వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 14
డా. నాగసూరి వేణుగోపాల్
ఆధునిక భారతదేశపు తొలి మహిళాగణిత శాస్త్రవేత్త టి. ఏ. సరస్వతి అమ్మ చేసిన పరిశోధన కారణంగానే భారతదేశంలో ప్రాచీన కాలంలోనే కాకుండా మధ్యయుగంలో కూడా గొప్పగా గణితవిజ్ఞానం వర్ధిల్లిందని మనకూ, అలాగే ప్రపంచానికి స్పష్టమైంది. భారతీయ, గ్రీకు గణిత విజ్ఞానపు పరంపరలకు సంబంధించి తన పరిశోధనలతో వంతెన నిర్మించిన ప్రతిభా శాలి కూడా ఆమె. కేరళ ప్రాంతం పాలక్కాడు జిల్లా చెర్పుల్ సరి గ్రామంలో ఎం. అచ్యుత మీనన్, కుట్టిమలు అమ్మ దంపతులకు 1918 డిసెంబర్ 26న జన్మించారు. ఇద్దరు సోదరీమణులు, ఇద్దరు సోదరుల మధ్య పెరిగిన సరస్వతి జీవితంలో పడిన కష్టాలు తక్కువ కాదు. ప్రఖ్యాత చరిత్రకారుడు కె.పి. పద్మనాభ మీనన్ ఈమెకు మేనమామ కాగా చెల్లెలు రాజ్యలక్ష్మి కథారచయిత్రిగా కేరళ ప్రాంతంలో సుప్రసిద్ధులు. సరస్వతికి పెళ్లి జరిగి, ఒక కుమారుడు కలిగిన తర్వాత భర్తతో విడిపోయిన ఈమె ఎదురైన సమస్యలకు తలొగ్గకుండా పట్టుదలతో విజయం సాధించిన పోరాటశీలి. నిజానికి ఆమె జీవిత విశేషాలు, బాల్యపు సంగతులు పెద్దగా అందుబాటులో లేవు, కానీ గణిత,భౌతిక శాస్త్రాలతో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందారని తెలుస్తోంది. తర్వాత వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతంలో ఎం. ఏ.పట్టాను సాధించారు. సంస్కృత సాహిత్యం, భాషా శాస్త్రం, సాంప్రదాయక భారతీయ విజ్ఞాన పరంపరలకు సంబంధించి విశేషమైన కీర్తిగడించిన సంస్కృత విద్వాంసులు వి. రాఘవన్ దగ్గర 1957 నుంచి 1960 దాకా పరిశోధకురాలుగా కృషి చేశారు. రాంచి విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. ఇంగ్లీష్ కూడా చేశారు. సంస్కృతం, ప్రాకృతం, ప్రాచీన కాలపు గణిత విజ్ఞానం ఈ మూడింటిలో పాండిత్యం సాధించి, వాటిని సమన్వయం చేసి భారతదేశపు గణిత శాస్త్ర చరిత్రను సుసంపన్నమని విశదం చేసిన సుచరిత సరస్వతి.

ఇక్కడ ఒక విషయం గురించి చెప్పుకోవాలి. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఇంకా కలకత్తా విశ్వవిద్యాలయాలలో గణేష్ ప్రసాద్ (1876-1935) గణిత శాస్త్రానికి సంబంధించి పటిష్టమైన పరిశోధన కేంద్రాలు తయారయ్యేలా కృషి చేశారు. వీరి పర్యవేక్షణలో కలకత్తా విశ్వవిద్యాలయం అప్లైడ్ మ్యాథమెటిక్స్ లో బిభూతి భూషణ్ దత్తాకు డి. ఎస్సి. పట్టాను ఒక శతాబ్దం క్రితం ప్రదానం చేసింది. దత్త గురువును స్ఫూర్తిగా తీసుకొని ప్రాచీన భారతీయ గణిత శాస్త్రం సంబంధించి అధ్యయనం చేసి 1924 -1927 మధ్యకాలంలో ఒక 12 పరిశోధనా పత్రాలను వెలువరించారు. గణితశాస్త్రానికి ప్రాచీన భారతీయులు చేసిన దోహదం గురించి దత్త 1927 డిసెంబర్ 20న అలహాబాద్ యూనివర్సిటీ మ్యాథమెటికల్ అసోసియేషన్ లో ఒక గొప్ప ప్రసంగం చేశారు. ఈ ప్రసంగ పాఠాన్ని తర్వాతి కాలంలో ఆ యూనివర్సిటీ అసోసియేషన్ బులెటిన్ లో ప్రచురించింది. దీనికి సంబంధించి గణేష్ ప్రసాద్ మరొక పరిశోధక విద్యార్థి ఏ.ఎన్. సింగ్ (1901-1954) అధ్యయనం కొనసాగించి ‘హిస్టరీ ఆఫ్ హిందూ మ్యాథమెటిక్స్: సోర్స్ బుక్’ పేరున రెండు భాగాలుగా సం.1935,:1938 లలో ప్రచురించారు. దత్తా, సింగ్ కలిసి లాహోర్ నుంచి వెలువరించిన ఈ పుస్తకం మొదటి భాగం న్యూమరికల్ నొటేషన్స్, అరితమెటిక్ కాగా, రెండవది ఆల్జీబ్రా కు సంబంధించింది. ఈ పుస్తకానికి కొనసాగింపుగా జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, క్యాలిక్యులేస్ ఇతర అంశాలతో కలిపి మూడో భాగం వెలువరించాలని వారాశించారు, కానీ అది వారి జీవితకాలంలో సాధ్యపడలేదు. ప్రాచీన, మధ్యయుగాల భారత దేశపు జామెట్రీ గురించి టి. ఏ. సరస్వతి 1964 లో రాంచీ విశ్వవిద్యాలయం నుంచి పరిశోధన కొనసాగించడం ఈ బృహత్తర కార్యక్రమానికి కొనసాగింపయ్యింది. టి. ఏ. సరస్వతి పర్యవేక్షణలో రాంచీ విశ్వవిద్యాలయం నుంచే 1971లో ఆర్.సి. గుప్త భారత దేశపు ప్రాచీనకాలపు త్రిగోనోమెట్రీ గురించి పరిశోధన పూర్తి చేశారు. దీనిని బట్టి సరస్వతి చేసిన, చేయించిన పరిశోధన ఎంత ముఖ్యమైనదో గమనించవచ్చు.
జైనుల గణితశాస్త్రం సంబంధించి సరస్వతి 1962 లో పరిశోధనా పత్రం వెలువరించారు. ఆర్యభట్ట, రెండవ భాస్కరుడు,శ్రీధర, నారాయణ పండిత మొదలైన ప్రాచీన గణిత శాస్త్రవేత్తల రచనలను కూలంకషంగా అధ్యయనం చేసిన ఆమె పరిశోధన 1964 లో పూర్తి అయ్యింది. కానీ ఆర్థిక సమస్యల కారణంగా ఆ సిద్ధాంత గ్రంథం 1979లో కానీ ప్రచురణ కాలేదు. యూరోపియన్ల కంటే మూడు శతాబ్దాలు ముందుగానే భారతీయులు ఆల్జీబ్రా, జామెట్రీ సంబంధించి ముందంజలో ఉన్నారని ఈ పరిశోధన ద్వారా తేటతెల్లమయ్యింది. రెండవ భాస్కరుడి తర్వాత భారత దేశంలో అభివృద్ధి చెందిన గణిత శాస్త్రం గురించి చేసిన పరిశోధన ద్వారా 12వ శతాబ్దంలోనే పై, సైన్, కొసైన్ శ్రేణుల పట్ల అవగాహన ఉందని బోధపడింది. 1972 లో సంస్కృతం, గణిత శాస్త్రం సంబంధించి భారతదేశపు తొలి అంతర్జాతీయ సంస్కృత సమ్మేళనంలో సరస్వతి ప్రసంగించారు. ధన్ బాద్ లోని ఎస్. ఎస్. ఎల్. ఎన్. టి. మహిళా కళాశాలకు 1973 నుంచి 1980 దాకా సరస్వతి ప్రిన్సిపల్ గా పనిచేశారు. ఈ పదవిలో ఉన్నంత కాలం పరిశోధన చేయకూడదనే నిబంధన ఆమెను క్రుంగదీసింది. పదవీవిరమణ చేసిన తర్వాత తన స్వస్థలం ఎర్నాకుళం వెళ్ళి పరిశోధనలను కొనసాగించాలని ప్రయత్నించారు. కానీ తల్లి అనారోగ్యం, ఇతర కుటుంబ సమస్యలు పలు రకాలుగా అడ్డుపడ్డాయి. గణిత శాస్త్రం

కఠినమనే నేటికీ ఎంతోమంది భావించే రంగంలో, తొలిసారి భారతీయ మహిళా కేతనాన్ని విజయవంతంగా ఎగుర వేసిన టి. ఏ. సరస్వతి 2000 ఆగస్టు 15న కనుమూశారు. ఆమె కృషి చిరస్మరణీయం.
రచయిత : డా. నాగసూరి వేణుగోపాల్, ప్రముఖ సైన్స్ రచయిత & ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు మొబైల్: 9440732392



