నాగబు ద్ధ
భారత ప్రాచీన నాగరికత అనగానే సింధూ నదీతీర హరప్పా నాగరికత మొదట సాక్షాత్కరిస్తుంది తర్వాత గంగా యమునా తీర వైదిక నాగరికత వచ్చి నిలబడుతుంది. మొదటిది BCE 2600-1900 నాటిది. రెండోది BCE 1500-600 నాటిది. ఈ రెండు నాగరికతల మధ్య ఇంత వ్యవధానం ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? సింధూ నాగరికత కొనసాగింపుకు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అసలు మన దేశంలో ఈ రెండు నాగరికతలు తప్ప మరో ఏ ప్రాచీన నాగరికతా లేదా? మరే నదీ తీరం దీనికి నోచుకోలేదా? ఈ ప్రశ్నల చుట్టూ దశాబ్దాల తరబడి చర్చలు జరుగుతున్నాయి. ఏ కొత్త అన్వేషణలైనా దీనికి దారి చుపుతాయేమోనని ఏదో చూపులు సాగుతున్నాయి.
అస్తిత్వ సమస్యగా మారిన కీళడి తవ్వకాలు
ఈ నేపథ్యంలో భారత పురాతత్వ శాఖ వారి కీళడి తవ్వకాలు కొత్త సమాధానాల్ని వెతికిపెట్టాల్సింది పోయి, సరికొత్త వివాదాలకు దారితీస్తున్నాయి. సైన్సు కంటే నమ్మకాలకు, భావోద్వేగాలకు, రాజకీయాలకు పెద్ద పేట వేసే మనలాంటి దేశంలో వాస్తవం వెనక్కి వెళ్లి వివాదాలు ముందుకు రావడం విశేషమేమీ కాదు గానీ విచిత్రం ఏమంటే కీళడి వ్యవహారం మాత్రం భారతీయ చరిత్రనే తిరగరాయాలన్నంత దూరం వెళ్ళింది. అక్కడితో ఆగక ఒక జాతి అస్తిత్వ సమస్యగా, మారోజాతి ఆధిపత్యసంకేతంగా కూడా మారింది!
కీళడి తమిళనాడులో మధురైకి 12 కిలోమీటర్ల దూరంలో వైగై నదీతీరాన వుంది. ఒకప్పుడిది సంగమ సాహితీ సంస్కృతుల పరిమళంతో గుబాళించిన ప్రాంతం. సంగం సంస్కృతి ఏ మతచ్ఛాయలు లేనిది, సరళ జన జీవనమే సారంగా సాగినది.
ఒక పాఠశాల ఉపాధ్యాయుడికి 1976లో దొరికిన మట్టి పాత్రతో కీళడి కథ మొదలైంది. అంతకు ముందు ఐరావత మహదేవన్ కూడా 1960లలో ఒక ప్రయత్నం చేసారు గానీ ఒక లారీ డ్రైవర్ 2014లో పురాతత్వ శాఖ వారికిచ్చిన సమాచారంతో శాస్త్రీయ తవ్వకాలు మొదలయ్యాయి. అప్పటినుంచి 2015-2024 మధ్య దశాబ్దం పాటు ఇప్పటికి పది దశల్లో వంద ప్రదేశాల్లో తవ్వకాలు జరిగాయి సుమారు 18,000 ఆనవాళ్ళు లభించాయి. ఇదంతా సువిశాల ప్రాంతంలో లభించిన సుదీర్ఘ కాలపు సామగ్రి (artefacts). ఇవిప్పుడు మన ప్రాచీన భారతదేశ చరిత్రను తిరగరాయాలన్న డిమాండ్ ను ముందుకు తెచ్చాయి.
సింధూనాగరికతకు తీసిపోని ఆనవాళ్ళు
పురాతత్వవేత్తలు ఈ తవ్వకాల్లో ఇటుకలతో కట్టిన నిర్మాణాలు, టెర్రకోట రింగు బావులు, మట్టి నీటి పైపులు, ఆభరణాలు, కత్తులు, టెర్రకోట ఆటగాళ్ల బొమ్మలు, చదరంగపు కాయలు, ఎముకల సాధనాలు, మానవ జంతు విగ్రహాలు, ఇంకా వేలాదిగా పట్టణ నాగరికత ఆనవాళ్లు కనుగొన్నారు. ఇవన్నీ వ్యవసాయం, పశుపోషణలపై ఆధారపడ్డ స్థిరనివాస నాగరికతకు సంకేతాలు. సాంకేతికతలో సింధూ నాగరికతకు ఏ మాత్రం తీసిపోనివి. అంతిమంగా ఈ ఆనవాళ్లు సింధూ, గంగా యమునల సరసన వైగైని కూడా చేర్చాలన్న వాదాన్ని బలంగా ముందుకు తెచ్చాయి.
సుదీర్ఘ భారత ప్రాచీన నాగరికతకు సింధూప్రజలూ, ఆర్యులతో పాటు ద్రవిడులు కూడా సమాన వారసులేననే కొత్త డిమాండును బలంగా తెరపైకి తెచ్చాయి.
ఫ్లోరిడాలో జరిగిన కార్బన్ డేటింగ్ లో ఇవి BCE 800 నుండి 300 నాటివని తేలింది. అంటే మహావీర బుద్ధుల కంటే, మౌర్య సామ్రాజ్యం నాటి మహాజనపదాల కంటే ముందే దక్షిణ భారత దేశంలో వైగై నదీతీరాన ఒక పట్టణ నాగరికత విలసిల్లిందన్నమాట!
సంగమ సంస్కృతితో కీళడి ఆనవాళ్లు సరిపోతున్నాయనీ, ఇక్కడి తవ్వకాల్లో మతచిహ్నాలేవీ లభించలేదని కూడా పరిశోధకులంటున్నారు. దీనర్థం ఏమిటి? ఇది స్పష్టంగా వైదిక నాగరికతకు భిన్నమైంది. సరళమైంది. సెక్యులర్ స్వభావం గలది. సంగమ సాహిత్యం కూడా అచ్చం అలాంటిదే కావడం విశేషం.
హరప్పానాగరికతకు కొనసాగింపా?
హరప్పా నాగరికతకు వైగై నాగరికత కొనసాగింపనీ; సింధూ నాగరికత జనం సంగమజనం ఒకరేననే చర్చ కూడా దీంతో మొదలైంది. పట్టణ నిర్మాణం, కాలువలు, క్రీడా వినోదపరికరాలు, వాణిజ్య వ్యాపారాల ఆనవాళ్ళు దీన్ని ధ్రువపరుస్తున్నాయంటున్నారు. ఇదే నిజమైతే సింధూ నాగరికత అర్ధాంతరంగా ఎలా తెగిపోయిందన్న ప్రశ్నకు కూడా సమాధానం దొరికినట్టవుతుంది.
అంతేగాక కీళడి తవ్వకాల్లో ప్రాచీన తమిళ బ్రాహ్మీలిపి ఆనవాళ్లు కూడా విస్తారంగా బయటపడ్డాయి. కాల్చిన కుండలపై శాసనాల్లాంటివి లభించాయి. సాధారణ ప్రజల అక్షరాస్యతా స్థాయినివి సూచిస్తున్నాయి. ఈ లిపికి, సింధూ లిపికి ఏమైనా సంబంధం వుందా? ఈ కూపీ లాగడానికి కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏకంగా తమిళనాడు ప్రభుత్వం సింధులిపిని ఛేదించిన వారికి ఒక మిలియన్ డాలర్ల పారితోషికాన్ని ప్రకటించింది! దీంతో ద్రవిడ భావోద్వేగం కూడా దీనికి తోడయినట్టయింది. సంగమ సాహిత్య కాలం కూడా ఈ అన్వేషణల ఫలితంగా మరింత వెనక్కి (సా.శ.పూ 800కు) వెళుతోంది.
కేంద్రం తిరకాసు
ఈ త్రవ్వకాల్ని సజావుగా కొనసాగించి, శాస్త్రీయంగా అన్వేషణలు పూర్తి చేయించి, దీని ఆనవాళ్ళని సైన్సు పద్దతిలో విశ్లేషించి, సమగ్ర నివేదిక పురాతత్వ శాఖ రూపొందించి, దేశీయంగానే కాదు అంతర్జాతీయంగా సైతం ఒక అకడమిక్ చర్చ ప్రారంభించి వుంటే ఎంతో బాగుండేది. సంకుచిత రాజకీయాల స్థానే సైన్సుకు పెద్దపీట వేసి వుంటే ఎంతో సవ్యంగా వుండేది. నిష్పక్షపాతంగా నిజాన్ని నిగ్గుతేల్చడానికి పురాతత్వ శాఖకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వుంటే ఏ వివాదమూ తలెత్తేది కాదు.
దీనికి భిన్నంగా మొదటి రెండు తవ్వకాలు జరగ్గానే (2015-16) మూడో దశకు అనుమతి ఇవ్వకపోగా దీనికి నాయకత్వం నెరిపిన అధికారి అమరనాథ రామకృష్ణను కేంద్రం అర్ధాంతంగా అస్సాంకు బదిలీ చేసింది. దీంతో ఆయనిచ్చిన ప్రాథమిక రిపోర్టు బయటికి రాలేదు. చెప్పుకోదగ్గ ఆధారాలు లభించలేదనీ, మట్టి నిర్మాణాల కొనసాగింపు కనిపించడం లేదనీ దీనికి భారత పురాతత్వ శాఖ కుంటి సాకులు చెప్పింది రిపోర్టును సవరించాలని కోరింది. దీన్ని తిరస్కరిస్తూ సహజంగానే ఆయన తీవ్రంగా స్పందించాడు. “ఉత్తర భారత నదీ నాగరికతల ప్రదేశాల్లో జరగాల్సినన్ని తవ్వకాలు జరిగాయి. కావలసినంత అధ్యయనం వాటిపై జరిగింది. మరిప్పుడు దక్షిణభారత నదీతీరాల్లో గదా త్రవ్వకాలు చెయ్యాల్సింది. అన్వేషణలు జరగాల్సింది. దీన్నెందుకు పట్టించుకోరు” అని నిలదీశాడు. ఓపిగ్గా ఏళ్ల తరబడి పరిశోధన చెయ్యాల్సిన శాస్త్రజ్ఞుల్ని బ్యురోకట్ల లాగా బదిలీలు చెయ్యడమేమిటని ఎదురు తిరిగాడు. వివాదం ముదిరి కోర్టులకెక్కింది. చివరకు మద్రాసు హైకోర్టు పురాతత్వ శాఖ నివేదికను బయటపెట్టాలనీ, తమిళనాడు ప్రభుత్వమే తవ్వకాలు కొనసాగించాలనీ మొట్టికాయలు వెయ్యడంతో 2017లో మళ్లీ అన్వేషణ మొదలైంది.
మొదటి, రెండు దశల వెయ్యి పేజీల రిపోర్టు 2023లో రామకృష్ణ ఇచ్చాడు. (దీన్ని ASI సవించాలంటోంది) కానీ మళ్ళీ త్రవ్వకాలు మొదలయ్యే నాటికి రామకృష్ణ చెన్నైలో లేడు. నాలుగవ దశలోని ఆనవాళ్లను ఫ్లోరిడాలోని డేటా అనలిటికల్ సెంటర్ కు పరీక్షల కోసం పంపారు. ఇది కీళడి చరిత్రను సా.శ.పూ 800 కి వెనక్కి జరిపింది.
శివగంగై జిల్లాలో ఆదిచెన్నలూరులో ఎప్పుడో 20వ శతాబ్దపు తొలినాళ్ళలో బ్రిటిష్ వారు జరిపిన తవ్వకాలది కూడా ఇదే కథ! వంద ఏళ్ల తర్వాత (2004) టి.సత్యమూర్తి నాయకత్వాన చేసిన అన్వేషణల్లో 3000 సంవత్సరాల నాటి ఇనుప యుగపు ఆనవాళ్ళు లభించాయి. ఇవీ కీళడిలో లభించినవి ఒకేరకమైనవని తేలింది. ఈ నివేదిక తయారు కావడానికి కూడా 15 ఏళ్లు పట్టింది!
ఇలా కీళడి తవ్వకాలు పది దశలుగా (2024 దాకా) కొనసాగాయి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర పురాతత్వ శాఖ ముందుండి వీటిని కొనసాగించాల్సి వచ్చింది. చివరికిది ద్రవిడుల అస్తిత్వ సమస్యగా మారి, తమిళనాడు ప్రభుత్వం మొండిగా కేంద్రాన్ని ఢీకొట్టాల్సి వచ్చింది.
ఇదో జాతి సంబంధ సమస్య
ఈ వ్యవహారం ఇంత దూరం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? భారత పురాతత్వ శాఖకు పూర్తి స్వేచ్ఛనీ, నిధుల్నీ ఇచ్చి రామకృష్ణ గారిని కొనసాగించి వుంటే ఏమయ్యేది? కేంద్రం ఎందుకింత పంతానికి పోతోంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే. ప్రస్తుత ప్రభుత్వం వైదిక సంస్కృతీ నాగరికతల్ని మాత్రమే భారతీయ వారసత్వ సంపదగా భావిస్తోంది. వేదశాస్త్ర పురాణాల సంస్కృత సాహిత్యం మాత్రమే మనల్ని విశ్వగురువులుగా చేసిందని దృఢంగా నమ్ముతోంది. మనల్ని ఒక గొప్ప పురుషాధిక్య యుద్ధ వీరుల ఆర్యజాతిగా అది భావిస్తోంది. దాని ప్రకారం ఆర్యులు దేవతలు, ద్రవిడులు రాక్షసులు! దీనికి భిన్నమైన స్వతంత్ర నాగరికతల్ని అది ఏ మాత్రం ఒప్పుకోలేదు. సింధూ నాగరికత అర్ధాంతరంగా తెగిపోలేదనీ, అదీ ఆర్యనాగరికతా ఒకటేననీ, సింధు తర్వాత గంగా యమునా తీరాల్లో ఇది అనుస్యూతంగా కొనసాగి విలసిల్లిందనీ నిర్ధారించడానికి లెక్కలేని ప్రయత్నాలిప్పుడు జరుగుతున్నాయి. ఇందులో భారత పురాతత్వ శాఖ కూడా ఇతోధిక పాత్ర పోషిస్తోంది. మరిప్పుడు వైదికేతర సంగమ నాగరికతా సంస్కృతులు వైగై తీరంలో సా. శ.పూ 800 నాటికే విలసిల్లాయంటే అదెలా జీర్ణం చేసుకోగలదు? సింధూలిపి, తమిళ బ్రహ్మీలిపులు ఒకే గొలుసులోనివంటే అదెలా తట్టుకోగలదు?
అదే రాజస్థాన్ రాష్ట్రంలోని బహాజ్ గ్రామంలో 23 మీటర్ల లోతున కనపడ్డ పూడిపోయిన కాలువను ఇదే పురాతత్వ శాఖ వైదిక సరస్వతీ నదిగా ఆగమేఘాల మీద ప్రకటించింది! అక్కడ మహాభారత కాలం నాటి (మహాభారతం ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ తేలలేదు) నివాసాలున్నట్టు చెప్పుకొచ్చింది!
ఇలా చూస్తే ఇదేదో ఒక శాఖా పరమైన సమస్య గాదు. పండిత వివాదం అంతకన్నా కాదు. ఇదో జాతుల సమస్య. ఆధిపత్యాల సమస్య అస్తిత్వాల సమస్య ఉత్తరదక్షిణ సంస్కృతుల సమస్య.
కావల్సింది సత్యం పట్ల నిబద్ధత
కేవలం రామకృష్ణ నివేదిక ఆధారంగానే వైగై నాగరికతకు సింధూ నాగరికతతో సారూపాన్ని నిర్ధారించగలమా? మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సివుందా? అంటే ప్రొ.పి మహాలక్ష్మి (JNU) వైగై నాగరికతనూ దక్షిణాదిపై వివక్షనూ అంగీకరిస్తూనే ప్రస్తుతాధారాలతోనే దీన్ని నిర్ధారించలేమంటున్నారు. సమగ్రమైన అంతిమ రిపోర్టులు రావాల్సి వుందంటున్నారు. ఆర్య ద్రావిడ వివాద పైత్యం ఆర్కియాలజిస్టుల్ని సైతం చుట్టుకోవడం వలసవాదులు మనకంటించిన రోగమనీ, ఇంతకాలమైనా మనది ఒకే దేశమన్న స్పృహే మనకు వొంటపట్టలేదని బాధపడుతూ.. పెరిగిన సాంకేతికను వాడుకొని, నిపుణుల్ని వినియోగించుకొని నిజాన్ని నిగ్గుతేల్చాలంటారామె. సింధూ నాగరికతపై సమగ్ర అధ్యయనానికి కూడా దశాబ్దానికి పైగా పట్టిందనీ, దాని విషయంలోనూ ఎన్నో తర్జనభర్జనలు జరిగాయనీ ఆమె గుర్తు చేస్తున్నారు.
నిజమే ఇలాంటి విషయాలపై మనకెంతో సంయమనం వుండాలి. ఫలితం ఎలా వచ్చినా సత్యాన్ని సత్యంగా గుర్తించే, అంగీకరించే విజ్ఞతా సంస్కారాలుండాలి. కాకుంటే ఈ సత్యం కోసం మరింత కాలం ఆగాల్సి రావచ్చు మనలాంటి బహుళ సంస్కృతుల దేశంలో ఒక్క సింధూ గంగా యమునా వైగైలే ఏమిటి ? నర్మదా గోదావరీ తీరాల్లోనూ ఏ నాగరికత ఏ రూపంలో విలసిల్లిందో మనకింకా తెలియవలసి వుంది. ఎంత సేపటికీ మన ప్రాచీనతకు ఉత్తరాది సంస్కృత వేద శాస్త్ర పురాణాలనే ప్రమాణంగా చూపుతున్నాం తప్ప ద్రవిడ జాతుల్ని, వాటి సంస్కృతీ సాహిత్యాలనీ చూడ నిరాకరిస్తున్నామన్న విమర్శల్ని అంత తక్కువ చేసేమీ కొట్టి పారేయలేము..
పురాతత్వశాఖకు ఈ విజ్ఞతా, స్వేచ్ఛా వుండాలంటే మొదట మన రాజకీయాలు ప్రజాస్వామిక లక్షణాలతో పరుపుష్టం కావలసి వుంది. దీనికోసం మనం ఎంతో దూరం ప్రయాణించాల్సివుందో, ఎంతకాలం వేచి చూడాల్సి వుందో మరి!
(నాగబు ద్ద గారు స్వతంత్ర చరిత్రకారులు. దక్షిణభారత దేశ ప్రాచీన చరిత్రను ప్రజలకు చేరువయ్యేలా సోషల్ మీడియా ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వెబ్ సైట్ www.nagabu.art )