డా. నాగసూరి వేణుగోపాల్
వృక్షశిథిలాలతో చరిత్ర గానాలు విశ్లేషించిన మహనీయుడు బీర్బల్ సాహ్ని! మనదేశంలో పాలియో బోటని అనగానే గుర్తుకు వచ్చే శాస్త్రవేత్త ఆయన. శిలావశేషాలలోని వివిధ పొరలలో ఉండే వృక్ష సంబంధమైన పదార్థాలను అధ్యయనం చేయడమే ‘పాలియో బోటని (Paleo Botany)’. దీనిని తెలుగులో ‘పురావృక్షశాస్త్రం’ అని అంటాం.
ఒకవైపు వృక్షశాస్త్రం, మరోవైపు భూభౌతికశాస్త్రం, ఇంకోవైపు చరిత్ర పరిశోధన మేళవించిన అపురూప సంగమమైన శోధన ఈ ‘పాలియో బోటని’. చూడగలిగితే ప్రతి శిలావశేషం (Fossils) – ఖనిజం, ఎముకల అవశేషం, చెక్కముక్క… ఇలా ప్రతిదీ ఓ కథ చెప్పగలదు. అప్పటి భూవాతావరణం. మొక్కలు గురించి ఇలా చాలా విషయాలు బయల్పడతాయి. లక్షలాది సంవత్సరాల క్రితం ఉండే ఈ ప్రాకృతిక సంపద వివరాలు ఆధారంగా చమురు, వాయునిక్షేపాల ఆనవాళ్ళ ఆచూకీ గ్రహించవచ్చు. ‘మల్టీ డిసిప్లినరీ ‘ శాఖలకు మంచి ఉదాహరణ పాలియోబోటని, ఇందులో కేవలం విజ్ఞానశాస్త్ర శాఖలే కాక చరిత్ర, సంస్కృతి..వంటి సామాజిక శాస్త్రాలుండటం గమనార్హం. అటువంటి పాలియో బోటనికి సంబంధించి మనదేశంలో బీర్బల్ సాహ్ని (Birbal Sahni) మహాశయుడిని ఆద్యుడుగా పరిగణిస్తాం!
బీర్బల్ సాహ్నికి మరో ప్రత్యేకత ఉంది. ఆయన జన్మదినం, జవహర్లాల్ నెహ్రూ జన్మదినం ఒకే రోజు వస్తాయి. కేవలం తేదీలలోనే కాదు, కుటుంబ నేపథ్యంలో కూడా పోలికలున్నాయి. బీర్బల్ సాహ్ని తండ్రి రుచీరాం సాహ్ని (Ruchi Ram Sahni) లాహెూర్ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకులు. చాలా ఉదారభావాలు కలిగి, పంజాబ్లో ఒక వైపు విజ్ఞాన శాస్త్రాన్ని, మరోవైపు బ్రహ్మసమాజపు భావాలను జనసామాన్యంలోకి తీసుకువెళ్ళాడు రుచీరాం సాహ్ని. గోపాలకృష్ణ గోఖలే, మోతీలాల్ నెహ్రూ, శ్రీనివాస శాస్త్రి వంటి అతిథులు రుచీరాం సాహ్ని ఇంటికి వచ్చేవారు. ఈ వాతావరణం బీర్బల్ సాహ్ని జీవనశైలిలో గమనించవచ్చు. సమాజంపట్ల ఆర్తి. విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తి అలా రూపుదిద్దుకున్నదే!
ఇప్పటి పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న షాపూర్ జిల్లా ‘బెహరా’ గ్రామంలో బీర్బల్ సాహ్ని 1891 నవంబరు 14న జన్మించారు. తన ప్రాథమిక విద్య లాహెూర్లో ప్రారంభమైంది. పంజాబ్ యూనివర్సిటీ నుంచి వృక్షశాస్త్రంలో పట్టా పొందారు. బీర్బల్ సాహ్ని వృక్షశాస్త్రవేత్త ఎస్.ఆర్. కశ్యప్ దగ్గర చదువుకోవడం చాలా కీలకమైంది. అతనితో సాన్నిహిత్యం ఎంతోకాలం కొనసాగింది. అతని కారణంగానే వృక్షశాస్త్రం పట్ల, సంస్కృతం పట్ల ఆసక్తి, అభిమానం కలిగాయి. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఇమ్మాన్యుయల్ కళాశాలలో నేచురల్ సైన్స్ ట్రిప్టోస్ చదవాలని 1913లో ఇంగ్లాండు వెళ్ళాడు బీర్బల్ సాహ్ని. 1915లో దీన్ని సాధించడంతో పరిశోధనా వేతనం లభించింది. బీర్బల్ సాహ్ని అక్కడ ఆల్బర్ట్ సేవార్డ్ ( A.C. Seward) చేసిన ప్రసంగాలు విని, పాలియోబాటని వైపు పరిశోధనా దృష్టిని మళ్లించాడు. ఆయన దగ్గరే పరిశోధనకు సిద్ధమయ్యాడు బీర్బల్ సాహ్ని. లభ్యమయ్యే వృక్ష విశేషాలతో గతకాలపు వృక్ష వివరాలను సమన్వయపరచి పరిశోధన సాగించడమనేది అక్కడే ఉత్తమంగా ఉండేది.ఈ సమయంలోనే జవహర్లాల్ నెహ్రూ సాహ్నికి సహాధ్యాయి.
బీర్బల్ సాహ్ని పరిశోధనా పత్రాలు 1915-1919 మధ్యకాలంలో ఐదు ప్రచురింపబడ్డాయి. ఈ పరిశోధనాంశం, ఈ కృషి జె.సి. విల్లీస్ తో కలసి ‘లా స్వాన్ టెక్స్ట్ బుక్ ఆఫ్ బోటని’ గా ప్రతిఫలించి, ప్రసిద్ధి చెందింది. శిలావశేషాల గురించి సాహ్ని కృషికి 1919లో లండన్ విశ్వవిద్యాలయం డి.ఎస్సి. డిగ్రీని బహూకరించింది. ఈ పరిశోధన 1920లో ‘ఫిలసాఫికల్ ట్రాన్సాక్షన్స్’లో ప్రచురింపబడటంతో ఆయనకు గొప్ప ఖ్యాతి లభించింది. 1919లోనే బీర్బల్ సహాని భారతదేశం తిరిగివచ్చాడు. బెనారస్ హిందూ
విశ్వవిద్యాలయం, పంజాబ్ విశ్వవిద్యాలయాలలో ఒక్కో సంవత్సరం పాటు ఉద్యోగం చేశారు. 1921లో లక్నో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరారు. 1949 దాకా ఆయన అక్కడ కొనసాగి విశేషమైన కీర్తి గడించారు. ఆయన పరిపాలనా సంబంధమైన బాధ్యతలు ఇటు బోధనను గానీ, అటు పరిశోధనను గానీ కుంటుపరచలేదు. బి.ఎస్సి పాఠ్య ప్రణాళిక మార్చారు. ఎం. ఎస్సీ కోర్సు, ఆనర్స్ కోర్సు ప్రారంభించారు. 1923లో ఎం.ఎస్సీ బ్యాచ్ వచ్చింది. ఎం. ఎస్సీ కోర్సులో ఆరుగురు కంటే ఎక్కువ ఉండేవారు కాదు. బీర్బల్ సాహ్నిఅన్ని తరగతులకు ప్రాధాన్యత ఇచ్చేవారు.
బీర్బల్ సాహ్ని వృక్షశాస్త్ర ఆచార్యుడుగా ఉన్నా ప్రత్యేకమైన గది ఉండేది కాదు. బోటనీ మ్యూజియంలో కూర్చొనేవారు. అందులోనే మరోవైపు గ్రంథాలయం ఉండేది. సరైన రీతిలో భూభౌతిక విజ్ఞానం లేకపోతే పాలియోబోటనీ పరిశోధనలు సవ్యంగా జరగవని గుర్తించారు. అలా 1943లో లక్నో యూనివర్సిటీలో ఆ శాఖ ఏర్పాటు కావడానికి దోహదపడ్డాడు. ఆయన డైనమిక్ జియాలజి, పాలియోబోటని శాఖలను బోధించారు. రెండు శాఖల మధ్య ఉండే అగాధాన్ని పూడ్చడానికీ, సమన్వయం చేయడానికీ ఆయన చేసిన కృషి విశేషమైంది.
భారతదేశపు శిలావశేషాల గురించి తొలుత ఆయన పరిశోధన 1971లో మొదలైంది. సెనార్డ్ తో కలసి 1920లో ‘రివిజన్ ఆఫ్ ఇండియన్ గోండ్వానా ల్యాండ్’ ప్రచురించారు. 1920 తర్వాతనే బీర్బల్ సాహ్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి శిలావశేషాలను మరింత తీవ్రంగా పరిశోధించడం ప్రారంభించారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఇండియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా కలసి ‘గోండ్వానాల్యాండ్’గా ఉండేదని భావించేవారు. సుమారు 300 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ప్రాంతపు వృక్ష సంపద గురించి పరిశోధించారు బీర్బల్ సాహ్ని. అంతవరకు ప్రచారంలో ఉండే భావనలు కొన్ని తప్పని ఋజువు చేశారు కూడా! బీర్బల్ సాహ్ని పరిశోధించిన మరో అంశం- ఖండాలచలనం. ఖండాలుగా విడిపోయి, చలించాయనే భావన సరికాదనీ, సముద్రాల వల్ల విడిపోయిన ఖండాలు ఒకదానికొకటి చేరువగా రావడం జరిగిందని వివరించాడు. లభించిన అవశేషాల ఆధారంగా అప్పటి వృక్షజాలాన్ని వివరించడం మరో గొప్ప అంశం.
బీర్బల్ సాహ్ని అలుపు ఎరుగని పరిశోధనా శ్రామికుడు. ప్రయోగశాలలో పరిశోధనతో పాటు – సుత్తి, పుస్తకం, కెమేరాలతో పరిశోధన కోసం బయట విహరించేవారు. వీలు దొరికితే హిమాలయ ప్రాంతాలు సందర్శించేవారు. బీహారులోని రాజమహల్ కొండల వైపు విహారయాత్రకు వెళ్ళారు. అక్కడ అహర్ జోల దగ్గర కొత్త అవశేషాలు కనుగొన్నారు. అక్కడి నుంచి రాగానే లక్నోలో కొత్త సంస్థ కోసం కృషి చేశారు. 1949 ఏప్రిల్ 3న జవహర్లాల్ నెహ్రూ ఆ సంస్థకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సంస్థ శంకుస్థాపన జరిగిన వారంలోపే ఏప్రిల్ 9-10 అర్ధరాత్రి బీర్బల్ సాహ్ని కన్నుమూశారు. ఆ సంస్థను పూర్తిగా చూడలేకపోయారు. కానీ ఆ సంస్థ ‘సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో బొటని’గా నేటికీ ఆయన కృషిని గుర్తు చేస్తోంది. వర్తమానానికీ, గతానికీ ఉండే చిక్కు ముడులు వివరిస్తూ పరిశోధనలను ఆవిష్కరిస్తోంది.
డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి పూర్వ సంచాలకులు, 9440732392



