డా. నాగసూరి వేణుగోపాల్

‘కెమటాలజి’ (Chematalogy) అంటే ఏమిటో చెప్పగలరా? పోనీ ‘ట్రైబో కెమిస్ట్రీ’ (Chemistry) అంటే వివరించగలరా? నిజానికి రెండూ ఒకటే! ఒకటి రష్యాలో పిలుచుకునే పేరయితే, రెండవది పాశ్చాత్య ప్రపంచం వాడే పేరు. కదలిక వున్నపుడు కలిగే ఘర్షణ, దాన్ని తగ్గించడానికి వాడే కందెనల (లూబ్రికెంట్స్) గురించి తెలిపే శాస్త్ర, సాంకేతిక విభాగం ‘ట్రైబోలజీ’ అందులోని  ఒక భాగమే – పైన పేర్కొన్న అంశం.. దీని కన్న ఆసక్తికరమైన విషయం ‘ కెమటాలజి’ విభాగానికి శ్రీకారం చుట్టింది, ఒక తెలుగు వ్యక్తి కావడం! కృష్ణానది ఒడ్డున జన్మించిన కొలచల సీతారామయ్య అమెరికాలో తన జీవనసమరం సాగించి రష్యాలో పరిశోధనల లతలు పూయించి, వైజ్ఞానిక ప్రపంచంలో చిరస్మరణీయుడయ్యారు. విజ్ఞానం, సాహిత్యం, సమాజం లోతులు ఎరిగిన మానవీయ శిఖరమాయన. అందుకే రష్యాలో సీతారామయ్య 1977లో గతించినపుడు అప్పటి భారత రాయబారి, తర్వాతి కాలంలో భారత ప్రధాని అయిన ఐ.కె. గుజ్రాల్ ఇలా అన్నారు. “ఒక గొప్ప శాస్త్రవేత్త, ఒక గొప్ప భారతీయుడు, ఒక గొప్ప ప్రపంచపౌరుడు” అయిన సీతారామయ్యకు కడపటి వీడ్కోలు చెబుదామని.                                                                                    

పరిశోధనా నేపథ్యం: 
అది యుద్ధ సమయం. మాస్కోలో ఎయిర్ రెయిడ్ వార్టన్ గా సీతారామయ్య అపార్ట్మెంట్ టెర్రస్ మీద ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నారు. ఆ సమయంలో నాజీలు వేసిన బాంబు దాదాపు మీదబడ్డది. అది పూర్తి బాంబు అయివుంటే ప్రమాదం జరిగి ఉండేదే. ఉద్యోగం అయిపోయాక ఆ రోజు యింటికి తిరిగి వస్తున్నారు, మెట్రో రైళ్ళు మారాలి. ప్లాట్ ఫారాలు ఎక్కడానికి, దిగడానికి శ్రమ లేకుండా చేసే ఆధునిక యంత్రం (ఎస్కలేటర్)  ముందు జనం మధ్య సీతారామయ్య చిక్కుకున్నారు. తనకి ముందు అగుపడిన దృశ్యం… దారీ తెన్నూ లేకుండా అన్ని దిశల్లో కదులుతున్న మనుషులు. వారి తలల కదలికలను ఎత్తు నుంచి పరిశీలనగా చూసినపుడు ‘బ్రౌనియన్’ చలనంలోని అణువుల కదలికను తలపిస్తోంది.

సోవియట్ ట్యాంకుల ఇంధనాలు, కందెనలకు సంబంధించిన సామర్థ్యం గురించి పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్త మన కొలచల సీతారామయ్య. అంతకు ముందు చాలా సార్లు ఈ దృశ్యాన్ని పలుసార్లు చూసినా ఈ ఆలోచన రాలేదు. అది కందెనలో అణువుల మధ్య జరిగే చర్యలను తలపిస్తోంది. మాధ్యమం (మీడియం)లో అణువులు పరస్పరం చర్య జరుపుకోవడం అనేది ఆ మాధ్యమం మీద ఆధారపడుతుంది. ఈ చర్యల వల్ల మాధ్యమ స్వభావమే మారిపోవచ్చు. అంతే… ఆలోచనల్లో తేలిపోతున్న, తూలిపోతున్న సీతారామయ్య ఇల్లు చేరుకోగానే దుస్తులు కూడా తీయకుండా, తన ఆలోచనలను కాగితం మీద చిత్రించడం ప్రారంభించారు. అంతవరకు వివరించడానికి ప్రయత్నించిన సైద్ధాంతిక నమూనాలన్నీ మాధ్యమం – అణువుల మధ్య జరిగే చర్యలను పట్టించుకోలేదు. అందువల్ల పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొత్త చూపు అవసరమని సీతారామయ్య భావించారు.

టెర్రస్ మీద పడిన బాంబులను టాంగ్స్ తో తీసివేసి, ఇసుక డబ్బాలో వేసిన విషయం కూడా గుర్తుకు వచ్చింది. అలా వేస్తున్నపుడు కనబడిన మెరుపులు, కందెనలతో సంబంధం కలిగి ఉన్నాయనిపించింది. అవి వెల్డింగ్ చేస్తున్నపుడు ఎగిసే అగ్నికీలల్లా ఉన్నాయి. భూగర్భంలో కదిలే శిలాద్రవం (మాగ్మా) గుర్తుకు వచ్చింది. అలాగే కళ్ళముందు తేలియాడే సూర్యుళ్ళు, వాటి నుంచి నాలుకలు చాచే మంటలు కనబడ్డాయి. పదార్థానికి మరో స్థితి వుండాలని తలంచారు. దాన్ని ఆయన ‘ప్లాస్టిక్’ అన్నారు. అదే తర్వాతి కాలంలో ‘ప్లాస్మా’ (Plasma) అని పిలువబడింది. ఈ స్థితిలో పదార్ధం ఆవేశభరిత అణువులు (అయొనైజ్డ్ స్టేట్)గా వుంటుంది. ఈ స్థితిలో దాని వాహకత్వం చాలా ఎక్కువ. ఇదే ‘కెమటాలజి’కి అంకురార్పణ. 1966 నుంచి పాశ్చాత్య దేశాల్లో ఈ ‘కెమటాలజి’ ‘ట్రైబో కెమిస్ట్రీ’గా ప్రసిద్ధి చెందింది.

కృష్ణా తీరంలో జననం :
1899 జూలై 15న కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గరుండే యాకమూరులో వెంకట కృష్ణశాస్త్రి,మార్తమ్మ దంపతులకు సీతారామయ్య జన్మించారు. అతని చిన్నప్పటి పేరు లాల్ గోవింద్. ఆ ప్రాంతం అప్పట్లో హైదరాబాదు నైజాం రాష్ట్రానికీ, మద్రాసు సంస్థానానికీ మధ్య సరిహద్దు ప్రాంతం. హైస్కూల్ విద్య మచిలీపట్నంలో సాగింది, ఆ దశలోనే భౌతిక శాస్త్రం మీద ఆసక్తి పెరిగింది. తండ్రి నుంచి సత్యాగ్రహ భావనను సీతారామయ్య అందుకున్నారు. లేకపోతే సమాజంలోని అన్యాయాలను చూసి తీవ్రవాదిగా మారి వుండేవారు. పాఠశాల విద్య కాగానే, మద్రాసులో చదువుకోవాలని తలపోశారు. విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షలో అతనికి అన్యాయం జరుగకుండా వుండాలని, సమీప బంధువు ఒకాయన ఒక ఉత్తరం రాసిచ్చారు. విశ్వవిద్యాలయంలో చేరాక క్రీడాకారుడుగాను రాణించారు. భౌతిక, రసాయన శాస్త్రాలను చక్కగా అభ్యసించారు. అయితే తండ్రి మరణశయ్యపై వున్న వర్తమానం అందిండంతో కష్టాలు ప్రారంభమయ్యాయి. స్టీమరెక్కి వెళ్ళేసరికి కడచూపు కూడా దక్కలేదు, కేవలం చితిమంటలు మాత్రమే దర్శనమిచ్చాయి. విదేశాలకెళ్ళి చదువుకోవాలని చెబితే, అన్న అనంతరామయ్య సముద్రాలు దాటి భ్రష్టుడివి కావద్దన్నారు. ధూమపానం, మద్యపానం, మగువను తాకకూడదని అన్నారు. తండ్రి దాచి ఉంచిన రెండు వేల రూపాయలు తమ్ముడికి ఇచ్చారు. మద్రాసులో గురుతుల్యుడయిన మిత్రుడు, వామపక్ష కార్యకర్తయిన వ్యక్తి సాయంతో ఓడ కెప్టెన్ తో ఒడంబడిక కుదిరింది. మద్రాసులో మరో ఆంగ్లేయుడు అమెరికాలోని వ్యక్తికి ఉత్తరం యిచ్చారు. ఓడ కెప్టెన్ కొంత ధనం అడిగాడు. తండ్రి నుంచి సంక్రమించిన రెండు వేల రూపాయలను ఓడలో ప్రయాణంచేసే వాడికి – డాలర్లగా మార్చమని ఇచ్చారు. ఎందుకంటే కెప్టెన్ డాలర్లే కావాలన్నాడు. డబ్బులు తీసుకున్న వ్యక్తి అదృశ్యమయ్యాడు. దాంతో క్రూరుడు అయిన కెప్టెన్ స్టీమర్ పొయ్యిలో దూకమన్నాడు. మధ్యధరా సముద్రం దాటేసరికి అనారోగ్యం పాలుకాకుండా చేరింది దాదాపు చిల్లిగవ్వ లేని సీతారామయ్య మాత్రమే. 

అమెరికాలో అగచాట్లు: 
న్యూయార్క్ చేరాక ఒక హెూటల్లో గిన్నెలు తోమడానికి, పదార్థాలు యివ్వడానికి పనిలో కుదిరారు. తర్వాత చికాగో లోని విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగంలో చేరారు. అక్కడ అతని పరిస్థితి బికారి కన్నా తక్కువ. తన దగ్గరున్నది అప్పులకో, పుస్తకాలకో ఆవిరయ్యింది. మాడే కడుపుతో, పార్కులోని బెంచి మీద గడిపిన రాత్రులున్నాయి. అలా ఉన్నపుడు గస్తీదారులు తరిమిన రోజులున్నాయి. అది యుద్ధ సమయం. వేరే గత్యంతరం లేదు. తాను బ్రతకాలి, చదువు పూర్తి చేయాలి. శ్రీలంకకు చెందిన మిత్రుడి ద్వారా భారతీయులు పరిచయం అయ్యారు. ఒక పార్టీలో ‘సిండి’ అనే వనితను కలిశారు. అతని ఆకర్షణీయమైన కళ్ళు ఆమెనాకర్షిస్తే, ఆమె అందమైన కళ్ళు అతన్ని ఆకట్టుకున్నాయి. ఆమె ఖాళీ చేసిన యిల్లు అతనికిచ్చింది. ఆకర్షణ అనురాగంగా, అనురాగం వివాహంగా మారింది. సిండి ద్వారా పరిచయమైన వారి సాయంతో ఫెలోషిప్ వచ్చింది. 1924 జూన్లో చికాగో విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్. డిగ్రీ పొందారు. మోటారాయిల్ కు సంబంధించిన పరిశోధనకు గుర్తింపు వచ్చింది. దాంతో ఉద్యోగం వచ్చింది. అపుడు సిండి అతని గురించి తల్లిదండ్రులతో మాట్లాడుతానంది. సీతారామయ్యకు ఆమే కాదు, ఆమె పరిమితులు, ఆ దేశపద్ధతులు అర్ధం సైతం కాలేదు. దాంతో అతను రెచ్చిపోయి ‘మా దేశం రాగలవా?’ అని రెట్టించారు. ఆమె మౌనం వీడలేదు. దాంతో సీతారామయ్య తన వస్తువులతో బయటపడ్డాడు. యేల్ లో చేసిన కృషికి రెండవ డిగ్రీ స్నాతకోత్తర పట్టా చాలా తక్కువ సమయంలో లభించింది. అక్కడ ఇంధనాలు, కందెనల గురించి శోధన జరుగుతోంది. వాడే విధానం మారినపుడు, ఇంధనమే మారుతుందని ఆలోచన. అక్కడ ఉద్యోగం కాంట్రాక్టు ముగిశాక, అధిక జీతం యిస్తామన్నా అవసరం లేదని రష్యా పయనమయ్యారు. అప్పటికీ వామపక్ష భావాల మీద మక్కువ పెరిగింది. సిండినీ, బిడ్డను వారితో పాటు తన సంపాదనను వదలి రష్యా చేరారు.

అమెరికా నుంచి రష్యాకు: 
రష్యాలో పెట్రోలియం సంస్థకూ, ట్రాక్టర్ సంస్థకు అధిపతి అయ్యారు. సాంకేతిక నైపుణ్యం కొరవడినా అక్కడి వారిలో చిత్తశుద్ధి లోపించలేదు. సమస్యలు ఎదురయినపుడు సిండి మదిలో మెదిలేది. ఒకసారి వచ్చి సిండి కలిసింది కూడా. అయితే సీతారాముడిని తనతో తీసుకెళ్ల లేకపోయింది. అదే చివరి కలయిక. ఆమె వెనుదిరిగి వెళ్ళిపోయింది. జర్మనీలో అంతర్యుద్ధపు కరువు, ఆకలి ఫలితంగా ‘ఎకటెరినా ఐవనోవ్నా’ అనాధగా రష్యాలో తారసపడింది. ఇద్దరి నేపధ్యాలు ఆకర్షించుకున్నాయి, పెళ్లయ్యింది. రష్యా భాష నేర్చుకోవడానికి ఆమె ఎంతో తోడ్పడింది. దాదాపు అదే సమయంలో హిట్లర్ తన తుపాకులను రష్యా వైపు గురిపెట్టాడు. జర్మనీ యుద్ధ ట్యాంకుల కన్నా, సీతారామయ్య రూపొందించిన ట్యాంకులు, యింజన్లు నమ్మకంగా, సమస్యలు లేకుండా మెరుగ్గా పనిచేశాయి. అలా కొత్త యింధనాలు గురించి పరిశోధన చేస్తున్న సమయంలో ‘ఎస్కలేటర్’ సంఘటన జరిగింది. యంత్రంలో ఘర్షణ మీద కందెన ప్రభావం గురించి సీతారామయ్య భావనలకు 1951లో డాక్టరేటు లభించింది. తర్వాత 15 సం|| అది ‘ట్రెబోలజి’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. సీతారామయ్య భారతీయుడు కావడం వల్ల తగినంత గుర్తింపు రాలేదని అంటారు. మాస్కోలోని ఆటోమొబైల్ ‘ఇన్స్టిట్యూట్ ‘నామి’ అధిపతిగా మాత్రమే ఆయన పదవీ విరమణ చేశారు. అతని ‘ది థియరి ఆఫ్ ది ప్లాస్టిక్ మీడియం’ కేవలం ప్రసంగాల్లోనే ఉండిపోయిందని కూడా అంటారు. సీతారామయ్య మౌలిక భావనలతో సంకలనం అతను గతించాక పుస్తకంగా వెలువడింది. 

విజ్ఞాన సాహిత్యాల మేటి కలయిక
అదే సమయంలో సాహిత్యంలో కూడా విశేషమైన కృషి చేశారు. తెలుగు – రష్యా నిఘంటువు కొరకు శ్రమించారు. ఏటుకూరి బలరామమూర్తి రాసిన పుస్తకం ‘ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర’ను రష్యా భాషలోకి అనువదించారు. రష్యాలో సీతారామయ్య పేరు ‘క్యాన్ స్టానిన్ సెర్జియో విచ్’. మన సాహిత్యంలో రష్యా ఆంధ్రుడు, మాస్కో ఆంధ్రుడు, సోవియట్ ఆంధ్రుడు వంటివి ఇతర పేర్లు, సీతారామయ్య రష్యా వెళ్లిన 42 సంవత్సరాలు తర్వాత అంటే 1963 ఏప్రిల్ 22న భారతదేశ వచ్చి 42 రోజులు గడిపారు. అలా వచ్చినప్పుడు తన సొంత ఊరు యాకమూరు, ఉయ్యూరు, విజయవాడ మొదలైన ప్రాంతాలతో సహా ఇతర నగరాలలో సత్కారాలు, పౌర సన్మానాలు అందుకుని చివరన జూన్ 1న బొంబాయి వెళ్ళారు. ఆ సమయంలో బొంబాయి ఆకాశవాణి వారిని రికార్డు చేసింది అని చెబుతారు, పిమ్మట అక్కడి నుంచి బయలుదేరి జూన్ 5న రష్యాకి చేరుకున్నారు. చివరి దశలో తన ప్రతిపాదనలన్నీ ఒక చట్రంగా రూపొందించాలని ఆయన భావించారు కానీ అది జరగలేదు. తన 78వ వేట మాస్కోలో 1977 సెప్టెంబర్ 29న కొలచల సీతారామయ్య కనుమూశారు.      

డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి పూర్వ సంచాలకులు, ప్రసిద్ధ సైన్స్ రచయిత 
మొబైల్ : 9440732392, 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *