డా యం. గేయానంద్

భారతదేశంలో, 2500 సంవత్సరాల నాడు, జరిగిన వైజ్ఞానిక వికాసం ఇంతకుముందు చూసాము. అటువంటిదే, యూరోప్ లో కూడా జరిగింది. దాన్ని కొంచెం తెలుసుకుందాము.

విజ్ఞానం ఏ ఒక్క ప్రాంతపు గుత్త సొత్తు కాదు. కొన్ని కొన్ని భౌతిక పరిస్థితులలో, కొన్ని కొన్ని భావాలు, విజ్ఞానాలు పుడతాయి.. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక నాగరికత నుంచి ఇంకో నాగరికతకు విజ్ఞానం వ్యాపించే క్రమంలో, జరిగే రాపిడిలో, సంలీనంలో మరిన్ని కొత్త భావాలు ఆవిర్భవిస్తాయి.

ఇప్పటికి రెండు వేలా ఐదు వందల సంవత్సరాల నాడు, ప్రాచీన గ్రీస్ లో, కొన్ని భౌతిక సామాజికాంశాలు కలసి వచ్చాయి. మనిషి, కి సహజంగానే ఉండే ఉత్సుకత తోనే కాకుండా, ప్రకృతిని, కొత్త దృష్టితో చూడటమనే కొత్త గాలులు మధ్యదరాసముద్రతీరాల్లో వీచాయి.
ప్రకృతిని ప్రకృతి కారణాలతోనే అర్థం చేసుకో వాల్సిన అవసరాలు, పరిస్థితులు ముందుకు వచ్చాయి.

అంతకుముందు, వేల, లక్షల సంవత్సరాలు, మానవులు తమ సమస్యలకు పరిష్కారాలను, ఎలా సాధించారు? అంటే, భౌతిక పనిముట్లను తయారు చేయడం ద్వారా, అని జవాబు వస్తుంది. అందుకు తన పరిసరాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చేశాడు. కానీ మొత్తం ప్రకృతిని, విశ్వాన్ని ఏ దృష్టితో చూడాలి అనేది, వచ్చినప్పుడు, అతనికి అంతా మార్మికంగా తోచింది. విధ్వంసపూరితమైన ప్రకృతి సంఘటనలు అతన్ని భయపెట్టేవి. ఋతువులు, అంతరిక్షం, చావు పుట్టుకలు, అతనికి అంతుచిక్కేవి కాదు. మనిషికి, ప్రకృతికి అతీతమైన ఏవేవో శక్తులను, దేవుళ్లను దయ్యాలను అందుకు కారణమని ఊహించుకున్నాడు. అవి ఆదిమ ఆలోచనలే. కానీ ఆ రకమైన ఆలోచనలకు చోటివ్వడం అనేది ఒక రకంగా, ఆనాటి మానవ సృజనాత్మకతకు సూచికగా కూడా తీసుకోవచ్చు.

అయితే 2500 సంవత్సరాల నాడు, మధ్యధరా సముద్ర తీర ప్రాంతాలలో మార్మికతను, కొంచెం పక్కన పెట్టి, ఎందుకని, మనిషి ఆలోచించాడు? దీనికి జవాబు అప్పుడున్న భౌతిక పరిస్థితులలో వెదకాలి.

భౌగోళికత నిర్వహించిన పాత్ర..
అయితే దీనికి చాలా కాలం ముందు, యూరోప్ లో, జరిగిన ఒక పరిణామాన్ని, గుర్తు చేసుకుందాం. 4000 సంవత్సరాల నాడు ఆర్మీనియా కొండల్లో ఉన్న కొందరు, ఇనుప ఖనిజం నుండి ఇనుమును ఎలా సంగ్రహించాలో నేర్చుకున్నారు. ఈ కొత్త పద్ధతి చక చకా, ఆ ప్రాంతమంతావ్యాపించి, ఇనుము పెద్ద ఎత్తున వాడకంలోకి వచ్చింది. ఒక వెయ్యి సంవత్సరాలు ఇలా గడిచాయి. కానీ, ఇనుము వాడకం పై, పై చేయి సాధించిన, కొన్ని ఆటవిక తెగలు, అప్పటి కంచు నాగరికతలను సైనికంగా జయించడం ప్రారంభించించాయి. అటువంటి ఒకానొక తెగ వారు (వారిని డోరియన్ గ్రీకులు అన్నారు) తూర్పు మధ్య ధర సముద్ర ద్వీపకల్పమైన మాసిడోనియాలోకి, (ప్రస్తుత గ్రీసు), తెరలు తెరలుగా ప్రవేశించారు. మధ్యధరా సముద్రంలో వేల ద్వీపా లుంటాయి. వాటిని, తమ ఆవాసాలుగా మార్చుకున్నారు. అయితే ఈ ప్రాంతమంతా ఎక్కడ చూసినా, సమున్నతమైన నిలువెత్తు కొండలే అన్నట్టుగా ఉండేది. కొండలు దాటి వెళ్లాలంటే, ఎవరికైనా కష్టం అయ్యేది. దాంతో ఎక్కడికక్కడ, స్వతంత్రమైన, చిన్నచిన్న వందల నగర రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ నగర రాజ్యాలకు మధ్య కొద్దికొద్దిగా సంబంధాలు ఉన్నా, వేటి ప్రభుత్వం వాటిదే, వేటి సంస్కృతి వాటిదే అన్నట్టుగా ఉండేవి. ఈ వందల రాజ్యాల మీద పెత్తనం చెలాయించే, కేంద్రీకృత రాజ్య వ్యవస్థ ఏది ఉండేది కాదు. ఎప్పుడైతే కేంద్రీకృత వ్యవస్థ లేదో, సంస్కృతి మీద కూడా పెత్తనం ఉండేది కాదు. ఒక కేంద్రీకృతమైన బలమైన పురోహిత వర్గం కూడా ఏర్పడలేదు. ఈ పరిస్థితులలో, మనుషులు స్వేచ్ఛాపూరిత ఆలోచనలు చేయగలిగారు.

మాసిడోనియా ద్వీపకల్పం చుట్టూ, అనేక ద్వీపాలు ఉంటాయి. గ్రీకులు ఈ ద్వీపాలతో వ్యాపారాలు చేశారు. ప్రయాణాలు చేశారు. అంటే సముద్ర ప్రయాణాల మీద ఆధారపడిన ఒక ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. నిరంతరం సముద్రాల మీద ప్రయాణాలు చేసే వారికి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఒక జామెట్రిక్ ఆలోచనలు ఏర్పడతాయి అంటారు. అట్లే ఆ ప్రయాణాలు చేసేవారు, మధ్యధరా సముద్రంలో ఒక మూల నుంచి ఇంకొక మూలకు వచ్చేసరికి, ప్రజల్లో దృక్పదాలు ఎలా మారుతాయో గమనించేవారు. తమకు ఉపయోగపడే వాటినే ఉపయోగించుకునేవారు, ఉపయోగపడని ఆలోచనలను వదిలేసేవారు. అంటే ఇదొక పద్ధతి అన్నమాట.

అట్లే సముద్ర ప్రయాణాలు అంటే మాటలు కావు. సముద్రపు భౌతిక శక్తిని, ఎప్పటికప్పుడు మారే సముద్ర స్వభావాన్ని అర్థం చేసుకొని ఎదుర్కోవాలన్నమాట. ఇందుకు సొంత లాజిక్కులు, మార్మికతలు పనిచేయవు. ఉన్నదాన్ని ఉన్నట్టుగానే అర్థం చేసుకోవాలి. లేకపోతే ప్రాణాలకే ముప్పు వస్తుంది.

విశ్వానికి అంతః సూత్రం ఏమిటి?
అన్ని నగర నాగరికతల్లో లాగే, గ్రీకు నాగరికతల్లో కూడా దేవుళ్ళు దేవతలకు అతీత శక్తులు ఉన్నాయి. అయితే ఒక తేడా ఉంది. గ్రీకు దేవుళ్ళు సర్వశక్తిమంతులు సర్వజ్ఞులు కారు. ఆ దేవుళ్ళు, మనుషుల్లాగే, లోపాలు ఉన్నవాళ్లే.
2500 సంవత్సరాలు నాడు, గ్రీకు సమాజం ఉన్న పరిస్థితి ఇది. ఈ పరిస్థితుల్లో, ఆనాటి గ్రీకు తాత్వికులలో ప్రకృతిని ప్రకృతి కారణాలతోనే అర్థం చేసుకోవాలనే ధోరణి ఒకటి ప్రారంభమైంది. ఈ విశ్వానికి, అంతః సూత్రంగా ఉన్నదేమిటి? అని ఆలోచించడం ప్రారంభించారు. ఈ ఆలోచనా పద్ధతిని ముందుకు తెచ్చినవాడు, మనకు తెలిసిన మొదటి తాత్వికుడు థేల్స్.

ఇప్పటి టర్కీ పశ్చిమ తీరంలో ఉన్న, అప్పటి పట్టణం మిలెటస్ కేంద్రంగా అనేకమంది తాత్వికులు ఆవిర్భవించారు. అట్లే ఏథెన్స్, కొన్ని ఇతర దీవుల నుంచి కూడా తాత్వికులు వచ్చారు. వాళ్లందరినీ కలిపి’ మిలేషియన్ స్కూల్ అంటారు. సోక్రటీస్ ముందు కాలం వాళ్ళు, వీళ్ళందరూ. వారందరి గురించి, తెలియదు కానీ, కొందరి గురించి మాత్రం చరిత్రలో నమోదయింది.

తొలి తాత్వికుడు థేల్స్…

థేల్స్ ఒక వ్యాపారి. విస్తృతంగా ప్రయాణాలు చేస్తూ ఉండేవాడు. భూమి నీళ్లలో తేలుతుందని, భూమిపై ఉండే చెట్లు పుట్టలు కొండలు మైదానాలు, గాలి ఆకాశం.. ఇలా అన్ని నీటి ద్వారానే నిర్మితమయ్యాయని చెప్పాడు. ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానింపబడి ఉంటాయని చెప్పాడు. ప్రపంచం దేనితో నిర్మింపబడి ఉంటుందని ప్రశ్నించుకున్న థేల్స్, నీళ్లు అనే సమాధానం ఇచ్చుకున్నాడు. ఇట్లా ఒక ప్రశ్న వేసుకుని, దానికి, భౌతిక సమాధానాన్ని వెతికిన మొట్టమొదటి గ్రీకు తత్వవేత్త థేల్స్.

థేల్స్ అడుగుజాడల్లో నడిచిన మరో ఇద్దరు ఉన్నారు. వారిలో అనాక్సి మాండర్(610BC) ఒకడు. ప్రపంచం నీళ్లతో నిర్మింపబడిందనే భావనను అతను ఒప్పుకోలేదు. తన సొంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ‘ఆపేరియన్’ అనే కనిపించని, రూపంలేని దానితో పదార్థం నిర్మితమైందని అన్నాడు. జీవులన్నీ సముద్రం నుంచే వచ్చాయని అన్నాడు. భూమి, సిలిండర్ లాగా ఉందని, ఉపరితలం వంగి ఉందని అన్నాడు. ఆకాశం ఒక గోళం లాగా భూమిని కప్పి ఉందని, ధ్రువ నక్షత్రం చుట్టూ అంతరిక్ష లోకాలు తిరుగుతూ ఉన్నాయని అన్నాడు. అనాక్సిమాండర్ అప్పటి ప్రపంచ చరిత్రను కూడా రాశాడట.

అనాక్సిమాండర్ శిష్యుడు అనాక్సి మినేజ్ (570BC). అతడు గురువుతో విభేదించాడు. ప్రపంచం తయారైంది నీటితోనో అపేరియాన్ తోనో కాదని, గాలితో నిర్మితమైందని అనాక్సిమినేజ్ అన్నాడు. గాలిని బాగా ఒత్తిడికి గురి చేస్తే నీరుగాను నేలగాను మారుతుందని, బాగా పలుచన చేస్తే మంటగా మారుతుందని అన్నాడు. ఇంద్రధనస్సుకు ప్రాకృతిక కారణాలేమిటి అని ఆలోచించాడు. గ్రహాల మధ్య తేడాలను చూశాడు.

ఈ విజ్ఞానులు, విశ్వం గురించి చెప్పిన విషయాలన్నీ, ఇప్పుడు నవ్వులాటగా, కొన్ని అర్థం, పర్థం లేనివిగా అనిపిస్తాయి. ఊహల విన్యాసంగా, ముతక మేధస్సుగా వాటిని తోసిపుచ్చవచ్చు. కానీ ప్రకృతిని పరిశీలించడం, భౌతిక విషయాలతో విశ్లేషించడం, అతీత శక్తులకు తావివ్వకపోవడం ఇందులో ని మౌలికాంశం.

పైథాగరస్…
విశ్వం గురించే కాక, ఇతరత్రా అంశాల గురించి ఆలోచించిన గ్రీకు విజ్ఞానలు కూడా ఉన్నారు. అందులో ప్రసిద్ధుడు పైథాగరస్. (560BC). విశ్వమంతా సంఖ్యాత్మకమే అని అన్నాడు. అయితే సంఖ్యలకు, ఒక అతీతమైన శక్తి ఏదో ఉందని అనుకున్నాడు. జామెట్రీ అనే భావనకు ఒకరకంగా పైథాగరస్ ఆధ్యుడు. అయితే విశ్వం గురించిన కొన్ని భావనలు కూడా ఆయనకు ఉన్నాయి. ప్రపంచానికి కేంద్రం భూమి కాదని, ఒక కేంద్రక అగ్ని కేంద్రమని, దాన్ని మనం చూడలేమని అన్నాడు. గ్రహాలు, విశ్వం గోళాకారంలో ఉంటాయని, అవన్నీ ఒక పర్ఫెక్ట్ వర్తులాకారంలో తిరుగుతుంటాయని పైథాగరస్ భావించాడు. ఇటువంటి భావాలు 17 శతాబ్దం దాకా పెద్దగా మారలేదు.

గ్రీకు విజ్ఞానులలో కొందరు మానవ శరీరంపై కూడా దృష్టి సారించారు. పైథాగరస్ శిష్యుడు ఆల్ కెమియోన్ (530BC) అందులో ఒకడు. మానవ, జంతు శరీర నిర్మాణాలని తెలుసుకోవడం కోసమే, ప్రత్యేకంగా శరీరాలను కోసి చూసిన మొట్టమొదటి విజ్ఞాని బహుశా ఇతనే. రక్తనాళాల గురించి, నాడుల గురించి చెప్పాడు. మేధస్సుకు కేంద్రం మెదడు కావచ్చు అని అన్నాడు. వైద్యం చేశాడు.

అయితే కొందరు గ్రీకు తత్వవేత్తలు మరోలా ఆలోచించారు. హెరా క్లిటెస్ (540BC) ఈ విశ్వం గురించి చేసే ఆలోచనల వల్ల, ఒక మామూలు మనిషికి వచ్చే ప్రయోజనం ఏమిటని? ప్రశ్నించారు. ఏదీ శాశ్వతం కాదని, అన్నీ నిరంతరం మారుతున్నాయని, ఆధారపడగలిగింది ఏదీ లేదని అంటూ వాపోతూ ఉండే వాడట. అందుకే అతన్ని ఏడుపుగొట్టు విజ్ఞాని అనేవారట. అతని దృష్టిలో విశ్వానికి అగ్ని కీలకం. అగ్ని నిరంతరం మారుతుండటమే కాక, నిరంతరం అన్నింటిని మార్చి వేయడం అతనికి ముఖ్యమైన విషయం గా తోచింది.

శిక్ష ను ఎదుర్కొన్న తొలి గ్రీకు శాస్త్రవేత్త..
ఈ విజ్ఞానుల పరంపరలో చివరివాడు అనక్సగోరస్ (500BC). మార్మికత ఏ రూపంలో ఉన్నా, దాన్ని ఎదిరించేవాడు. అది దేవుళ్ల మార్మికత అయినా సరే, లేదా పైథాగరస్ చెప్పిన, సంఖ్యలలోని మార్మికత అయినా సరే. అన్నింటికి కారణాలు అడిగేవాడు. అతడు గ్రహాల గురించి చెప్పిన, అనేక భావాలు అప్పటి వారికి నచ్చలేదు. అంతరిక్షం/ స్వర్గం అంటే ఎంతో పవిత్రమైనది, గొప్పవి అనుకునే ఆ రోజుల్లో, చంద్రుని ఒక సాదాసీదా గ్రహం అని, అక్కడ అంతా కొండలు గుట్టలు ఉంటాయని, మనుషుల్లాంటి వాళ్లే ఉండొచ్చని అనక్సగోరస్ అన్నాడు. సూర్యచంద్రుల గ్రహగతుల వల్లే, గ్రహణాలు వస్తాయని చెప్పాడు. నక్షత్రాలు, గ్రహాలు సూర్యుడిలాగే నిప్పు కణికలన్నాడు. విశ్వం దేవుళ్ళ సృష్టి కాదని, అది ఏవో కొన్ని చలనాల వల్ల ఏర్పడిందని అన్నాడు. భూమైనా, స్వర్గమైనా ఒకే సమయంలో ఒకే పదార్థాలతో ఏర్పడిందని అన్నాడు. ఏథేన్స్ లో చాలా కాలం ఈ చర్చలు నడిపాడు.

ఏథెన్స్, అప్పటి ప్రపంచంలోనే ఒక మొదటి ప్రజాస్వామిక సమాజం కింద లెక్క. బానిసలకు స్త్రీలకు అక్కడ హక్కులు ఉండవు కానీ, మిగిలిన వారు ఓటు వేసి పాలకులను ఎన్నుకుంటారు. అనెక్స గోరస్ లాంటి తాత్వికుల వల్లే, ఏథేన్స్ కు ఆ కాలంలో ఒక మేధో కేంద్రంగా పేరు వచ్చింది.

ఆనాటి గ్రీకు సమాజం కూడా ఈ భావాల తీవ్రతకు తట్టుకోలేకపోయింది. వ్యవహారం చాలా దూరం వెళుతూ ఉందని, ఆనాటి ఛాందసులు అనుకున్నారు. అనెక్సగోరస్ పై నేరారోపణ చేసి, విచారణ ప్రారంభించారు. మొదట అనెక్స గోరస్ కొందరు స్నేహితుల సహాయం తీసుకుని, శిక్ష నుంచి తప్పించుకున్నాడు. కానీ ఎప్పటికైనా, శిక్షించక వదలని పరిస్థితి ఉంది. ఇక ఎటో పారిపోయాడు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో చనిపోయాడు.

దేవుడు కూడా అణువులతోనే…
ఆ కాలంలోనే ప్రాచీన గ్రీస్ లో అణు వాదులు కనిపిస్తారు. డెమోక్రిటస్ (470BC), లూసిపస్ (490BC), ఎపిక్యూరస్, విశ్వం గురించి చేసిన ఊహలు చూస్తే మొన్నటి విషయాల్లాగా కనిపిస్తాయి. భూమిపై లాగే చంద్రుడు పై కూడా పర్వతాలు లోయలు ఉండొచ్చని డెమోక్రిటస్ ఊహించాడు. పాలపుంతలో అనంతమైన నక్షత్రాలు ఉండొచ్చని అన్నాడు. ప్రపంచమంతా (మనుషులతో సహా) విభజించలేనంత, చిన్న అణువులతో, నిర్మితమై ఉందని అన్నాడు. వీటిని నాశనం చేయడం కానీ, మార్పు చేయడం కానీ కుదరదు అన్నాడు. ఈ అణు వులు, ఒకదానితో ఒకటి కలవడం, విడిపోవడాల వల్లా పదార్థాలలో మార్పులు వస్తాయని అన్నాడు ఇటువంటి అణువుల బృహత్ రాశి, ఒకటి గిర్రున వేగంగా తిరిగే క్రమంలో అనేక విశ్వాలు ఆవిర్భవించి ఉంటాయని అన్నాడు. మనిషి మెదడు కూడా అణువులే అన్నాడు. ఒకవేళ దేవుడు ఉంటే, దేవుడు కూడా అణువులుతోనే నిర్మింపబడి ఉంటాడని అన్నాడు. పునర్జన్మ అనేది లేదని, కాబట్టి మానవ జీవితంలోని మంచు చెడులు ఏవైనా ఉంటే, మనిషి మనసే, దానికి తీర్పరి కావాలని అన్నాడు.

కానీ ఆనాటి సమాజంలోని, మత చాందసులకు ఇవేవీ నచ్చలేదు. వాటిని చర్చించడం మానివేశారు. ఆ తరువాత, లూక్లిటస్ (95BC) అనే రోమన్ తాత్వికుడు తప్ప, ఇంకెవరు దీని గురించి పట్టించుకోలేదు. 19వ శతాబ్దంలో డాల్టన్ వచ్చే వరకు, ఈ ఈ భావాలు మరుగునపడి ఉన్నాయి.

గ్రీకుల ఆలోచనలను, విజ్ఞాన్వేషణను- సోక్రటీస్ (470 BC) ముందు, సోక్రటీస్ తరువాత,- అని విభజిస్తారు. సోక్రటీస్ తరువాత వచ్చిన వారిలో, ప్లేటో అరిస్టాటిల్ లాంటివాళ్లు ముఖ్యులు. ఆ విషయాలు వచ్చేనెల తెలుసుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *