డా. నాగసూరి వేణుగోపాల్
అది బ్రిటిష్ వారు పాలించే కాలపు భారతదేశ రాజధాని కలకత్తా పట్టణం. ఆ యువకుడు రసాయన శాస్త్ర అధ్యాపకుడు. ఆయన ఇల్లే ఒక చిన్న ప్రయోగశాల. పరిశోధనల కోసం పశువుల ఎముకలు సేకరించి ప్రయోగశాలలో పోగు చేశాడు. ఎముకల వాసన ప్రయోగశాలకే పరిమితం కాక, ఆ వీధి అంతా గుప్పుమంది! అంతేకాదు, కాకులు బారులుగా వాలి, వీధి అంతా పచార్లు కొడుతున్నాయి. దాంతో ఆ ప్రాంతం వారంతా భరించలేమని చెప్పడమేకాదు; ఇల్లు ఖాళీ చేయకపోతే. కలకత్తా అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
సరిగ్గా ఆ సమయంలో ఓ మిత్రుడతనికి స్నేహహస్తం అందించాడు. ఊరికి కాస్త దూరంగా ఉన్న తన ఇల్లు వాడుకోమని చెప్పాడు. దాంతో సేకరించిన ఎముకలు ప్రయోగశాలతో పాటు అక్కడికి రవాణా అయ్యాయి. ఆరుబయలులో ఎముకలు బాగా ఎండిపోయాయి. అలా ఎండిన ఎముకలను తగులబెట్టాడు. అంతే, మరో సమస్య ఎదురయ్యింది! పోలీసులు వచ్చారు– “అవి మనుషుల ఎముకలు కావచ్చు, నేరంలో ఆధారం లేకుండా తగులబెట్టే ప్రయత్నం కావచ్చు” అని లాఠీ ఝులిపించారు. వారికి నచ్చజెప్పడం ఎంత కష్టమో కదా! ఆ శాస్త్రవేత్త ఎంత వ్యథకు లోనై ఉంటాడో?
ఎముకల నుండి టానిక్
అలా మండిన ఎముకల నుంచి తయారైన బూడిదను గంధకికామ్లంతో కలిపాడా యువకుడు. ఫలితంగా తయారైంది సున్నపు సూపర్ ఫాస్పేటు! దీనికి మరో రసాయనం కలిపాడు, దాన్ని మరగబెట్టాడు. ఇంకేం స్ఫటికాలు ఏర్పడ్డాయి. వాటిని నమిలి చూచాడు. మహదానందం కల్గింది. ఈ స్పటికాల నుంచి నరాలకు పనికి వచ్చే బలవర్ధక ఔషధం లేదా టానిక్ తయారు చేయగలిగాడు. అంతవరకు అటువంటి టానిక్ ను ఎక్కువ ధర చెల్లించి దిగుమతి చేసుకునేవారు.
మరి ఈ విజయగాథ- ఎప్పటిదో తెలుసా? ఎవరిదో తెలుసా? అది 19వ శతాబ్దపు చివరి కాలానిది! అది ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రపుల్లచంద్ర రే గాథ. ఇలా సాగిన ప్రయత్నాల ఫలితమే బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ వర్క్స్ అనే పరిశ్రమ అవతరణ. అప్పట్లో అతి పెద్ద భారత రసాయన పరిశ్రమలలో అది ఒకటిగా వెలుగొందింది. అందువల్లనే పి.సి. రే ని రసాయన శాస్త్రవేత్తగానే కాదు, భారతదేశపు ఆధునిక రసాయన పరిశ్రమలకు ఆద్యుడుగా గుర్తించి గౌరవిస్తాం!
బహుముఖం రే జీవితం
పి. సి. రే జీవితం గమనిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత విస్తృతి. వైవిధ్యం అని మనకు విస్మయం కలగక తప్పదు. ఆయన రసాయన శాస్త్రవేత్త మాత్రమే కాదు గొప్ప దేశభక్తుడు; గొప్ప పరిశోధకుడే కాదు, మంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్త; ఉపాధ్యాయుడే కాదు, మంచి సాహితీవేత్త… ఇలా ఎన్నో పార్శ్వాలు ఆయనలో కనబడుతాయి. తన జీవితాన్నే కాదు. జీతాన్ని కూడా పరిశోధనకూ. సమాజానికీ అర్పించిన అవివాహిత త్యాగశీలి ఆయన! ప్రఫుల్ల చంద్ర రే రాసుకున్న ఆత్మకథకు ‘ది లైఫ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ బెంగాల్ కెమిస్టు’ అని నామకరణం చేసుకున్నాడు.
ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న ఖుల్నా జిల్లాలో 1861 ఆగస్టు 2న ప్రపుల్ల చంద్ర జన్మించారు. తండ్రి హరిశ్చంద్ర రే కు సంస్కృతం, పర్షియా, ఆంగ్లభాషలలలో మంచి పాండిత్యం ఉండేది. ఆయన ధనవంతుడు, సంస్కారవంతుడు మాత్రమే కాక అభ్యుదయవాది కూడా. అటువంటి తండ్రి దగ్గర పెరిగిన రే కు మానవీయ లక్షణాలు చాలా అలవడ్డాయి. బెంజిమిన్ ఫ్రాంక్లిన్ ఆత్మకథ ఆయనను ఎంతో ప్రభావితం చేసింది. అంతకుమించి మెరుపు స్వభావం తెలుసుకోవడానికి ఫ్రాంక్లిన్ చేసిన గాలిపటం ప్రయోగం ఉత్తేజపరచింది.
ప్రపుల్ల చంద్ర రే తొలి విద్యాభ్యాసం గ్రామంలో మొదలైనా, 1870లో అతని కుటుంబం కలకత్తా రావడంతో అక్కడే కొనసాగింది. పదేళ్ళ వయసులో లాటిన్, గ్రీకు భాషలు నేర్చుకోవడం; ఇంగ్లాండు, రోమ్, స్పెయిన్ చరిత్రలు చదువుకోవడం ఎంతో ఆశ్చర్యం కల్గిస్తుంది. 1879లో ప్రవేశ పరీక్ష రాసి మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్ లో చేరారు. అక్కడే సురేంద్రనాథ్ బెనర్జీ, ప్రసన్నకుమార్ లహరి వంటి గొప్ప అధ్యాపకులనుంచి స్ఫూర్తిపొందాడు. అప్పుడే స్వాతంత్ర్య కాంక్ష, పేదల స్థితిగతుల పట్ల స్పందనా గుణాలు అలవడ్డాయి. అక్కడ చదువుతున్నప్పుడే ప్రెసిడెన్సీ కళాశాలలో అలెగ్జాండర్ పెడ్లర్ చేసిన రసాయన శాస్త్ర ఉపన్యాసాలు ఎంతో ప్రేరేపించాయి. దాని ఫలితంగా సాహిత్యంలో బి.ఏ. చేయకుండా; రసాయన శాస్త్రం ఎంచుకున్నారు. బెంజిమిన్ ఫ్రాంక్లిన్ శాస్త్రవేత్త రాసిన ఆత్మకథ ఆయనను ఎంతో ప్రభావాన్ని కలుగజేసింది. మెరుపు స్వభావం తెలుసుకోవడానికి, అంతకుమించి చేసిన ఫ్రాంక్లిన్ గాలిపటం ప్రయోగం రేను చాలా ఉత్తేజపరిచింది. అట్లని సాహిత్యాన్ని, చరిత్రను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.

పరిశోధనేగాదు, పరిశ్రమలు కూడా
అప్పట్లో లండన్ యూనివర్సిటి ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించింది, పై చదువులకు ఇచ్చే ఫెలోషిప్ ఇవ్వడానికి! అందులో నెగ్గిన రే 1882లో బ్రిటన్ కు వెళ్ళి, ఎడింబరోలో బి. ఎస్సీ. లో చేరాడు. 27 సంవత్సరాలకే (1887లో) డి.ఎస్సి. పొందడం చిన్న విషయం కాదు. అక్కడ అతనికి సన్నిహిత మిత్రుడు ఎవరో తెలుసా మరో ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీశ్చంద్ర బోస్! రే కన్నా బోస్ ఓ మూడేళ్లు పెద్దవారు. 1889లో పి.సి.రే కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమించబడ్డాడు. బోధన, పరిశోధన మాత్రమే కాదు; పారిశ్రామికీకరణ అవసరమని భావించాడు. అందువల్లనే మొదలైంది ‘బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ వర్క్స్’!
తయారు చేసిన మందులు ఎవరూ కొనేవారు కాదు. ఆ సమయంలో డాక్టర్ అమూల్య శరణ బోస్ బాసటగా నిలిచి రోగులకు సూచించేవారు. రే పరిశోధనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి, ప్రతి జర్నల్ కూడా రే పరిశోధన పత్రాలను ప్రచురించింది. ఫ్రెంచ్ శాస్త్రవేత్త బెర్త్ లెట్ రచించిన ‘గ్రీక్ ఆల్కెమి’ చదివిన తర్వాత భారతీయ రసాయన శాస్త్రం మీద ఆసక్తి కల్గింది. దాంతో ‘రసాంద్ర సార సంగ్రహ’ అనే సంస్కృత గ్రంథం అధ్యయనం చేసి, భారతీయ రసాయన శాస్త్రం గురించి ఒక వ్యాసం బెర్త్ లేట్ కు సంపాడు. ఆయన దీనిని శ్లాఘిస్తూ ప్రచురించడమే కాక; దీని మీద మరింత పరిశోధన చేయమని పురిగొల్పాడు. అందువల్లనే పి.సి. రే మన దేశంలో రసాయన శాస్త్రపు ప్రగతి, తొలి రోజుల మొదలుకొని 16వ శతాబ్దం మధ్యదాకా అధ్యయనం చేసి ‘ది హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ’ అనే పరిశోధనా గ్రంథం రాయగలిగాడు. దీనికి ప్రపంచ ఖ్యాతి లభించింది. దాంతో భారతీయ శాస్త్రవేత్తలు చాలా కాలం క్రిందటే ఉక్కు లవణ సంగ్రహణం, మెర్క్యురీ సల్ఫెడ్స్ మొదలైన రసాయనాలు తయారు చేసేవారని స్పష్టమయ్యింది.
త్యాగమయ జీవితం
చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ ఎంతో త్యాగపూరితమైన దృష్టితో ప్రజాసేవ చేసే పి.సి. రే అంటే గాంధీజీకి చాలా గౌరవం. ఒకవైపు అద్భుతమైన శాస్త్ర పరిశోధన జీవితాన్ని గడుపుతూ మరోవైపు శాస్త్రబద్ధంగా ఆర్థిక పురోగతి సాగించాలనే ప్రఫుల్ల చంద్ర రే దృష్టి గాంధీజీని గొప్పగా ఆకర్షించింది. తన జీవనం గడపడానికి జీతంలో కొంత భాగాన్ని వాడుకుంటూ, మిగతా మొత్తాన్ని పేద విద్యార్థుల బాగు కోసం రే కేటాయించేవారు. 1901 లో దక్షిణాఫ్రికాలో ఉన్న గాంధీజీని ఆహ్వానించి తొలుత కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనేట్టు చేసింది రే మహాశయుడే. శాస్త్రవేత్తలు ప్రఫుల్ల చంద్ర రే, జగదీష్ చంద్రబోస్ సదా మనకు ఆదర్శప్రాయమని గాంధీజీ పలుసార్లు పేర్కొన్నారు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసిన ఆర్థిక శాస్త్రవేత్త జె.సి. కుమారప్పతోపాటు జగదీష్ చంద్రబోస్, పి.సి.రే, సి.వి. రామన్ 1934 లో ఏర్పరిచిన ఆల్ ఇండియా విలేజ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ నిర్వాహక స్థాయి సభ్యులుగా కొనసాగారు.
ప్రెసిడెన్సీ కళాశాలలో 1916లో పదవీ విరమణ చేశాక కలకత్తా విశ్వవిద్యాలయంలో రసాయన శాస్తాచార్యులుగా అశుతోష్ ముఖర్జీ ఆయన్ని ఆహ్వానించాడు. అక్కడ దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎంతో మంది పరిశోధకులను తయారు చేశారు. 1936లో (75 సం॥రాల వయసులో) ఆయన అక్కడే పదవీ విరమణ చేశాడు. 83 సంవత్సరాల వయసులో రే మరణించింది ఒక చిన్న గదిలో! అది కూడా కళాశాలలో ఒక గది! ఆ గదిలోనే ఆయన రెండున్నర దశాబ్దాలు జీవించారు. ఆయన జీవితం చాలా సామాన్యంగా ఉండేది. ఏ ఆసరాలేని విద్యార్థులు కొందరు ఎప్పుడూ ఆయనతో ఉండేవారు. తన భవిష్యత్తులో పొందే జీతం యూనివర్సిటి రసాయన శాస్త్ర విభాగం అభివృద్ధికి రాసిచ్చాడు. ఇది కాక ప్రతి ఏటా పదివేల రూపాయల రసాయనాలు రసాయన శాస్త్ర పరిశోధనకు బహుమతిగా ఇచ్చేవాడు. అది ఆచార్య నాగార్జునుని పేరున ఉండేది. అలాగే మరో పదివేల రూపాయలు జీవశాస్త్ర పరిశోధనకు అశుతోష్ ముఖర్జీ పేరున ఇచ్చేవాడు. తరతరాలకు గొప్ప స్ఫూర్తిని అందివ్వగల మహావ్యక్తి ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే!

ఆచార్య పి.సి.రే జీవితం అంతా పరిశోధనలకు అంకితం చేసి ఎంతో మంది శాస్త్రవేత్తలకు స్ఫూర్తి నిచ్చారు.