బడి బయట పాఠాలు -2
భయం భయంగా..
– సి. వి. కృష్ణయ్య
ఆ పిల్లవాడికి ఎనిమిదేళ్లు ఉంటాయి. రెక్కలు దొడిగే వయసు. వాడి ముందు మూడు ప్రపంచాలు నిలిచి ఉన్నాయి. అందులో బడి ఒకటి. అంటే టీచర్లు, అక్షరాలు, అంకెలు, శిక్షలు. రెండోది వింత అనుభూతులు పంచే అద్భుత ప్రపంచం – కొండలు, గుట్టలు, తోటలు, దొడ్లు, పిట్టలు పురుగులు. మూడోది నిజమో అబద్ధమో అర్థం గాని మాయా ప్రపంచం – దేవుళ్లు, దెయ్యాలు, భూతాలు, మంత్రాలు మాయలు నమ్మకాలు.
ఈ మూడు ప్రపంచాలలో ఏది ఆపిల్లవాడిని కాటేసిందో? నిన్నటి దాకా ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేసిన పిల్లవాడు ఒక్కసారిగా మౌనం దాల్చాడు. నిద్రలో ఉలికి పడుతున్నాడు. తోడి పిల్లలతో కలిసి ఆడుకోవడం లేదు. ఒంటరిగా తిరుగుతున్నాడు. పెద్దవారి మాటలు చాటుగా ఆలకిస్తున్నాడు.
తల్లి వాడి వాలకం గమనించి “ఏమైందిరా ఎందుకు ఇలా ఉన్నావు” అంటూ ప్రశ్నించింది. ఏమీ లేదంటూ దూరంగా పారిపోతున్నాడు. చదువు మీద శ్రద్ధ తగ్గింది. పట్టణంలో చదివించాలని ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాడు వాడి ముఖంలో మునుపటి కళ వచ్చింది. ఆనందంగా పట్టణానికి పయనమయ్యాడు.
మూడు నెలలు ఉత్సాహంగా చదువు సాగింది. సెలవులకు ఇంటికి వచ్చాడు. మళ్లీ మామూలే. సెలవుల తర్వాత పట్టణం వెళ్లినా మునుపటి ఉత్సాహం లేదు. వాడికి ఏమైంది? వాడి సమస్యకు పరిష్కారమే లేదా!

ఆ పిల్లవాడికి ఏమి జరిగిందో అసలు సంగతి తెలుసుకుందాం. ఆ పిల్లవాడిని నేనే గనుక నామాటల్లోనే వివరిస్తాను. ఆదివారం అంటే మా ఆనందానికి అవధులు ఉండవు. నలుగురం పిల్లలం దూరంగా ఉన్న పంటచేలవైపు బయలుదేరాం. దారిలో తూనీగల తోకలు పట్టుకుంటూ తొండలను రాళ్లతో కొడుతూ వెళుతున్నాం. ఒక తొండ మా రాళ్ళ దెబ్బల నుండి తప్పించుకొని ఒక పుట్టలో దూరింది. నాకు కోపం వచ్చింది. రాళ్లుతీసుకొని పుట్ట లోపలికి విసిరాను. పుట్టలో నుంచి పాము పైకి లేచింది. పరిగెత్తాను. పాము నా వెనక పరిగెత్తింది. నా మిత్రులు దూరంగా పరుగులు తీశారు. నేను వెనక్కి తిరిగాను. వెంటనే పాము వెనక్కి తిరిగి వేగంగా పుట్టలో దూరింది. నా వెంట ఉన్న పిల్లలు పాము పగబడుతుందని భయపెట్ట సాగారు. అప్పటికే పాములు పగబట్టే కథలు చాలా విని ఉన్నాను నాలో భయం దూరింది.
పాము సంగతి ఇంట్లో చెబితే తాట వలస్తారు. స్నేహితులతో కలిసి ఆడుకోవడం తగ్గించాను. ఏ వైపు నుండి పాము వస్తుందోనని జాగ్రత్తగా పరిసరాలు పరిశీలిస్తూ ఉండేవాడని. పాముల గురించి పెద్దవాళ్లు మాట్లాడుకునే మాటలు చాటుగా వినేవాడిని ‘నాలో మార్పు చూసి మా అమ్మ అడిగింది . చెబితేకొడతారు. లేదా తేలిగ్గా తీసిపారేస్తారు. అందుకే చెప్పలేదు. చదువు కోసం పట్టణంలో చేర్పించాలని ఎప్పుడు అనుకున్నారో అప్పుడు నాలో ఉత్సాహం వచ్చింది. ఈ పాము పీడ వదిలి పోతుందని ఆనందించాను.
మూడు నెలల సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు కొత్త సంగతులు తెలిశాయి. పాములు రైళ్లలో బస్సుల్లో చివరకు విమానాలలో కూడా వచ్చి కరుస్తాయనీ ‘పగ తీర్చుకున్న దాకా నీరు ఆహారం ముట్టవని చెప్పుకోవడం విన్నాను. మళ్లీ భయం పట్టుకున్నది. పాము పిల్లను చూసినా భయపడసాగాను. ఆహారం ముట్టకపోతే పాము చచ్చిపోతుంది కదా!
కాలం గడిచే కొద్దీ ఈ పాము పగనుండి బయటపడసాగాను. కానీ టీచర్లు కూడా పాములు పగబడతాయని చెబితే ఏమి చేయాలి? ఇంక నేను భయం నుండి బయట పడే మార్గం ఏది?
ఇది సమాజంలో ఉన్న అజ్ఞానం వల్ల మూఢనమ్మకాల వల్ల ఒక పిల్లవాడికి వచ్చిన కష్టం. బడి గాని బడిలో చదువు గాని పిల్లవాడికి ఏమి ఉపయోగపడింది. చదువు చెప్పే టీచర్లకు కూడా సరైన జ్ఞానం లేకపోతే శాస్త్రీ ఆలోచనలు కొరవడితే వారు చెప్పే చదువులకు సార్థకం ఏముంది? చివరకు ఈ పాము భయం నుండి ఎలా బయటపడ్డానో తెలుసా?
ఒక్క మాటలో చెప్పాలంటే పుస్తకాలు చదవడం వల్లనే పాముల గురించి శాస్త్రీయ విషయాలు తెలుసుకున్నాను. మార్కుల కోసం పరీక్షల కోసం కాకుండా కుతూహలంతో విషయాలు తెలుసుకోవడం కోసం పుస్తకాలు చదివితేనే జ్ఞానం సంపాదిస్తాం. పరీక్షల కోసం చదివే చదువులో తెలుసుకోవాలనే కుతూహలం ఉండదు. ఆ కుతూహలం లేకపోతే జ్ఞానం అబ్బదు.
ఇప్పుడు ఆ చదవడం కూడా బడిలో రావడం లేదు. చదవడం తెలిసినవారు కూడా పుస్తకాలు చదవడం లేదు. ఇంక చదువుల వల్ల లాభం ఏముంది?
ఆనందంగా ఆడుకుంటూ ప్రతి దాన్ని పరిశీలిస్తూ ప్రకృతిని చదివే పిల్లల్ని బడిలో వేస్తారు. అక్కడ చదువు విచిత్రంగా ఉంటుంది. కదలకుండా కూర్చోబెడతారు. అర్థం లేని అక్షరాల్ని అంకెల్ని నిర్బంధంగా నేర్పించడానికి ప్రయత్నిస్తారు. పిల్లల ఆసక్తిని ఆనందాన్ని చంపేస్తారు. ఆ తర్వాత చదువు అనే తతంగం మొక్కుబడిగా సాగుతుంది. స్వయంగా ఆలోచించడం ఆగిపోతుంది. ప్రశ్నించే తత్వం నశిస్తుంది.
చదువు పూర్తి చేసుకుని జీవితంలోకి అడుగు పెడతారు.
ఎవడో నీకు కోటి బహుమతి వచ్చింది ఖర్చులకు లక్ష పంపమని ఫోన్ చేస్తాడు. నాకెందుకు బహుమతి వస్తుందని ఆలోచించడు. ఉన్నది పోగొట్టుకుంటాడు. ఎవరో వస్తారు లక్ష కట్టు మూడు నెలలకు రెండు లక్షలు అవుతుంది అంటాడు. జనం పరిగెత్తి డబ్బులు సమర్పించుకుంటారు. ఇంట్లో ఏవో ఇబ్బందులు వస్తాయి. ఎవడినో ఇంటికి తీసుకుని వస్తారు. వాడు వాస్తు పేరుతో నీ చేతులతో నీ ఇల్లు పడగొట్టిస్తాడు.
తాయెత్తులు, మంత్రాలు యాగాలు అంటూ జనం ఉన్నది పోగొట్టుకుంటూ ఉంటే ఇదంతా కేవలం నమ్మకాలని భక్తి అని సరి పెట్టుకొన్నందువల్లే సమాజం ఇలా తయారవుతున్నది. ఇందుకు బయట విషయాలు ఏమీ పట్టని బడి, బడిలోని చదువులు కారణం కాదా? అజ్ఞానం నుండి భయం నుండి బయటపడాల్సిన సమాజం మరింత అజ్ఞానంలోకి భయంలోకి మూఢనమ్మకాలలోకి మునిగిపోవడానికి పనికిరాని ఈ చదువులు కారణం కాదా? బ్రతుకు దెరువు నేర్పేది మాత్రమే చదువు కాదు. ఎలా బ్రతకాలో నేర్పేదే నిజమైన చదువు. ఈ చదువులు లేనప్పుడు కూడా మనుషులు బతికారు. బహుశ కష్టాలున్నా మనుషులు ఇంతకంటే సంతోషంగా బతికారనుకొంటా!
చాలా బాగుంది.మనలో కూడా అధ్యయనం లేకపోవడమే మూఢ నమ్మకాలు పెరుగుడానికి కారణం అవుతోంది.
Very useful article for parents, teachers and working in education field