– డా. విరించి విరివింటి

“ఆర్కపెలాగో” అంటే ‘ద్వీపాల సముదాయం’ అని అర్థం. మన భూమి మీద వివిధ ప్రాంతాల్లో ఇలాంటి ద్వీపాల సముదాయాలు ఎన్నో వున్నాయి. ఇవి కాలక్రమంలో పెద్ద ఖండాల నుండి విడిపోయినవి కావడంతో మొక్కల, జంతువుల, మనుషుల గురించి లోతుగా తెలుసుకోవడానికి ప్రకృతి సహజమైన జీవశాస్త్ర ప్రయోగశాలల్లాగా ఉపయోగపడతాయి. అందుకే ఆంత్రోపాలజిష్టుల నుంచి పరిణామ వాదులు, పర్యావరణవేత్తలు, డాక్టర్లు దాకా ఈ ప్రాంతాలలో పరిశోధనలు చేయడానికి ఉత్సుకత చూపుతుంటారు.

వలసవాదుల కన్ను పడింది!

ఇలాంటి ద్వీప సముదాయాలలో పరిశోధనలు చేయాలన్న ఉత్సాహం ఇప్పటిది కాదు. ప్రాచీన కాలం నుంచీ వున్నదే. అయితే 15 -17వ శతాబ్దాల కాలంలో కొలంబస్, జేమ్స్ కుక్ వంటి వారి సాహస యాత్రల నుండి ఇలాంటి దీవులను గుర్తించడం, వాటికి మ్యాపులు తయారు చేయడం మొదలైంది. ఆ తర్వాత వలసవాద దేశాల పరిశోధకులు 18 ,19 శతాబ్దాల నుండి ఈ ప్రాంతాలకు వెళ్లి పరిశోధనలు చేయడం ప్రారంభించారు. ఈ రెండు శతాబ్దాల కాలం ప్రపంచం చాలా విచిత్రమైన పరిస్థితుల్లో వున్న కాలం.ఒకవైపు అదొక మహత్తర జ్ఞానోదయ యుగం .హేతుబద్ధ ఆలోచనలు, శాస్త్రీయదృక్పథంతో పాటు టెక్నాలజీ రూపంలో మైక్రోస్కోప్ వంటి సైంటిఫిక్ యంత్రాలు , స్పెసిమన్లను భద్రపరిచే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన కాలం. మరో వైపు వలసవాద దేశాలు కొత్త ప్రదేశాలకు పాకుతూ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయాల్సిన అవసరాలు ఏర్పడ్డ కాలం. బ్రిటిష్, ఫ్రెంచి ,డచ్చి ప్రభుత్వాలే స్వయాన సాహస యాత్రలను స్పాన్సర్ చేసి, పరిశోధనల ద్వారా వచ్చిన డేటా ఆధారంగా తమ సామ్రాజ్యాలను విస్తరించుకొంటూ పోయిన తరుణమిది.

అలా “ఆర్కపెలాగోలు” వలసలకు అనుగుణమైనవిగా, వ్యవసాయానికి సహజ వనరులకు ఆలవాలమైనవిగా, కొల్లగొట్టడానికి అనుకూలమైనవిగా వలసవాదులకు తోచాయి. ఇంకేముంది? వాటిపైబడ్డారు. పరిశోధనలు ప్రారంభించారు. కొత్త కొత్త మొక్కలతో, జంతువులతో, మానవులతో వారికవి కొత్త లోకాలను పరిచయం చేసాయి. ఈ విచిత్రమైన పరిస్థితుల్లోంచే ‘జీవపరిణామం’ అంటే ఏమిటో అర్థం కావడం మొదలైంది. ఇప్పటికే ఎందరో న్యాచురలిస్టులు జీవపరిణామాన్ని అర్థం చేసుకొని వివరించగలిగినా, వారికి సరైన సాక్ష్యాలు దొరక్కపోవడంతో చాలా మటుకు అవి ఊహాగానాలు గానే మిగిలిపోయాయి. ఇప్పుడు తిరుగులేని సాక్ష్యలతో జీవపరిణామాన్ని చార్లెస్ డార్విన్, ఆల్ఫ్రెడ్ వాలెస్ లు ముందుకు తీసుకురాగలిగారు. అయితే డార్విన్ “గలపాగోస్” ఆర్కపెలాగోలో 1831- 1836 లో పరిశోధన చేస్తే , దానికి కొంత కాలం తర్వాత వాలెస్ “మలయ్” ఆర్కపెలాగాలో 1854 -1862లో పరిశోధనలు చేశాడు. ఈదీవుల్లోని జంతు వృక్షజాతుల వైవిధ్యం, అవి అనువర్తనం (adaptation) చెందిన విధానం, వ్యాపించిన తీరు, అంతరించిన క్రమం లాంటివన్నీ ఇతర జీవుల ప్రభావం లేకుండా స్వచ్ఛందంగా,సహజంగా జరుగుతోందని వీరు భావించేవారు. దీంతో ఈ ద్వీప సముదాయాలు వీళ్ళని ఆకర్షించాయి .

ఇలాంటి ప్రదేశాలకు వెళ్లి పరిశోధనలు చేయాలంటే మొదట గట్స్ కావాలి. డార్విన్, వాలెసులు అలాంటి గట్స్ వున్నవారు. తమకంటూ ఎలాంటి సంస్థలతో, విశ్వవిద్యాలయాలతో సంబంధం లేకున్నా విక్రమార్క పట్టుదలతో వీళ్ళు సాహసాలు, యాత్రలు పరిశోధనలు చేశారు. డార్విన్ బీగిల్లో తిరుగుతూ తన స్పెసిమెన్లను తయారు చేసుకుంటే, వాలస్ మలయా ఆర్కిపెలాగోలోనే దాదాపు 8 సంవత్సరాలు తిష్టవేసుకు కూర్చుని పరిశోధనలు చేశాడు. 

ఇంతకూ మలాయ్ ఆర్కపెలాగోలో ఎన్ని ద్వీపాలు వున్నాయనుకున్నారు ? చిన్నవీ పెద్దవీ కలిసి ఇరవై అయిదు వేలు! అయితే ఇందులో మానవ నివాసయోగ్యమైనవి చాలా కొద్ది మాత్రమే. కానీ ఈ దీప సముదాయాలలో వాలెస్ కు ఒక కీలకమైన విచిత్రం కనబడింది. అదే ఈ వ్యాసంలోని ప్రధాన అంశం!

సముద్రంలో ఊహాత్మక రేఖ!

అదేమంటే ఈ ప్రాంతంలోని ద్వీపాలను తూర్పు పడమర ద్వీపాలుగా విభజించుకుంటే పశ్చిమ ద్వీపాలలోని వృక్ష జంతుజాలం ఒక రకంగా వుంటే, తూర్పు ద్వీపాలవి మరో రకంగా వున్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పశ్చిమాన ఉన్న జావా, బాలి, లంబోక్ దీవులలో వుండే వృక్షాల, జంతువుల జాతులు తూర్పున వున్న బోర్నియో, సులవేసి దీవుల కంటే భిన్నమైనవి.అంటే ఈ దీవులన్నీ పక్కపక్కనే వున్నప్పటికీ ఇక్కడున్న జంతువుల, వృక్షాల జాతులు మాత్రం పూర్తిగా భిన్నమైనవి. బాలిలో ఉండే జంతువు ఏదీ బోర్నియాలో లేదు. అలాగే బోర్నియాలో వుండే జంతువు లేదా వృక్షాల రకాలు ఏవీ బాలిలో లేవు.ఇదీ విచిత్రం!

ఇది గమనించిన వాలెస్ 1859లో (ఈ సంవత్సరమే డార్విన్ Origin of Species పుస్తకం వెలువడింది.) తూర్పు పడమర దీవుల మధ్య ఒక ఊహాత్మక గీత గీశాడు. దాన్నే “వాలెస్ లైన్ ” అంటారు.సముద్రంలో ‘గీసిన’ ఈ ఊహాత్మక గీతకు అటూ ఇటూగా ప్రకృతి దేనికదిగా వేరుగా వుండడాన్ని చూసి ఆశ్చర్య పోవడం ఆంథ్రోపాలజిస్టుల వంతు అయింది! ఈ ద్వీపాలు సముద్రంలో ఒకదానికొకటి దూరంగా విడివడినట్టు ఉంటాయి కాబట్టి ఏ ద్వీపానికా ద్వీపం భిన్నమైన వృక్ష జంతుజాలాలను కలిగి వుంటుందని వారు ఊహించారు. ఈ ఊహలో కొంత నిజం లేక పోలేదు గానీ దీని అసలు రహస్యం మాత్రం  ఖండాలు విడిపోవడంలో (continental drift) వుందని వారు 20వ శతాబ్దంలో పసిగట్టేసారు! ఇండోనేషియాలోని పడమర దీవులు యురోషియా ప్లేట్ లోని “సుందా షెల్లో ” వుంటే , తూర్పుదేవులు ఆస్ట్రేలియా ప్లేట్ లోని “సాహుల్ షెల్ “కి సంబంధించినవి. ఖండాలు విడిపోయినపుడు ఈ రెండు షెల్ లు పక్కపక్కకు వచ్చి చేరడంతో ఇండోనేషియా పశ్చిమ దీవులలో ఆసియాకి సంబంధించిన వృక్ష జంతు జాతులుండగా, తూర్పుదీవులలో మాత్రం ఆస్ట్రేలియాకు సంబంధించిన వృక్ష జంతువులు కనబడుతున్నాయి.

సూడో సైన్సు మాటున జాతి వాదం!

వాలెస్ పరిశోధనలు 1963 లో పుస్తకరూపంలోకి వచ్చాయి. అప్పటికి మలాయ్ ద్వీప సముదాయాలకు ఆంత్రోపాలజిస్టుల , ఇతర నేచరిస్టుల తాకిడి ఎక్కువైంది. సరిగ్గా వలసవాదుల “జాతి సిద్ధాంతాలు” ( Racial Theories) కూడా రూపుదిద్దుకుంటున్న కాలమిది. వాలెస్ పరిశీలనల్ని, ఆయన అదనంగా చెప్పిన కొన్ని అంశాల్ని పట్టుకొని ఆంథ్రొపాలజిస్టులు కోడిగుడ్డు మీద ఈకల పీకడం మొదలుపెట్టారు. పొరపాటునో, గ్రహపాటునో వాలెస్ “జంతు వృక్షజాలాల్లోనే కాకుండా తూర్పు పడమర దీవుల్లోని మనుషుల మధ్య కూడా భేదాలు వున్నాయ”న్నాడు. పడమర వైపు వుండే వారి చర్మం తెల్లగాను, వెంట్రుకలు పలుచగాను వుంటే, తూర్పుదేవులలో వుండే వారి చర్మం నల్లగానూ, వెంట్రుకలు మందంగా వొంపులు తిరిగీ వున్నాయని చెప్పాడు. ఇదే తర్వాతి పరిశోధకులకు పనికిమాలిన పనిని కలిగించింది. తమ జాత్యున్మాద సిద్ధాంతాలతో ఈ ద్వీప సముదాలను చూడడానికి వచ్చిన వలసవాద ఆంథ్రోపాలజిస్టులు ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపుతూ మరింత వ్యాఖ్యానం చేయ మొదలుపెట్టారు. వృక్ష జంతు జాలాల మధ్య తేడాల్ని పక్కన బెట్టి ఇక్కడి మనుషుల మీద పడ్డారు ! తూర్పు దీవుల్లో నివసించే మనుషుల మీద ఏహ్య భావం, చిన్నచూపు తమ రాతల్లో రంగరించారు. ఆ మనుషులంతా జబ్బులతో ఉన్నారని ,శుభ్రత లేకుండా చూడడానికి అసహ్యంగా ఉన్నారని, పైగా నమ్మదగిన వ్యక్తులుగా కనిపించడం లేదని రాయడం మొదలుపెట్టారు. “వాలెస్ లైన్ ని” వాళ్ళు “వాలెస్ ఆంత్రొపాలజికల్ లైన్” గా మార్చేశారు. మనుషులను వారి ఆకారాల ఆధారంగా, వారి సంస్కృతుల ఆధారంగా, భాషల ఆధారంగా వేరువేరుగా విభజించవచ్చునని ఈ వలసవాద ఆంత్రోపాలజిష్టులు తీర్మానించేసారు!

మనిషి మెదడులో స్క్రూ లూజుగా వుందా?

ఇలా మానవుడి నీచత్వం సైన్సును కూడా భ్రష్టు పట్టించే దాకా వెళ్లింది. మానవుడు కులాలుగా, మతాలుగా, జాతులుగా విడిపోయి యుద్ధాలు చేసుకుంటున్నాడు. చంపుకొంటున్నాడు. ఇవన్నీ మానవ భ్రష్టత్వానికి రుజువులు! దీన్నంతా చూచి పరిశోధకుడు, రచయిత ఆర్థర్ కోస్టరల్ ” మనిషి మెదడులో ఎక్కడో ఒక స్క్రూ లూజుగా ఉంది ! మానవ పరిణామంలో ఎక్కడో ఏదో అంతుచిక్కని తప్పు జరిగిపోయింది ! మానవుడి మస్తిష్కం ఇతర అవయవాల మాదిరిగా కాకుండా చాలా వేగంగా పరిణామం చెందింది. అదే బహుశా అతడి స్క్రూ లూజు కావడానికి కారణం కావచ్చు”అంటాడు.  సైన్సు మనలోని మూఢత్వాన్ని పక్ష పాతాల్ని తొలగించేయాలని మనం కోరుకుంటాం. కానీ సైన్సుని ఆధారంగా చేసుకుని అచ్చం సైన్సు లాగా కనబడే సూడో సైన్సు మూఢత్వాలను మరింత పెంచుతూ వుంది!

ఇలా వచ్చిందే వలసవాదుల జాతివాదం! అలా రూపుదిద్దుకున్నదే “వాలెస్ ఆంత్రొపాలజికల్ లైన్”!! అంతా సూడో సైన్సు మయం!!! ఆ కాలంలో యూరపులో ఆంథ్రోపాలజిష్టులు వైద్యంలో కూడా శిక్షణ పొందేవారు. వీళ్ళు మనుషులను, మానవ సమాజాన్ని వారి శరీర ఆకృతులను బట్టి  ఎక్కువగా తక్కువగా లెక్కించే వారు. ఇదే భావజాలాన్ని వాళ్ళు మలయా ఆర్క పలాగో కి తీసుకెళ్లారు .అయితే ఈ వలసవాదులు సౌత్ ఆగ్నేయసియాలో నాటిన ఆనాటి జాతివాద విత్తనం తర్వాత చాలా ఘోరమైన మలుపులు తీసుకొంది. ఆ ప్రాంత రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది .పైకి కనిపించే శరీర లక్షణాలు ఆధారంగా “వీళ్ళు నా జాతి వాళ్లు .మిగిలిన వాళ్ళు పరాయి జాతి వాళ్లు ” అని అక్కడ ప్రజలు నమ్మడం మొదలు పెట్టారు. ఇది “విభజించి పాలించే ” వలసవాద అజెండాకు తెర లేపింది.

జాతుల మధ్య చిచ్చు!

ఇండోనేషియా డచ్ వారి అధీనంలో వున్న రోజులవి.  ఆ కాలంలో పశ్చిమ న్యూ గినియా సమస్య తలెత్తినప్పుడు మానవహననాలు జరగడానికి ఈ ఊహాత్మక ఆంత్రోపాలాజికల్ భావజాలమే కారణం. పశ్చిమ న్యూ గినియాలో “పపువా”, “మలేషియా” జాతుల వారు శతాబ్దాలుగా కలిసి నివసిస్తున్నారు. కానీ వారి చర్మపు రంగును, వెంట్రుకల మందాన్ని బట్టి పపువా జాతిని తక్కువ జాతిగా వివక్షతో చూడ్డంతో ఇది ఇద్దరి మధ్యా చిచ్చు రగిలించింది.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ప్రాంతాన్ని ఇండోనేషియాలో కలపాలని జాతీయవాద స్వాతంత్ర్య ఉద్యమాలు మొదలయ్యాయి.1949లో డచ్ వారి నుండి వెస్ట్ న్యూ గినియాకు విముక్తి లభించింది .వారు ఇండోనేషియాలో కలిసిపోయారు. కానీ ఇండోనేషియాలోనే ఉండి నిరంతరం వివక్షకు గురయ్యే పపువా ప్రజలు మాత్రం ఇండోనేషియా నుండి స్వాతంత్రాన్ని కోరుకున్నారు ! ఒకవైపు ఇండోనేషియా నేషనలిస్టులు తమదంతా ఒకే చారిత్రక సాంస్కృతిక నేపథ్యమని వాదిస్తే, పపువా నేషనలిస్టులు మాత్రం “వాలెస్ లైను” ఆధారంగా తాము వేరే జాతికి చెందిన వారమని వాదించ సాగారు !ప్రచ్ఛన్నయుద్ధవ్యూహాల్లో భాగంగా అమెరికాతోపాటు ఇతర యూరప్ దేశాలు ఇండోనేషియా వైపు నిలబడగా, రష్యా పబువా వైపు మొగ్గింది.  ఈ సమస్య రావణ కాష్టంగానే మిగిలిపోయింది. ఇండోనేషియా నుండి స్వాతంత్రం కావాలని ఆ ప్రాంతంలో ఘర్షణలు తీవ్రం కాసాగాయి. ఇక మానవ హక్కుల ఉల్లంఘనలు, చట్ట వ్యతిరేక అరెస్టులు, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే చర్యలు సరే సరి!

విచిత్రంగా వుంది కదూ! వాలెస్ చేసిన ఒక సైంటిఫిక్ పరిశోధన , ఒక సముద్రం గుండా సాగే ఊహాత్మక సైంటిఫిక్ లైను ఆ తర్వాత వలసవాదుల చేతిలో బడి ఏ విధంగా మనుషులను జాతులుగా విడగొట్టిందో ! అది చిలికి చిలికి గాలివానై జాతి వద్వేషాలకు ఎలా దారితీసిందో ! దశాబ్దాలతరబడి అది ఎలా మండుతూనే వుందో!

వలసలూ,సంపర్కాలూ, జన్యు వైవిధ్యాలూ!

ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏమిటంటే సైన్స్ ఏం చెబుతుందని. మనుషుల సాంస్కృతిక రాజకీయ ప్రాధాన్యాలు ఏమి చెబుతున్నాయని. సైన్సు పరంగా చూస్తే వాలెస్ లైన్ కి ఇవతల అవతల ఉన్న ప్రజల్లో ఎలాంటి జన్యుపరమైన తేడాలు లేవు. ఆగ్నేయసియాలోని ప్రజలందరివీ ఒకే పూర్వీకుల జన్యువులు. పలుమార్లు ఈ దీవులకు వివిధ ప్రాంతాల నుండి వలసలు , వారి మధ్య సంపర్కాలు కూడా జరిగి జన్యుమిశ్రమం ( Genetical mixing ) జరిగిందని, అందుకే ఈ ప్రాంత జనాభాలో జన్యు వైవిధ్యం ( Genetical Variation ) అధికంగా ఉందని కూడా సైన్సు తెలుపుతోంది.

ఒక ప్రాంతం కావచ్చు, ఒక దేశం కావచ్చు. ప్రస్తుతానికి దేశమే అనుకుందాం ! జెనటికల్ వేరియేషన్ అనేది రెండు వేరువేరు దేశాలకు చెందిన ప్రజల కంటే ఒక దేశం లోపల నివసించే జనాభాల్లో కనుక ఎక్కువగా వుంటే ఆ దేశానికి ఇతర దేశాల నుండి వలసలు, సంపర్కాలు విపరీతంగా జరిగినట్టు లెక్క! విచిత్రం ఏమంటే ప్రపంచంలో దాదాపు ప్రతి దేశం లేదా ప్రతి ప్రాంతంలో ఇదే ధోరణి కనిపిస్తుంది. అటు అమెరికాను తీసుకున్నా, యూరపును తీసుకున్నా ఇటు తూర్పు దేశాలైన చైనా, భారత్ లను  తీసుకున్నా ఆయా జనాభాలలో జెనెటికల్ వేరియేషన్ అధికంగా ఉన్నట్లు ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. అంటే సరిహద్దులు లేని, దేశాలనేవి లేని ఒకానొక కాలంలో మనుషులు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలసలు చేస్తూనే వుండేవారు. ప్రపంచంలో ఒకటీ, అరా అలా ఎక్కడో మూలకు విసిరేసినట్టుండే అమెజాన్ అడవులూ, అండమాన్ నికోబార్ సోలోమన్ ఫసిఫిక్ దీవుల వంటివి కొంత మినహాయింపు! అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు గ్లోబలైజేషన్ ఎప్పుడో జరిగింది ! కాబట్టి దానవీరశూరకర్ణలో కొండవీటి వెంకట కవి రాసినట్టు జెనెటికల్ రుజువులు ప్రత్యక్షంగా కనబడుతున్న ఈ ఆధునిక కాలంలో జాతి జాతి అనడం వ్యర్ధవాదం!

సైన్సే మానవ ఏకాత్మకతా శక్తి!

శరీరాకృతిలోనూ, జన్యుపరంగానూ మనుషుల్లో వైవిధ్యం కనబడుతున్నప్పటికీ వారి మధ్యన అడ్డుగోడలేవీ లేవని, అవి మసక వారి పోయాయని జన్యు శాస్త్రం తెలుపుతోంది. జీవశాస్త్రపరంగా నిర్ధారించగల ఒక స్పష్టమైన జాతి అనేది ఏదీ లేదని ఆధునిక జన్య శాస్త్ర, మానవ శాస్త్ర పరిశోధనలు రూఢి చేస్తున్నాయి. పూర్వీకుల ఆధారంగా. భాషా సంస్కృతుల ఆధారంగా, శరీర ఆకృతి ఆధారంగా మనల్ని జాతులుగా విడగొట్టడం అన్నది సంక్లిష్టమైన మానవవైవిధ్యాన్ని అతి పలచన చేయడమే అవుతుంది. విద్వేషాలను రెచ్చగొట్టేవి సుడో సైన్సులవుతాయే తప్ప నిజమైన సైన్సు మాత్రం కాబోదు. మానవులందరం ఒకటే అని చెప్పగలిగి, అందరినీ బంధువుల్ని చేయగల శక్తి దేనికైనా వుందా అంటే అది కేవలం సైన్సుకు మాత్రమే వుంది! అయితే సైన్సు వలసవాద అంత్రోపాలజిస్టుల్లాంటి వారి చేతిలో పడి, జాతి విద్వేషాలు రెచ్చగొట్టే లాంటి దుస్థితి రాగూడదు. అది సూడో సైన్సుగా మారగూడదు. ఈ జాగ్రత్త మనం పడాలి! అంతేగాక తమ తాత్కాలిక పదవుల కోసం రాజకీయ నాయకులు వేల ఏళ్ల తరబడి జన్యువుల రూపంలో సాగిన మానవ సమూహాల ఏకాత్మతా శక్తిని కాదని, జాతులు వేరువేరని నమ్మబలుకుతుంటారు. కానీ అందరమూ ఒక తల్లి బిడ్డలమే అని తెలుసుకోగల్గడమే జెనెటిక్ రియాలిటీ ! దీన్ని మనం బలంగా చెప్ప గల్గాలి!!

 (న్యూ గినియా అనేది అతిపెద్ద ద్వీపం, దీన్ని “న్యూగినియా ఐలాండ్” అంటారు. గ్రీన్ ల్యాండ్ మొదటిది అయితే ఇది రెండవ అతిపెద్ద ద్వీపం. అయితే దీనిలోని పశ్చిమ భాగాన్ని “వెస్ట్ న్యూగినియా “అనీ, తూర్పు భాగాన్ని “పపువాన్ న్యూగినియా ” అనీ అంటారు. వెస్ట్ న్యూగినియా ఇండోనేషియాలో ఒక భాగమైతే,  పపువా న్యూగినియా 1975లో ఆస్ట్రేలియా నుండి విడివిడి స్వతంత్ర దేశంగా మారింది).

One thought on “సూడో సైంటిఫిక్ జాతి వాదం

  1. అన్నిటికీ వేదాలే కారణమని సినిమాలు సోషల్ మెడియా లో ప్రచారాలు ఆనాటి ఆవిష్కరాలు పడిన శ్రమ ఎక్కడా ఎవరు గురించి ఎటువంటి ప్రచారం లేదు కదా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *