పద్దెనిమిది ప్రకృతి సూత్రాలు

– ఎ. రామచంద్రయ్య

ఇంగ్లీషు భాషంతా 26 అక్షరాల సమాహారమే అన్నట్లుగా సైన్స్ లో ఎన్ని వేల సూత్రాలు వున్నా అవన్నీ మౌలికంగా 18 ప్రాథమిక సూత్రాల సమాహారమని ఆధునిక శాస్త్రజ్ఞులు రుజువు చేశారు. ఈ మిలీనియం ఆరంభంలో ఒక అంతర్జాతీయ స్థాయిలో జరిగిన శాస్త్రజ్ఞుల మహాసభలో ఈ సూత్రాలను తీర్మానించారు.  ఈ సూత్రాలు ఇక అంతిమమనీ వీటికి డోకా లేదని సైన్సు శాసించదు. కానీ నేటి వరకు పోగు పడిన విజ్ఞానం ఈ 18 సూత్రాలకు లోబడే వున్నట్లు ఖరారు అయింది. వీటిని ప్రశ్నించే పరిశీలనలు సైన్స్ పద్ధతి ద్వారా ప్రయోగపూర్వకంగా మనకు తారసపడే వరకు ఈ సూత్రాలనే మనము సత్యాలుగా ఆమోదిస్తాం. అందుకే ఈ 18 సూత్రాలను శాస్త్రజ్ఞులు సమకాలీన శిఖరాగ్ర (Cordinal) సూత్రాలుగా భావిస్తారు. ఈ సూత్రాల్లో ఏ ఒక్కదాన్నే లేదా కొన్నిటిని లేదా అన్నింటిని వ్యతిరేకించే విధంగా నమ్మకాలు ఆచారాలు విశ్వాసాలు ఉంటే అవి అశాస్త్రీయమని సైన్స్ పద్ధతి అంటుంది.

 ఈ సూత్రాలతో ప్రతి వాదననూ పోల్చుకోవాలి. ఆ వాదన ఈ సూత్రాలను ప్రశ్నించేదైతే రుజువు చేసుకోవాలి. రుజువు చేసుకో లేకపోతే వాదనను తప్పుగా భావించాలి. అందుకే ఈ 18 సూత్రాలను రూల్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ గా కాకుండా రూల్స్ ఆఫ్ ఎక్స్క్లూషన్ గా పేర్కొంటారు. ఈ సూత్రాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. అందువల్ల క్లుప్తంగా ప్రతి సూత్ర సారాంశాన్ని ఇక్కడ పరిచయం చేస్తున్నాను. 

మొదటి నియమం

సహజ సంఘటనలు పరిశీలకుని ఇష్టానుసారంగా జరగవు. వాస్తవ మనుగడలో వున్నదాన్ని పరిశీలకులు గమనిస్తారు. సంఘటనలు పరిశీలకుడు గమనించడం కోసం జరగవు.

(Events occur independent of the observer. Observation may perturb the event but the event itself occur independent of the observer.)

 తత్వశాస్త్రంలో విజ్ఞానం అనేది చర్చకు ప్రధాన అంశం. మనకు జ్ఞానం ఎలా కలుగుతుంది ? పరిసరాల గురించి, విశ్వం గురించి, మన గురించి మనం ఏ విధంగా పరిజ్ఞానులమవుతాము? ఈ ప్రశ్నలు మేధావులు చాలా కాలం నుంచి వేసుకొని సమాధానాలు చెబుతున్నారు. వీరు ఇచ్చే జవాబులు రెండు దృక్కోణాల్లో ఉంటాయి.

  1. భావవాదం  2. భౌతికవాదం.

భావవాదం ప్రకారం ప్రకృతి, దేహం, విశ్వం, సమాజం, రేయింబవళ్లు, గ్రహగతులు, ఆకలిదప్పులు, జీవన్మరణాలు, సంఘటనలు, వస్తువులు అన్నీ కేవలం కల్పన! వాస్తవ ప్రపంచం అంటూ ఏదీ లేదు. అంతా మిథ్య!

అయితే దీన్ని సైన్సు అంగీకరించదు.  సైన్స్ ప్రకారం భావవాదాన్ని ఏ కోశానా రుజువు చేయలేము. రుజువులు లేని వాదాన్ని సైన్సు ఎలా సమర్థిస్తుంది?

భౌతిక వాదం ప్రకారం ఈ సృష్టి ఎల్లప్పుడూ వుంది. కాలం కూడా సృష్టిలో భాగమే. సృష్టిలో ఎన్నో మార్పులు స్వతస్సిద్ధంగా దాని ఆంతరంగిక వైరుధ్యాల చోదక బలంతో జరుగుతూ వున్నాయి.

ఈ సంఘటనలకు ఒక దిశ అంటూ ఏదీ లేదు. అలాగే ఏదో అతీత శక్తి అభీష్టం మేరకు ఈ సంఘటనలు జరగడం లేదు.   ప్రకృతి సంఘటనలు వాటికవే జరుగుతాయి. అది పదార్థ స్వలక్షణం .ఆ సంఘటనల్లో ఒక అంశం సౌరమండల ఆవిర్భావం. అందులో భూమి ఏర్పాటు, ఆ భూమి మీద మానవ పరిణామం. భూమి ఏర్పడ్డాకే మనిషి ఏర్పడ్డాడు. భూమి అనేది మనిషితో నిమిత్తం లేకుండా వుంది. మనిషి ఎదుగుదల జ్ఞాన సమపార్జనా శక్తిసామాజిక పరిణామం ఇవన్నీ మనిషికి సంబంధించి నిర్ణయమైన అంశాలు కావు. అవి స్వతసిద్ధంగా సహజంగా జరుగుతూనే వుంటాయి.

మనిషి కూడా ఒక వస్తువుగా ఇతర ప్రకృతి వస్తువులతో కలబడితే కొన్ని సంఘటనలను తన జీవితానికి అనుకూలంగా మలుచుకోవచ్చును. అంతేగాని మనిషి మనసు అనుకోవడం వల్ల గ్రహణాలు రేయింబవళ్లు, చావు బతుకులు కలగడం లేదు. ప్రకృతిలో జరిగే సంఘటనలు ఒక నిర్ణీతమైన చట్రాలలో పరిశీలకులందరికీ ఒకే విధంగా ద్యోతకమవుతాయి. సుబ్బారావు వరంగల్ లో నిలబడి చూస్తే తూర్పున సూర్యుడు ఉదయించినట్లు అనిపిస్తే ఇమ్మానుయేల్ కు ఇస్మాయిల్ కు కూడా వరంగల్ లో వుండి గమనిస్తే సూర్యోదయం తూర్పునే జరుగుతున్నట్లు కనిపిస్తుంది. వారి వారి నమ్మకాలు ఏవైనా భూమి మీద రేయింబగళ్లు సూర్యుడు అనే నక్షత్రం చుట్టూ భూమి అనే గోళాకార వస్తువు తన చుట్టూ తాను తిరుగుతూ వుండడం వల్ల మాత్రమే ఏర్పడుతున్నాయి అనేది పరమ సత్యం.

   దీన్ని ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటారు. ఒక భౌతిక పరిశీలన చట్రంలో పరిశీలకులు అందరికీ ఒకే విధమైన అనుభవాలు జరగాలనేది ఈ సూత్ర సారాంశం.

రెండవ నియమం

మనం చూస్తున్న నేటి విశ్వం మహా విస్పోటనం అనబడే ఒక సంఘటనతో ఏర్పడింది. అప్పటినుంచి విశ్వం పలు మార్పులకు లోనై నేటి స్థితిలో వుంది. మహా విస్ఫోటనానికి ముందు కూడా విశ్వం వుంది. మరో తెలియని రూపంలో వుంది.
(The universe as we see it today has originated from Big Bang and has been gradually evolving and expanding. The universe must have existed even before the event of Big Bang in an untraceable form)

మనకు ప్రస్తుతం కనిపిస్తున్న విశ్వం సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం మహా విస్పోటనం ద్వారా రూపొందింది. అప్పటినుంచి విశ్వం ఎన్నో మార్పులకు లోనై నేడు ఇలా కనిపిస్తోంది. విశ్వం పుట్టుకతో పాటే కాలమూ ఏర్పడింది.

వస్తువులు, వస్తువుల్లో మార్పులు లేకుండా కాలం లేదు. కాబట్టి దూర- కాల అవిచ్ఛిన్నతను(Space- Time Continuum) భగ్నం చేయలేము. బిగ్ బ్యాంగుకు ముందు కూడా విశ్వం వుండే వుండాలి. అది ఎలా వుండేదో మనం ఈ వర్తమాన దూర-కాల-చట్రంలో( Space-Time-Reference frame) చిత్రించలేము. బిగ్ బ్యాంగ్ జరిగినట్లు 1920లో అలెగ్జాండర్ ప్రైడ్ మ్యాన్, అబ్బెజార్జి లెమాట్రి, ఆ తర్వాత 1940 లో జార్జ్ గేమోల్ అనే ప్రసిద్ధ శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. అయితే చాలాకాలం వరకు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి ప్రయోగపూర్వకంగా రుజువులు లభించలేదు. 1965లో పెంజియస్, రాబర్ట్ విల్సన్ అనే ఇద్దరు ఖగోళ శాస్త్రజ్ఞులు బిగ్ బ్యాంగ్ కు సాక్ష్యాధారాలు చూపారు.

  ఏ భావవాద విశ్వాస గ్రంధాన్ని చూసినా భూకేంద్రక సిద్ధాంతం తప్ప మరేదీ కనిపించదు. మధ్యలో భూమి, చుట్టూ గ్రహాలు (అందులోనే సూర్య చంద్రులు ఇద్దరూ వుంటారు. నెప్ట్యూన్ ఫ్లూటో అనే మాటలకందులో అర్థాలే తెలీవు ) ఆ పై పొరలు నక్షత్రాలు. ఇదే భావవాద విశ్వం.

కానీ శాస్త్రం ప్రకారం ఎన్నో వాద ప్రతివాదనలను ఎదుర్కొని ప్రాయోజక రుజువులకు నిలబడింది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం.  విశ్వంతో పాటే కాలం ఏర్పడింది కాబట్టి 0 సెకండ్లకు ప్రస్తుత భౌతిక విశ్వం ఏర్పడింది. 1×10-43 లోనే గురుత్వ, విద్యుదయస్కాంత,బలమైన ,బలహీనమైన కేంద్రక బలాలు ఏర్పడ్డాయి. ఈ 10-43 సెకండ్ల కాలాన్ని ప్లాంక్(PLANCH) సమయం అంటారు. ఇంత తక్కువ కాలాన్ని ఊహించడం కూడా కష్టమే. అప్పుడు విశ్వంలో ఉష్ణోగ్రత 1032 డిగ్రీ సెంటిగ్రేడ్. దాని సైజు ప్రస్తుత పరమాణువులో 20వ భాగం మాత్రమే. మూడు నిమిషాల్లో ఉష్ణోగ్రత 108 సెంటీగ్రేడ్ కి పడిపోయింది. పదార్థపు క్వార్కులు, లెప్టానులు, ప్రోటాన్లు న్యూట్రాన్లుగా మారాయి. మూడు లక్షల సంవత్సరాలకు ప్రాథమిక కణాలు పరమాణువులుగా మారాయి. ప్రధానంగా హైడ్రోజన్ వాయువు ఏర్పడింది.

నేటి సూర్య కుటుంబం 600 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. కొన్ని విశ్వాస గ్రంధాల ప్రకారం భూమి వయస్సు కేవలం 6000 సంవత్సరాలే. అయితే భూమి వయస్సు సుమారు 500 కోట్లు సంవత్సరాలు వుంటుంది. భూమి మీద జీవం పుట్టి నేటికి సుమారు 400 కోట్లు సంవత్సరాలు అయింది. మనిషి కేవలం 20 లక్షల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద వున్నాడు. విశ్వ ఆవిర్భావం గురించి నేడు బలమైన లోతైన ఆధారాలు ఉన్న సిద్ధాంతాలు వున్నాయి. ఇవి మత గ్రంథాల్లో వున్నట్టుగా లేవు పైగా విరుద్ధంగా వున్నాయి. సూర్యుడు తదితర గ్రహాలు దాదాపు ఒకే ముద్ద (నెబ్యులా )నుంచి ఉద్భవించాయి. సూర్యుడు నుండి కొన్ని విడిపోయి ఇతర గ్రహాలుగా ఏర్పడ్డాయి అన్నది అశాస్త్రీయం.

సైన్స్ ప్రకారం విశ్వం తనంత తానుగా ఎప్పుడూ వుంది. ప్రస్తుత విశ్వం సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ ద్వారా ఆవిర్భవించింది. దీన్ని మించిన సిద్ధాంతాలు సైన్స్ పద్ధతులకు పరీక్షలకు ఇంకా నిలవలేదు. విశ్వాన్ని ఎవరు సృష్టించలేదని అది ఒక పదార్థ స్వతసిద్ధ ఘటనలో రూపొందిందని, అప్పటినుంచి మార్పులకు లోనవుతోందనీ ఈ సూత్ర సారాంశం.

(మిగతా సూత్రాల గురించి తర్వాతి సంచికలో తెలుసుకుందాం)

One thought on “తెలుసుకొందాం!

  1. Articles on such topics must be wide spread to keep the thought of a common person in line with the truth. Writer efforted to explain the complex laws in a simpler way. Add more illustrations and also expose the illiteracy and ignorance of coomon man through added Catoons inbetween the content paragraphs. Kudos to “jana vignanam” Team and Prof. Ramachandraia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *