మిఠాయి యుగంధర్ బాబు

అతడు సినిమాలో బ్రహ్మానందం, త్రిష ల మధ్య సంభాషణ :-

“తాడు అని అంత తేలికగా తీసి పారేయకమ్మా!
అది ఇక్కడ కడితే మొలతాడు (నడుము)
ఇక్కడ కడితే ఉరితాడు (మెడ)
ఇక్కడ కడితే కాశీతాడు (మణికట్టు)”
“మరి అక్కడ కడితే…..?”(గడప దగ్గర)
“పడతాడు!!”

ఆ విధంగా రచయిత దారాల స్థానాలు బట్టి కొన్ని పేర్లు చెప్పాడు. కానీ అదే నల్ల దారం కాలికి కడితే దాన్నేమంటారో చెప్పలేదు. అసలు దానికి ప్రత్యేకమైన పేర్లు లేదనుకుంటా. ఎందుకంటే ఈ కాలికి నల్ల దారం కట్టడం అన్నది కొత్త ట్రెండ్ కదా. అందులోనూ “తాళ్ళలోన నల్లతాడు వేరయా” అన్నట్లు అందరూ నల్లతాడుని కాలికి కట్టుకుంటున్నారు.

నరునికి – నల్ల తాడుకు జన్మజన్మల సంబంధం అనుకుంటా. అన్ని మతాల వాళ్ళు ఈ నలుపు తాడుని కట్టుకుంటున్నారు. ఓ మతం వాళ్లు ఈ నల్ల తాడుకి దేవుడు బొమ్మలు తగిలించుకుంటే, ఇంకో మతం వాళ్లు చిన్న గుడ్డలో బొమ్మ వున్న వెండి బిళ్ళ పెట్టి దానిని కుట్టి దాన్ని మెడలో వేసుకుంటున్నారు. ఈమధ్య ఓ వయస్సు పండిన టాప్ హీరో రకరకాల దారాలు, రకరకాల రంగుల్లో మణికట్టు నిండుగా కట్టుకోవడం మీరు గమనించే ఉంటారు.

ఊయలలో ఉన్న చిన్నపిల్లలకి నల్లదారం, నల్లపూసలు కడుతూ ఉంటారు. కాశీ దారాన్ని అందరూ మణికట్టు వద్ద కట్టుకోవడం మీకు తెలుసు. వీటన్నిటికంటే కాలికి నల్ల దారం కట్టుకోవడం అనేది ఈమధ్య ఒక కొత్త ట్రెండింగ్ గా ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు, యువతులు ఎడమ కాలుకు నల్ల దారం కట్టుకోవడం ఎక్కువ అవుతోంది. దాని కథా కమామీషు ఏమిటో చూద్దామా!

యూట్యూబ్లో కొల్లలుగా వీటి గురించి వీడియోలు ఉన్నాయి. వీటన్నిటిలో సదరు పండితులు చెప్పేదేమంటే అమ్మాయిలు లేదా స్త్రీలు ఎడమ కాలికి, అబ్బాయిలు లేక పురుషులు కుడి కాలికి మాత్రమే ఈ నల్ల దారాన్ని కట్టుకోవాలట. మార్చి కట్టుకుంటే (అంటే అబ్బాయిలు ఎడమ కాలికి, అమ్మాయిలు కుడి కాలికి) చాలా ప్రమాదమట. కొంప కొలంబో అవుతుందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ఉదయం లేదా సూర్యోదయం సమయంలో ఈ నల్ల దారం కట్టుకోవడం అత్యంత శుభప్రదం అట.ఎందుకంటే నలుపు రంగు శని దేవునికి ప్రియమైనదట. కాబట్టి శనివారం ధరిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుంది, ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందుతారట.

 నల్ల దారం కాలికి లేదా చేతికి కట్టిన తర్వాత దానితో ఎరుపు, పసుపు లాంటి ఇతర రంగు దారాలు కలిపి కట్టుకోకూడదట. (ఫలానా హీరోకి ఈ విషయం తెలియదేమో పాపం!!). మళ్లీ ఇందులో తిరకాసు. కొన్ని రాశుల వారు నల్ల దారం ధరించకూడదట. వారికి ఎరుపు రంగు అనుకూలంగా ఉంటుందట. 

దిష్టి తగలకుండా ఉండడానికి, జాతక దోష నివారణకు, నర దిష్టి, నరఘోష నివారణకు ఈ దారాన్ని కట్టుకుంటారట. లేదా వేరే ఏదైనా ఉద్దేశంతో కట్టుకోవాలి అనుకుంటున్నారో చెబితే దానికి సంబంధించి మరిన్ని ప్రత్యేక నియమాలను ఈ పండితులు చెబుతారట. యూట్యూబ్లో సైన్స్, టెక్నాలజీని వాడుకుని AI సహాయంతో పాములు, గ్రహాలతో రకరకాల వీడియోలు, భయపెట్టి మిమ్మల్ని లొంగ తీసుకునే వీడియోలు తయారుచేసి ఈ నల్ల దారం గురించి ప్రచారం చేస్తున్నారు. ఎవరికి తోచిన మాటలు వారు చెబుతున్నారు. అలా చెప్పే వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సొంత పీఠమో, గురువు స్థానమో ఉంటుంది. వీరు చెప్పే విషయాలలో ఎలాంటి నిజమూ ఉండదు, ఎందుకంటే ఒకరు చెప్పే విషయంతో ఇంకొకరు ఏకీభవించరు. పైపెచ్చు వాటికి ఎలాంటి ప్రమాణం గానీ, ఎలాంటి శాస్త్రీయ వివరణ గాని ఉండదు. అది ఎలాగో గమనిద్దాం.

 నల్ల దుస్తులు చెడు అని చాలామంది నల్లగుడ్డలు కట్టుకోరు. చాలా విషయాల్లో నలుపురంగుని అశుభం అని, అమంగళం అని చెప్పే వీళ్ళు. . దారం దగ్గర మాత్రం నలుపు రంగుకి ఓటు వేస్తున్నారు. ఎందుకంటే ఇదివరకే చెప్పుకున్నాము కదా… ఫలానా దేవుడికి నలుపు రంగు చాలా ప్రీతి అని. అంతేకాదు ఈ నలుపు రంగు ప్రతికూల శక్తులను గ్రహిస్తుందని నమ్ముతారట. ఆ శక్తులు నలుపు వైపే ఎందుకు పోతాయో ఎవరూ చెప్పరు. రంగుల మనస్తత్వ శాస్త్రం ప్రకారం మరియు ఆధ్యాత్మిక సాంప్రదాయంలో నలుపు రంగును రక్షణగా, స్థిరత్వానికి ప్రతీకగా, అన్ని ప్రతికూల శక్తులను గ్రహించేదిగా సూచిస్తాయట. ఈ దారం ఒక కవచంలా చెడుని, దురదృష్టాన్ని నిరంతరం తిప్పికొట్టే పని చేస్తుందట. అంటే దారానికి ఎంతో ఆలోచన, ఎంతో శక్తి ఉందన్నమాట. అలా తిప్పి కొట్టడంలో దానికి ఎవరు తర్ఫీదు ఇచ్చారో మనకి తెలియదు.

 తత్వ శాస్త్ర ప్రకారం శరీరం యొక్క ఎడమ భాగం ఇడా నాడీతో సంబంధం కలిగి ఉంటుందట. ఇది చంద్రునికి, స్త్రీత్వానికీ, మరియు చల్లదనానికి సంబంధించిన శక్తి నాడీ ఆట. ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోవడం వల్ల అన్ని శక్తులను సమతుల్యంగా మార్చి సంపూర్ణ శ్రేయస్సును కలుగచేస్తుందట. మరైతే నాకో అనుమానం. ఆడవాళ్ళకి ఎడమ కాల్లో జరిగే మంచి మగవాళ్ళకి కుడికాలులోకి ఎలా మారిందో? నిర్దిష్ట వ్యాధులను నివారించడంలోనూ ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ ఈ దారం పనిచేస్తుందట. కీళ్ల నొప్పులను తగ్గించగలదని, సిరపు వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది అని కొందరు నమ్ముతారు. ఈ నల్ల దారానికి ఆరోగ్య రహస్యాలు కూడా తెలుసు సుమా!?

కానీ కాలికి దారం కట్టుకొని పావడా లేదా ప్యాంట్ వేసుకొని,లేదా పెద్ద చీర కట్టుకొని ఆ దారాన్ని కప్పేస్తే అది దిష్టి ని ఎలా అరికడుతుందని ఇంకొకరి వాదన. ఇది ఒక స్టైల్ లాగా తయారయిందని, ఒకరు చూసి ఒకరు కట్టుకుంటున్నారని, వీటికి గిరాకీ పెరిగిందని, ఇది దక్షిణాది సంప్రదాయం కాదని ఉత్తరాది నుంచి దిగుమతి అయిందని కొందరు ప్రవచనకారుల బాధ.

సందర్భానుసారంగా మాటలు మార్చి, ఏమార్చి, పరిమార్చే వీళ్ళు నలుపు నాలుగు విధాల మంచి అని చెప్పి, నల్ల దారం కట్టుకోవడానికి కొన్ని నియమాలు కూడా చెబుతున్నారు. దిష్టి దోషం, నర దోషం, నర పీఢ… ఇవన్నీ తొలగి పోవడానికి శనివారం రోజున నియమాలను పాటిస్తూ నల్ల తాడు ను కట్టుకోవాలట. ఏమిటా నియమాలు?

అవి ఏమిటంటే శనివారం మూడు పోగులున్న నల్ల దారం తీసుకోవాలి. ఒక పోగు ఉన్న దారం పనికిరాదు. ఈ మూడు పోగులు కలిపి మూడు చోట్ల ముడులు వేయాలి. ఎలా వేయాలి? అంటే ప్రతి ముడికి కొన్ని మాటలు చదువుతూ ముడివేసి ఉఫ్ అని ఊదాలి. అలా మూడు ముడులు వేయాలి. కొంతమంది 9 ముళ్ళు వేయాలని కూడా చెబుతారు. అలా చేసిన దారాన్ని శనివారం రోజు ఎడమ కాలికి కట్టుకోవాలి అలా చేస్తే మీకు అసలు దిష్టి అనేది ఉండదట.

ఆ తర్వాత వచ్చే శనివారం, అంటే వారం తరువాత పాత దారాన్ని తీసివేసి కొత్త దారాన్ని పైన చెప్పిన విధంగా ముడులు వేసి కట్టుకోవాలి మరి పాత దారాన్ని ఏం చేయాలి? దానికీ ఓ తతంగం ఉంది. ఓ జిల్లేడు ఆకు తీసుకొని అందులో కర్పూరం వుంచి మండించి పాత దారాన్ని అందులో వేసి కాల్చివేయాలి. ఈ మొత్తం బూడిదను ఓ కవర్లో వేసి నాలుగు రోడ్లు కూడలిలో పారవేయాలి!.

చూశారా ఎంత దారుణం !?ఇదివరకే మన దేశం చెత్తాచెదారంతో నిండిపోయింది. విదేశీయులందరికీ భారతదేశం వస్తే ఈ చెత్త గురించే ఓ పెద్ద ఆశ్చర్యము, ఆందోళన, అసభ్యము, అభ్యంతరము. మనము చెత్తను చెత్త బుట్టలో తప్ప అన్ని చోట్ల పడేస్తాము. అందులో మనం సిద్ధహస్థులం. దానికితోడు ఈ పెద్ద మనుషులు బూడిద ఉన్న కవరును నాలుగు రోడ్డు కూడలిలో పార వేయాలని చెప్పడం చాలా సిగ్గు చేటు. ఈ బుడిదే కాదు దిష్టి తీసిన నిమ్మకాయ సున్నపు నీళ్ళు, దిష్టి కోసం కాల్చిన కొబ్బరి చిప్పలు, దిష్టితీసి పగలగొట్టిన గుమ్మడికాయలు…. వీటన్నిటిని విచ్చలవిడిగా రోడ్లపై వేయడం, శవ యాత్ర స్మశానం వైపు వెళుతుంటే పూలన్నీ తెంపి రోడ్లపై వేయడం, ఇవన్నీ మనం శాయశక్తులా మన దేశాన్ని, మన ఊరుని చెత్త పెంటలా తయారు చేయడానికి కృషి చేస్తున్నాం కదా!!

కోతికొమ్మచ్చి. దారి తప్పి దారి పైకి వెళ్లిపోయాం.తిరిగి నల్లదారం దారికి వస్తామా.!?

ఇలా ప్రతి శనివారం పాత దారం విప్పి కొత్త నల్లదారం కట్టుకోవాలట. ఒకవేళ ప్రతి వారం ఇలా చేయడానికి ఇబ్బంది అయితే దానికి ఓ మినహాయింపు కూడా ఉంది. నెలకోసారి అంటే అమావాస్య రోజున ఈ తతంగమంతా చేసి కొత్త నల్లదారం కట్టుకోవచ్చు. కానీ పాత దారం కాల్చి రోడ్లో వేయడం మాత్రం మర్చిపోకూడదు సుమా. ( అంతే ! సంవత్సరానికి ఒకసారి చేసే మినహాయింపు అయితే లేదు )

 ఇంకొక సూచన కూడా ఉంది. అదేమిటంటే కాటన్ నల్ల దారం కట్టుకోకూడదు ట. ఊలుతో అంటే ఉన్నీతో చేసిన దారం మాత్రమే కట్టుకోవాలట.

మనది ఉష్ణ ప్రదేశం కాబట్టి మనదేశంలో అధిక శాతం మనుషులకి నల్ల రంగు జుట్టే ఉంది.అంతేకాదు కన్నుబొమ్మలు, కనురెప్పలు, కనుగుడ్డు.. ఇవన్నీ నలుపే (చాలా వరకు). శరీరం పైన వెంట్రుకలన్నీ నలుపే. మరి ఇంత నలుపు మన శరీరం పై పెట్టుకొని… ప్రత్యేకంగా నల్లదారం ఒకటి కట్టుకోవాలా? అంటే దిష్టికి దారం వేరు.. వెంట్రుకలు వేరు అని తెలుస్తుందా? నూలుదారం వేరు, సిల్క్ దారం వేరు అని తెలుస్తుందా? ఎడమ కాలు లేదా కుడికాలు అని తెలుస్తుందా? నువ్వు శనివారం కట్టుకున్నావా లేక ఆదివారం కట్టుకున్నావా అని తెలుస్తుందా?. వినేవాడు అమాయకుడైతే లోకువైతే, చెప్పేవాడు ఎన్నైనా చెబుతాడు. దానికి ఏఐ జోడించి రంగురంగుల వీడియోలలో చెబుతాడు. నిన్ను భయపెడతాడు.రేటింగ్ పెంచుకుంటాడు.

ఇంకా నయం కాలి దారంతోనే ఆగిపోయారు. రాబోయే కాలంలో ముక్కు దారము, చెవి దారము, తొడ దారము, పిక్క దారము,బొటన వేలు దారము కూడా రావచ్చేమో. ఎవరు చూశారు? వ్యాపారం బాగా జరగాలంటే వినిమయ వస్తువులు కొత్త పుంతలు తోక్కాల్సిందే కదా. ఎటు తిరిగీ మన యూట్యూబ్ ఛానల్స్ ఉండనే ఉన్నాయి… ఏఐ ఉందీ.. సెల్లు ఉందీ..సొల్లూ ఉంది…. మనమూ ఉన్నాం… భయపడ్డానికి, ఖర్చు పెట్టడానికి జనాలు ఉన్నారు… ఇక మీరు కోరిన కొండపైన వాన కురుస్తుంది… కాసుల వర్షం కురుస్తుంది.

ఈ దారాల వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. ఫ్యాషన్ వరకు అయితే ఓకే కానీ. .దారం తెగిపోతేనూ, దారం లేకపోతేనూ ఏదో చెడు జరుగుతుంది అని భయపడుతూ ఉండడం, అనుక్షణం కీడు శంకించడం మాత్రం పిరికి వాళ్ళ లక్షణం. ఆత్మస్థైర్యం, ఆత్మ బలం ఉంటే ఏదైనా మనం ఎదుర్కోవచ్చు. ఆ దిశగా మనం ఆలోచిద్దాం.

రచయిత: మిఠాయి యుగంధర్ బాబు, పలమనేరు. ఫోన్ : 9394782540

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *