డా. గేయానంద్

దాదాపు 85 వేల సంవత్సరాల నాడు, ఒక హంటర్ గాదరర్ సమూహం, ఆఫ్రికాను వీడింది. మూడు వేల తరాలకు ముందటి, మన పూర్వీకులు వాళ్ళందరూ. ఈ మహా ప్రయాణం ప్రారంభించినప్పుడు, వారి శరీరానికి ఒక పరిమితి( ఇప్పటికీ!) ఉంది. చాలా దూరాలు నడవటం పరిగెత్తడం తప్ప, వాళ్లకున్న శారీరిక సామర్థ్యం ఇంకేదీ లేదు. పరిసరాలు, వాతావరణం విధించే పరిమితులు ఎలాగూ ఉన్నాయి. వీటన్నింటికీ తగ్గట్టుగా మార్పులు సంతరించుకోగలిగే వాళ్లే మిగులుతారు. ఆ మార్పులు శారీరక మార్పులే కానక్కరలేదు, సామాజిక మార్పులు, సాంస్కృతిక మార్పులు కూడా. ఇటువంటి సవాళ్లు, అవకాశాల మధ్య 50 వేల సంవత్సరాల నాడు, హోమోసెపియన్స్, ఆసియాను చేరుకున్నది. అది ఇంకా పాత రాతియుగమే. కానీ, అప్పటికే, లక్షల సంవత్సరాల మానవ శరీర పరిణామ క్రమం సాధించిన కొన్ని విజయాలు ఉన్నాయి. 
అవి –
1. శరీరం నిట్ట నిలువుగా నిలబడటం, చేతులకు స్వేచ్ఛ 
2. చేయి పట్టు సాధించేట్టుగా బొటనవేలు 
3. మెదడు సైజు పెరగడం, సెరిబెల్లంలో వచ్చిన మార్పులు.
 4. శబ్ద సంకేతాల ద్వారా సమన్వయం.

50 వేల సం. నాడు జరిగిన విప్లవం…..
శరీరంలో వచ్చిన ఈ మార్పులన్నీ, పరిసరాలను ఎదుర్కొంటూ, మనిషి సంతరించుకున్నవే. ఈ వేల సంవత్సరాల కాలంలో, మనిషి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్నాడు. తోబా లాంటి అగ్నిపర్వతాల విస్పోటంలో, భారత ఉపఖండం లాంటి చోట్ల దాదాపు తుడిచిపెట్టుకుపోయాడు. మళ్లీ  కూడదీసుకున్నాడు. ఒక పది లక్షల సంవత్సరాలుగా రాయిరప్పే అతని పరికరాలు, ఆయుధాలూ. కానీ 50 వేల సంవత్సరాల నాడు మానవ జీవితంలో సరికొత్త మార్పులు విస్తృతంగా జరిగినట్టు, ఆంత్రో పాలజిస్టులు చెబుతున్నారు.
ఒక విధంగా, వేల సంవత్సరాలుగా పోగు పడిన మానవ అనుభవం, సమిష్టి జీవితం గుణాత్మక మార్పులకు లోను అయింది. దీన్న అప్పర్ పాలియోలితిక్ విప్లవం (పాతరాతి యుగంలో చివరి దశ) అని అంటారు. 

ఆ మార్పులు ఏమిటో ఒకసారి చూద్దాం..
1. అంతవరకు చిన్న చిన్న జంతువులను, వేటాడి బతికిన మనిషి, హఠాత్తుగా మేమత్ లాంటి పెద్ద జంతువులను వేటాడిన ఆనవాళ్లు కనిపిస్తాయి.
2. గుహల్లో కళాత్మకంగా కనిపించే చిత్రాలు అప్పుడే గీయడం ప్రారంభించాడు. రంగులు వాడాడు.
3. ఏనుగుల దంతాలపై, ఎముకలపై చెక్కిన ఆకృతులు, అలంకరణలు కనిపిస్తాయి.
4. సమాధులలో, ఏవో వస్తువులు, బహుశా బహుమతులు పెట్టడం లాంటి తంతులు కనిపిస్తాయి.
5. నివాస స్థలాలు చెల్లాచెదురుగా కాకుండా, ఒద్దికగా సర్దుకున్నట్టు కనిపిస్తాయి.
6. వెదురు మోవి దొరికింది.
7. అంతకు ముందే కలపతో చేసిన పడవలు కనిపించాయి.
8. మనిషి ఏవో వెతకడానికి వెళ్లినట్టుగా, అనుకూలం లేని ప్రాంతాలకు వెళ్లినట్టు కనిపిస్తుంది.
9. ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగిన ఆనవాళ్లు కనిపిస్తాయి.
10. విస్తృతంగా కొత్త కొత్త పనిముట్లు (blades, flakes, boring harpoons, fish hook, oil lamps, rope, eyed nidle) కనిపించాయి. 

ఈ సమాజాలన్నీ, వేట మీద ఆహార సేకరణ మీద ఆధారపడిన సమాజాలే. కానీ వాటిలో ఒక కొత్త దనం కూడా కనిపిస్తుంది. ఇప్పటి ఆధునిక మానవుడి ప్రవర్తనకు ప్రాతిపదిక అప్పుడే ఏర్పడిందని, శాస్త్రవేత్తలు అంటారు.
సుదూర భవిష్యత్తులో మనిషి సాధించబోయే విజ్ఞానాలకు అవసరమైన తొలి పరిస్థితులు అవి.

అయితే శిలాయుగపు పరిస్థితులు అన్ని చోట్ల ఒకే విధంగా ఒకే సమయంలో లేవు. వివిధ చోట్ల వివిధ సమయాలలో ఉన్నాయి. కొన్నిచోట్ల కలగలసిపోయి ఉన్నాయి.

వేటలో సంక్షోభం
మరో 30 వేల సంవత్సరాలు, దాదాపు ఇలాగే గడిచాయి. కానీ ఇప్పటికి 20వేల సంవత్సరాల నాడు మంచు ఖండాలు కరగడం ప్రారంభించాయి. ప్రపంచం వేడెక్కడం ప్రారంభించింది. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది ఒక సమస్య. మంచు కరిగే కొద్దీ సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. భూఖండాలు మునిగిపోతున్నాయి. భూ వంతెనలు (land bridges) కనుమరుగవుతున్నాయి. తండ్రాల స్థానంలో దట్టమైన అడవులు వచ్చాయి. అంతకుముందున్న జంతువులు తగ్గిపోయాయి. పశ్చిమ మధ్య ఆసియా లలో ఎడారులు ఏర్పడ్డాయి. మనుషులు నదీ లోయల్లోకి, ఎత్తయిన తడి ప్రాంతాలలోకి, నీళ్లున్న చోట్లకి వెను తిరుగుతున్నారు. అప్పటికే మనిషి భూగోళం అంతా వ్యాపించాడు. 

పదివేల సంవత్సరాల నాడు, వేట సమాజం ఒక సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. మనిషి వేటాడి వేటాడి, జంతువుల సంఖ్య తగ్గిపోయింది. వాతావరణ మార్పుల వల్ల మైదానాలు మాయమై, దట్టమైన అడవులు ఏర్పడ్డాయి. పాత జంతువులు నశించాయి. మైదానాలు అడవులుగా మారేకొద్దీ మనిషి జంతువుల కోసం తన స్థావరాలను మార్చుకోవాల్సి వచ్చింది. వేటాడే పద్ధతులనూ మార్చుకున్నాడు. కానీ ఆసియా ప్రాంతంలో ఒక కొత్త పరిస్థితి ఏర్పడింది. అక్కడ మంచు ప్రాంతాల స్థానంలో, ఎడారుల లాంటి(arid) వి ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులలో ఆహార సేకరణకు వీలు లేదు. ఆహార ఉత్పత్తికి, వ్యవసాయ ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. దీంతో పాటుగా రాతి పనిముట్లలో మెరుగుదల ప్రారంభమైంది. నునుపైన సౌష్టవమైన పొడవైన అంచులు పదునైన మొనలు ఉండే రాతి పనిముట్లు వాడుకలోకి వచ్చాయి. నూతన శిలాయుగం ప్రారంభమైంది. 

నియోలితిక్ విప్లవం
వ్యవసాయం వైపుగా మానవ ప్రయాణం 12-14 వేల సంవత్సరాల నాడు ప్రారంభమైందని అనవచ్చు. గింజ వేస్తే మొక్క మొలుస్తుందని తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ పంటను పండించడం మాత్రం కష్టమే. అంతేకాక, వేటలో ఉన్న ఉత్తేజం, తక్షణ ఫలితం ఇందులో లేదు. చేపలు పట్టడంలో, పళ్ళు ఫలాలు ఏరుకోవడంలో కూడా ఒక సౌలభ్యం ఉంది. మొదట్లో మనిషి వేట నుండి పంట వైపు మళ్ళడం, అంత సులభంగా జరగలేదు. కానీ అవసరం మనిషిని వ్యవసాయం వైపు మళ్ళించింది. మనిషి కింద మీద పడి, అనేక అడుగులు వేసి, అనేక చిక్కులను విప్పుకొని, చివరికి గడ్డి జాతుల్ని ఎలా పెంచాలో నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే దక్షిణ పశ్చిమాసియాలో కొన్ని ప్రాంతాలలో రాతి కొడవళ్ళు, జంతువుల దవడను కొడవలిగా వాడటం, అడవి గొర్రెలను మేకలను మచ్చి క చేసుకోవడం కనిపిస్తుంది. 

వ్యవసాయ ఆవిష్కరణ నిప్పు ఆవిష్కరణతో సరి సమానమైన చర్య అని బెర్నాల్ అంటాడు.

మొక్కల్ని పెంచడం, అనేక పరిణామాలకు దారితీసింది. ఒక స్థిరనివాసం అవసరమైంది. కొత్త పనిముట్లు అవసరమయ్యాయి. కొత్త అవకాశాలు వచ్చాయి. గింజలు పండించిన వారు వదిలేసిన గ్రాసం మేయడానికి పశువులు వచ్చి మచ్చిక అయ్యాయి. అప్పటికే, వేటలో కుక్కను మచ్చికగా చేసుకున్న మనిషికి, వ్యవసాయంలో పశువుల్ని మచ్చిక చేసుకోవడం పెద్ద కష్టం కాలేదు. ప్రపంచంలో అన్ని చోట్ల పంటను కోయడానికి, కొడవలి లాంటి దాన్నే (రాతితోనో, దవడ ఎముకతోనో) వాడారు. పంటను పండించడం, పశు పోషణ కంటే ఎక్కువ ప్రభావపూర్వకమైనది. తగినంత గ్రాసం పండించకుంటే, పెద్ద సంఖ్యలో జంతువుల్ని పోషించలేరు. క్రమేణ జంతువుల మాంసం, చర్మాలు, ఉన్ని వాడకం, మార్పిడి జరగడం ప్రారంభమై ఉండాలి. వీటిని, ఆయుధాలు అలంకరణలు ఇతర ఆహారాలతో, మార్పిడి చేసుకుని ఉంటారు. ఉత్సాహాన్నిచ్చే వేట బదులు, పశువులమందల్ని కాయడం ఆకర్షణీయం అయ్యింది.

అడవి గడ్డి గింజల జాతులు సమృద్ధిగా ఉండే చోట్ల, వాటిని పీకడం పెంచడం బుట్టలో పెట్టడం లాంటి పనులు జరిగి ఉంటాయి. పాత రాతి యుగంలో స్త్రీలు వీటిని ఏరుకునే పని చేసేవారు. వ్యవసాయం కూడా వారి ఆవిష్కరణ అయి ఉంటుంది. ఎద్దులతో మడక కట్టి దున్నే వరకు, స్త్రీలే వ్యవసాయ చేసి ఉంటారు. పాత రాతియుగంలో మహిళలు కర్రతో తవ్వి దుంపలు పోగు చేసేవారు. కాబట్టి ఆ కర్రే మడక లాంటిదిగా మారి ఉంటుంది. వేట కంటే వ్యవసాయం ప్రాధాన్యత పెరిగే కొద్దీ, స్త్రీల స్థాయి కూడా పెరిగి ఉంటుంది. వ్యవసాయం ఒక విధంగా స్త్రీల ప్రాధాన్యత (matrilenier) పునరావృతం కావడానికి ఉపయోగపడింది. అయితే పశు పోషణ ప్రాధాన్యత పెరిగే కొద్దీ, సమాజం పితృస్వామ్యానికి మారిందని (patriarchy) బెర్నాల్ అంటాడు. అంతకు ముందున్న సంస్కృతితో పెద్దగా తెగతెంపులు చేసుకోకుండానే, ఇదంతా జరిగి ఉండొచ్చు.

ప్రకృతితో మారిన సంబంధం
వ్యవసాయం మనిషికి ప్రకృతికి మధ్య ఉండే సంబంధాన్ని మార్చివేసింది. అంతవరకు మనిషి చెట్ల మీద, జంతువుల మీద ఆధారపడి పరాన్న జీవి లాగా బతికాడు. కానీ ఇప్పుడు తన ఇచ్ఛ మేరకు ప్రకృతిని నియంత్రించడం ప్రారంభించాడు. ప్రకృతి సూత్రాలు అర్ధమయ్యే కొద్దీ మరింత స్వతంత్రత సాధిస్తూ పోయాడు. అది ఆదిమ స్థాయి వ్యవసాయమే. అయినా ఒక విస్ఫోటం లాంటి ప్రభావం చూపిందంటాడు బెర్నల్. అంతకు ముందు లేని కొత్త సామాజిక క్రమాలకు ఇది దారితీసింది. ఆహార ఉత్పత్తి పెరిగింది. దానితో జనాభా పెరిగింది. ఇదొక గుణాత్మక మార్పుకు దారి తీసింది. వ్యవసాయం అనేది వేటలాగా ఒక నిరంతర వ్యాపకం కాదు. అది ఋతువులను బట్టి మారుతూ ఉంటుంది. మనుషులకు వేరే పనులు చేసే వెసులుబాటు ఏర్పడింది.. 

వ్యవసాయం చేసే కొద్దీ కొత్త అవసరాలు ఏర్పడ్డాయి. కొత్త జ్ఞానాలు తెలిసాయి. కొత్త పద్ధతులను నేర్చుకున్నాడు. నాటడం కలుపు తీయడం నూర్చడం కోయడం కాల్చడం ఉడకబెట్టడం- ఇవన్నీ మనిషి నేర్చుకున్నాడు. అల్లడం నేయడం కొండలు చేయడం నేర్చుకున్నాడు. ఒకే చోట, స్థిర నివాసం ఉండే క్రమంలో, కుండలు చేయడం గుడిసెలు వేయడం నేర్చుకున్నాడు. జంతువులు బాగా దొరికే చోటు, మాటు వేయడానికి వీలుగా గుడిసెలు లాంటివి వేసుకోవడం అవసరమైంది.. వ్యవసాయం ఒక్క కొత్త భావనను ముందుకు తెచ్చింది. అది పని అనే భావన. వేటాడే సమాజంలో పని అనే భావన విడిగా లేదు.     

ఇవన్నీ కలగలసి, సాంస్కృతిక జీవితంలో ఒక వేగాన్ని తెచ్చింది. ఆస్తి ఉనికిలోకి వచ్చింది. వేటాడే సమాజాలలో ఆస్తి అంటే, వేట సామాగ్రి, వంట సామాగ్రి దుస్తులు లాంటివే. ఇలా ఎక్కువ కాలం మన్నేవి మాత్రమే ఆస్తిగా ఉండేవి. వీటిని ఎవరికి వారు వ్యక్తిగతంగా దగ్గర ఉంచుకొని వాడుకునేవారు. ఆహారాన్ని వేటను కొన్ని క్రతువులు తంతుల ద్వారా పంచుకునేవారు. కానీ వ్యవసాయక సమాజాల్లో ఆస్తులంటే, భూమి పశువులు గుడిసెలు పంట గింజలు. ఇవన్నీ దాదాపు ఉమ్మడి ఆస్తిగా ఉండేవి. వాటిని రక్షించుకోవాలి. పంచుకోవాలి. వ్యక్తిగతంగా శ్రమచేసి పంటలు పండించాలి. తాము పండించింది తమకే దక్కాలనే ధోరణి వచ్చింది. పండించింది మార్పిడి చేసుకోవడం అలవాటయింది. వ్యక్తి గత ఆస్తి ఉనికిలోకి వచ్చింది. ఆస్తిలో తార తమ్యాలు కూడా వచ్చాయి. ఈ తారతమ్యాలు వర్గాలుగా మారటానికి, చాలా కాలమే (నగరాలు ఏర్పడేదాకా) పట్టింది.  

మానవుడి భౌతిక జీవితంలో ఇంతగా మార్పు వచ్చింది కాబట్టే, దీన్ని నియోలితిక్ విప్లవం (నూతన శిలాయుగపు విప్లవం) అన్నారు.

ఈ సామాజిక ఉత్పత్తి క్రమంలోనే మనిషికి ప్రకృతి విజ్ఞానమూ పెరుగుతూ వచ్చింది.

తొలి ప్రకృతి విజ్ఞానాలు
విజ్ఞానం పెరగడం, ఒక అంశానికి ఇంకో అంశానికి ఉండే సంబంధాన్ని గుర్తించడంలో ఉంది. అంటే కార్య కారణ సంబంధాలను గుర్తించడం. వ్యవసాయం, పశు పోషణ కొనసాగే క్రమంలో మొక్కల జంతువుల జీవన చక్రాలను మనిషి గమనించాడు.   

బట్టలు నేయడం బుట్టలోల్లడం వ్యవసాయానికి అనుబంధమయ్యాయి. దారాల అల్లిక,వెదురు అల్లికలో సంఖ్యకు రూపానికి మధ్యన సంబంధం తెలుస్తూ వచ్చింది.

కర్రతో గిరగిరా రాపిడిని కల్పించడం ద్వారా నిప్పును పుట్టించే పద్ధతి, నూలును గిరగిరా వడకడం లాంటివి చక్రం ఆవిర్భావానికి దారితీసి ఉంటుంది. కుండల తయారీతో నిప్పుపై మరింత నియంత్రణ పెరిగింది. లోహాలను కాల్చడం నేర్చుకున్నాడు. తొలి కాలాల రసాయనిక ప్రక్రియలకు ఇదే బీజం వేసి ఉంటుంది. 

ఈనాటి శాస్త్ర విజ్ఞానాల ఛాయలను, ఆనాటి వ్యవసాయ ఆవిర్భావంలో చూడవచ్చు.

కొన్ని పర్యవసానాలు
వ్యవసాయం గ్రామాలు ఏర్పడడానికి దారి తీసింది. కొత్త రాతియుగం గ్రామాలు అంటారు. ఈ గ్రామాలలో స్థానిక అవసరాలు తీర్చే ఒక స్థానికమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. ఇటువంటి గ్రామాలు ఒకదాని తర్వాత ఒకటి విస్తృతంగా ఆవిర్భవించాయి. గ్రామ అవసరాలు స్థానికంగా గ్రామంలోనే తీర్చుకోగలిగిన ఈ గ్రామాలలో, కుచించుకుపోయి, అభివృద్ధికి అవకాశం లేకపోయింది. 

వ్యవసాయం వల్లా జనాభా పెరిగింది. జనాభా పెరిగే కొద్దీ అవసరాలు కూడా పెరుగుతాయి. క్రమేణా సారవంతమైన, నదీ ప్రాంతాలలో వ్యవసాయం ప్రారంభమైంది. నదుల వరదలు ఆపడానికి అడ్డుకట్టలు కట్టాల్సి వచ్చింది. దీనికోసం మనుషుల మధ్య, గ్రామాల మధ్య సహకారం అవసరమైంది. నదీ లోయల వ్యవసాయం నుండి మంచి ఫలితాలు రావాలంటే అది విస్తృతమైన స్థాయిలో జరగాలి. దానికి మనుషుల మధ్య గ్రామాల మధ్య సహకారం చాలా అవసరం. నైలునది పరివాహక ప్రాంతాలలో అదే జరిగింది. అక్కడున్న గ్రామాలన్నీ ఒక యూనిట్ గా తయారయ్యాయి. రెండు మూడు శతాబ్దాలలోనే ఎంతో అదనపు సంపద పోగు పడింది. మొదటి ఈజిప్టు సామ్రాజ్యం రూపొందటంలో ఈ అదనపు సంపదే ఒక పాత్ర వహించింది. అంటే కొత్త సాంకేతికత అవసరం లేకుండానే, ఒక పెద్ద యూనిట్ నిర్మింపబడే క్రమమే అనుకోని మార్పులకు దారితీసింది. కానీ ఈ నాగరికతలేవి నదీలోయల సారవంతమైన భూములను దాటి వెళ్లలేకపోయాయి. మెసెపటోమియా సింధు నాగరికతల పరిస్థితి కూడా ఇదే. 

మన మొదటి వ్యవసాయ గ్రామం
భారత ఉపఖండములో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 
పాకిస్తాన్ లో భాగమైన, బిలోచిస్తాన్ లో భౌగోళికంగా సింధు మైదానంలో భాగంగా (బోలన్ కనుమ కచ్ మైదానం) పరిగణించే ప్రాంతం ఉంది. అక్కడ మెహర్ గర్ అనే ప్రదేశం లో 7000-5000 bc వ్యవసాయం ప్రారంభమైనట్టు పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతారు. నీరులేని ఈ పొడి ప్రాంతంలో వ్యవసాయం పశు పోషణ ప్రారంభమైనాయి. అక్కడ బార్లీ గోధుమ సాగుచేసిన ఆనవాళ్లు ఉన్నాయి. వేటే ముఖ్యమైన జీవనాధారంగా ఉంది. ఆవు ఎద్దు గొర్రెల మచ్చిక ప్రారంభమైంది. ఆ ప్రదేశంలో తిరుగళ్ళు రోళ్లు, పిండి చేసే రాళ్లు, పనిముట్లుగా వాడిన ఎముకలు దొరికాయి. వెదురు బుట్టలు, జంతువుల బొచ్చుతో బట్టలు చేసిన ఆధారాలు దొరికాయి. సమాధులలో పూసల ఆభరణాలు, ముత్యపు చిప్పలు కనిపించాయి. ధాన్యాన్ని నిలువ చేసే వసతులు కనిపించాయి. తక్కువ వర్షపాతం గల ఈ ప్రాంతాలలో వాగులకు అడ్డుకట్టలు వేసి నీటి సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారు. పత్తి సేద్యం చేశారు. ఆహారం కొరకు వేట కంటే మచ్చిక చేసుకున్న జంతువులపై ఆధారపడ్డారు. కాల్చిన కుండలు చేశారు.
భారత ఉపఖండంలోని మొదటి వ్యవసాయ సమూహాల భౌతిక జీవితం ఇది.

కొత్త రాతియుగం తర్వాత కంచు యుగం వచ్చింది. నగర నాగరికతలు వచ్చాయి. క్రీస్తుపూర్వం 3000- 4000 సంవత్సరాల మధ్య జరిగిన సాంకేతిక పురోగమనం, సాంకేతిక రంగంలో ఎన్నో కీలకమైన మార్పులు తెచ్చింది. ఇది ఎంతటి అభివృద్ధి అంటే, మళ్లీ 16వ శతాబ్దం వచ్చేదాకా, అంతటి ప్రభావ పూర్తిమైన సాంకేతిక అభివృద్ధి జరగలేదంటారు.

అదేమిటో వచ్చే నెలలో చూద్దాం...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *