ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాలరావు
ఇంటర్వ్యూ
ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల నిర్వహణాధికారి, రాజ్యసభ సభ్యుడు, జాతీయ రైతు కమిషన్ ఛైర్మన్ వంటి అనేక బాధ్యతల్ని నిర్వహించిన ప్రొ. ఎం.ఎస్. స్వామినాధన్ ఆయన తొంబయ్యవ జన్మదిన సందర్భంగా “జనవిజ్ఞానం”తో తన అభిప్రాయాల్ని పంచుకొన్నారు. జనవిజ్ఞానం ప్రతినిధిగా ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాలరావు అడిగిన ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానమిచ్చారు.

ప్ర. హరిత విప్లవ మూలకారకుల్లో ఒకరిగా గత 45-50 ఏళ్లుగా భారత వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత వ్యవసాయ సంక్షోభం, ముఖ్యంగా రైతుల ఆర్తనాదాలపై మీరేమనుకొంటున్నారు?
జ. నిజానికి ప్రస్తుత మన వ్యవసాయరంగంలో అనేక అనుకూల అంశాలేగాక, ప్రతికూల ఘటనలున్నాయి. ఒకవైపు మన రైతులు 270 మిలియన్ (మి) టన్నుల (ట) తిండిగింజలు, 270 మి.ట పండ్లు, కూరగాయలు 140 మి.ట.పాలు ఉత్పత్తి చేస్తున్నారు. 1957లో మన జనాభా 30 కోట్లయితే నేడది 130 కోట్ల స్థాయికెళ్లింది. స్వాతంత్య్రం వచ్చేనాటికి మనమెంతో ఆహార కొరతతోకరువు కాటకాలతో ఉన్నాం. ఇప్పుడు మన ముఖ్య సమస్య కొనుగోలు శక్తిలేని వర్గాల్లో దీర్ఘకాలిక ఆకలి సమస్యగా రూపొందటం. 1960ల్లో మనల్ని “ఓడ నుండి నోటికి” అనే దేశంగా గుర్తించారు. 2013 నాటికి ఆహార భద్రతాచట్టాన్ని తెచ్చేస్థాయికి దేశం ఎదిగింది. అనగా ప్రతి భారత పౌరుడికి ఆహార అందుబాటు హక్కు కల్పించబడ్డది. యిదేం చిన్న విషయంకాదు. మనం గర్వపడాల్సిన స్థాయి కెదిగాం.
ప్ర. మీరు తరచుగా మీ ఉపన్యాసాల్లో వ్యాసాల్లో గాంధీజీ ఆలోచన్లని, ఆచరణను పేర్కొంటూ ఉంటారు. వ్యవసాయరంగంలో ప్రవేశపెట్టిన సాంకేతికాల వల్ల జీవావరణ రక్షణకు ముఖ్యమైన జీవపునర్ నిర్మాణ నిత్యచలనచక్రాలు క్షీణిస్తూ వస్తున్నాయనేది, గాంధీ (సిద్ధాంత) అనుయాయుల అభిప్రాయం. దానికి మీరేమంటారు?
జ. పర్యావరణ అనుకూలతలున్న సామాజిక సమతుల్యతల్నిచ్చే కొత్త సాంకేతికాలకెప్పుడూ గాంధీజీ వ్యతిరేకులు కారు. ఉపాధిని పెంచగల “మంది కొరకు ఉత్పత్తి” కాకుండా, మంది ద్వారా ఉత్పత్తి విధానాన్ని మనం అనుసరించాలనేదే గాంధీ ఉద్భోధ. మన ఉపాధిని పెంచగలిగేది వ్యవసాయ రంగమేననీ ఉపాధి నివ్వలేని పెరుగుదల నిరర్ధకమనేది ఆయన భావం.
ప్ర. కృత్రిమ జన్యుమార్పిడి సాంకేతికాలు, ప్రస్తుతం వస్తున్నవ్యవసాయ సమస్యల్ని పరిష్కరించగలవా?
జ. మొక్కల మధ్య లేక జీవుల మధ్య ఉన్న పునరుత్పత్తి అడ్డంకుల్నికృత్రిమ జన్యుమార్పిడి సాంకేతికాలు తొలగించడానికి తోడ్పడతాయి.తద్వారా అనేక జీవనిర్జీవ వత్తిళ్లను తట్టుకోగల పంట వంగడాల రూపకల్పనకది సహాయకారి. సాంప్రదాయ సంకర విధానం (మెండల్ పద్ధతి) 150 ఏళ్లనాటిది. ఈ కృత్రిమ జన్యుమార్పిడి విధానం 1980లో మొదలయ్యింది. అందువల్ల ఈ రెంటెనీ సరైనపద్ధతిలో సమన్వయ పరచాలి. మనకు ఉత్పాదక వనరు కంటే అంతిమ లక్ష్యం ముఖ్యం.

M. S. Swaminathan (left) and
Norman Borlaug in the
wheat fields of the
Indian Agricultural Research
Institute (IARI), New Delhi. Credit: MSSRF
ప్ర. అధిక జనాభా గల భారత దేశానికి సేంద్రీయ వ్యవసాయం సుస్థిర ఆహార ఉత్పత్తిని ఇవ్వగలదా?
జ. మన జనాభా తక్కువగా ఉన్నప్పటి దశలో సేంద్రియ వ్యవసాయమొక జీవన విధానంగా రూపొందింది. యివ్వాళ మనం 1.3బిలియన్ల జనానికి, ఒక బిలియన్ పశువులకు తిండి పెట్టాల్సిన స్థితిలో ఉన్నాం. కాబట్టి ఉత్పత్తి స్థాయికి తగిన ఉత్పాదక వనర్లు కావాలి. మనం భూమి నుండి తీసుకొంటున్నదంతా వెనక్కి యివ్వాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తు మనకు తగినంత సేంద్రియతను పెంచగల భూసార పునర్ నిర్మితాలు లేవు. అందుకే మనం సమగ్రమైన పోషక లభ్యత విధానాన్ని అనగా సేంద్రియ ఎరువుల్ని, రసాయనాల్ని, పచ్చి రొట్ట ఎరువుల్ని కలిపి వాడాల్సి ఉంటుంది.
ష్ర : వ్యవసాయ పరిశోధనాభివృద్ధికై అంతర్జాతీయ స్థాయి సంప్రదింపులకమిటీ (సిజిఐఎఆర్) పాత్ర సోషలిస్టు వ్యవస్థ తిరోగమనంలో పడగానే తగ్గుతూవచ్చింది. గుత్తాధిపత్యంలోకి వ్యవసాయ సాంకేతికాలు వెళ్లేందుకుకిది దోహదపడ్డది. దీన్ని మీరెలా పరిగణిస్తారు?
జ. సిజిఐఎఆర్ యింకా మంచిపని చేస్తూనే ఉంది. ప్రపంచజనాభాకు మేలు చేయటమే దానిలక్ష్యం. మన దేశంలో నెలకొల్పబడ్డ సిజిఐఎఆర్ సంస్థ యిక్రిసాట్, నాణ్యమైన శాస్త్ర పరిశోధనలు నడుపుతూనే ఉంది. అక్కడ చాలామంది అనుభవజ్ఞులైన భారతీయ శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. అలాగే నేను నిర్దేశకుడిగా ఆరేళ్లు పనిచేసిన అంతర్జాతీయ వరి పరిశోధనా స్థానం చాలా ఉన్నతమైన పరిశోధనలు చేస్తున్నది. అయితే నిధుల కొరతవల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ముఖ్యమైన విషయాలు అశ్రద్ధకు గురౌతున్నాయి. అందుకే మనం జాతీయ, అంతర్జాతీయ సంస్థల్ని బలోపేతం చేసుకోవాలి.
ప్ర: మీరు సూచించిన ప్రత్యేక వ్యవసాయ మండళ్ల రూపకల్పన ద్వారా “కుటుంబ వ్యవసాయం” రక్షించబడుతుందా?
జ. ప్రత్యేక వ్యవసాయ మండళ్లు ముఖ్య వ్యవసాయ భూముల్నికాపాడుకోవటకి. భవిష్యత్లో మనం, తరుగుతున్న తలసరి భూమి ద్వారా, యింతకంటే ఎక్కువ మోతాదులో ఆహారాన్ని ఉత్పత్తి చెయ్యాల్సుంటుంది. అందుకే అధిక ఉత్పత్తికి దోహదపడే(ఉదా: ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర జిల్లాలు) భూముల్ని ప్రత్యేక వ్యవసాయ మండలిగా మార్చాలి. తద్వారా భవిష్యత్ తరాలకు ఆహారభద్రత ఉంటుంది.
ప్ర. జాతీయ రైతు కమిషన్ ద్వారా మీరు ‘భారత వ్యాపార సంస్థను’ స్థాపించాలని సూచించారు. వ్యవసాయ రంగంలోని సాంకేతికాలపై గుత్తాధిపత్యం వహిస్తున్న బహుళ జాతి సంస్థలకు అనుకూలంగా ప్రపంచవాణిజ్య సంస్థ, మేథోపర హక్కుల చట్టాన్ని తెచ్చింది. అటువంటప్పుడు మన స్థానిక సంస్థ ఎలా ప్రయోజనకారికాగలదు?
జ. జాతీయ రైతు కమిషన్ దేశంలో ఒకే మార్కెట్ విధానం నడవాలనే ‘భారత వ్యాపార సంస్థ’ అవసరాన్ని సూచించింది. ఈసంస్థ తమ ఉత్పత్తుల ఎగుమతుల, దిగుమతుల్లో మన రైతులు ఎదుర్కొనే సమస్యల్నే గాక, వ్యవసాయ ఉత్పత్తికి తగిన వనరుల ధరల నిర్ణయానికి తోడ్పడుతుంది. తద్వారా విదేశీ సంస్థల గుత్తాధిపత్యాన్ని ఎదుర్కోగలం.
ప్ర. ప్రభుత్వాలు మీ సలహాల్ని అర్థించి, వాటిని అమలు చేసేవిషయంలో అశ్రద్ధ వహిస్తున్నాయి. అయినా మీరు మౌన ప్రేక్షకుడిలాగా ఉండి పోతున్నారనే విమర్శ మీమీద ఉన్నది. దీనికి మీ సమాధానమేమిటి?
జ. తగినంత ఆహార లభ్యత పరంగానూ, ఆకలి సమస్య తలెత్తకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి సలహా యివ్వటం, నడిచే మార్గం సూచించడం వరకే చేస్తారు. ఆ సలహాలు ఆచరణ పరంగా, సామర్థ్యపరంగా అనుకూలంగా ఉండాలి. హరిత విప్లవ ఆవిష్కరణ రోజుల్లో యిదే చెయ్యగలిగాం. ఆనాడు రాజకీయ నాయకులైన భారతరత్న సుబ్రమణ్యం, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధి వంటి వారుండడం అదృష్టం.
ప్ర. రాజ్యసభ సభ్యులుగా వ్యవసాయం లేక పర్యావరణం విషయాల్లో నిర్ణయ భాగస్వామ్యపరంగా మీరు తృప్తి పొందారా?
జ. నేను రైతుల, అలానే వ్యవసాయరంగ ప్రతినిధిగా పార్లమెంటు సభ్యుడిగా సేవ చెయ్యగలిగాననే అనుకొంటున్నాను (చివరి రోజు నా వీడ్కోలు ప్రసంగాన్ని మీకందిస్తాను). మహిళా రైతు సాధికారతకై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టగలిగిన అవకాశం నాకే లభించింది. అందెంతో తృప్తినిచ్చింది.
ప్ర. ప్రస్తుతం కంపెనీలు ఉత్పత్తి చేసే ‘మొదటితరం హైబ్రీడ్ విత్తనాల” వల్లే దిగుబళ్లు పెరుగుతాయి అనే ప్రచారం నడుస్తున్నది. ఇదెంతవరకు సమర్థనీయం? అలానే మొక్కలోకి చొప్పించబడిన విషపు జన్యువు ద్వారా వెలువడే పురుగు మందు (బిటి జన్యువు) ఏ విధంగా మనం సాంప్రదాయంగా మొక్కపైన చల్లే పురుగుమందుల కంటే భిన్నమైంది?
జ. హైబ్రిడ్ రకాలు ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడతాయి. మొక్కజొన్న (ఐరోపా, అమెరికా)తో మొదలైన ఈ వరవడి, చైనా ద్వారా వరికి పాకింది. అయితే మనం సూటి (ప్రతిసారి సంకర పరచాల్సిన అవసరం లేని) రకాల్ని కూడా పెంపొందించాలి. తద్వారా రైతులు వాటిని కాపాడుకోగలరు. నిజానికి ప్రభుత్వసంస్థలు సూటిరకాల రక్షణకు, విస్తరణకు పాటుబడాలి. పత్తిలో చాలా దేశాలు రైతులకు అనుకూలమైన సూటి రకాల్నే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు తయారు చేస్తున్నాయి. మన దేశంలో ఎందుకనో భిన్నమైనవరవడి నడుస్తున్నది.
ప్ర. 2015ని అంతర్జాతీయ భూముల (మట్టి) సంవత్సరంగా ప్రకటించారు. దానికి ప్రపంచ సంస్థలేగాక మీవంటి ప్రముఖులు కూడా ప్రచారమిచ్చారు. అయితే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, విలువైన వ్వసాయ భూముల్ని వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తున్నారు. దీనికి మీ స్పందన ఏమిటి?
జ. ఐక్యరాజ్యసమితి సంస్థ యిచ్చిన ఈ పిలుపును గుర్తించి మట్టినాణ్యతకు, వ్యవసాయ యోగ్యమైన భూమి రక్షణకు తగిన విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రపంచ వ్యవసాయ ఆహార సంస్థ, భూ వనరు రక్షణ ఉద్యమ భాగస్వామ్యపరంగా మనదేశంలో నన్ను నియమించింది. తద్వారా భూ వనరు రక్షణలో, అభివృద్ధిలో అంతర్జాతీయ సహకారాన్ని మన పాత్రకూడా ఉంటుంది. ఈ సందర్భంగా ఆహార భద్రత సుస్థిరతకు తగినట్లు మన భూమల్ని రక్షించుకొనే కొన్ని సలహాలిస్తున్నాను. సంవత్సరానికి రెండు – మూడు పంటల సాగుకు అనుకూలమైన భూములున్న ప్రాంతాల్ని ప్రత్యేక వ్యవసాయ మండళ్లుగా గుర్తించాలి. రైతుల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వాలే వీటిని గుర్తించి నిర్వహించాలి. ఆ ప్రాంత రైతులకు వ్యవసాయ మండళ్లు నిర్వహించటకి ప్రత్యేక వనర్లు కల్పించాలి.
మన వ్యవసాయ- పర్యావరణ జోన్లుగా గుర్తించిన 130 ప్రాంతాల్లో భూసార నిఘా మరియు రక్షణ కేంద్రాల్ని ఏర్పరచాలి.
ఈ కేంద్రాలు భూ సమస్యలైన చౌడు, ఊట వంటి వాటికి పరిష్కరించే నేర్పును రైతులకు కల్పించాలి. భూమిలో తేమ నిలుపుదలకు తద్వారా సూక్ష్మక్రిముల రక్షణకు అత్యంత కీలకమైన సేంద్రీయ పోషకాల నిలుపుదలకు ప్రత్యేక ప్రాధాన్యత నివ్వాలి.భూ నాణ్యతకు దోహదపడే వానపాములు, నత్రజని పెంపొందించే, భాస్వరాన్ని అందించే సూక్ష్మ జీవుల వృద్ధి గురించి ప్రచారం చెయ్యాలి. భూసార రక్షణ ఉద్యమానికి తగిన మానవ వనరునురూపొందించుకోవాలి.
ప్ర. ప్రజా సైన్స్ ఉద్యమం మీద నమ్మకమున్న మీరు, అలానే అనేకమంది నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తల సహచరుడిగా మీరు పెక్కు అంతర్జాతీయ ఉద్యమాలకు స్పందిస్తూ వచ్చారు. ముఖ్యంగా శాస్త్ర సాంకేతికాలు మానవ కళ్యాణానికి తోడ్పడాలనే “పగ్వాష్ వేదిక”కు మీరు నాయకులుగా (అలర్ట్ ఐన్స్టీన్, బెట్రెండ్ రస్సెల్ వారసుడిగా) పనిచేశారు. మేము, మీరు ఈ భూమ్మీద ఉన్న కాలంలో జీవిస్తున్నందుకు గర్వపడుతున్నాం. మీ విలువైన సలహాలతో మా (ఆంధ్రప్రదేశ్,తెలంగాణా రాష్ట్రాల) జన విజ్ఞాన వేదికను ఆశీర్వదించండి.
జ. “మీ మానవతను గుర్తుంచుకోండి, మిగిలినవి మర్చిపోండి; అలా చెయ్యగలిగితే ఒక కొత్త స్వర్గానికి దారులు తెరిచినట్లవుతుంది. అలా కాకపోతే మీముందు ప్రపంచ వినాశనం ఉంటుంది” అని నినదించిన “పగ్నాష్” ఉద్యమానికి బెట్రెండ్ రస్సెల్, అల్బర్డ్ ఐన్స్టీన్ రూపమిస్తే దానికి నేను ఐదేళ్లు అధ్యక్షుడిగా పనిచేశాను. ఈ నేపథ్యంతో, సైన్స్ ఉద్యమ కార్యకర్తలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.