ఒకే సూత్రాల సమూహంతో చలనాలన్నింటినీ వివరించగలము.
(One Set of Laws Explains all Set of Motions)
విశ్వంలో అన్ని చోట్లా చలనాలు ఉన్నట్లు తెలుసుకున్నాం. దోమ, ఏనుగు, అణువు, పరమాణువు, నదులు, సముద్రాలు, గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, నెబ్యులాలు ఇలా దేనిలోనైనా జరిగే చలనాలను వివరించడానికి ఒకే విధమైన సూత్రాలు సరిపోతాయి. ఉదాహరణకు గాడిద పొట్టప్రేవుల్లో కదిలే నీటి గతిజశక్తికి సూత్రం E=1/2 mv2 అయితే హిమాలయ పర్వతాల పై నుండి పడే నీటి గతిజశక్తికి కూడా అదే సూత్రం. నిశ్చలంగా ఉన్న వస్తువును కదిలించేందుకు ఆ వస్తువు ఏ పరిమాణంలో ఉన్నా ఎంతోకొంత బలమవసరమే. వస్తువుల కదలికలు, చలనాలలో (Dynamics) ద్రవ్యవేగం, శక్తి, ద్రవ్యరాశి, కోణీయ ద్రవ్యవేగం, ఇలాంటి రాశులెన్నో యిమిడి ఉన్నాయి. అవి నిత్యత్వమై వున్నాయి (Conserved)
ఇది గతిలో ఉన్న ఏ వస్తువుకైనా వర్తిస్తుంది.
‘A’ అనే మనిషి వయసుతోపాటు ముసలితనం వచ్చి కొన్ని రోజుల తర్వాత , చనిపోతే ‘B’ అనే వ్యక్తి కూడా ముసలితనం వచ్చి చనిపోవడం ఖాయం. పరమాణువులో తిరిగే ఎలక్ట్రాన్ బలానికి సూత్రం F=mv2/r అయితే సూర్యునిచుట్టూ తిరిగే భూమికి, గెలాక్సీ కేంద్రం చుట్టూ తిరిగే నక్షత్రాలకు మధ్య అపకేంద్ర బలానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.
భౌతిక శాస్త్రంలో రెండు విద్యుదావేశాల మధ్య వికర్షణ లేదా ఆకర్షణ బలాలు పనిచేస్తాయని, q1, q2 మధ్య పనిచేసే అలాంటి బలానికి సూత్రం F=q1q2/r2 అని కూడా తెలుసుకున్నాము. అయితే ఇదే రీతిలో విశ్వంలో ఎక్కడున్నా పనిచేస్తుంది. ఒకేరకమైన సూత్రాల సముదాయంతో (Set of Laws) అన్ని రకాల చలనాలను వివరించగలమంటే అర్ధం ఇదే! ఆకారమేమీ లేని 10 కేజీల ద్రవ్యరాశిఉన్న రాయిని భూమినుంచి 10 మీటర్ల ఎత్తులో ఉంచితే సుమారు 1000 జౌళ్ళ స్థితిశక్తి (Potential energy) ఆ వస్తువులో ఒనగూరుతుంది. అంతే ఎత్తులో 10కేజీల ద్రవ్యరాశి ఉన్న శివలింగాన్ని, క్రీస్తు శిలువను, బుద్ధ విగ్రహాన్నిఉంచితే ఆయా పదార్థాల్లో కూడా సుమారు 1000 జౌళ్ళ శక్తే ఉంటుంది. వీటన్నింటిని ఒకేసారి వదిలేస్తే అన్నీ ఒకేసారి నేలను తాకుతాయి. నేలను తాకేప్పుడు అన్నింటికీ ఒకే వేగం ఉంటుంది. బెల్లం ముద్దనొకదాన్ని తీసుకొని దాన్ని నేలమీద పెడితే చీమలు పడతాయి. బెల్లం ముద్దను ఏ ఆకారంలో ఉంచినా చీమలు పట్టక మానవు. ఆ బెల్లం ముద్దను ఏ ఆకారంలో తయారుచేసి నీటిలో పడేసినా కరగక మానదు. కాబట్టి ఒకే విధమైన సూత్రాలతోనే అన్ని చలనాలను వివరించగలము. ఈ విధంగా చూస్తే ద్రవ్యరాశిలేనట్లు చెప్పబడుతున్న దెయ్యాలు క్రమేపీ బరువు పెంచుతాయనీ, అరుస్తాయనీ, కదులుతాయనీ నమ్మడం అశాస్త్రీయం!
– ప్రోఫెసర్ ఎ.రామచంద్రయ్య
Excellent explanation and good message for all students, teachers and all elderly educated people.