డాక్టర్ కె. బాబురావు
“ప్రకృతిలో దయ లేదు, జాలి లేదు. అక్కడ నియమం మాత్రమే ఉంది” అని అమెరికా మూలవాసుల నాయకుడు ఒరెన్ లయోన్స్ చెప్పిన మాట ఈ రోజుల్లో మరింత సత్యంగా అనిపిస్తోంది. మనిషి ఎంత అభివృద్ధి సాధించినా, ఎంత సాంకేతిక విజ్ఞానం పెరిగినా, ప్రకృతి నియమాల ముందు అందరూ సమానమే. ఈ నియమాలకు ఎలాంటి మినహాయింపులూ లేవు.
మన అవసరాలు, కోరికలు, ఆశలు ప్రకృతికి అర్థం కావు. “అభివృద్ధి కోసం ఇది తప్పనిసరి”, “ఉద్యోగాల కోసం ఇది అవసరం”, “విద్యుత్ కోసం వేరే దారి లేదు” అని మనం వాదించవచ్చు. కానీ ప్రకృతి మాత్రం తనదైన నియమాల ప్రకారమే పనిచేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువులు పెరిగితే భూమి వేడెక్కుతుంది. ఇంధనాన్ని కాల్చితే తప్పనిసరిగా కొంత శక్తి వ్యర్థ వేడిగా మారుతుంది. ఇవి అభిప్రాయాలు కాదు, చర్చించుకుంటూ వుండే విషయాలు కూడా కావు — ఇవి భౌతిక శాస్త్ర సత్యాలు.
భౌతిక శాస్త్ర నియమాలు మారవు. శక్తిని సృష్టించలేం నాశనం చేయలేం అనే శక్తి నిత్యత్వ నియమం, వ్యవస్థలో అస్తవ్యస్తత (ఎంట్రోపీ) ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది అనే ఉష్ణగతి శాస్త్ర సూత్రం, ద్రవ్యరాశి ఉన్న వస్తువులు ఒకదానిని ఒకటి ఆకర్షించుకుంటాయి అనే గురుత్వాకర్షణ నియమం. ఇవన్నీ శతాబ్దాలుగా అదే విధంగా ఉన్నాయి. “అవసరం” అనే మాట మన కోరిక మాత్రమే. ప్రకృతి నియమాలు మన కోరికలకు లోబడవు.
ఇది మన నిత్యజీవితంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. గది ఉష్ణోగ్రతలో ఒక మంచు ముక్కను ఉంచి అది కరగకూడదని కోరుకుంటే ఏమవుతుంది? అది తప్పక కరుగుతుంది. ఎందుకంటే వేడి ఎప్పుడూ చల్లని వస్తువు వైపు ప్రవహిస్తుంది. అదే విధంగా, బలహీనమైన పునాది మీద కట్టిన భవనం పెద్ద భూకంపం లేకుండానే పగుళ్లు చూపిస్తుంది. గురుత్వాకర్షణను, నిర్మాణ బలాన్ని మన కోరికలతో మార్చలేం.
రోడ్డుపై అధిక వేగంతో వెళ్తున్న కారు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. కారణం స్పష్టం — వేగం పెరిగే కొద్దీ గతి శక్తి గణనీయంగా పెరుగుతుంది. వేగం రెట్టింపు అయితే ప్రమాదం నాలుగు రెట్లు పెరుగుతుంది. అలాగే పై అంతస్తులో ఉన్న నీటి ట్యాంక్‌లో నీటి మట్టం తక్కువగా ఉంటే కింద అంతస్తులకు నీరు రావడం కష్టం. ఇది ద్రవ పీడన నియమం. ఒకే విద్యుత్ సాకెట్‌కు హీటర్, ఇస్త్రీ, ఏసీ అన్నీ కలిపితే షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగవచ్చు. ఎందుకంటే అధిక కరెంట్ వైర్లలో ఎక్కువ వేడిని సృష్టిస్తుంది.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త టామ్ మర్ఫీ చెప్పిన మాట ఇక్కడ గుర్తు చేసుకోవాలి. “మనం భౌతిక నియమాలు పాలించే ప్రపంచంలో జీవిస్తున్నాం. మానవ చట్టాలను ఉల్లంఘించవచ్చు గానీ, భౌతిక నియమాలను ఉల్లంఘించే అవకాశం లేదు” అని ఆయన అంటారు. ఒక రాయిని పైకి విసిరితే అది తప్పకుండా కింద పడుతుంది. అది ఎంత విలువైనదైనా, ఏ ప్రభుత్వ ఉత్తర్వు ఉన్నా, గురుత్వాకర్షణ దాన్ని వదిలిపెట్టదు.
మానవ చట్టాలకు కోర్టులు, పోలీసులు అవసరం. కానీ ప్రకృతి నియమాలు ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి ఆలస్యం లేకుండా, స్వయంగా అమలవుతాయి. ఇదే ముఖ్యమైన తేడా.
మనం తరచూ ఒక ప్రమాదకరమైన భ్రమలో ఉంటాం. “సాంకేతికత వచ్చేసింది కదా, ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది” అని అనుకుంటాం. నిజమే, సాంకేతికత మన జీవితాన్ని సులభతరం చేసింది. కానీ అది ప్రకృతి నియమాలను రద్దు చేయలేదు. అందువల్ల నిజమైన మానవ విజ్ఞత అంటే ప్రకృతి నియమాలను మార్చడం కాదు, వాటిని అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా జీవించడం. సాంకేతికతను ప్రకృతి పరిమితులలోనే అభివృద్ధి చేయాలి. తాత్కాలిక లాభాల కోసం పర్యావరణాన్ని, భౌతిక సత్యాలను విస్మరించడం ప్రమాదకరం.
ఈ సందర్భంలో మహాత్మా గాంధీ చేసిన హెచ్చరికను మరచిపోలేం. భారతదేశం పాశ్చాత్య దేశాల తరహాలో నిర్బంధంలేని పారిశ్రామీకరణకు దిగితే, ఆ పారిశ్రామికీకరణ ప్రపంచ వనరులను మిడతల దండులా నాశనం చేస్తుందని ఆయన అన్నారు. పరిమిత వనరులున్న భూమిపై పరిమితిలేని వృద్ధి అసాధ్యం అన్న నిజాన్ని మనం అంగీకరించాల్సిందే.
తుది సత్యం ఒక్కటే — ప్రకృతి మనిషి“అవసరాన్ని” గుర్తించదు. తన నియమాల ప్రకారం మాత్రమే పనిచేస్తుంది. పర్యవసానాలు తప్పవు. మన రాజకీయాలు, అభిప్రాయాలు, వాగ్దానాలన్నీ ప్రకృతి నియమాలకు లోబడి ఉండాలి. ఈ నిజాన్ని అర్థం చేసుకోకపోతే, ప్రమాదంలో పడేది కేవలం ప్రకృతి కాదు. మన మనుగడే. “ప్రకృతిలో చట్టాలు లేవు. కేవలం పర్యవసానాలు మాత్రమే ఉన్నాయి.”



