సంపాదకీయం
“జన విజ్ఞానం” మూడో ఏడాది ముంగిట్లోకి అడుగుపెడుతోంది. దాదాపు అన్ని వైపుల నుంచి సవాళ్లు తప్ప సానుకూలత సన్నగిల్లుతున్న సందర్భమిది. ఇలాంటి ఎదురీత యుగంలో ఒక ఆన్ లైన్ ప్రజా సైన్సు పత్రికకు రెండేళ్లేమీ తక్కువ కాలం గాదు. ఈ మాటలు రాస్తుండగా కలల చక్రవర్తి పరమేశ్వరన్ గారు( యంపి) కలగా మిగిలిపొయ్యారన్న వార్త శరాఘాతంలా వచ్చి తగిలింది.
“జన విజ్ఞానం” ప్రారంభ సంచికలో “శాస్త్ర ప్రచారంతో సరిపెట్టక శాస్త్రీయ దృక్పథాన్ని కూడా విస్తరింప చేయాలని మా ప్రయత్నం. సైన్సును గాఢాతిగాఢంగా ప్రేమిస్తూనే దాని సామాజిక కోణాన్ని లోతుగా చర్చకు పెట్టాలని మా ఆకాంక్ష. మానవ జీవితంలోని ప్రతి రంగంలోనూ ఆధునిక దృక్పథం అల్లుకున్నప్పుడే ప్రగతీ, ప్రజాస్వామ్యం దృఢంగా నిలదొక్కుకుంటాయని మా నమ్మకం సముద్రానికి ఏతమెత్తుతున్నట్టు కనిపించినా ఎదురీదడం మానవ సహజాత మనే విశ్వాసమే మమ్మల్నిలా నాలుగు శతాబ్దాల నుంచి నడిపిస్తోంది” అని చెప్పుకున్నాం.
ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సముద్రానికేతమెత్తడంలో ఏమీ అలసట రావడం లేదు. అట్లని ఉత్సాహం ఉరకలెత్తడమూ లేదు, ఎంచుకున్న దారిలో ఏమరుపాటు లేకుండా నడుస్తున్నామన్న ధీమాకు మాత్రం ఢోకాలేదని పిడికిలి బిగించి మరీ చెప్పగలం. ఈ ధీమా కూడా మాకు యంపి వారసత్వంగా లభించిందే!
“ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక విజ్ఞానం కొరవడి మేధావులు మత వేదాంత చర్చల్లో కూరుకుపోడం వల్లనే భారత్ లాంటి దేశాలు ప్రగతి రథం ఎక్కలేకపోయా”యన్న కోశాంబి మాటలు మమ్ముల్ని అడుగడుగునా హెచ్చరిస్తూనే వున్నాయి. “రుజువు ఆధారిత సత్యానికి దూరంగా జరిగే కొద్దీ, ఏదో ఒక దాన్ని విశ్వసించి రావడంతో అది చివరకు మత దురహంకారానికీ, ఫాసిజానికి దారితీస్తుంద”న్న జేడీ బెర్నాల్ పలుకులు నేటికీ భయపెడుతూనే వున్నాయి. “అసలు భారతదేశం 19వ శతాబ్దాన్ని దాటనే లేదు “అన్న వ్యాఖ్యలు మరింత నిర్వేదంలోకి నెట్టుతూ కూడా వుండొచ్చు. ఇలా వాస్తవాలు ఎంత వెక్కిరిస్తున్నా మా అడుగులు మాత్రం తడబడటం లేదని కచ్చితంగా చెప్పగలం. ఈ వొరవడి కూడా మాకు పరమేశ్వరన్ లాంటి వారి నుంచే సంక్రమించింది.
అట్లని దీనర్జం సవాళ్లు చిన్నవని కాదు. చేసింది ఎక్కువా, చెయ్యాల్సింది తక్కువా అనీ గాదు..
నానాటికి జనంలో చదవడం తగ్గిపోతోంది. ఇదొక నిష్టుర సత్యం. మరీ సీరియస్ రచనల్ని, శాస్త్ర, తాత్విక రచనల్ని తెలుగులో చదివేవారు తగ్గిపోతున్నారు. సొంతంగా చదవడం, తార్కికంగా ఆలోచించడం, సమర్థవంతంగా భావాల్ని పంచుకోడం అనే అభ్యసన మూల సూత్రాలకు మన చదువులు దూరమై చాలా కాలమైంది. ఒక ప్రాపంచిక దృక్పథం ఏర్పర్పుకునే ప్రక్రియతో విద్యారంగానికేమీ సంబంధం లేదని తీర్మానించుకున్న కాలంలో మనం ఉన్నాం. దీనికి మన సమాజం నుంచి ఏదో మౌనాంగీకారం కూడా వుందనిపిస్తోంది. యంపి గారి కాలంలో లేని సవాలిది. ప్రజాసైన్సుఉద్యమ ప్రస్థానమే మాతృభాషల్లోకి సైన్సు గ్రంథాల అనువాదంతో మొదలైందంటే, పుస్తకాల అమ్మకమే దాని ఏకైక ఆర్థిక వనరుగా వుండేదంటే ఆశ్చర్యం వేస్తుంది.
విచిత్రంగా కేవలం పదేళ్లలో మన రాజకీయ వాతావరణమే గాదు, మన మేధో వాతావరణం, సామాజిక వాతావరణం కూడా అంతుబట్టనంతగా మారిపోయాయి. భారతీయ జ్ఞాన వ్యవస్థలంటూ కొత్త రాగం మొదలైంది. ఆధునిక సైన్సు పైనే కాదు ఆధునిక దృక్పథం మీద కూడా అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోంది. “మనకు తెలియనిది ఏమీ లేదనీ, మనం నేర్చుకోవాల్సిందసలే లేదనీ వాదించడంతో మొదలై మన దగ్గర నుంచే అందరూ నేర్చుకోవాలన్న అహంకారం మనల్నిప్పుడు ఆవహించింది. మనకు మనమే విశ్వగురు బిరుదాంకితులమై పొయ్యాం. దీంతో నిమ్మళంగా, ప్రజాస్వామికంగా చర్చించుకునే అవకాశమే లేకుండా పోతోంది. ఈ చాదస్తం కాస్తా ఫాసింజంగా మారేట్టుంది. ఇది యంపి కాలం నాడు ఎరగని సవాలు.
క్రమంగా మధ్యతరగతి ఆధునిక దృక్పథానికి దూరంగా జరగడమే కాదు వ్యతిరేకంగా సైతం మారుతోంది. సాంస్కృతికంగా సమాజాన్ని వెనక్కి నెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో గతంలో ఎవ్నడూ లేని భావ దారిద్ర్యం మనల్ని కమ్ముకొస్తోంది. కొంచెం అటు ఇటు దక్షిణాసియా అంతా ఇదే కనిపిస్తోంది. మన ఇరుగునా పొరుగునా చూస్తే మనమే మేలనిపించే దుస్థితి తాండవిస్తోంది. ఇది మరీ పెద్ద సవాలు
ఓపిగ్గా, స్టిరచితంతో వీటిని ఎదుర్కోవలసి వుంది. ప్రజలకు తెలియజెప్పడం, వాళ్ళ నుంచి తెలుసుకోవడం, వాళ్లకి నమ్మకం కలిగించడం, కదిలించి భాగస్వాముల్ని చెయ్యడం కీలకం. జనం కదిలినప్పుడు ఎంత అద్భుతాలు జరిగాయో సాక్షరతా ఉద్యమంలోనూ, సారావ్యతిరేకోద్యమంలోనూ మనం చూసాం.
ఈ కాలానికి తగ్గ కొత్త కొత్త కలలు కనడానికి మన ముందిప్పుడు పరమేశ్వరన్ లేడు. జ్ఞానం, సాంకేతికతా ప్రజల పరం గాకుండా గొప్ప సామాజిక పరిణామాల్ని ఊహించలేమని ఆయన మాటిమాటికి చెబుతుండేవాడు. మాటలు కట్టి పెట్టి జనం మధ్య ఓ ప్రత్యామ్నాయం కోసం పనిచెయ్యమని హెచ్చరిస్తుండేవాడు. ఇప్పుడాయన మన నుంచి వెళ్ళిపోయాడు “జనవిజ్ఞానం” మూడో ఏడాది మొదటి సంచిక పరమేశ్వరన్ గారి సృతి సంచికగా వెలువడ్డమంటే బాధ కన్నా భయం ఎక్కువగలుగుతోంది. బాధ్యతా భారం పదింతలవుతున్నట్టనిపిస్తోంది. అయినా కన్నీళ్ళు తుడుచుకుంటూనే దీనికి కంకణబద్దులమవుతామని ఆయన సాక్షిగా “జనవిజ్ఞానం” ప్రతిజ్ఞ చేస్తోంది!






