డా. కలపాల బాబూ రావు
కన్నెగంటి రవి
భారత ప్రభుత్వం 2021లో ఇథనాల్ -20 విధానం తీసుకొచ్చింది. రోజుకు 60 వేల లీటర్ల నుంచి 6 లక్షల లీటర్ల దాకా ఇథనాల్ ఉత్పత్తి చెయ్యగల సామర్థ్యం మన దేశానికి అవసరమని లెక్కించి, దానికనుగుణంగా దేశవ్యాప్తంగా పరిశ్రమలు స్థాపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలో 30, ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పరిమాణంలో ఈ పరిశ్రమలు పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
మనం వాడుతున్న లీటరు పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపడం లక్ష్యంగా ఈ నిర్ణయం తెర మీదికి వచ్చింది. అంటే ఇక మన పెట్రోల్ మొత్తం మిశ్రమ ఇంధనంగా మారుతుందన్నమాట. ప్రతి లీటరు పెట్రోలులో 20 శాతం ఇథనాల్ కలపడం ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని 2030 నుంచి 2025 -26 కు మార్చారు కూడా. దీనికోసం ఇథనాల్ 2018 స్థానే ఇథనాల్ 2024 వచ్చింది.
ఇథనాల్ అంటే ఏమిటి?
క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఇథనైల్ ఆల్కహాల్. దీన్ని ఇంధనంగానూ, మద్యం గానూ, ద్రావకంగానూ వాడొచ్చు. ధాన్యాల్ని పులియ పెట్టడం ద్వారా, పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా ఇది తయారవుతుంది. ఇదో రంగులేని వాసన గల ద్రవం. ఇది నీటిలో బాగా కరిగిపోతుంది
ఇథనాల్ ను పెట్రోల్ తో కలిపి వాహనాలకు ఇంధనంగా వాడడమే గాక బీర్, వైన్, విస్కీ లాంటి ఆల్కహాలిక్ పానీయాల్లో; పెయింటింగుల్లో వార్నీషులో, ఇంకుల్లో, ఔషధాల్లో ఉపయోగిస్తారు. దీనికి శుభ్రపరిచే గుణం, క్రిమిసంహారక లక్షణం, యాంటీ ఫ్రీజ్ ధర్మం కూడా వున్నాయి.
ఇథనాల్ కు ముడి పదార్థాలు
మొక్కజొన్న, జొన్న, బియ్యం, గోధుమల్లాంటి ధాన్యాలు దీని తయారీకి ఎక్కువగా వాడతారు. కారణం వీటిలో అధిక మొత్తంలో స్టార్చ్ (పిండి పదార్థం) వుంటుంది. దీన్ని ఇథనాల్ తయారీకి అవసరమైన చక్కెరగా మారుస్తారు. వరిలో గోధుమల్లో కూడా స్టార్చ్ వుంటుంది. కాబట్టి ఇవి కూడా ఇథనాల్ కి పనికొస్తాయి. చెక్క చిప్స్ లోని సెల్యులోజ్ ను చక్కెరగా మార్చి, ఆ తర్వాత ఇథనాల్ తయారు చేయవచ్చు. వ్యవసాయ వ్యర్ధాలూ, ఎండు గడ్డి నుంచి కూడా ఇది తయారవుతుంది
ఆహార ధాన్యాలతో ఇథనాల్
మనలాంటి పేద దేశాలకు ప్రజలందరికీ ఆహారాన్ని అందించటం మొదటి కర్తవ్యం. అలాంటి ఆహార ధాన్యాల నుంచి 780 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేయబూనుకుంటే ఏమవుతుంది ? అంత పంట, దానికి తగ్గ భూమి మన వద్ద వున్నాయా? వీటి ధర అంత చవకగా వుందా ? ఇక వున్నది ఒకే మార్గం. సబ్సిడీతో ఈ పరిశ్రమలకు ప్రభుత్వాలే బియ్యాన్ని సరఫరా చేయడం! ఇందులో భాగంగానే- ఒక్క 202- 23 లోనే భారత ఆహార సంస్థ (ఎఫ్ సి ఐ ) తన నిల్వలనుండి 14 లక్షల టన్నుల బియ్యాన్ని కిలో రు 20 కి ఈ పరిశ్రమలకు సరఫరా చేసింది. (ఇదే ఎఫ్ సి ఐ “భారత రైస్” పేరుతో పేదలకు బియ్యాన్ని 29 రూపాయలకు అమ్ముతోంది!)
కానీ 2023లో ఈ విధానం గల్లంతయింది. కారణం వాతావరణ పరిస్థితుల కారణంగా బియ్యం ఉత్పత్తి తగ్గి మార్కెట్లో ధర పెరిగిపోయింది. ప్రజల ఆహార భద్రతకే ప్రమాదం ముంచుకొచ్చింది. గత్యంతరం లేక ఇథనాల్ పరిశ్రమలకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. ఈ నిషేధం 2023 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు దాకా కొనసాగింది. తర్వాత ఈ అంక్షలను తొలగించారు.
దీనర్థం ఏమిటి? ఆహార ధాన్యాల లబ్ధి మీద, అవి చౌకగా మార్కెట్లో లభించడం మీద ఇథనాల్ పరిశ్రమ ఆధారపడి వుంది. వాతావరణం అనుకూలించక బియ్యం ఉత్పత్తి తగ్గితే ఈ పరిశ్రమలు గల్లంతవుతాయి. ప్రజలకు కాదని మరీ తక్కువ రేటుకు వీటికి బియ్యం ఇస్తే ప్రజలు తిండి దొరక్క నకనకలాడుతారు. కాదని మార్కెట్ రేటుకే బియ్యమిస్తే ఇథనాల్ ధర విపరీతంగా పెరిగిపోతుంది. పెట్రోల్ పరిశ్రమల యాజమాన్యాలు దీన్ని కొనడానికి ముందుకు రారు.
ఉదాహరణకి ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి 2. 2 కిలోల బియ్యం కావాలి. భారత ఆహార సంస్థ కిలో బియ్యం రేటు 39. 18 రూపాయలు. ప్రభుత్వాలు సబ్సిడీతో దీన్ని 28 రూపాయలకే ఇస్తున్నారు. అలా ఇచ్చినా కూడా లీటర్ ఇథనాల్ కోసం 62. 16 రూపాయలు విలువైన బియ్యం ఇవ్వాల్సి వుంటుంది. పెట్రోలియం కంపెనీలు ఇథనాల్ని 64 రూపాయలకు కొంటున్నాయి. ప్రభుత్వం మీద లీటర్ కు రు 24. 82 ల బరువు పడుతుంది
ఈ సమస్యకు మరో పరిష్కారం ఏమంటే ఇథనాల్ ధర పెంచడం. తమకు మొక్కజొన్న నుంచి చేసే ఇథనాల్ వల్ల 9. 28 రూపాయలు, ముక్కిపోయిన బియ్యం వల్ల రు 8. 36 నష్టం వస్తోందని ఈ పరిశ్రమలు గగ్గోలు పెట్టడం మొదలు పెడుతున్నాయి మరి!
ఇక దీనంతటికీ ఒకే పరిష్కారం. ప్రభుత్వం మరింత సబ్సిడీ ఇచ్చి, మరింత తక్కువ ధరకు బియ్యం, మొక్కజొన్న, గోధుమ పరిశ్రమలకు సరఫరా చేయటం. అంటే ప్రజల సొమ్ము దోచిపెట్టడం!
ఇంకో సమస్య ఏమంటే దీనికోసం ఆహార ధాన్యాలు సాగు విస్తీర్ణం ఇబ్బడిముబ్బడిగా పెరగాలి. అలా చేస్తే పప్పు ధాన్యాలు,నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగు తగ్గించాల్సి వుంటుంది. దీనివల్ల ప్రజల ఆహారం పై పడే ప్రతికూల ప్రభావం ఒక ఎత్తైతే, రైతులు లాభసాటి పంటలు వదులుకోవాల్సి రావడం మరో ఎత్తు. ఇక పంటల్లో వైవిధ్యం తగ్గడం మరో సమస్య.
ఇదంతా కలిసి మన ప్రజల ఆహార భద్రతను, నాణ్యతను తీవ్రంగా నష్టపరుస్తాయి. మనలాంటి దేశంలో ఇది ఎలాంటి బాధాకర పరిస్థితులకు దారితీస్తుందో చెప్పనక్కరలేదు.
నీటి సమస్య
ఒక లీటరు ఇథనాల్ ఉత్పత్తికి నాలుగు లీటర్ల నీరు కావాలి. నిజానికి ఈ నీటి వాడకం మీద ఎలాంటి ఆడిటింగ్ లేదు. ఎనిమిది లీటర్లు కూడా వాడుతున్నట్టు నివేదికలున్నాయి. భూగర్భ జలాలు, ఎత్తిపోతల ప్రాజెక్టుల జలాలు రైతుల సాగునీటి అవసరాలకు బదులు, ఇథనాల్ పరిశ్రమలకు ఇవ్వడం అంటే ఏమనాలి? ఇది చాలక ఇథనాల్ కోసం వరి, చెరకు లాంటి పంటలు అదనంగా పండిస్తే వాటికయ్యే నీటి వ్యయం ఎంత ? వాస్తవానికి భూగర్భ జలాల్ని ఇలాంటి పరిశ్రమల కోసం వాడుకోవడానికి అనుమతులు లేవు. కానీ దీన్ని ఎవరు ఖాతాలు చేస్తారు ? పెద్ద పెద్ద బోర్లు వీరు వేస్తున్నారు. మనలాంటి దేశంలో వీరిని ఎవరు అదుపు చేయగలరు ? దీంతో రైతుల బోర్లు ఎండిపోతున్నాయి
అమెరికా అనుభవం
ప్రపంచంలోనే అత్యధికంగా శిలాజ ఇంధనాలను వాడుతున్న అమెరికా 1971 సంక్షోభంలో పడింది. ప్రత్యామ్నాయాల కోసం చేసిన ప్రయత్నాల్లోంచి ఇథనాల్ ముందుకు వచ్చింది. పెట్రోల్ లో పది శాతం కనీసం ఇథనాల్ని కలపాలని నియమం పెట్టుకుంది. తర్వాత దాన్ని 15 శాతానికి పెంచింది. అప్పటినుంచి ఇథనాల్ పరిశ్రమ అమెరికాలో పెరగసాగింది.
అమెరికాలో జన్యు మార్పిడి మొక్కజొన్నను ఇథనాల్ పరిశ్రమకు తరలిస్తున్నారు. అయినా మూడు కోట్ల ఎకరాల్లో దాన్ని సాగు చేస్తే గాని 10 శాతం ఇథనాల్ కలపడం సాధ్యం కావడం లేదు. ఇది దేశ రవాణా అవసరాల్లో నాలుగు శాతం నుంచి తీర్చడం లేదు. దీనికంటే 17 మిలియన్ల ఎకరాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తే అది మొత్తం అమెరికా ఇంధన అవసరాల్ని తీరుస్తుందని పర్యావరణవేత్తలు ప్రత్యామ్నాయాన్ని చూపుతున్నారు
పులిని చూసి నక్క వాత వేసుకున్నట్టు మనం అమెరికాను అనుకరిస్తున్నాం. అమెరికా జనాభా మన జనాభాలో మూడోవంతు కూడా లేదు. కానీ మన సాగు భూముల కంటే అమెరికా సాగుభూమి మూడు రెట్లు ఎక్కువ. జన సాంద్రత కూడా మనతో పోలిస్తే అక్కడ చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఇథనాల్ పరిశ్రమలు మన ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తులనాత్మకంగా చూడాల్సి వుంటుంది.
కాలుష్యం
ఇథనాల్ తయారీలోని ఫెర్మెంటేషన్ ప్రక్రియలో ఫార్మాల్టి హైడ్, అసెటాల్టిహైడ్, ఆక్రోలీన్, హేక్సేన్ లాంటి విషవాయవులు వెలబడతాయి. వీటిని VOCలు అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ VOCలపై ప్రజలు చాలా పోరాటాలు చేస్తున్నారు. ఇంగ్లాండు లాంటి దేశాలు కఠిన షరతులు, జరిమానాలు కూడా విధించాయి. అలాగే E20 ఇంధనాన్ని వాహనాల్లో మండించినప్పుడు కార్బన్ మోక్సైడ్, నైట్రిజెన్ ఆక్సైడ్లు ఒక మేరకు తగ్గుతాయి గాని ఫార్మాల్టీ హైడ్ అసెల్టీహైడ్ కాలుష్యం బాగా పెరుగుతుంది
ఈ వాయు కాలుష్యంతో కన్ను, ముక్కు, గొంతు దురద వుంటాయి. తలనొప్పి వికారం కలుగుతాయి. వాంతులు కూడా వస్తాయి. ఊపిరి ఆగినట్టు వుంటుంది. దీర్ఘకాలంలో ఇది క్యాన్సర్ కారకం కావచ్చు. ఉబ్బసానికి దారి తీయవచ్చు. క్రానిక్ బ్రాంకైటిస్ కూడా రావచ్చు. వాయు కోశాలు వ్యాకోచించవచ్చు. VOCలు గర్భస్థ శిశువులపై కూడా ప్రభావాన్ని కలిగిస్తాయి. బలహీనంగా, తక్కువ బరువుతో బిడ్డలు పుడతారు
మరొక కీలక సమస్య దీని నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్. ప్రతి లీటర్ ఇథనాల్ ఉత్పత్తి నుంచి 0. 7 కిలోల కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. దీన్ని 40 నుంచి 50% దాకా తిరిగి పట్టుకునేందుకు అనుమతులు ఇస్తున్నారు. 2025 నాటికి 1500 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం. అంటే దాన్నుంచి 1. 14 కోట్ల లీటర్ల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. దీనంతటికీ మన దేశంలో మార్కెట్ ఉందా? దీన్ని ఎలా తరలిస్తారు ?గొట్టాల ద్వారానా?సిలిండర్ల ద్వారానా ?అమెరికాలో గొట్టాలతో తరలించడంపై తీవ్ర నిరసన వ్యక్తమయింది. దీంతో అడుగు ముందుకు పడడం లేదు. ఏ ఇథనాల్ పరిశ్రమ ప్రారంభించినా మొదట దాని కార్బన్ డై ఆక్సైడ్ ను ఏం చేస్తారో తేల్చాల్సి వుంది. కానీ అలా జరగడం లేదు. ఉదాహరణకు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఏర్పాటు కానున్న ఇథనాల్ పరిశ్రమలో రోజుకు 238 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విధులు విడుదలవుతుంటే 110 టన్నుల కార్బన్ డయాక్సైడ్ మాత్రమే పట్టుకొని ఇతర కంపెనీల అవసరాలను తీర్చేందుకు ఒప్పందాలు కుదిరాయి. మరి మిగతా దాన్ని ఏం చేస్తారు? ఇక మన కాలుష్యనియంత్రణామండలి సామర్థ్యం, నిర్వాకం తెలిసినవే.
ఎంత గిట్టుబాటు?
రాను రాను పెట్రోల్ ధరలు తగ్గి ఇథనాల్ ధరలు పెరుగుతాయి. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 2014 మేలో 127 డాలర్లు. అప్పుడు మన దేశంలో పెట్రోల్ ధర 71. 5 1 రూపాయలు. అదే 2014 సెప్టెంబర్ లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 72 డాలర్లకు పడిపోయింది. అయినా మన దేశంలో పెట్రోల్ ధర రు. 187. 41 గా వుంది. పెట్రోల్ డీలర్లకు కంపెనీలు అమ్మే పెట్రోల్ ధర 50, 55 రూపాయల లోపే ఉండగా మొక్కజొన్న నుంచి తయారైన లీటరు ఇథనాల్ 72 రూపాయలుగాను, బియ్యం నుంచి తయారయింది 64 రూపాయలుగాను వుంటే ఎంత కాలం ఈ డీలర్లు ఇథనాల్ కొంటారు?
అలాగే మన ఆయిల్ దిగుమతులు నానాటికి పెరిగిపోతున్నాయి. ఇథనాల్ వాడకం పెంచినా పెట్రోల్ దిగుమతులు మాత్రం తగ్గడం లేదు. మరి పరిష్కారం ఎక్కడ వుంది ? మొత్తంగా పెట్రోలు వాడకం తగ్గించుకోవడంలో వుంది. ఇథనాల్ ని కలపడంతో దీనికి పరిష్కారం దొరకదు
అలాగే ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయన్నది కూడా నిజం కాదు. ఒక లీటర్ పెట్రోలు వాడటం వల్ల విడుదల అయ్యే ఉద్గారాల కంటే చెరుకు నుంచి తీసిన ఇథనాల్ వల్ల విడుదలయ్యే అదనపు ఉద్గారాలు 40 శాతం ఎక్కువ. భారతదేశంలో 2019లో 380 కోట్ల టన్నులు, 2020 లో 361 కోట్ల టన్నులు ( ఇది కరోనాకాలం), 2022లో 495 కోట్ల టన్నులు ఉద్గరాలు విడుదలయ్యాయి. దీని అర్థం ఏమిటి ? మన పెట్రోలు వాడకం తక్కువగా ఉండే అభివృద్ధి నమూనాను ఎంచుకోవాలి. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం కూడా ఇదే. నానాటికి మరింత పర్యావరణ విధ్వంసక అభివృద్ధిని ఎంచుకుంటూ, దాని వెంట పోటీపడి పరిగెడుతూ ఇథనాల్ తో ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు అని చెప్పడం పెద్ద వంచన!
రైతులకు ఆదాయాలు పెరుగుతాయా?
పోనీ ఇవన్నీ ఎలా వున్నా రైతుల ఆదాయమైనా పెరుగుతుందా అంటే అదీ లేదు. ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి 2. 22 కిలోల బియ్యం లేదా నూకలు గానీ, 2. 63 కిలోల మొక్కజొన్న గాని అవసరం ఉంటుంది. ప్రభుత్వ ఆహార ప్రజా పంపిణీ విభాగం సమాచారం ప్రకారం టన్ను బియ్యంతో 450 లీటర్లూ, టన్ను మొక్కజొన్నతో 350 లీటర్లు ఇథనాల్ తయారవుతుంది. దేశంలో 2025 నాటికి ధాన్యాల నుండి 740 కోట్ల లీటర్ల ఇథనాల్ తయారు చేయాలంటే బియ్యం సంవత్సరానికి 1. 643 కోట్ల టన్నులు, మొక్కజొన్న సంవత్సరానికి 1. 946 కోట్ల టన్నులు అవసరం ఉంటుంది.
ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటు వల్ల రైతులు పండించే ధాన్యం, మొక్కజొన్న, జొన్న పంటలకు సంవత్సరం పొడుగునా గిట్టుబాటు ధరలు లభిస్తాయని పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ ఆచరణలో అలా జరగడం లేదు. కారణం కంపెనీ యాజమాన్యాలు మన రాష్ట్రంలో గానీ, ఇతర రాష్ట్రాలలో గాని ఈ పరిశ్రమల నడపడానికి అవసరమైన ఆహార ధాన్యాలను కనీస మద్దతు ధరలకు రైతుల నుండి నేరుగా కొనడం లేదు.
ఈ పరిశ్రమలు ఇప్పటి వరకు కేంద్రం సరఫరా చేసే సబ్సిడీ బియ్యం పైనే ఆధారపడుతున్నాయి లేదా మద్దతు ధరలు అమలు కాని రాష్ట్రాల్లో అతి తక్కువ ధరలకు దళారీల నుండి కొంటున్నాయి లేదా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే బియ్యాన్ని మార్కెట్లో అక్రమంగా తక్కువ ధరకు ఎనిమిది రూపాయలకు కొంటున్నాయి. కాబట్టి రైతులకు ఈ పరిశ్రమల వల్ల సంవత్సరం పొడవునా లాభం ఉంటుందనే మాట పచ్చి అబద్ధం!
పోనీ వాహనదారులైనా లాభపడతారా అంటే అదీ లేదు. ఎందుకంటే సాధారణ పెట్రోలు కంటే ఇథనాల్ కలిపిన పెట్రోలు మైలేజీ తక్కువ. మిశ్రమ ఇంధనం ఎక్కువ పోయించుకొని జేబులు ఖాళీ చేసుకోవల్సి వుంటుంది.
ఇలా ఏ కోణం నుంచి చూసినా ఈ ఇథనాల్ పరిశ్రమల్లో ప్రజోపకరమైనది ఏదీ లేదు
డా. బాబు రావు గారు పర్యావరణంపై దీర్ఘ కాలంగా పని చేస్తున్న ప్రజా శాస్త్ర వేత్త.
కన్నెగంటి రవి గారు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వాహకులు



