం. కానీ మన పురాతత్వ శాఖ మాత్రం ప్రమాణాలన్నిటినీ గాలికొదిలేసి సర్కారు వారి బాకాగా మారిపోయింది.

ఢిల్లీలో జి 20 సదస్సు సందర్భంగా అది ఆరు నెలల పాటు అన్ని పనులు అటకెక్కించి ఆతిథ్యసేవలో మునిగిపోవల్సి వచ్చింది. ఇది మా పని కాదని చెప్పే ధైర్యమే వారికి లేకపోయింది. ఆక్రమణల్లో పోయినవి పోగా ఇప్పుడు ఏ.యస్.ఐ రక్షణలో మిగిలిన వారసత్వ నిర్మాణాలు నాలుగువేలకు పడిపోయాయి. దాదాపు వెయ్యి క్షేత్రాలు – ఢిల్లీ ఎర్ర కోటతో సహా ప్రైవేటు పరమయ్యాయి. ఇటీవల దాల్మియా గ్రూపు హుమయూన్ సమాధిని గ్రాండ్ రెస్టారెంట్ గా మార్చబూనుకోడం, స్థానిక జనం తిరగబడ్డం మనం చూచాం. ఇక అక్రమ బదిలీలు, వేధింపులు, వివక్షలు, రిపోర్టులు తొక్కి పట్టడం, నిధుల కొరత, కోర్టుల జోక్యాలు మన పురాతత్వ శాఖను నిస్సారంగా మార్చుతుండడంతో పాపమది ప్రాణావశిష్టంగా మారుతోంది. ఇలాంటి కష్టకాలంలో మన ఆర్కియాలజిస్టులు పుక్కిటి పురాణ శోధనలో పడి, ప్రమోషన్ల కోసం, పాలకుల ప్రాపకం కోసం సత్యాన్ని సమాధి చెయ్య జూస్తే ఏమనుకోవాలి? అకడమిక్ కృషి మానేసి ఆధునిక వైజ్ఞానిక ప్రపంచం ముందు, చరిత్రకారుల ముందు మరుగుజ్జులుగా మారితే వారికి, వారి పరిశోధనలకు ఏ విలువ వుంటుంది ? చరిత్రలో వారికే స్థానం దక్కుతుంది? ఒకవైపు విశ్వగురువుగా చెప్పుకొంటూ మరోవైపు ప్రతిష్టాత్మక సంస్థల్నిలా పలచబార్చుకోవడం అంతర్జాతీయ వైజ్ఞానిక సమాజం ముందు మనకే గౌరవాన్ని మిగిలిస్తుంది? ఏ తీరాలకు మనల్ని చేరుస్తుంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *