సోఫీ వింకిల్మాన్

నేను నాలుగు వారాల క్రితం లండన్ లో ఒక బస్సులో నిలబడి ప్రయాణిస్తున్నాను. నా పక్కనే ఓ యువతీ, యువకుడూ కూర్చుని వున్నారు. ఇద్దరూ అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. ఇద్దరి చేతుల్లో రెండు స్మార్ట్ ఫోన్లున్నాయి. ఆసక్తిగా వారిద్దరి ఫోన్లలోకి కొంచెం తొంగి చూస్తే ఇద్దరూ డేటింగ్ యాప్ లు చూస్తున్నారు. తమ లాంటి యువతీ యువకుల స్నేహం కోసం వెతుకుతున్నారు. కొంచెం సేపటికి బస్సు ఆగింది. ఇద్దరూ బస్సు దిగి ఒకరు షాఫ్టెస్ బరీ అవెన్యూ వైపు మరొకరు సెయింట్ జేమ్స్ వైపు ఎవరి దారిన వారు వెళ్ళిపోతున్నారు. నాకు ఆశ్చర్యం కలిగించింది ఏమంటే అంతసేపూ పక్కపక్కనే బస్సులో కూర్చున్నా యువతీ యువకులు ఏ ముచ్చట్లూ చెప్పుకోలేదు. అసలు ఒకరి సరసన ఒకరం వున్నామన్న స్పృహే వారికి లేదు. ఇక చుట్టుపక్కల వాళ్ళని గమనించేదేముంటుంది? దిగాక కూడా ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. వాళ్ళు వెతుకుతున్న ‘స్నేహం’ పక్కనే వున్నా వాళ్ళు మాత్రం స్మార్ట్ ఫోన్లలోనే వెతుకుతున్నారన్నమాట! నాకిది చాలా అన్యాయంగా అనిపించింది.

మనం సామాజిక మాధ్యమాలు ప్రజల్ని గొప్పగా దగ్గరికి చేరుస్తున్నాయనుకుంటున్నాం. కానీ బస్సులో గంటల తరబడి సెల్ ఫోన్లకు అతుక్కుపోయిన ఆ జంట సంగతి ఏమిటి? ఆ జంటేనా ? బెడ్ రూముల్లో పరమ చెత్తకు బానిసలైపోయిన టీనేజర్ల సంగతీ, పిల్లలతో ముచ్చట్లాడ్డం మానేసి స్క్రోల్స్ చూస్తుండే తల్లిదండ్రుల సంగతీ, ’సిరి’ వాయిస్ వ్యసనంలో పడిపోయిన నర్సరీ పిల్లల సంగతీ మాత్రం ఏమిటి? అందరిదీ ఇదే వరుస గదూ?

పాపం వీరందరూ మానవ సహజతాల్ని కోల్పోతున్న వారు. ఓవైపు వయోజనులు ఎవరికి వాళ్లవుతున్నారు. వృద్ధులు వొంటరి వాళ్ళవుతున్నారు. ఇక బాల్యం చూస్తే సెల్ ఫోన్ల మాయాజాలంలో చిక్కుకుపోయింది. ఇంతకంటే పెద్ద సామాజిక సంక్షోభం ఏముంటుంది?

నేను కొన్నాళ్ల క్రితం ‘స్కూల్ హోం సపోర్ట్’ అనే స్వచ్చంద సంస్థలో పని చేశాను. అప్పుడు నాకు స్క్రీన్ లకు అతుక్కుపోతున్న పిల్లలపై ఆసక్తి కలిగింది వారిని ఓపిగ్గా పరిశీలించాను. దీనికోసం చాలా పాఠశాలలు సందర్శించాను. నాకు కొట్టొచ్చినట్టు కనిపించిందేమంటే పిల్లలు తరగతి గదిలో పరధ్యానంగా వుండిపోతున్నారు. ఆట స్థలంలోనూ నిశ్శబ్దంగా వుంటున్నారు. వీరికేమైంది?

పాఠాలు ఇప్పుడు చాలా చోట్ల స్క్రీన్ లపై చెబుతున్నారు. పిల్లలు వీటిని చూస్తూ టీచర్ల వైపు చూడ్డమే మానేసారు. దీంతో పిల్లలు టీచర్లు ఒకరికి ఒకరు దూరమైపోతున్నారు. తీరిక సమయాల్లో పిల్లలు వాళ్లలో వాళ్లు కూడా మాట్లాడుకోడం మానేస్తున్నారు. ఇప్పటి పిల్లలది ఏదో ఒక కొత్త లోకమనిపిస్తోంది. వారో కొత్త జాతిగా కనిపిస్తున్నారు. మన కుర్రకారు యవ్వనమంతా అశాంతి, చిరాకు, ఆందోళన, ఒంటరితనాలతో నిండిపోతోంది. తలచుకొంటే చాలా బాధేస్తోంది. ఇష్టంగా, క్రియాశీలంగా పాల్గొనేలా తరగతి గది, బడి వాతావరణమూ వున్నట్టయితే ఈ పిల్లలంతా ఎంతో రాణించే వారు. పరధ్యానంలో ఒక్క నిమిషమూ వుండేవారు కాదు. ఆన్ లైన్లో వచ్చే చెత్తను చూస్తే వారికే అసహ్యం వేసేది. ఏ పుస్తకాలూ చదవకుండా, చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా ఇలా పట్టాలు తప్పిన బండిలా వుండిపోయే వాళ్లే కాదు.

చిన్నప్పుడు నాకే స్క్రీన్లు, ఫోన్లు, టాబ్లెట్లు ఉన్నట్టయితే నా చదువు పూర్తిగా నాశనం అయ్యేది. పుస్తకాలు చదవడం అలవాటయ్యేదే కాదు. తీవ్రంగా నష్టపోయే దాన్ని. జీవితంలో నాకు దక్కిన గొప్ప బహుమతి ఏమిటంటే మనిషికి మనిషికీ మధ్య అనుబంధాన్ని పెంచే చదువు నాకు దక్కడం. మా టీచర్లతో మాకుండే గొప్ప అనుబంధం!

నిజానికీ బహుమతి పిల్లలందరికీ దక్కాలి. వాళ్ల సామర్థ్యాలన్నీ వెలికి రావాలి. వారి కోసం అపార జ్ఞానద్వారాలు తెరుచుకోవాలి.ఏ నాగరిక సమాజానికైనా ఇదీ అసలు లక్ష్యం! కానీ కళ్ళముందు జరుగుతున్నదంతా భిన్నంగా వుంది. బాధాకరంగా వుంది. మనం మన పిల్లలకు కావలసిందంతా ఇస్తున్నామనుకుంటున్నాం. విస్తృత ప్రపంచాన్ని వారి ముందు తెరిచి పెడుతున్నామనుకుంటున్నాం. మంచీ చెడూ వారే వింగడించుకోవాలనుకొంటున్నాం.

కానీ కొంచెం ఓపిక చేసుకుని చూడండి. మన పిల్లలు ఎంతగా మానసిక రుగ్మతకు లోనవుతున్నారో తెలుస్తుంది. ఒకసారి ఈ గణాంకాలు, అధ్యయనాలు చూడండి. మనం ఏ దరికి చేరుకొంటున్నామో అర్థమవుతుంది. యువతలో ఆత్మహత్యలు 2020 నాటికి అమ్మాయిల్లో 167%, అబ్బాయిలలో 91% పెరిగాయి. చెత్త తిండి వల్ల ఆసుపత్రుల్లో చేరే వాళ్ళు ఆరు రెట్లు పెరిగారు టీనేజర్లలో ఆత్మహత్యా ప్రయత్నాలు ఐదింతలు పెరిగాయి. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి ముగ్గురు బిడ్డల్లో ఒకరికి కంటి సమస్య (మయోపియా) తలెత్తుతోంది. ప్రపంచవ్యాప్తంగా మన చిన్నారుల్లో 100 కోట్ల మంది 2050 కల్లా ఈ మహమ్మారి బారిన పడబోతున్నారు.

దీనికి మొదటి ముద్దాయి మన సెల్ ఫోన్! ఒకరకంగా ఇదంతా మనం తెచ్చిపెట్టుకున్న సమస్య. ఎక్కువ కాలం ఫోన్లపై గడపడం, బ్లూ లైట్లు, నిద్రలేమి, ఆటల కొరత ఇవన్నీ మనం కోరి తెచ్చుకొన్నవి. కంటి జబ్బులతో ఇది ఆగడం లేదు. ఈ ఫోన్ల పుణ్యమా అని మన పిల్లలు డ్రగ్స్ బారిన పడుతున్నారు. హింసాత్మకంగా మారుతున్నారు. పోర్న్ వీడియోలకు బానిసలవుతున్నారు. వారి ప్రవర్తనలో తీవ్రమైన మార్పులొస్తున్నాయి. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించే మన చంటిపిల్లలు కూడా ఫోన్లకు అతుక్కు పోతున్నారు. కిటికీలోంచి బయటికి చూడ్డం లేదు. అక్కడ వారికే కొత్త లోకమూ కనపడ్డం లేదు. విచిత్రంగా పసిబిడ్డలకు కూడా ప్రపంచం మూసుకుపోతోంది. ఇంతకంటే విషాదం ఇంకేముంటుంది?

బ్రిటన్ లో ఎడ్యుటెక్ కంపెనీల్లో కేవలం ఏడు శాతం మాత్రమే ప్రాథమిక పరీక్షలు జరిగాక తమ సామగ్రిని విడుదల చేస్తున్నాయి. ఇక 12 శాతం మాత్రమే ప్రామాణిక పరీక్షలకు నిలబడినవి. మిగిలిందంతా ఇష్టారాజ్యపు సరుకు!

మేము వైయంసీఏ గ్రౌండు వద్ద పిల్లలకు కరాటే నేర్పుతాం. కొంతమంది పిల్లలు కరోనాకాలంలో రావడం మానేశారు. విచిత్రంగా వారు కరోనా ముగిసాక కూడా వారు రావడం లేదు. కారణం ఏమంటే ఆటల సమయంలో కూడా వారు ఫోన్లకు అతుక్కుపోవడం. కోవిడ్ రోజుల్లో మనం చెప్పిన ఆన్ లైన్ పాఠాలు కూడా వారిని మరింతగా ఫోన్లకు బానిసల్ని చేశాయి. మనకు తెలియకుండానే మన పిల్లలు మానసికంగా బలహీనులై పోయారు. టెక్నాలజీ ఏదో గొప్పదనీ, దీన్ని చిన్నప్పటి నుంచే పిల్లలకందించాలనీ మనమనుకుంటే అది పిల్లల్ని బడికి, కుటుంబానికి, చివరకు స్వతంత్ర ఆలోచనలకు కూడా దూరం చేసింది.

ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా ప్రియాతి ప్రియమైన ఉపాధ్యాయులతో నేను నెరపుకున్న అనుబంధానికెంతో గర్వపడుతున్నాను. జీవితంలో అదో గొప్ప బహుమతి నాకు. అందరు పిల్లలకీ అది దక్కాలి. వారందరూ ఎదగాల్సినంత ఎత్తుకెదగాలి. ప్రతి నాగరిక సమాజలక్ష్యం అదేనని నేననుకుంటున్నాను. కానీ నా కళ్ళ ముందున్న సాక్ష్యాలు అలా కనపడ్డం లేదు. ఇప్పటికే మన పిల్లలు ప్రమాదపుటంచులకు చేరుకొన్నారు. మానసిక రోగగ్రస్తులుగా మారిపొయారు. కథ ఇక్కడితో ఆగడం లేదు. వారిలో హింసాప్రవృత్తి పెరుగుతోంది. ఉన్మాదం పెరిగి, ఉగ్రవాద లక్షణాలు ముసురుకుంటున్నాయి. ప్రలోభం, అశ్లీలం, భయానక దృశ్యాల్ని ఇష్టపడ్డం ఎక్కువవుతున్నాయి. ఇవన్నీ పరిశోధనల్లో తేలినా ఫోన్లు మాత్రం పిల్లలకు ఇంకా ఇంకా చేరువవుతూనే వున్నాయి.

కొంత కాలం కోవిడ్ ఈ సెల్ ఫోన్ల మయాజాలంలోకి తోసేసి మన పిల్లల్ని బయటి ప్రపంచానికి దూరం చేసి నిష్క్రియాపరుల్ని చేసింది. వాళ్ల శరీరంలో కొవ్వును పెంచేసింది. ఇప్పుడు కోవిడ్ లేదు. అయినా సెల్ ఫోన్ల జాడ్యం మాత్రం నిర్విఘ్నంగా సాగుతోంది. కొంచెం వ్యాయామం వుంటే, వ్యాపకం మార్చుకోగల్గితే దీన్నుంచి సులభంగా బయటపడొచ్చు. కరాటే కాకుంటే ఈత.. ఈత కాకుంటే టెన్నిస్. అది కాకుంటే ఏదో ఒక కళ. పిల్లలకు ఎదిగే వయసులో ఒక సమతుల్యత కావాలి.

ఎడ్యుటెక్ కంపెనీలు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. అమాయకంగా మన పాఠశాలలు వాటి వెంట పడుతున్నాయి. బ్రిటన్ లో వీటి పాఠాలు ఏవీ కనీసం ఏడు శాతం కూడా మార్కెట్లోకి వచ్చే ముందు ఎలాంటి పరీక్షలకు నిలబడ్డవి కావు. మూడవ పార్టీ సర్టిఫికెట్ పొందినవి వీటిలో 12 శాతం కూడా లేవు. ఇదో కఠోర వాస్తవం. అంతే గాదు తరగతి గదిలో వీటి వల్ల ఏం ఒరిగిందో ఎవ్వరికీ తెలియదు.

భవిష్యత్తుపై నాక్కొంచెం ఆనందం కలిగించే అంశం ఏమంటే ఇప్పుడు సెల్ ఫోన్లు 16 ఏళ్ల లోపు పిల్లలకు దూరంగా వుంచాలన్న విజ్ఞత క్రమంగా, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది అనేక దేశాలు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా ఇందులో ముందుండడం ఆహ్వానించాల్సిన విషయం చివరగా ఒక సంఘటనతో ముగిస్తాను. కొన్ని వారాల క్రితం నాకొక మహిళ తటస్థపడింది.ఆమె తన ఇద్దరు కుమారులతో కలిసి కరాటే నేర్చుకునేందుకు వచ్చింది. కానీ చిన్నవాడు మొరాయిస్తున్నాడు. వాడికేం కావాలో తల్లికి అర్థమైంది. జిమ్ చివర కూర్చోబెట్టి టాబ్లెట్, హెడ్ ఫోన్లు వాడికిచ్చింది ఇక వాడు అందులో మునిగిపోయాడు. తల్లీ, పెద్ద కుమారుడు కరాటే నేర్చుకుంటున్నారు. నేను దీన్ని గమనించి తల్లికి నచ్చ చెప్పి టాబ్లెట్ నుంచి వాడిని దూరం చేశాను కరాటే దగ్గరకు తెచ్చాను. వాడి వైపు మెల్లమెల్లగా చూస్తూ ప్రోత్సహించాను. ఓ గంటకు వాడు తన తల్లీ, సోదరుడూ కరాటే నేర్చుకుంనటున్న చోటికి వచ్చాడు వారి దగ్గరే కూర్చున్నాడు. ఇంకొంచెం సేపటికి వాడు కూడా రంగంలోకి దిగాడు. ఈ మాత్రం మనకీ, మన తల్లిదండ్రులకీ ఓపిక వుండాలి! కొంచెం అర్థం చేసుకోండి. చిన్న వయసులోనే పిల్లలకు టెక్నాలజీ అలవాటు చెయ్యకండి. అది వారిని పాఠశాలలనుండి, కుటుంబాల నుండి, స్వతంత్ర ఆలోచనల నుండి దూరం చేస్తోందని గుర్తించండి.

(సోఫీ వింకిల్మాన్ డిజిటల్ విద్యావ్యాపార వ్యతిరేక ఉద్యమకారిణి. ఆమె ప్రసంగానికిది విబియస్ స్వేచ్ఛానువాదం)

One thought on “డిజిటల్ మాయాజాలంలో ఆబాలగోపాలం!

  1. టెక్నాలజీ కాలంలో పిల్లలకు టెక్నాలజీ ను దూరం చేయడం అసాధ్యమే… కానీ టెక్నాలజీను గురించిన అవగాహన Pros and Cons తల్లి దండ్రులకు ఉంటే పిల్లలను ఎడిక్షన్ నుంచి తప్పించడం పెద్ద కష్టమేమీ కాదు.. మంచి ఆర్టికల్. చర్చించవలసిన ఆర్టికల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *