డాక్టర్ గేయానంద్
గ్రీక్ ప్రకృతి విజ్ఞానులు, తొలిదశలో, ప్రకృతి కారణాలతోనే, ప్రకృతిని అర్థం చేసుకొనే ప్రయత్నం చేశారు. అన్వేషణలో, వాళ్లు ప్రకృతికి అతీతమైన శక్తులలో, ఈ కారణాలు చూడలేదు..అదొక దశ. కానీ ఆ తర్వాత దశలో, ప్రకృతి విజ్ఞానంతో పాటు, ప్రజాస్వామ్యం వంటి సామాజిక సూత్రాల పట్ల కూడా వారి దృష్టి మళ్లీంది.
.ఏథేన్స్ లో ప్రజాస్వామ్యం…
ఇనుప యుగం గ్రీస్ లో తెచ్చిన మార్పులుచూద్దాం. ఇనుప సాంకేతికత మానవ శ్రమకు తోడై, ఉత్పత్తి ఎన్నో రెట్లు పెరిగింది. ఇనుము సామాన్యుల లోహం. గతంలో కంచు ఉన్నత వర్గాలను బలోపేతం చేసిన లోహం. కానీ,సామాన్యుల చేతుల్లో ఇనుము, ప్రకృతి వనరులు ఎక్కడికి అక్కడ అందుబాటులో ఉండటం, ఇంకా ఆనాటి ఆహార ఉత్పత్తిలో ఉన్న సరళత్వం-
వీటన్నిటి రీత్యా సామాన్యుడు కూడా ఉత్పత్తిలోకి ప్రవేశించాడు. ఇటువంటి నేపథ్యంలో ఏథెన్స్ నగర రాజ్యంలో (510bc-506bc), ప్రజలు కులీనులపై తిరుగుబాటు చేశారు. ఇది రైతులు, చేతి వృత్తుల వారు,చిన్న వ్యాపారులు, భూస్వాములపై చేసిన తిరుగుబాటుగా చరిత్రకారులు చెబుతారు. అది సైనికులు, నావికులు చేసిన తిరుగుబాటు కూడా. దీని తరువాత, ప్రజల భాగస్వామ్యంతో పాలన ప్రారంభమైంది. దాదాపు 200 సంవత్సరాలు ఇది కొనసాగింది. 500bc వచ్చేసరికి ఆ సముద్ర ప్రాంతమంతా, ప్రతి నగర రాజ్యంలో ప్రజాస్వామ్యం విస్తరించింది. 1000 దాకా నగర రాజ్యాలు ఉండేవట.. ప్రజాస్వామ్యం ఇచ్చే సృజనాత్మక అవకాశాలను ప్రదర్శించేందుకు వీలైనంత ఎక్కువ కాలమే, ప్రజాస్వామ్యం మన గలిగింది. అయితే, ఈ ప్రజాస్వామ్యం పరిమితమైనదే. అందులో మహిళలు విదేశీయులు బానిసలకు రాజకీయ హక్కులు లేవు. ఓటు హక్కు మగవారికి మాత్రమే ఉండేది. ప్రతి సంవత్సరము, పదిమందిని ఎన్నుకొని, పాలన అధికారాలు ఇచ్చేవారు. అవసరమైనప్పుడు, పౌరులందరూ బహిరంగంగా సమావేశమై, రాజ్యం తరఫున నిర్ణయాలు చేసేవారు. ఈ ప్రజాస్వామ్యం వల్ల చిన్న రైతుల భూమికి రక్షణ ఉండేది. డబ్బున్న వాళ్లు పన్నులు చెల్లించేవారు. యుద్ధాలు చేయాల్సి వస్తే, యుద్ధాలలో పాల్గొనే వాళ్లే నిర్ణయాలు చేసేవాళ్లు.
అయితే, సహజంగానే, గ్రీకు ప్రపంచం రెండుగా చీలి ఉండేది. పౌరుల పాలన ఉండాలనే ప్రజాస్వామ్యవాదులుగా, కొందరి పాలన చాలనే కులీనులుగా చీలి ఉండేది. ఒక విధంగా ఈ సంఘర్షణ నుండే గ్రీకు తత్వం చరిత్ర కళ సైన్సు పుట్టాయనవచ్చు.
ఒక విచిత్రం ఏమంటే, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ ప్రజాస్వామ్య వ్యతిరేకులు. ప్రజాస్వామ్య వ్యతిరేకులుగా ఉండే అవకాశం కూడా ప్రజాస్వామ్యమే ఇచ్చింది. ఆ స్వేచ్ఛాయుత వాతావరణంలోనే, ఒక పెద్ద మేధో విస్పోటం సాధ్యమైంది. ఈ నగర రాజ్యాలలో ప్రజాస్వామ్యం ఉన్నా, రాజ్యాల మధ్య మాత్రం యుద్ధాలు జరిగేవి. బయట నుండి ఈ రాజ్యాలపై దురాక్రమణలు ఉండేవి. ఒక ఇనుప యుగపు నగరంలో తలఎత్తే, ఆర్థిక వైరుధ్యాల నుంచి కొంత తప్పించుకోవడానికి ప్రజాస్వామ్యం ఉపయోగపడింది. యుద్ధాలలో దోపిడీ, బానిసల చాకిరీ ఈ సమాజాలకు పునాదిగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఉత్పత్తిలో, ఒక ప్రతిష్టంభన ఏర్పడిందో, గ్రీస్ నాగరికతలో అంతర్గత వికాసం ఆగిపోయింది. మరో ఇనుప యుగపు నాగరికత అయిన రోమ్, గ్రీస్ ను ఓడించింది.
వాద వివాదాల నుండే విజ్ఞానం…
ఈ నేపథ్యంలో గ్రీకు విజ్ఞానుల గురించి మాట్లాడుకుందాం. గ్రీకు తాత్వికులు అందరిలోకి, విజ్ఞాన శాస్త్రానికి ఎవరు కీలకం? అరిస్టాటిల్. అంత వరకూ ఎవరు చేయని పని ఒకటి అరిస్టాటిల్ చేశాడు. జగత్తులో ఉన్న అన్ని భాగాలను ఒకదానితో ఒకటి సంబంధం కలిపి, ఒక వ్యవస్థగా చూసే ప్రయత్నం అరిస్టాటిల్ చేశాడు. ఇది విశ్వాన్ని, దేనికదే కాకుండా మొత్తంగా అర్థం చేసుకోవడానికి చేసిన మొదటి మహా ప్రయత్నం అనుకోవచ్చు.
ఆ కాలంలో గురు శిష్యుల మధ్య, వాదవివాదాలు జరిగేవి. అరిస్టాటిల్, ప్లేటోకు శిష్యుడు. ప్లేటో సోక్రటీస్ కు శిష్యుడు. సోక్రటీస్, ప్లేటోల బోధనలకు నెలవుగా ఉన్న ప్లేటో అకాడమీలో అరిస్టాటిల్ ఒక వెలుగు వెలిగాడు. ప్లేటో నైతిక విలువల వైపు ఎక్కువగా మొగ్గి, ఒక విధమైన సామరస్యతను (హార్మోని) ప్రబోధించేవాడు. అదొక గణితాత్మకమైన సామరస్యత. కనిపించేదంతా వాస్తవం కాదని ప్లేటో అనేవాడు. ఇంద్రియ జ్ఞానానికి వాస్తవం అందదని, వాస్తవమనేది గణితంలో, భావాలలో, ఆకృతులలో ఉంటుందని అనేవాడు. అయితే అరిస్టాటిల్ ఈ ప్లేటో భావాలను సవాల్ చేశాడు.
అరిస్టాటిల్ చెప్పంది లేదు, వదిలింది లేదు..
అరిస్టాటిల్ దృష్టిలో అన్నిటికంటే కీలకమైనది పరిశీలన. ఒక వాస్తవాన్ని తెలుసుకోవాలంటే, పరిశీలన చేయాలి. గణితం చాలదు. విశ్వంలో దైవత్వం అనేదే ఉంటే, అది కూడా నిర్మలమైన మేధో రూపంలో ఉంటుందని అరిస్టాటిల్ భావించాడు. వాస్తవ పరిశీలనతో ప్రకృతి కారణాలను శోధించడం కంటే శ్రేష్టమైన పని ఇంకోటి లేదని అరిస్టాటిల్ అన్నాడు. విశ్వంలో ఉన్న ప్రతిదీ ఒక మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఉంటుందని, ప్రతి దానికి ఒక అంతిమ ప్రయోజనం ముందే ఉంటుందని, ఆయన భావించాడు. ఆయన చెప్పిన పరిశీలనల సూత్రం కంటే, ఈ మాస్టర్ ప్లాన్ సూత్రమే, కొన్ని శతాబ్దాల పాటు సైన్స్ ను ప్రభావితం చేసింది. దారి తప్పించింది అని కూడా కొందరంటారు. మొక్కల గురించి, జంతువుల గురించి అరిస్టాటిల్ సరైన పరిశీలనలే చేశాడు. డాల్ఫిన్ ను ఒక క్షీరథంగా మొదట వర్గీకరించింది ఆయనే. గుండెను మేదస్సుకు కేంద్రం అని, మెదడు రక్తాన్ని చల్లబరిచే అవయవమని అన్నాడు. జీవులన్నీ ఒక నిచ్చెన మెట్ల లాంటి క్రమంలో అమరి ఉన్నాయని, పురుగు పుట్రా నుండి మనిషి దాకా ఎవరి స్థానం వారికుంటుందని, మనిషి అగ్రస్థానంలో ఉంటాడని, మనిషి కి కింద, ఇతర జీవులు, వాటి శ్రేష్టతను బట్టి వివిధ స్థానాలలో ఉంటాయని, జీవులన్నింటి మధ్య ఒక అవిచ్ఛిన్నత ఉంటుందని అరిస్టాటిల్ భావించాడు. జీవుల మధ్య ఉన్న పరిణామ సంబంధాన్ని ఊహించలేకపోయాడు. కానీ, అంతరిక్షం గురించి (కాస్మాలజీ), భౌతిక విజ్ఞానాల గురించి (ఫిజిక్స్) అరిస్టాటిల్ ముందుకు తెచ్చిన భావనలు ఎన్నో శతాబ్దాలు సైన్సును ప్రభావితం చేశాయి. భూమి చుట్టూ అనేక గోళాలు తిరుగుతూ ఉంటాయని, ఆ గోళాలలో నక్షత్రాలు, గ్రహాలు పొదిగి ఉంటాయని ఆయన భావించాడు. అరిస్టాటిల్ కు ముందు కూడా, ఇటువంటి భావనలు చేసిన వారున్నా, ప్లేటో ప్రభావం వల్ల వారు వాటిని గణితాత్మకంగానే చూశారు. కానీ అరిస్టాటిల్, ఈ గోళాల విశ్వంలోనే పదార్ధమంతా ఉందని భావించాడు. దీన్ని ఒక గణితాల లెక్కలాగా కాకుండా, ఒక నిజమైన యంత్రం లాగా భావించాడు. ఎక్కడా శూన్యం లేదని, అంతా ఈథర్ అనే దాంతో నిండి ఉందని అన్నాడు. అన్నిటికంటే బయట వరుసలో ఉన్న గోళాలలో నక్షత్రాలు ఉండి, ఇతర వరుసల గోళాలని నడిపిస్తున్నాయని (Prime mover) భావించాడు. ఈ విధమైన గోళాలు 55 దాకా ఉన్నాయని చెప్పాడు. ఈ వివరణలు సంక్లిష్టంగా, మరింత సంక్లిష్టంగా మారుతూ పోయాయి. కానీ విశ్వం గురించిన ఈ గోళాల సంకలన భావన, మధ్యయుగాల వరకు కొనసాగి, విజ్ఞాన శాస్త్రాన్ని ప్రభావితం చేసింది.
అంతరిక్ష లోకాలు అంటే, అవి చాలా శ్రేష్టమైనవని అరిస్టాటిల్ భావించాడు. అంతరిక్షం నాశనం లేనిదని, ఎప్పటికీ ఉన్నదని, దానికి ఆది అంతం లేదని, అక్కడ ఏదీ మారదని, శాంతితో నిండి ఉంటుందని, అక్కడి చలనాలన్నీ వర్తులంగా, శ్రేష్టంగా, సౌమ్యంగా ఉంటాయని ఊహించాడు. కానీ భూమిపై అన్ని మారుతూ ఉంటాయని, ఇక్కడ అన్ని కల్మషమయమని, ఇక్కడి చలనాలు దుష్టంగా ఉండి, ఒక రేఖలో ఉంటాయని భావించాడు. అంటే అంతరిక్ష లోకాలను నడిపే సూత్రాలు, చలనాలు, భూమి మీద కంటే భిన్నంగా ఉంటాయని అన్నాడు. భూమ్మీద అన్ని పదార్థాలను, – భూమి, నిప్పు, నీరు, గాలి-గా అరిస్టాటిల్ వర్గీకరించాడు. ఇవన్నీ ఎప్పుడూ తమ సహజ స్థితిని చేరుకోవాలని చూస్తుంటాయని అన్నాడు. వస్తువులు కిందికి పడటానికి, గాలి వ్యాపించడానికి, మంటలు పైకి ఎగడటానికి కారణం అవి వాటి సహజ స్థితిని / స్థానాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నించడమే అని అరిస్టాటిల్ భావించాడు. ఈ భావాలు కూడా వందల సంవత్సరాలు కొనసాగాయి. అరిస్టాటిల్ పదార్థాలు ఒకదానించి ఇంకోదానికి మార్చవచ్చని కూడా భావించాడు. మధ్యయుగాల్లో ఇతర పదార్థాలను బంగారుగా మార్చటానికి ఎన్నో విఫల ప్రయత్నాలు జరిగాయి. వాటికి ప్రేరణ ఈ భావాలనుంచే వచ్చింది. ప్రొజెక్టైల్ చలనాల గురించి కూడా, అరిస్టాటిల్ చెప్పింది, వందల సంవత్సరాలు మానవ ఆలోచనలను ప్రభావితం చేసింది.
ఒక విధంగా చెప్పాలంటే అరిస్టాటిల్ తయారుచేసిన జ్ఞాన వ్యవస్థ పదహైదు వందల సంవత్సరాలు, మనుషుల ఆలోచనలను నడిపింది. అరిస్టాటిల్ చెప్పిందే, విజ్ఞానం అన్నంతగా అది ప్రభావితం చేసింది. అప్పటి కాలాల విజ్ఞానంలో అరిస్టాటిల్ సాధించిన అధికారం, తరువాతి కాలాల జ్ఞాన సమపార్జన కు అడ్డంకిగా తయారయ్యాయని చెప్పక తప్పదు. అరిస్టాటిల్ భావాలను బద్దలు కొట్టి తప్పని రుజువు చేసిన తర్వాతే, సైన్సు చకచకా ముందడుగులు వేసింది.
అరిస్టాటిల్ తరువాత..
అరిస్టాటిల్ తరువాత ఏం జరిగిందో చూద్దాం. అరిస్టాటిల్ శిష్యుడైన అలెగ్జాండర్ తన యుద్ధాలతో పాటు, గ్రీకు సంస్కృతిని వ్యాపింప చేశాడు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో, అలెగ్జాండర్ ఏర్పాటు చేసిన ఒక గొప్ప లైబ్రరీ (42 bc లో ధ్వంసం చేయబడేదాకా) చాలాకాలం విజ్ఞాన కేంద్రంగా వెలుగులు చిమ్మింది. అలెగ్జాండర్ 323 బీసీలో మరణిస్తే, అరిస్టాటిల్ 322 బీసీ లో మరణించాడు. అరిస్టాటిల్ తరువాత, విశ్వాన్నంత ఒక మహా కథనంలోకి తీసుకువచ్చే, వారు పెద్దగా లేకపోయారు.
అయితే దేనికదే విడిగా, లోతుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వారి లో అరిస్టాటిల్ భావాలను, సవాలు చేసినవారు ఉన్నారు. వీరిలో చెప్పుకోవాల్సినవాడు, అరిస్టార్చేస్ (310-230BCE). అరిస్టాటిల్ చెప్పింది తప్పని, భూమి, చంద్రుడు- సూర్యుడి చుట్టూ తిరుగుతున్నారని చెప్పాడు. గ్రహ చలనాలను పరిశీలించి లెక్కలు వేశాడు. కానీ ఆ కాలంలో, ప్రజల సాధారణ జ్ఞానానికి (కామన్ సీన్స్) అది అందలేదు. హిస్టార్చేస్ (190c-120bc) అనే ఖగోళ విజ్ఞానికి కూడా, గ్రహాలు భూమి చుట్టూ, స్పష్టమైన వృత్తాలలోనే తిరుగుతాయని అరిస్టాటిల్ చెప్పింది సరైనది అని అనిపించలేదు. తన పరిశీలనలు, అరిస్టాటిల్ చెప్పిన దానితో సరిపోలటం లేదు. చివరికి సూర్యుడు, చంద్రుడు మాత్రం భూమి చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నాయని, కానీ మిగిలిన గ్రహాలు చిన్నచిన్న వలయాలుగా తిరుగుతూ ఒక పెద్ద వృత్తంలో భూమి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాడు. ఆ విధంగా, అరిస్టాటిల్ చెప్పిన దానితో, సరిపోల్చుకున్నాడు. చిన్న వలయాలతో పెద్ద వృత్తంగా, తిరిగితే దాన్ని ఏపిసైకిల్స్ అంటారు. ఏపిసైకిల్స్ అనే ఈ భావననే ఆ తర్వాత టాలమీ (100-120bc) చేపట్టాడు.
విశ్వానికి గ్రహాల చలనాలకు సంబంధించిన ఒక బృహత్ భావనను టాలమి ముందుకు తెచ్చాడు. ఆల్మగెస్ట్ అనే పుస్తకంలో వాటిని సంకలనం చేసాడు. టాలమి ప్రకారం విశ్వానికి కేంద్రం భూమి. భూమి చుట్టూ సూర్యుడు చంద్రుడు, అట్లే వీనస్ మెర్క్యూరీ, మార్స్,,జుపిటర్, సాటర్న్,,భూమి నుంచి వివిధ దూరాలలో ఉండి, ఏపీసైకిల్స్ లో తిరుగుతూ, పెద్ద వలయాలుగా భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. అరిస్టాటిల్ చెప్పిన గోళాలు వాస్తవం కాదని, అయితే వాటిని కొన్ని గణితాత్మక ఊహ దృశ్యాలుగా భావించవచ్చని టాలమి చెప్పాడు. ఈ టాలమీ విశ్వనమూనా అనేక శతాబ్దాలు విజ్ఞానాన్ని ప్రభావితం చేసింది. అయితే ఆ కాలంలో అరిస్టార్చేస్ లాంటివాళ్ళు ప్రత్యామ్నాయ నమూనాలను చెప్పినా, ప్రజలు ఎందుకని అంగీకరించలేదు? అరిస్టాటిల్ హేతుబద్ధంగా చెప్పేది, ప్రజల సాధారణ జ్ఞానానికి నప్పేది. ఉదాహరణకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్టు ఉండటం వాళ్లు రోజూ చూసేదే. అరిస్టాటిల్, టాలమి లాంటి వాళ్లు ప్రతిపాదించే విశ్వనమునా, విశ్వ రహస్యాల వివరణ, వారికి సంతృప్తినిచ్చింది. మనిషి జీవితానికి ఒక ప్రయోజనాన్ని ఒక స్థానాన్ని అరిస్టాటిల్ విశ్వనమునా ఇచ్చింది. భూమ్మీద ఉండేవి అందలహీనంగా, తప్పులతడకగా కనిపిస్తే, అదే అరిస్టాటిల్ చెప్పిన అంతరిక్షం సౌందర్యపూరితంగా సౌష్టవంగా కనిపించేది. ఈ విశ్వనమునా లో అనేక సమస్యలు ఉన్నా, పదనాలుగు వందల సంవత్సరాలు మానవ ఆలోచనలను ఇది శాసించింది.
రోమన్ల ప్రాబల్యం..
గ్రీకుల తరువాత, రోమన్ల ప్రాబల్యం పెరిగింది (27BCE). రోమన్లు సైన్స్ కంటే ఎక్కువగా, ఇంజనీరింగ్ ను, ఫైనాన్స్ నూ, ప్రభుత్వ నిర్వాహణ పద్ధతులను ఎక్కువగా పట్టించుకున్నారు. క్రీస్తు శకం అయిదవ శతాబ్దానికి రోమన్ సామ్రాజ్యం కూడా, బలహీన పడింది. గ్రీక్ రోమన్ కాలాలనాటి, సమాజం ఒక స్తబ్దత లోకి వెళ్ళిపోయింది. దాంతోపాటు విజ్ఞాన వికాసాలు వెనక పట్టు పట్టాయి. చీకటి యుగాలు ప్రారంభమైనాయి.
ఖగోళ శాస్త్రంలో టాలమి చూపిన ప్రభావం లాంటిదే, శరీర శాస్త్రంలో, వైద్యశాస్త్రంలో గాలెన్ (130-200 CE) చూపాడు. ఆయన రాసిన డి మెటీరియా మెడికా, అనే పుస్తకంలో మందులు ఏ విధంగా తయారు చేయాలో చెప్పాడు. పందులు లాంటి జంతువుల శరీరాలను కోసి చూసి, మానవ శరీర నిర్మాణం గురించి రాశాడు. ఆ కాలంలో మనుషుల శరీరాలను కోయడానికి అనుమతి లేదు. మరో రోమన్ విజ్ఞాని, ప్లైని ప్రకృతిలోని వింతల గురించి జంతువుల గురించి పరిశీలించాడు. ఆయన రాసిన 17 సంపుటాల నాచురాలిస్ హిస్టోరియా మరొక ముఖ్యమైన పుస్తకం. వారి ఆలోచనలే, వందల సంవత్సరాలు సమాజాలను ప్రభావితం చేశాయి. ఒక విధంగా సమాజానికి మరో ఆలోచన లేకుండా పోయింది. ప్రాచీన కాలంలో ఆధునిక విజ్ఞాని.. గ్రీకు రోమన్ కాలాలలో, అందరూ సిద్ధాంతకారులే. కానీ ఒక అరుదైన ప్రయోగశీలి కూడా ఉన్నాడు. అతను, పద్ధతిలో ఇప్పటి ఆధునిక శాస్త్రవేత్తలతో పోల్చదగినవాడు. అతడే ఆర్కిమెడిస్ (287-212BCE), సిసిలి). అటువంటి ప్రయోగ కారుడిని, మరొకరిని ఆ కాలంలో చూడలేము. యాంత్రిక పనిముట్లు చేయడమంటే, ఆయనకు ఎంతో ఇష్టం.
సూర్యుడి కాంతి ప్రతిఫలనం అయ్యేట్టు, దూరంగా అద్దాలను అమర్చి, శత్రుయుద్ధ ఓడలపై మంట రగల్చేవాడట. ప్లవన సూత్రాలు, జామెంట్రీ, పై విలువ, స్క్రూ, లీవర్, నీళ్లు తోడే యంత్రాలు- ఇవన్నీ ఆర్కిమెడిస్ కనుగొన్నాడని అంటారు. ఆయన పేరుతోనే ఇవన్నీ ప్రసిద్ధం.
ముగిసిన ప్రాభవం..
ఇనుప యుగాలు సృష్టించిన వైరుధ్యాలు, బానిస సమాజాలలో ఉండే, అభివృద్ధి నిరోధకత, నిరంతర యుద్ధాలు, వైజ్ఞానిక పురోగమనాలకు, అడ్డుకట్టగా మారాయి. ఐదవ శతాబ్దంలో రోమ్ పతనంతో, పాశ్చాత్య వైజ్ఞానిక వికాసం కూడా ఒక ముగింపు కొచ్చింది. చరిత్ర ఒక సుదీర్ఘ సుశుప్తి లోకి వెళ్ళింది. అందుకే తరువాతి కాలాలను కొందరు చీకటి యుగాలన్నారు.
క్రీస్తుశకం ఐదవ శతాబ్దం నుంచి, ఒక ఒక వెయ్యి సంవత్సరాలు, వైజ్ఞానిక పురోగమనం పెద్దగా లేదు. అరిస్టాటిల్ టాలెమి, గాలన్ చెప్పిందే ఆఖరు సత్యాలు అన్నట్టు సమాజాలు నడిచాయి. ఎప్పటికప్పుడు ప్రశ్నించి, తర్కించి, నిగ్గు తేల్చేది పోయింది. దేనికైనా అంతిమ పరిష్కారం, మన ప్రాచీనుల గ్రంథాలలో ఎప్పుడో రాసి ఉన్నాయన్నట్టుగా ఉండేది. పాత సిద్ధాంతాల అధికారాన్ని, సవాలు చేసే వారే కరువైపోయారు. విజ్ఞాన శాస్త్రం ఈ ప్రతిష్టంబన ను ఎలా ఎదుర్కొన్నది? మనుషులు మళ్ళీ కొత్తగా ఆలోచనలు ఎందుకు చేశారు? అనేది చరిత్ర. సైన్స్ చరిత్ర.
(ఇదే కాలంలో భారతదేశంలో వైజ్ఞానిక వికాసం గురించి వచ్చే సంచికలో తెలుసుకుందాం)



