మంచి పుస్తకం సమీక్ష – విఠపు బాల సుబ్రహ్మణ్యం
“ఆదిమ మానవుడు జంతువుల్ని చంపి మాంసాన్ని తిన్నాక వాటి తోలును వెచ్చగా కప్పుకోవడం నేర్చుకున్నాడు. తర్వాత దానితో పాదరక్షలు చేసుకున్నాడు. దీంతో అతనికి అడవుల్లో విశాల ప్రాంతాల్లో తిరిగే సామర్థ్యం ఎంతో పెరిగింది” అంటాడు జెడి బెర్నాల్. చర్మం వాడకానికీ, మనిషి తిరగడం పెరగడానికి మధ్య ఇంత కథ వుందన్న సంగతి మన ఊహకందని విషయం.
మట్టి పూసిన బుట్టలో ద్రవ పదార్థాలు నిల్వ వుంచడం వల్ల అవి పులిసి, నేడు మనం ఈస్ట్ గా చెప్పుకునే రసాయన ద్రవ్యం పుట్టుకొచ్చింది దాంతో దాన్ని వడగట్టుకునే పరికరాలు అవసరమయ్యాయి. ఇలా పాతరాతియుగం నాటికే మనిషికి “తాగుడు” అలవాటయిందంటే ఆశ్చర్యం వేస్తుంది గదూ!
మట్టి కుండ మనకిప్పుడు చాలా చిన్నదే గావచ్చు. కానీ దాని ఆవిష్కరణతోనే పాతరాతి యుగం పరిసమాప్తమై కొత్త రాతి యుగం మొదలైంది! అంటే మన కుండ రెండు యుగాల మధ్యవర్తి అన్నమాట!
పాలస్తీనాలోని “జరికో” క్రీపూ 7000నాటిది. అదే మానవుడు నిర్మించుబడకొన్న మొదటి గ్రామం. దాని జనాభా రెండు మూడు వేలు! అంటే అదొకరకంగా చిన్న సైజు పట్టణం!
మానవుడు మొదట లోహాల్ని ఆయుధాల కోసమే కరిగించాడనీ, సమాధుల్లో దొరికిన రాగి వస్తువులన్నీ ఆయుధాలేననీ తెలిసినప్పుడు ఆయుధాలకీ,సైన్సుకూ మధ్య ఆదిమకాలంలోనే ఇంత బంధముందా అని మనం ముక్కున వేలేసుకోకుండా వుండలేము.
కొత్త రాతి యుగంలోనే దేవాలయాలకు భూములుండేవనీ, వాటిని ప్రజలకు సేద్యం కోసం ప్రతి ఏటా పంచడం పూజారుల పని అనీ, దాన్ని దైవదత్తాధికారంగా వారు బోరవిప్పి చెప్పుకునే వారనీ తెలిసినపుడు ” భూమికీ పెత్తందార్లకూ మధ్య ఇంత గాఢానుబంధం ” అలనాటి నుంచే వుందా అనిపిస్తుంది!
అసలు తాత్విక చర్చలన్నిటికీ మూలం ఏమిటి? ఈ ప్రపంచం దైవ సృష్టి అంటారు కొందరు కాదు పదార్థం అంటారు మరి కొందరు వీరిద్దరికీ ఎప్పుడూ పడదు. ఇలా చూస్తే సృష్టి వాదమెంత సనాతనమో, పదార్థవాదమూ అంతే సనాతనమన్న మాట!
చైనాలో ఒక చేతి వృత్తిదారుడు చక్రవర్తి దగ్గరకు వచ్చి “రాత కోసం అప్పటిదాకా వాడే వెదురు కర్రలు చాలా బరువైనవనీ, పట్టు వస్త్రాలు చాలా ఖరీదైనవనీ, వీటికి బదులుగా నేను చెట్టు బెరడు, వెదురు గుజ్జు కలిపి ఒక పల్చటి పదార్ధాన్ని తయారు చేశాన”ని చెప్పి ఒప్పించిన కథ ఇప్పటిదాకా మనం విని వుండము. ఇప్పుడు మనం వాడే కాగితం క్రీశ105లో ఇలానే పుట్టుకొచ్చింది! ఇప్పుడు చెప్పండి మానవజాతి అతనికి ఎంత రుణపడి వుందో.
టాలెమీ క్రీపూ 238లోనే అలగ్జాండ్రియాలో నాలుగు లక్షల వ్రాతప్రతులతో అద్భుతమైన గ్రంథాలయం నిర్మిస్తే విజ్ఞాన శాస్త్రజ్ఞులు క్రైస్తవ మతాన్ని హేళన చేస్తున్నారన్న కోపంతో బిషప్ థియో ఫిలస్ క్రీశ 390లో దాన్ని తగలబెట్టాడు. అయినా అంతో ఇంతో మిగిలి వుంటే ఖలీఫా ఉమర్ “ఖురాన్ కన్నా ఏ గ్రంథంలోనైనా ఏముంటుంది?” అని క్రీ శ 642లో మిగిలిన దాన్ని కూడా బూడిద చేశాడు. లోకమంతా గౌరవించే ఖగోళ శాస్త్రాల బోధకురాలు హైపాటియాను మత విరోధిగా ముద్ర వేసి అలెగ్జాండ్రియాలో క్రీశ 415 లో క్రైస్తవ మతోన్మాదులు బలవంతంగా వీధుల్లోకి లాక్కొచ్చి బట్టలు చించివేసి, పెంకు ముక్కలతో చర్మాన్ని గీరి, కండల్ని కోసి చంపారు! ఆర్యభట్టీయం క్రీశ.500లో రాస్తే అది 1300 ఏళ్ళ పాటు అదృశ్యమై పోయింది! వారూ వీరూ అక్కడక్కడా చేసిన ఉట్టంకింపులే ఇంతకాలం దాని ఉనికికి ఆధారమయ్యాయి! బ్రహ్మగుప్తుడికీ ఇలాంటి కష్టాలు తప్పకపోవడంతో ఆయన అందర్నీ మెప్పిస్తూ ద్వంద్వ ప్రమాణాలతో జాగ్రత్తపడ్డాడు! ఇలా చూస్తే దేశమతకాలాలకతీతంగా చరిత్ర ఎంత క్రూరమైంది! అది సైన్సునూ, సత్యాన్నీ ఎంత వేటాడింది!
న్యూటన్ కూడా “సౌర కుటుంబం అప్పుడప్పుడూ గతి తప్పుతుందనీ, అప్పుడు దేవుడు జోక్యం చేసుకుని దాన్ని సరిదిద్దుతుంటాడని ఊహించాడు. కానీ లాప్లాస్ తన గణిత సూత్రాల ద్వారా “శక్తి చెక్కుచెదరకుండా వున్నంతకాలం గ్రహాల చలనంలో ఎట్టి మార్పు వుండ”దని నిర్ధారించాడు దీన్ని విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎంత గొప్పవారికైనా పరిమితులు వుంటాయనీ , సత్యాన్వేషణ ఎక్కడో ఏ ఒక్కరితోనో ఆగిపోదనీ, కొత్త రుజువులు దొరికినప్పుడు కొత్త నిరూపణలు రావడాన్ని ఎవరూ ఆపలేరనీ మనకు బోధపడదూ?
సముద్ర రవాణా కోసం ఓడలు, తెరచాపలు, దిక్సూచి,చివరికి ఆవిరి యంత్రాలు లాంటి ఎన్ని ఆవిష్కరణలు వచ్చినా అవి వ్యాపారుల కన్నా సముద్రపు దొంగలకే ఎక్కువగా ఉపయోగపడ్డాయి ! అసలు ఈ దొంగలే వ్యాపారులుగా, వలస దోపిడీదార్లుగా మారారు! ఈ దొంగ సొమ్మే పారిశ్రామిక విప్లవానికి దారితీసింది ! ఇదంతా చదివినప్పుడు మనం చదువుకున్న చరిత్ర అంతా తలకిందుల చరిత్ర అనిపించదూ!
ఇలా సైన్సు గురించి చెప్పకుంటూ పోవాలంటే ఎంతైనా చెప్పొచ్చు. ఎన్ని కోణాల నుంచయినా చెప్పొచ్చు!
అదంతా పెద్ద చరిత్ర. సుదీర్ఘమానవ చరిత్రతో ముడి పడిపోయిన చరిత్ర ఈ ప్రయాణంలో సైన్సు ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొందో! ఎంత ఘర్షణ పడిందో ! ఎన్ని బలిదానాలు అవసరమయ్యాయో!
ఇలా చూస్తే నిప్పు రాజెయ్యడం నుంచి, కృత్రిమ మేధ దాకా సైన్సు గమనం అద్యంతం సమాజంతో మమైకమై సాగింది సమాజాన్ని సైన్సూ, సైన్సును సమాజమూ పోటీపడి నడిపించాయి.
ఈ గతిక్రమాన్ని అధ్యయనం చెయ్యాలంటే ఇప్పటికీ వైజ్ఞానిక ప్రపంచం జె డి బెర్నాల్ Science in History ని ప్రామాణికంగా భావిస్తుంది దాన్నొక క్లాసిక్ గా లెక్కిస్తుంది కూడా. ఆర్.వి.జి మీనన్ గారి Technology and Society కూడా ఇదే కోవలోకి వస్తుంది. సులభంగా శాస్త్ర ప్రచారకులకు కరదీపికగా ఉపయోగపడగలడం దీని ప్రత్యేకత.
తెలుగులో ఇలాంటి ప్రామాణిక గ్రంథాల అనువాదాలు అడపా వచ్చినా సగటు పాఠకుడికీ, సైన్సు ప్రేమికుడికీ, మరీ విద్యార్థులకూ సుదీర్ఘ సైన్సు పురోగమనపు తీరుతెన్నులను ఒకవైపు సంక్షిప్తంగానూ, మరోవైపు సీరియస్ గాను కూడా చెప్పే ప్రయత్నాలు మాత్రం చాలా తక్కువగా జరిగాయి. మరీ ఇటీవల కాలంలో ఒకవైపు ఎంతగా విజ్ఞాన శాస్త్రం విస్తరిల్లినా దాని ప్రయాణపు సారాన్ని పట్టించే గ్రంథాలు రావడం గగనంగా మారిపోయింది. సామాజిక మాధ్యమాల్లో సూడోసైన్సుకూ, శాస్త్రాన్వేషణల వక్రీకరణకూ మాత్రం కావల్సినంత ప్రచారం లభిస్తోంది. ఇప్పుడు రాజకీయాలు కూడా దీనికి తోడయ్యాయి.
ఈ దశలో ఒక ప్రజాసైన్సు ఉద్యమకారుడిగా కెఎల్ కాంతారావు గారు ఆదిమయుగం నుంచి అణుయుగం దాకా సైన్సు చేసిన ప్రయాణాన్ని, ఎదుర్కొన్న సవాళ్లని, సాధించిన విజయాలను అద్దంలో కొండను చూపించినట్టు కేవలం 170 పేజీల గ్రంథంలో వివరించే ప్రయత్నం చేశారు. ఒక రకంగా ఇది ఆధునిక మానవ సమాజ చరిత్ర కూడా! ఎందుకంటే సైన్సు నుంచి ఆధునిక సమాజాన్ని ఏమాత్రం విడదీసి చూడలేము.
ఇదేమీ కేవలం వైజ్ఞానిక ఆవిష్కరణల వల్లెవేత గాదు. వాటి విహంగవీక్షణమూ గాదు. సైన్సుకు సమాజానికీ మధ్య గల సంబంధాన్ని ఒక స్పష్టమైన ప్రాపంచిక దృక్పథంతో వివరించే ప్రయత్నమిది. మానవుడి కుతూహలం, జిజ్ఞాస, క్రియాశీలత, వీటన్నిటికి తోడు తోసుకొచ్చిన అతని అవసరాలు అతన్ని ఎలా ముందుకు నడిపించాయో, మానవుడే మహనీయుడని ఎలా నిరూపించాయో అడుగునా ఓపిగ్గా చెప్పే శాస్త్రీయపాఠమిది!
కాంతారావు గారి పుస్తకాలన్నీ విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య సంభాషణలుగా, ప్రశ్నోత్తర రూపంలోనే వుంటాయి. ఇది ఆయన కోరి ఎంచుకున్న ప్రక్రియ. “సైన్సుకూ చరిత్ర ఉంది” కూడా మొత్తం ఇలా చర్చా రూపంలోనే సాగుతుంది. ఉపాధ్యాయుడు కుతూహలం కలిగించే ప్రశ్నలు వేస్తాడు. తయారైవచ్చిన పిల్లలు ఒక్కో దాని గురించి చెబుతూ పోతారు. అక్కడక్కడ వివరణ అవసరమైనప్పుడు కొద్దిగా టీచరు జోక్యం చేసుకుంటాడు .ఈ పద్ధతినిఎంచుకోడంలో కాంతారావు గారి లక్ష్యం మన భావితరాలన్నది స్పష్టం! దీంతో పాటు అంతర్లీనంగా “మన చదువులు ఇలా గదా వుండాల్సింది” అన్న హెచ్చరికా స్పష్టం.
ఈ పుస్తకం పొడవునా వందల ఆవిష్కరణల వివరాలున్నాయి. పిల్లల కోసం చెబుతున్నందువల్ల అన్నీ సూటిగా వీలైనంత సంక్షిప్తంగా వున్నాయి. కానీ ప్రతి ఆవిష్కరణకు నేపథ్యం, కాలం, దేశం, ఏమాత్రం అవసరం అనిపించినా ఆధార గ్రంథాల ఉట్టంకింపులు మాత్రం ఉండి తీరుతాయి. ఎక్కడా గాలి మాటలుండవు. భావోద్వేగాల్లో కొట్టుకుపోడాలూ,ఉహాలోక విహారాలూ, ఏదో ఒకవైపుకు వొరిగిపోడాలూ కన్పించవు. ఎంతో పరిశోధన, నిబద్ధత, నిజాయితీ వుంటే తప్ప ఇలా రచించడం కష్టం. కాంతారావు గారిందులో కాకలు తీరారని చెప్పాల్సిన అవసరం లేదు.
భారతీయ సైన్సుకు కూడా ఈ గ్రంథంలో రచయిత పెద్ద పేట వేశారు. సుశ్రుతుడు 300 రకాల శస్త్రచికిత్సల గురించీ (ఇందులో మూత్రాశయం నుండి రాళ్లు తీయడం కూడా వుంది ), 121 శాస్త్రపరికరాల గురించీ (బొమ్మలతో సహా ) తన శుశ్రుత సంహితలో వివరించడం; వాగ్భటుడి ఆయుర్వేద గ్రంధం “అష్టాంగ హృదయ” సామాన్య శకం 1473 నాటికే పర్షియాలోకి అనువాదం కావడం; పరాశరుడి పత్ర నిర్మాణ విజ్ఞానం; సామాన్య శకం 5 నాటికే ఏడున్నర అడుగుల ఎత్తు గల బుద్ధుడి లోహ విగ్రహం తయారీ; నాగార్జునిడి రసరత్నాకరం; తక్షశిల నలంద విశ్వవిద్యాలయాలు; వీటన్నిటినీ మించి భారతీయ వైజ్ఞానికతకు సిరియా చరిత్రకారుడు సెబోక్త్ ఇచ్చిన కితాబూ కాంతారావు గారు ఎంతో గౌరవంతో వివరిస్తారు. ఇందుకోసం నాలుగు అధ్యయాలు కేటాయిస్తారు. (విశ్వగురువులమన్న బడాయికి మాత్రం పోడు).
అయితే మనుస్మృతి శూద్రులు, చేతి వృత్తుల వారు, వడ్రంగులు, కమ్మర్లు, చాకళ్ళు, చర్మకారులు, నేరస్తులు, దొంగలు, వ్యభిచారులు మత కర్మలకు పనికిరారని చెబుతూ, ఇలాంటి అపవిత్రుల జాబితాలో వైద్యుల్ని,శస్త్ర నిపుణులన్నీ కూడా చేర్చడం లాంటి పరిస్థితుల వల్లే భారతీయ వైద్యశాస్త్ర పరిశోధనలన్నీ అర్ధాంతరంగా అటకెక్కాయంటాడు రచయిత. మత నాయకులు ఏ ఆంక్షలు పెట్టకుండా ఆమోదించినందువల్లే మూలికా వైద్యం బతికి బట్టకట్టిందనీ అంటాడాయన.
ఈ గ్రంథం అసాంతం చదివిన వారికి విజ్ఞాన శాస్త్రం అంచలంచెలుగా ఎదిగిందనీ, ఒక పరిశోధన మరొకరికి మెట్టుగా ఉపయోగపడిందనీ, ఇదంతా శతాబ్దాల శ్రమతో, అనుభవంతో సాధ్యమైందనీ, ఎక్కడెక్కడి దేశాలు ఒక దానికొకటి ఇచ్చిపోచ్చుకోవడం వల్లే మానవాళి సైన్సురంగంలో ఇంత ప్రగతి సాధించిందనీ, ప్రతి శాస్త్రజ్ఞుడికి ఆవిష్కరణకి పరిమిత కూడా ఉంటుందనీ, దేనినీ అంతిమం అనలేమనీ, సైన్సులోని లోపాలను ఎప్పుడో ఒకప్పుడు సైన్సే సరిచేసుకుంటుందనీ ఒక విశాల వినమ్ర దృక్పథం ఏర్పడుతుంది . భవిష్యత్ ప్రపంచ పట్ల గొప్ప భరోసా లభిస్తుంది.
ప్రతి ఉపాధ్యాయుడి చేతిలో, ప్రతి పాఠశాల గ్రంథాలయంలో వుండాల్సిన పుస్తకమిది. ప్రతి ప్రజాసైన్సు ఉద్యమ కార్యకర్తా చదివి దాచుకోవాల్సిన గ్రంథమిది. ఇలాంటి పుస్తకాన్ని ఏడుపదుల వయసులో ఇంత పట్టుదలతో, పరిశోధనతో రాయటం కాంతారావు గారికే చెల్లింది జన విజ్ఞాన వేదిక (తెలంగాణ) ఈ పుస్తకాన్ని మొదటి ముద్రణలోనే రెండువేల కాపీలు ముద్రించడం ఈ రోజుల్లో ఆషామాషీ వ్యవహారం కాదు. ఇద్దరూ ఎంతైనా అభినందనీయులు!



