సంపాదకీయం
మనుషులకు లాగా పుస్తకాలకూ శత్రువులుంటారు. రాజ్యాల మీద లాగే పుస్తకాల మీదా దాడులు జరుగుతాయి. పక్క వాళ్ళని ద్వేషించే వాళ్ళున్నట్టే పుస్తకాల్ని ద్వేషించే వాళ్ళూ వుంటారు. నగరాలని తగలబెట్టినట్టే గ్రంథాలయాల్నీ తగలబెడతారు. చరిత్రలో సగటు మానవులు ఎన్ని కష్టాలు పడ్డారో పుస్తకాలూ అన్ని కష్టాలు పడ్డాయి. మనుషులు ఎదురొడ్డి నిలబడినట్టే పుస్తకాలూ ఎదురీది నిలబడ్డాయి. ఇంతెందుకు పుస్తక ద్వేషానికి సైతం బోలెడంత చరిత్ర వుంది. పుస్తకం పుట్టిననాడే దాని మీద ద్వేషం కూడా పుట్టుకొచ్చిందనిపిస్తుంది !
అలెగ్జాండ్రియా గ్రంథాలయాన్ని తీసుకోండి. ఇది టోలెమిక్ రాజ వంశం సామాన్య శకం మూడవ శతాబ్దంలో స్థాపించిన ప్రతిష్టాత్మక గ్రంథాలయం. ఇదో గొప్ప విశ్వవిద్యాలయం లాంటిదని ప్రతీతి. భూమి వ్యాసాన్ని నీడ ఆధారంగా ఖచ్చితంగా కొలిచిన ఎరాటోస్తనస్, రేఖాగణిత పితామహుడు యూక్లియో, ఖగోళ విజ్ఞానఖని హిప్పార్కస్ ఇక్కడే పరిశోధనలు చేశారు. గణితం అనగానే గుర్తుకొచ్చే ఆర్కిమెడిస్ ఇందులోనే చదువుకున్నాడు. ఆ కాలంలో దీనిలో ఏడు లక్షల రాతప్రతులు వుండేవంటారు. ఈజిప్టు, గ్రీకు, పర్షియా భాషల్లో వేలాది వైద్య గణిత ఖగోళ ఇంజనీరింగ్ గ్రంథాలతో ఇదొకప్పుడు జిజ్ఞాసవుల తీర్థ క్షేత్రంగా వుండేది.
ఇంతటి విజ్ఞాన భాండాగారానికి వచ్చిన కష్టాలు తలుచుకుంటే గుండె బరువెక్కుతుంది. దానిపై దాదాపు ఏడు వందల ఏళ్లు దాడుల మీద దాడులు జరిగాయి. జూలియస్ సీజర్ (సామాన్య శక పూర్వం 48) అలెగ్జాండ్రియా నౌకాశ్రయాన్ని తగలబెట్టడంతో ఆ మంటలు ఈ గ్రంథాలయానికి అంటుకొని 14 రోజులపాటు అది తగలబడుతూనే వుండిందట. అయినా పుస్తకప్రియులు ఎంతోకొంత కాపాడుకోగలిగారు. ఇక బిషప్ థియోఫిలస్ (సా.శ. 391) దీని అనుబంధ గ్రంధాలయాన్ని పట్టుబట్టి నేలమట్టం చేశాడు. తీవ్రమైన మత ద్వేషంతో ఆ స్థలంలో చర్చి నిర్మాణానికి డిక్రీ జారీ చేశాడు. దీంతోనే ఈజిప్టులో క్రైస్తవప్రభావం మొదలైందంటారు. ఈ విషాదం ఇక్కడితో ముగియలేదు. ఖలీఫా ఒమర్ (సా.శ. 642) మిగిలిన దాన్ని మొత్తం తగలబెట్టించాడు. “ఇందులోని గ్రంథాలు ఖురాన్ ని అంగీకరిస్తాయా? అంగీకరిస్తే మళ్లీ వీటి అవసరం ఏమిటి? అంగీకరించవా? అయితే వీటిని ధ్వంసం చేసితీరాలి” అనేది ఖలీఫా వాదం!
అయినా ఈ గ్రంథాలయంలోని పుస్తకాల్ని (పాపైరిస్ చుట్టల్ని) అక్కడి పండితులు లెక్కలేని కష్టాలకోర్చి దాచిపెట్టారట. కాపీ చేసి ఇతరులకు పంచిపెట్టారట. ఇలా చూస్తే పుస్తక ద్వేషానికే కాదు పుస్తక ప్రేమకూ అలెగ్జాండ్రియా గొప్ప సాక్షి! అలెగ్జాండ్రియా పాఠం ఏమంటే బిషప్ దీ ఖలీఫా దీ ఒకే మతం గాకపోవచ్చు. ఈ రెండు మతాల పుస్తక ద్వేషం మాత్రం అచ్చుగుద్దినట్టు ఒక్కటే !
ఇప్పుడు మధ్యయుగాల (క్రూసేడ్స్) దగ్గరికొద్దాం. “క్రైస్తవ పీఠాధిపతులు స్వేచ్ఛను హర్షించరు…..వారి పాదాల వద్ద కళలు, విజ్ఞానం దోసిలొగ్గి మోకరిల్లాలి” అంటారు చరిత్రకారులు మైకేల్ ఇలిన్, ఐ. సెగాల్ తమ “మధ్యయుగాల మహా చరిత్రలో”. అవును సా.శ 554 నాటికే క్రైస్తవ చక్రవర్తి జస్టీనియన్ అథేన్స్ లోని నియోప్లాటోనిక్ అకాడమీని మూసేయించాడు. ఆనాటికది ప్రపంచంలోనే అత్యున్నత వైజ్ఞానిక సంస్థ. ఆధునిక విశ్వవిద్యాలయాలకు దీన్ని మాతృక అంటారు.
అయితే ఈ పుస్తక విధ్వంసాన్ని నిలవరించిన వారు నెస్టోరియన్లు.వారూ క్రైస్తవులే అయినా (మరో శాఖ) గ్రీకు విజ్ఞాన గ్రంథాలని సిరియాక్ లోకి ఆ తర్వాత, బాగ్దాద్ అరబ్బుల వశమైనప్పుడు సిరియాక్ నుంచి అరబ్బీలోకి అనువాదం చేసి కాపాడారు.
పుస్తకాలని ప్రాణంగా నమ్ముకునే వాళ్లకొచ్చే కష్టాలు వినాలంటే తిమా ఖలీఫ్ (సా.శ 1070) దగ్గరకి వెళ్ళాలి. ఈజిప్టులో కరువు రక్కసి కోరలు విప్పినప్పుడు ఆయన సైనికుల ఖర్చు కోసం 18 వేల సైన్సు పుస్తకాలు అమ్ముకున్నాడట! లక్ష దినార్ల విలువైన గ్రంథాలని ఐదువేల దినార్లకే అమ్మాల్సి వచ్చిందని కన్నీళ్లు నింపుకున్నాడట. వీటిల్లో సిల్కు వస్త్రంపై చిత్రించిన అపురూప ప్రపంచ పటం “టాప్ స్టై” కూడా ఒకటి!
చరిత్రలో పుస్తకాలు దోచుకోవడమూ తక్కువేమీ కాదు.మధ్యయుగాల మత యుద్ధాల్లో ట్రిపోలీని స్వాధీనం చేసుకున్నప్పుడు (సా.శ 1102) సైనికులు ఇల్లిల్లూ తిరిగి సంపదలతో పాటు పుస్తకాలూ దోచుకున్నారట! కారణం ఏమంటే ఆ కాలానికి పశ్చిమ దేశాలకు అరబ్బుల పుస్తకాల అవసరం వచ్చింది! దీంతో వాళ్లు ఎక్కడెక్కడి పుస్తకాలను దోచుకోవడం మొదలుపెట్టారు. మెడ మీద కత్తి పెట్టి అమ్మేలా కూడా చేశారు. ఫలితంగా ముస్లిం ప్రపంచం నుంచి క్రైస్తవ ప్రపంచానికి విజ్ఞానం బదిలీ అయింది. సా.శ 12 నాటికి యూరపులో ప్రోటో రినైజాన్స్ కు బీజాలు పడ్డాయంటే ఇదంతా ఈ అరబ్బుల పుస్తకాల చలవే! చూడండి పుస్తక దోపిడీ చరిత్రనెంత తిరగరాసిందో! పాశ్చాత్య ప్రాభవానికి ద్వారాలు ఎంత తెరిచిందో!
మొదటి ఖలీఫాలు రాజ్యాలతో ఒప్పందం చేసుకునేప్పుడు వైజ్ఞానిక గ్రంథాలను అందజేయాలని కూడా కోరేవారు! గొప్ప విద్వాంసుల్ని, పరిశోధకుల్ని ఆ దేశాల నుంచి తెచ్చుకునేవారు. ఒక రకంగా ప్రాచీన విజ్ఞానానికి ఖలీఫాలు ట్రస్టీలు! వీరి వల్లనే తూర్పు గ్రంథాలన్నీ అనువాదాలతో యూరప్ కు అందాయి. అందుకే అది “అరేబియన్ సైన్సు” అయింది.పుస్తకాల దోపిడీలతోనే గాదు, అరబ్బుల పుస్తకాభిమానంతో కూడా యూరపు లబ్ది పొందిందన్నమాట!
మనదేశంలో పుస్తక దహన చరిత్ర గుణాడ్యుడి (సాశ 1) బృహత్కథతో మొదలవుతుంది. గుణాఢ్యుడు భారతీయ పండితలోకంలో వ్యాస వాల్మీకులంతటివాడు. మన తెలుగు వాడు కూడా! ఆయన ఏడేళ్లు అడవుల్లో వుండి గిరిజనుల (పైశాచి) భాషలో బృహత్కథ రాస్తాడు. రాజు హాలుడు అది సంస్కృతంలో లేదని అపహాస్యం చేసి తిరస్కరిస్తాడు. గుణాఢ్యుడికి అహం దెబ్బతిని, ఒక కొండెక్కి అడవిలోని జంతువులకు, పక్షులకు అందులోని ఒక్కో కథా చదివి వినిపిస్తూ ఒక్కో తాళపత్రాన్ని తగలబెడతాడు. ఆ కథల్ని వింటూ మైమరిచి పక్షులూ, జంతువులూ ఆహారాన్ని మానేస్తాయి. రాజుకీ సంగతి తెలిసి అడవికెళ్ళి ఈ పుస్తక దహనం ఆపమని వేడుకుంటాడు. అప్పటికే ఆరు లక్షల పత్రాలు దగ్ధమై ఒక లక్ష పత్రాలు మాత్రమే మిగులుతాయి. అలా మిగిలివవే కథాసరిత్సాగరంగా, బృహత్కథామంజరిగా, పంచతంత్రంగా, చివరకు దేశ దేశాలు తిరిగి అరేబియన్ నైట్స్ గా మారి విశ్వ కథా ప్రపంచాన్ని ఏలుతాయి!
ఈ కథలో నిజమెంతో గానీ సంస్కృతం రాజ్యమేలిన చోట ప్రజల భాషలో రాసిన పుస్తకాలకు ఆ రోజుల్లో ఏ గతి పట్టేదో మాత్రం స్పష్టం!
ఇక మన నలంద విశ్వవిద్యాలయం దగ్గరికొస్తే ఆ రోజుల్లో అంతటి అంతర్జాతీయ అధ్యయన కేంద్రం లేదంటారు. ఆ కాలంలోనే 3,000 మంది బౌద్ధ సన్యాసులు, విద్యార్థులు, గురువులు,పరిశోధకులతో కళకళలాడే నైవాసిక విద్యాలయమది. అందులోని “ధర్మగంజ్” గ్రంథాలయం మూడంతస్తుల భవనంలో ఖగోళ వైద్య తర్క గణిత తాత్విక గ్రంథాలతో ప్రపంచానికే తలమానికమైనది. లక్షల వ్రాత ప్రతులతో నిండిన ప్రపంచపు అతి పురాతన గ్రంథాలయమది. మిన్ హజ్ – ఈ- సిరాజ్ రాసిన “తబాకత్ -ఇ-నసరి” గ్రంథం చూస్తే నలంద ప్రాశస్త్యం బోధపడుతుంది!
మరి అలాంటి గ్రంథాలయం ఏమైంది? బౌద్ధం మనదేశం నుంచి వలస వెళ్లాల్సి వచ్చాక అక్కడి గ్రంథాలూ టిబెట్ కు, నేపాల్ కు, సింహళానికి వలస వెళ్లాయి! ఇలా ఏ గ్రంధాలు వెళ్లాయో, ఎన్ని గ్రంథాలు వెళ్లాయో లెక్క చెప్పలేము. కానీ నలంద పతనం బౌద్ధం పతనంతో ముడిబడ్డం మాత్రం భారతీయ పుస్తక ప్రపంచానికీ, విద్యావ్యవస్థకూ గొప్ప విషాదమై కూచుంది! ఇక టర్కీ కమాండర్ భక్తియార్ ఖిల్జీ (సా.శ 1193) మిగిలిన పుస్తకాలన్నిటిని తగలబెట్టించాడు. లక్షల పుస్తకాలు నెలల తరబడి తగులబడతూనే వుండిపోయాయి. ఒక మూర్ఖ కమాండర్ సంకుచితత్వానికి, దౌష్ట్యానికి, మతోన్మాదానికి ఇంతటి విజ్ఞాన సంపద అగ్గిపాలు కావడం ఎంత నష్టం తెచ్చిందో! ఒక్క నలందానే ఏమిటి విక్రమసింహ, ఓదంతాపురి, సోమపురి విశ్వవిద్యాలయాలూ వాటి గ్రంథాలు సైతం మతవిద్వేషాలకిలా 12వ శతాబ్దానికల్లా మట్టి పాలయ్యాయి, లేదా మంటల పాలయ్యాయి.
భారతదేశం గొప్ప తాత్విక బహుళత్వం గల దేశం. దీనికి మనం గర్వపడాలి. లోకాయతుల నుంచి సాంఖ్యుల దాకా, చార్వాకుల నుంచి బౌద్ధాలు దాకా భిన్నతాత్విక ధోరణులు తామరతంపరగా అల్లుకుపోయిన దేశం మనది. మన ఉపనిషత్తులు గొప్పవాద ప్రతి వాదాలకు ప్రతీకలు.
కానీ లోకాయితుల గ్రంథాలేవీ మనకిప్పుడు కనిపించవు. చార్వాకులు నిజంగా ఏం చెప్పారో మనకు తెలియదు. అత్యంత ప్రతిభావంతుడైన తాత్వికుడిగా పేరుగన్న కపిలుడి “సాంఖ్యకారికలో” 74 శ్లోకాలే నేడు మిగిలాయి! సాంఖ్యం క్షీణం పెద్ద విషాదమంటాడు దేవిప్రసాద్ చటోపాధ్యాయ. ఆర్యభట్టీయం (సాశ 499) మొన్న మొన్నటిదాకా అజ్ఞాతంలోనే వుండిపోయింది. చాణక్యుడి అర్థశాస్త్రం (సా.శ 1) మనకు చిక్కింది 2000 ఏళ్ల తర్వాతే అంటే (1915లో) ఆశ్చర్యం వేస్తుంది. త్రిపిటకాలు సైతం రాహుల్ సాంకృత్యాయన్ టిబెట్ నుంచి తెచ్చాకే మనం చూడగలిగామంటే సిగ్గేస్తుంది. ఇలా ఎన్ని గ్రంథాలు, వాటితో పాటు ఎన్ని తాత్విక వైజ్ఞానిక దృక్పథాలు మనకు దూరమయ్యాయో ఏ చరిత్రా మనకు చెప్పదు.
దీనికి అజాగ్రత్తలు, నిర్లక్ష్యాలు, ప్రకృతి విపత్తులు లాంటివి ఎంత కారణాలో సంకుచితత్వాలు, మత వైషమ్యాలు యుద్ధవిధ్వంసాలు, టర్కిష్ ఇస్లామిక్ దాడులు, దుండగులు పని గట్టుకొని పుస్తక ధ్వంసం చెయ్యడాలు కూడా అంతే కారణాలు. పుస్తకాన్ని సరస్వతిగా కొలిచే చోట దానికింత ప్రాణభయం పట్టుకోవడం మనదేశంలోనే చూస్తాం!
ఇప్పుడు మనం ఆధునిక యుగంలోకి, నాజీ జర్మనీలోకి వద్దాం. ఇప్పటిదాకా మనం చూసిన పుస్తక ద్వేషాలన్నీ ఒక ఎత్తు. ఇక్కడ జరిగిందొక ఎత్తు. ఇక్కడ రాజ్యమే “జర్మనేతరం” (Ungerman) పేర ఒక శత్రువును పుస్తకాల్లో గుర్తించి వాటి నిర్మూలనకు పిలుపునిచ్చింది! దానికో ముహూర్తం కూడా పెట్టింది! ఆశ్చర్యం ఏమంటే 1933 మే 9న ఈ పవిత్ర పుస్తక దహనోత్సవం కోసం అధికారిక మార్గదర్శకాలు విడుదలయ్యాయి! ఏ గ్రంథ దహన సందర్భంలో ఏ నినాదాలు ఇవ్వాలో, ఏ ప్రతిజ్ఞలు చెయ్యాలో కూడా రాజ్యమే నిర్ణయించింది! ఆర్యశుద్ధ సంస్కృతీ సంరక్షణార్థం, యూదు విదేశీ మేధావుల ఆలోచనల్ని తుడిచి పెట్టడం కోసం ప్రభుత్వమే విద్యార్థి సంఘాల్ని ఈ క్రతువుకు పురమాయించింది.
ఇంకేముంది వారిలో ఆర్య రక్తం కట్టలు తెచ్చుకుంది. విశ్వవిద్యాలయాలన్నీ తిరిగి తిరిగి, గ్రంథాలయాలన్నిటిని శోధించి శోధించి నలభై వేల పుస్తకాల్ని ట్రక్కుల కొద్దీ తెచ్చి బెర్లిన్ నడివీధిలో తగలబెట్టారు. మంత్రాలు చదివినట్టు రచయితల పేర్లూ, వారి రచనల వివరాలూ పెద్దగా చెబుతూ మరీ తగలబెట్టారు. ఈ గ్రంథ ద్వేషాన్నీ, దహనాన్నీ కళ్ళారా తిలకించడానికి 1933 మే 10న వేలాది మంది వీధుల్లోకి తరలివచ్చారు! విద్యార్థులకు జేజేలు పలికారు! ఆ రచయితల్ని మేధావుల్ని నానాశాపనాార్ధాలు పెట్టారు. దీంతో ఈ మేధోజీవులంతా బతుకు జీవుడా అంటూ వలస బాట పట్టారు!
ఇంతకూ ఈ మేధావులెవరు? కమ్యూనిస్టులు, సోషలిస్టులు, యుద్ధవ్యతిరేకులు, లిబరల్స్, యూదులు, అనార్కిస్టులూ. ఈ రచయితలెవరు? కార్ల్ మార్క్సు, కార్ల్ కౌట్స్ కీ, హెలెన్ కెల్లర్, హెమింగ్వే, ఫ్రాయిడ్, హెచ్.జి.వెల్స్ తదితరులు! ఈ పవిత్ర యజ్ఞం పుణ్యమా అని Magus Hirschfeld Institute of Sexualogy కి సైతం అలెగ్జాండ్రియా నలందాల హోదా లభించింది ! జర్మనీ నగరాలంతటా జరిగిన ఈ దహనకాండ “సాంస్కృతిక హత్యాకాండగా” చరిత్రలో నిలిచిపోయింది. ఎప్పుడో 1823లో నాటక కర్త హెన్రిచ్ హైన్ రాసిన “ఎక్కడైతే వాళ్ళు పుస్తకాలు తగలబెడతారో, వాళ్ళు మనుషుల్ని కూడా తగలబెడతారు” అన్న వాక్యాల్ని ముమ్మాటికీ సత్యాలని నాజీలిలా రుజువు చేశారు! (అన్నట్టు నాజీలు ఆయన నాటకాలను కూడా తగలబెట్టారు) తర్వాత దీనివల్ల జర్మనీ ప్రపంచానికెంత కష్టం తెచ్చిపెట్టిందో, తానెంత నష్టం కొని తెచ్చుకొందో మనందరికీ తెలిసిందే!
ఇక వర్తమానానికొస్తే ఈ పుస్తకవిద్వేష పాఠాలు నేర్చుకోవాలంటే ఇస్లామాబాదులోని “క్వాద్-ఈ-ఆజం” విశ్వవిద్యాలయాని కెళ్ళాలి. “మొత్తం 57 ఇస్లామిక్ దేశాల విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్లో దానిది రెండో స్థానం. అయితే విచిత్రమేంటే అందులో ఒక్క గ్రంథాలయమూ లేదు. మూడు మసీదులు మాత్రం వున్నాయి. నాలుగోది నిర్మాణంలో వుంది” అంటాడు అక్కడి ఫిజిక్స్ ప్రొఫెసర్ పర్వేజ్ హుద్ భాయ్. అంతేకాదు ఇస్లామాబాద్ నగరంలోనే పబ్లిక్ లైబ్రరీ అంటూ ఏదీ లేదట !
ఇంతకీ ఈ పుస్తక వైముఖ్యం ఎందుకంటారా? క్వాంటం మెకానిక్స్ నుంచి బ్లాక్ హోల్స్ దాకా అరబిక్ మతగ్రంథాల్లో లేనిది లేదని పాకిస్తాన్ పండితుల విశ్వాసం! ఇప్పటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానమంతా 1400 ఏళ్ల ముందే అరబ్బు గ్రంథాల్లో నిక్షిప్తమని అక్కడి పాలకుల ధీమా. నిజానికి సా.శ 9 కి ముందు అరబ్బు దేశాలు ఎక్కడెక్కడి గ్రంథాలూ తెప్పించుకుని, జ్ఞానభాండాగారాలనదగ్గ గ్రంథాలయాల్లో భద్రపరుచుకొని అరబ్బీలోకి అనువాదం చేయించుకున్న మహత్తర చరిత్ర గలవి! తూర్పు దేశాల విజ్ఞానాన్నంతా మెరుగుపరచి ప్రపంచానికి అందించినవి!
ఇప్పుడు కథ వెనక్కి వెళ్లి సైన్సూ, ఇస్లామూ విడిపోవడంతో పుస్తక విద్వేష జాడ్యం ఈ దేశాలన్నిటికీ పట్టుకొందంటాడు పర్వేజ్. ఫలితంగానే ఆ దేశాలు చేసిన వైజ్ఞానికావిష్కరణలు ఇటీవలి కాలంలో ఒక్కటంటే ఒక్కటీ లేదంటాడాయన. జీవ పరిణామవాదాన్ని బయాలజీ విద్యార్థులే వ్యతిరేకించే దేశాల్లో ఆధునిక సైన్సుకు స్థానం ఎక్కడ వుంటుందని ఆయన ఆవేదన. ఇలా చూస్తే సైన్సు వ్యతిరేకత, ఆధునికతా వ్యతిరేకత, నూతన ఆలోచనల వ్యతిరేకత, విశాలదృక్పథ వ్యతిరేకత ఇస్లామిక్ దేశాలకీ గతి పట్టించిందన్నది తేటతెల్లం!
ఇప్పుడు చివరగా మళ్ళీ మన దేశానికొద్దాం. నడుస్తున్న చరిత్రలోకి తొంగిచూద్దాం.
అరవై మూడేళ్ల సయ్యద్ ఐషాన్ మైసూరులో రోజుకూలీ. పుస్తకాలపై వల్లమాలిన ప్రేమతో అతడు 11 వేలగ్రంథాల్ని సేకరించి ఓ ప్రజా గ్రంథాలయాన్ని నడుపుతున్నాడు. మత దురహంకారం కట్టలు తెంచుకున్న అల్లరి మూకలు 2021 ఏప్రిల్లో దాని మీద దాడి చేశాయి. మొత్తం గ్రంథాలయాన్ని బూడిద పాలు చేశాయి. ఇందులో కన్నడ, ఇంగ్లీషు, ఉర్దూ, తమిళ గ్రంథాలున్నాయి. భగవద్గీత నుంచి బైబిల్ ఖురాన్ల దాకా అన్ని మతాల ఆధ్యాత్మిక గ్రంథాలూ వున్నాయి! అయినా ఏ విచక్షణా ఈ మూకలకు లేకపోయింది. సర్వం దగ్ధమైపోయింది. పోలీసులు దీన్ని ప్రమాదవశాత్తు జరిగిందని పక్కదారి పట్టింపజూచారు. అయినా ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రచయితలూ పుస్తకాభిమానులూ ఆందోళనకు దిగారు. అద్భుతం ఏమంటే ప్రజలే దాన్ని రు13 లక్షలతో పునర్నిర్మించుకున్నారు!
జమ్మూ కాశ్మీర్లో 2025 ఫిబ్రవరిలో భద్రతా దళాలు 668 పుస్తకాల షాపులపై దాడి చేశాయి. ఇవన్నీ అబుల్ ఆలా మౌదూదీ ప్రచురణకర్తలవి. జమాతే ఇస్లాం భావజాలాన్ని ప్రచారాన్ని చేస్తున్నారన్నది వారిపై ఆరోపణ. చివరికిది 25 పుస్తకాల నిషేధానికి దారి తీసింది. ఇందులో అరుంధతీ రాయ్, హఫ్ సా కన్వాల్, సమంతా బోస్ లాంటి సుప్రసిద్ధ రచయితల గ్రంథాలు కూడా ఉన్నాయి. మరి వీరందరూ జమాతే ఇస్లాం ప్రచారకులెప్పుడయ్యారో మరి! దీని మీద కాశ్మీరులోనే గాదు దేశమంతటా తీవ్రనిరసన వ్యక్తమైంది.
అడపాదడపానే అయినా ఇలా పుస్తకాలపై దాడులు జరగడం ఇటీవల మన దేశంలో మామూలై పోయింది. ఈ పుస్తకద్వేషం స్వాతంత్య్రానంతరం భారత్ లో ఎన్నడూ లేని ధోరణి. రాజకీయంగానూ, సాంస్కృతికంగానూ ఇటీవల వచ్చిన మార్పుల ఫలితమిది! వీటి పరాకాష్ట బెంగాల్ ఘటన.
బెంగాల్ దుర్గా పూజల పందిళ్ల లో పుస్తకాలు అమ్మడం, వందలాది దుకాణాలు దీనికోసం నడపడం దశాబ్దాల నుంచి నడుస్తున్న గొప్ప సంప్రదాయం. దసరా ఉత్సవాల్లో భాగంగా శారదోత్సవం జరపడం ఇక్కడి సంస్కృతి. ఈ సందర్భంగా అభ్యుదయ సాహిత్యాన్నే కాదు బెంగాలీ సంప్రదాయ రచనల్ని కూడా జనం ఎంతో ప్రేమతో కొంటారు. సరస్వతిని తమ ఇంట కొలువు తీర్చుకుంటారు. ఇదో ఫ్యూడల్ వ్యతిరేక సాంస్కృతికోద్యమం. దీన్నుంచి బెంగాలీలను విడదీయడం అసాధ్యం.
ఇంతకాలం ఇంత వైభవంగా జరుగుతున్న ఈ పుస్తకోత్సవాలకు కొత్త ప్రభుత్వం కొలువు తీరాక ఎప్పుడూ లేని కష్టాలొచ్చి పడ్డాయి! అక్టోబర్ 7న జాదవ్ పూర్ లోని ఒక పెద్ద పుస్తక దుకాణం పైకి అధికారులు బుల్ డ్రోజర్తో దాడి చేసి నానా బీభత్సం సృష్టించారు. కానీ జనం తిరగబడ్డంతో తోక ముడిచారు. అలాగే నార్త్ కలకత్తాలో నజీర్ బజార్లో శరత్ “పథేర్ దాబి” ని చించి కాళ్లతో తొక్కాడో ఉన్మాది. ఒక వృద్ధ పుస్తకమిత్రుడు అతన్ని వారించి, తెగించి నిలవరించాడు. ఈ రెండు ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా 292 దుకాణాలపై దాడి జరిగింది! మున్సిపల్ అధికారులు, బుల్ డోజర్లు, పోలీసులు, దుండగులు ఒకవైపు; రచయితలు, మేధావులు, పుస్తకప్రియులు మరోవైపు మోహరించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదో అద్భుతమైన దృశ్యం. బెంగాలీలకే సాధ్యమైన దృశ్యం!
సిగ్గుమాలిన సంగతి ఏమంటే ప్రభుత్వం దీన్ని “వామపక్ష భావజాలాన్ని ప్రజా జీవితం నుంచి తొలగించడంగా” అభివర్ణించడం. “మార్క్స్ వాదీ పుస్తక విక్రయకేంద్రాలుగా” వీటికి ఎరుపు రంగునద్దడం! సరిగ్గా అలనాడు నాజీలు అన్నది కూడా ఇవే మాటలు! మరి బెంగాలీ సంస్కృతి నుంచి పుస్తకాలను తొలగించడం సాధ్యమేనా? దీని వల్ల వచ్చే ఫలితం ఏమిటి? అన్న స్పృహలేకుండా ఈ కిష్కింధకాండను సమర్ధించడం నాజీలు తప్ప ఎవరు చెయ్యగలరు?
కానీ ఈ దాడి జరిగింది బెంగాల్లో! అదీ వారి సాంస్కృతిక వారసత్వం పైన! దీంతో జనం వేలమంది ఎక్కడికక్కడ మానవహారాలతో జనగణమన పాడుతూ రోడ్ల మీదకు వచ్చారు. పుస్తక దుకాణాలకు రక్షణగా నిలబడ్డారు. నిర్వాహకులు ఏమాత్రం జంకకుండా ఆరుబయటే టేబుళ్లు పెట్టి పుస్తకాలు అమ్మారు. శారదాసంస్కృతిని ఏ మాత్రం సడలకుండా కాపాడుకొన్నారు. దీంతో ఎప్పుడూ లేనట్టు కోటిన్నర విలువైన గ్రంథాల కొనుగోళ్లు జరిగాయి. ఆశ్చర్యం ఏమంటే బెంగాలీ క్లాసిక్స్ పాటు అభ్యుదయ సాహిత్యాన్ని కూడా జనం అద్భుతంగా ఆదరించారు!
దీన్నుంచి మనం రెండు పాఠాలు నేర్చుకోవచ్చు. ఒకటి ఎంత నాగరికత పెరిగినా, చరిత్ర మనకు ఎన్ని పాఠాలు నేర్పినా పుస్తక ద్వేషం మాత్రం చిరంజీవిగా ఉండిపోవడం. పుస్తకాలు ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. ప్రశ్నల్ని సంధింపజేస్తాయి. యుద్దాల్ని వ్యతిరేకిస్తాయి. శాంతిని ప్రబోధిస్తాయి. మానవత్వాన్ని గుబాళింపజేసి మనిషిని మనిషిగా నిలబడతాయి. ఇవన్నీ ఛాందసులకు ఏమాత్రం పడనివి. జాతి మతోన్మాదులకు పచ్చి వ్యతిరేకమైనవి. ఈ వైరుధ్యం ఇంతే! ఇది మొదటి పాఠం. ఇక రెండోది ఏమంటే కాలం చాలా దూరం ప్రయాణించింది. ఇంకా మనం అలగ్జాండ్రియా యుగంంలోనో, నలంద కాలంలోనో, నాజీల రోజుల్లోనో లేము. ఇప్పుడు ప్రభుత్వాలు, ఉన్మాదులు పుస్తక ద్వేషం పెంచుకొని వాటిపై యుద్ధాలు ప్రకటిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. పుస్తకద్వేషం రెండు వైరుధ్యాల మధ్య యుద్ధం. ఆ యుద్ధాన్ని చెయ్యడానికి వారూ సిద్ధంగా ఉన్నారు. దీన్ని మైసూరులోనూ చూడొచ్చు. కలకత్తాలోనూ చూడొచ్చు!



