సి. వి. కృష్ణయ్య
అవి నా చిన్నప్పటి రోజులు. నేను ఐదో తరగతి చదువుతున్నాను. మా ఇంటి పక్కన ఒక పెద్దమనిషి ఉండేవాడు. ఆయనది మా ఊరు కాదు. ఎక్కడినుంచో వచ్చాడు. ఒంటరిగా ఉండేవాడు. వైద్యం చేస్తూ జీవనం సాగించేవాడు. ఆయన్ను అందరూ “కథల బాబాయ్” అని పిలిచేవారు.
ఆయన అసలు పేరేమిటో తెలియదు. ఇంట్లో పిల్లల్ని చుట్టూ కూర్చుండబెట్టుకొని కథలు చెబుతూ ఉండేవాడు. చెప్పిన కథ చెప్పకుండా చెపుతూ ఉంటే ఎంతో ఆసక్తిగా వినేవాళ్లం. కథలో ఉండే విషయం కన్నా ఆయన చెప్పే తీరుకు మేము ఎక్కువ ఆకర్షితులమయ్యాం అని చెప్పవచ్చు. అప్పుడప్పుడు మాకు ఒక విషయం చెప్పేవాడు. మీరు పాఠాలు చదవకపోయినా పర్వాలేదు. కథలు మాత్రం తప్పక చదవండి. కథలు చదివినవాళ్లు మంచి మనుషులు అవుతారు అని చెప్పేవాడు.
మా ఊరి మధ్యలో పెద్ద అరుగు ఉంది. ఆ అరుగు మధ్యలో చుట్టూ కొమ్మలు పరచుకొని చల్లని నీడనిచ్చే పెద్ద వేపచెట్టు ఉంది. వేసవికాలంలో ఇంట్లో వేడిని తట్టుకోలేక పిల్లలూ, పెద్దలూ మధ్యాహ్నం భోంచేసి అరుగు మీదకు వచ్చి సేద తీర్చుకొనేవారు. అలాంటి సమయంలో జనం కథల బాబాయిని బ్రతిమాలి కథలు చెప్పించుకొనేవారు. ఆయన చెప్పే కథలు గంటలకొద్దీ సాగేవి.
ఆ కథల్లో తప్పకుండా మహావీరుడైన రాజకుమారుడు అందాలరాసియైన ఒక రాజకుమారి, ఒక రాక్షసుడో, మాయలు తెలిసిన మంత్రగాడో ఉండేవాడు. ఆ రాక్షసుడు రాకుమారిని అపహరించి ఏ దీవిలోనో, ఇతర లోకాల్లోనో ఎక్కడో దాచిపెట్టేవాడు. రాజకుమారుడు రాజకుమారిని వెదుకుతూ మధ్యలో అనేక శక్తులు సంపాదించుకొంటూ, వరాలు పొందుతూ అన్నిలోకాలు వెదికేవాడు. రాజకుమారుడి శక్తులకు రాక్షసుడి మాయలకు అంతు అంటూ ఉండేది కాదు. రకరకాల రూపాలు మార్చేవారు. ఆకాశంలో ప్రయాణం చేసేవారు. రాజకుమారి నిద్రాహారాలు మాని తల్లిదండ్రుల కోసం గాని ప్రియుడి కోసం గాని విలపిస్తూ ఉంటే వింటున్న శ్రోతల కళ్లల్లో నీళ్లు ఉబికేవి. నోరెళ్లబెట్టి బొమ్మల్లా ఆలకించేవారు. ఆ సమయంలో కథా ప్రవాహానికి ఎవరైనా ఆటంకం కలిగిస్తే వాడికి మూడినట్లే. కొట్టేంత పని చేసేవారు.
ఒక్కోరోజు సమయం చాలక కథ పూర్తియ్యేదికాదు. రేపటికి మిగిలిపొయ్యేది. రేపటి కథకోసం జనం ఎంతో ఆత్రుతతో ఎదురు చూసేవారు. మరునాడు కథల బాబాయ్ అరుగు మీదకి రాగానే నిన్నటి కథ ఎంతవరకు వచ్చింది, అని అడిగేవాడు. నేను నేనంటూ అందరూ కథను తిరగతోడేవారు. తర్వాతి కథ కొనసాగిస్తూ చెబుతూవుంటే మైమరచి వింటూ కొందరు నిద్రలోకి జారుకొనేవారు. ఇలాంటి సమయంలో ఏదో ఒక హాస్య సంఘటన చెప్పి నవ్వించే వాడు. మీకు నిద్రవస్తున్నట్లు ఉంది, రేపు చెప్పుకొందాం అనేవాడు. జనం ఒప్పుకొనేవారు కాదు. ఆ నిద్రపోయిన వాళ్లని చెడ తిట్టి బాబాయిని బ్రతిమలాడుకొనేవారు. అరుగుమీద జనం చేరి ఉన్నప్పుడు ఊళ్లో ఏదైనా చెడ్డ పనులు చేసిన వారి సంగతి తెలిసేది. కథలు విననివాళ్లు కథలు చదవని వాళ్లే ఇలాంటి చెడ్డపనులు చేస్తారు. దుర్మార్గులు అవుతారు అనేవాడు. విచిత్రంగా అరుగు మీదకు రాని వాళ్ల పేర్లే వినబడేవి.
బాబాయి అరుగుమీదికి రాని రోజు బాబాయిని గురించి జనం రకరకాల కథలు చెప్పుకొనేవారు. మన ఊళ్ళో మనకు కథలు చెప్పే బాబాయి ఉన్నాడు. పాపం ఇలాంటి కథలు చెప్పేవాళ్లు లేక ఇతర ఊళ్లల్లో జనాలు ఎలా బ్రతుకుతున్నారో అంటూ బాధపడిపోయేవారు.
నేను పదవ తరగతిలో ఉండగా కథల బాబాయి ఏదో జబ్బుతో కన్నుమూసాడు. ఊరి జనమంతా కన్నీరు మున్నీరై విలపించారు. మన పిల్లలకూ మనకూ ఇంక ఎవరు కథలు చెబుతారంటూ దిగులు పడ్డారు.

ఆ చిన్న వయస్సులో కథలు వింటూ పెరిగిన నేను కథల పుస్తకాలు తెగ చదివేవాడిని. క్రమక్రమంగా నవలలు, పురాణాలు శాస్త్ర గ్రంథాలు చదవడం అలవాటయింది. 50 సంవత్సరాలకిందట కథల బాబాయి చెప్పిన మాటలు అప్పుడప్పుడు గుర్తుకు వస్తూ ఉంటాయి. కథలు చదవకుండా పుస్తకాలు చదవకుండా డిగ్రీలు సంపాదించుకొని బయటకు వస్తున్న వీళ్లంతా మంచివాళ్లు కాదా? ఏమో ఆనాడు కథల బాబాయి చెప్పిన మాటలు నిజమేమో అనిపిస్తూ ఉంది.
ఇప్పుడు అభ్యుదయవాదం, మానవతావాదం, సమతావాదం వంటి మాటలు బూతు పదాలయ్యాయి. అందుకే కాబోలు ఎవరి నోటా వినబడడంలేదు. నీతి, న్యాయం, ధర్మం అని మాట్లాడేవాళ్లను చేతగాని వాళ్లని, బీ.సీ. కాలం నాటి అమాయకులని అంటున్నారు. ఎందుకిలా జరిగింది. చదువుల్లో భాషాసాహిత్యాలకున్న ప్రాధాన్యత గతంలో కంటే తగ్గినందువల్ల వట్టిపోయిన హృదయాలతో విద్యావంతులై బయటకు వస్తున్నారేమో? కాదని కొట్టివేయలేము.
మనిషి సంపాదించిన శాస్త్ర జ్ఞానం విశ్వవ్యాప్తం చెంది, భౌతిక ప్రపంచం చాలా చిన్నదైపోయింది. భూగోళమంతా మన అరచేతిలో ఉన్న సెల్ఫోన్లోకి వచ్చేసింది. మనిషి మరింత విశాలంగా ఆలోచించాలి. ప్రజాస్వామ్యవాదిగా, విశ్వమానవుడిగా ఎదగాలి. కాని మానసికంగా మనిషి ముడుచుకుపోయాడు. జాతి, కుల, మతాలను ముందుకు తెచ్చి ఊగిపోతున్నాడు. ఎదుటివారిపై కత్తులు దూస్తున్నాడు. ఎందుకు ఇలా జరిగింది? కథా సాహిత్యం చదవక పోయినందువలనేనా?
మనిషి విశ్వమానవునిగా మారడానికి కావలసిన శక్తి కథల్లో, పుస్తకాల్లో ఉందా? విశ్వమానవుడు అంటే అదేదో చాలా గొప్ప ఆదర్శం కాదు. మన పొరుగు వారు కూడా మనలాంటి వారేననుకోవడం.
కథల్లో ఏముంది? కథా సాహిత్యం మనుషుల్ని ఇంతగా ఎందుకు ఆకర్షిస్తుంది? కథ కూడా అద్దంలాంటిదే. మనిషి అద్దంలో తన ముఖం చూసుకొన్నట్లు కథలో తనను వెదుక్కొంటాడు. తన అభిప్రాయాలు, బాధలు, మంచీచెడుల గురించి తెలుసుకొంటూ వుంటాడు. కథల్లో, కావ్యాల్లో, నవలల్లో అన్నింటిలో మనుషులే ఉంటారు. చివరకు దేవుడి రూపం కూడా మనిషిదే. మంచివారిని మహాత్ములను దేవుడిగా పూజిస్తారు. లేదా దేవుడే మనిషిగా పుడతాడు. కథల్లో ఇతర జీవులు, ప్రాణంలేని బండరాళ్లు మనిషిలానే మాట్లాడతాయి. అణువణువులో మనిషి తననే వెదుక్కొంటాడు.
పుస్తకాలు చదివేవాళ్లు వంద మంది ఉన్నారనుకొంటే అందులో తొంభై మంది కథల పుస్తకాలే చదువుతుంటారు. మిగిలిన పదిశాతం ఇతర పుస్తకాలు చదువుతుంటారు.
కథలు చదివేవాళ్లు జాతి, కుల, మత భేదాలు లేకుండా ఒకేలా స్పందిస్తారు. అందరూ సినిమాలకు వెళ్లతారు. సినిమా చూసే ప్రేక్షకుల్లో ధనికులూ, పేదలూ ఉంటారు. మంచివారూ, చెడ్డవాళ్లు ఉంటారు. అందరూ ఒకేలా స్పందిస్తూ ఉంటారు. ముగింపులో చెడు ఓడిపోయి మంచి గెలుస్తుంది. ఎవ్వరు చెడు గెలవాలని కోరుకోరు. కాని నిజజీవితంలో బలహీనుడివైపు ఎంత న్యాయమున్నా గెలవడు. బలవంతులు, ధనవంతులు, అధికారం ఉన్నవాళ్లు ఈ ప్రపంచంలో గెలుస్తూ ఉన్నారు. కాని కథల్లో మాత్రం ఓడిపోవాల్సిందే. ఇది మానవ జాతి ఆకాంక్ష, కోరిక, ఆశయం. ఈ ఆకాంక్షను మానవజాతి ఏదో ఒక రోజు నెరవేర్చుకొంటుంది. అయితే మనుషులు ఈ ఆకాంక్షతో జీవించాలంటే అది కథా సాహిత్యం ద్వారానే సాధ్యం. మరింత బలంగా పురికొల్పబడుతూ ఉండాలి. ఇందుకే పిల్లలు కథలు వింటూ కథలు చదువుతూ పెరగాలి.
కథా సాహిత్యం చదవకుండా పాఠ్యేతర పుస్తకాలు చదవకుండా పైకి వచ్చిన వారికి మనుషులు మనుషుల్లా కనిపించరు. డాక్టర్లకు పేషంట్లుగా, లాయర్లకు క్లయింట్లుగా, రాజకీయ నాయకులకు ఓటర్లుగా, వ్యాపారులకు కష్టమర్లుగా మాత్రమే కన్పిస్తారు. వీళ్లంతా ప్రకృతి నుండి, మనిషి నుండి ఎంత పిండుకోవాలో అంత పిండుకోడానికే చూస్తారు.
మానవ జాతిని సమాజ అభివృద్ధిని శాస్త్రీయంగా అర్థం చేసుకోక పోతే, తాలిబాన్ల వంటి ఉగ్రవాదులు పుడుతూనే ఉంటారు. ప్రకృతిని ఇతర జీవజాతులను అర్థం చేసుకోలేకపోతే కరోనాలాంటి భూతాలు పుడుతూనే ఉంటాయి. ఈ దుష్టసమాజపు పోకడలకు విసిగిపోయిన జనం మరింత దుర్మార్గులను క్రూరులను తమ ప్రభువులుగా ఎన్నుకొంటారు. అంతులేని లాభాపేక్షతో వ్యాపారులు, ఆశబోతులు ప్రకృతి నుండి మరింత పిండుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటే కరోనా కంటే ప్రమాదకరమైన జీవులు పుట్టి మానవజాతి అంతుచూస్తాయి.
ఈ భూగోళం పచ్చగా పరిశుభ్రంగా జీవంతో కళకళలాడుతూ ఉండాలంటే మనిషి మారాలి. మనుషులు మంచి వాళ్లుగా ఆలోచనాపరులుగా మారాలి. ఇది ఒక్క కథాసాహిత్యం ద్వారానే సాధ్యం.
మనుషుల ఊహలకు, కల్పనలకు, ఆకాంక్షలకు ఊపిరి పోసేవే కథలు. కథల్లో ఉన్న కల్పనలు- శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాస్త్రాల ద్వారా వాస్తవం చేసుకొంటాడు మనిషి. ఊహలకు, కల్పనలకు ఊపిరిపోసే కథలు చదవకుండా మన విద్యార్థులకు శాస్త్రజ్ఞానంఎలా అబ్బుతుంది? శాస్త్రజ్ఞులకు మానవతా విలువలు ఎక్కడ నుండి వస్తాయి?
మనిషి కథల గుర్రాన్ని ఎక్కి స్వారీ చేసుకొంటూ సైన్సు అనే మాయామందిరంలోకి ప్రవేశించాలి. అప్పుడు మాత్రమే తన మానవరూపాన్ని నిలబెట్టుకొంటాడు. లేకపోతే ఏభూతంగానో క్రూర మృగంగానో మారిపోయి బయటకు వస్తాడు.
ఒకప్పుడు శాస్త్రాన్ని కూడా కలిపి అంతా సాహిత్యంగానే చదువుకొన్నారు. ఆధునిక కాలంలో శాస్త్రం సాహిత్యం నుండి విడగొట్టుకొన్నది. అయినా చదువుల్లో భాషాసాహిత్యాలకు, విజ్ఞాన శాస్త్రాలకు సమప్రాధాన్యత నిచ్చి చదువుకొన్నాం. ఇప్పుడు భాషాసాహిత్యాలను పక్కనబెట్టి శాస్త్రజ్ఞానం చాలు అన్నట్లుగాచదువులు సాగుతున్నాయి. ఈ చదువుల పుణ్యమే మాతృభాషల ప్రాధాన్యతలను అర్థంచేసుకోలేని మేధావులు తయారయ్యారు. ఊహలు, కల్పనలు, స్పందనలు లేని కొత్తరకపు మానవజాతి ఈ భూగోళం మీద అవతరిస్తుంది.
ఈ కొత్త రకపు మానవజాతి పుట్టింది ఈ చదువుల ద్వారా ఈ బడుల ద్వారానే. ఇది నమ్మలేని నిజం.
బాల్యంలో కథా సాహిత్యం చదవకపోవడం, పాఠ్యేతర పుస్తకాలు చదవకపోవడమనే చిన్న కారణంతో బడిమీద ఈ నాటి చదువుల మీద ఇంత పెద్ద నిందవేయడం సబబేనా?
చిన్న మేకు టైరులో దిగితే గాలిపోయి బండిబోల్తా కొడుతుంది. బోల్టు చాలా చిన్నగా కనిపించవచ్చు. అది ఊడిపోతే ఎంతపెద్ద యంత్రమైనా ఆగిపోతుంది.
కథలు చదవకపోవడం పుస్తకాలు చదవకపోవడం చిన్న కారణమా? మనిషి గుండెల్ని తట్టిలేపేవి పుస్తకాలు. పుస్తకాలు మనతో మాట్లాడతాయి. పుస్తకానికి పాఠకుడికి మధ్య ఎవ్వరూ ఉండరు. ఏకాంతంలో ఒక్కడే పుస్తకాలు చదువుతూ స్పందిస్తూ ఉన్నప్పుడే మనిషిలో మార్పు జరుగుతూ ఉంటుంది. మంచి భావనలు నాటుకొంటూ ఉంటాయి. ఇక్కడ పరీక్షలు మార్కుల గొడవ ఉండదు. గుర్తుపెట్టుకోవాలనే బాధ ఉండదు. ఇష్టపూర్వకంగా ఆనందంగా ఆసక్తిగా చదివే పుస్తకాలే మనిషిని మానవతా సింహాసనంపై కూర్చుండబెడతాయి. మహనీయుల్నిగా మారుస్తాయి.
‘మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అని అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెబుతాను’ అన్నాడు అల్బర్ట్ ఐన్స్టీన్. ‘తుపాకీ కంటే గొప్ప ఆయుధం పుస్తకం’ అన్నాడు లెనిన్. ‘శారీరక ఆరోగ్యానికి వ్యాయామం ఎలా అవసరమో మానసిక ఆరోగ్యానికి పుస్తక పఠనం అంతే అవసరం’ అన్నాడు మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. జైల్లో ఉన్నప్పుడు ‘నాకు ఎలాంటి స్వేచ్ఛ అవసరం లేదు. పుస్తకాలను చదవనిస్తే చాలు’ అన్నాడు నెల్సన్ మండేలా. ‘నాకు కోటి రూపాయిలిస్తే ముందు గ్రంథాలయాన్ని పెడతా’నన్నాడు గాంధి. ‘ఒక పిల్లవాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి పుస్తకమే’నంటాడు విన్సెన్ట్ రస్సెల్.
ప్రపంచాన్ని తిరిగిచూడాలన్నా, భూత భవిష్యత్తు కాలాల్ని దర్శించాలనుకొన్నా ముందు గ్రంథాలయమనే జ్ఞాన మందిరాన్ని సందర్శించాలి.



