యంపి పరమేశ్వరన్ జీవనయానం
విఠపు బాలసుబ్రమణ్యం
“నా కలలు కాలం చెల్లనివి” అని ఎప్పుడూ ధీమాగా చెప్పుకునే యంపీ పరమేశ్వరన్ ఇప్పుడు ఒక కలగా మిగిలిపొయ్యాడు. తొంబై ఒక్క ఏళ్ళు మీదబడి జీవితం చరమ ఘట్టంలోకి ప్రవేశిస్తున్నా ఆయన కలలు కనడం మాత్రం ఎప్పుడూ మానలేదు. ఏదో ఒక వసంతకాల సుప్రభాతాన ఒక మహోన్నత సమాజం ఈ భూమి మీద అవతరిస్తుందనీ, ఆ సామాజిక విప్లవానికి సైన్సు ఒక చోదక శక్తిగా మారాలనీ ఆయన కల.

శాస్త్ర పరిశోధనా? శాస్త్ర ప్రచారమా?
పేద కుటుంబం నుంచి వచ్చి చదువుకొని పైకి ఎదిగిన పరమేశ్వరన్ కు “బాబా ఆటమిక్ రిసెర్చ్ సెంటర్లో” సైంటిస్ట్ ఉద్యోగం వచ్చింది. వృత్తి, వేతనం, భవిష్యత్తు దృష్ట్యా చూస్తే మరొకరికైతే జీవితానికి అంతకన్నా సాఫల్యం వుండదు. దీనికి తోడు ఆయనకు మాస్కోలో మూడేళ్లుండి పి హెచ్ డి చేసే అవకాశం కూడా వచ్చింది. చాలా కఠినతరమైన డిగ్రీ చేతపుచ్చుకొని మరీ ఆయన స్వదేశం వచ్చాడు. శాస్త్రవేత్తగా ఇక ఆయనకు ఎదురేముంది?
ఇలాంటి సందర్భంలో ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసేందుకు ఆయన్ని ఏ ఆశయం పురమాయించింది?
స్వతంత్ర భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచంతో పోటీ పడితే తప్ప, జనం శాస్త్రీయ దృక్పథాన్ని సంతరించుకుంటే తప్ప మన ఈతిబాధలు తీరవనీ, మన స్వాతంత్ర్యం కూడా నిలవదనీ ఒకానొక దార్శనికత మనకు దృఢంగా వున్న కాలమది. దీనికనుగుణంగా అంతర్జాతీయ స్థాయి వైజ్ఞానిక పరిశోధనా సంస్థల్ని ఒక్కొక్కటీ మనం నిర్మించుకుంటున్న సమయమది. ఎంతో ఆవేశంతో, దేశభక్తితో హేమాహేమీలైన శాస్త్రవేత్తలిందుకు కంకణధారులవుతున్న సందర్భమది.
కానీ పరమేశ్వరన్ భారతదేశం ఇలాంటి సంస్థలతో ఆగిపోకూడదని గట్టిగా నమ్మాడు. బహుశా ఇది జెడి బర్నాల్, హాల్డేన్, కోశాంబి లాంటి వారి ప్రేరణ కావచ్చు. “సైన్సు మన చదువుల్ని విప్లవీకరించాలి. విజ్ఞానం ఒక సబ్జెక్టుగా కాదు జీవితంలో భాగంగా మారాలి. ప్రజల్లోని అన్ని పొరల్లోకి సైన్సు ఒక దృక్పథంగా చొచ్చుకు పోవాలి. అలా జరగాలంటే పెద్ద ఎత్తున మాతృభాషలో శాస్త్ర గ్రంధాల రచన జరగాలి. వాటిని ప్రజల చేతుల్లోకి చేర్చాలి. ఇది ఒక వెల్లువలా జరగాలి”. ఇదీ అప్పటి ఆయన ఆలోచన. అప్పటికే ఇలాంటి ఆలోచనలతో కొందరు మలయాళీ రచయితలు ఒక తాటిమీదికి వచ్చి వున్నారు.
దీనికోసం ఆయన అంతటి సైంటిస్టు ఉద్యోగాన్నీ వదిలేసాడు. కేరళకు తిరిగొచ్చి కేవలం 900 రూపాయల గౌరవ భృతితో పుస్తకాల ప్రపంచంలో పడ్డాడు. ప్రజా సైన్సు ఉద్యమానికి అంకితమయ్యాడు.
మనం నడుపుతున్న ప్రజాసైన్సు ఉద్యమానికి మనం నమ్ముతున్న సామాజిక విప్లవంలో ఇంతటి పాత్ర వుందన్నమాట! మన కార్యక్షేత్రం ఇంతటి పునాదులపై ఏర్పడిందన్నమాట!
ప్రజల చేతుల్లోకి సైన్సు
సైన్సు రచయితల సంస్థ కాస్తా క్రమంగా ప్రజా సైన్సుఉద్యమ సంస్థగా మారింది. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ గా (కె ఎస్ ఎస్ పి) రూపాంతరం చెందింది.
ప్రజలు జ్ఞానవంతులు కావాలి. వారి చేతికి ఆధునిక సాంకేతికత అందాలి. అవి వారి భౌతికజీవితాన్ని ప్రభావితం చెయ్యాలి.అయితే సైన్సు అక్కడితో ఆగిపోగూడదు. సైన్స్ పని ఆవిష్కరణలు చేయడమే కాదు అది శాస్త్రీయ దృక్పథానికి కూడా దారి తీయాలి. సైన్సు రావలసింది వినియోగంలోకి మాత్రమే కాదు ఆచరణలోకి కూడా. దీన్నాయన జీవిత లక్ష్యంగా ఎంచుకొని ప్రజాసైన్సు ఉద్యమానికి అంకితమయ్యాడు. చిట్ట చివరి శ్వాస దాకా దీనితోనే నడిచాడు, దాన్ని తన వెంట నడిపించాడు.
ఎంపీ దానికి ఎంచుకున్న ఒక మార్గం పుస్తకాలు. ఎప్పటికప్పుడు కొత్త పుస్తకాలు రాయించడం, ప్రజలకు అందించడం, ఒక నిరంతర ప్రయత్నంగా దీన్ని కేరళ సమాజంలో భాగం చేయడం ఆయన చేసిన ప్రయోగాల్లో చాలా విలువైంది. జ్ఞాన సమాజానికి పుస్తకపఠనం ప్రాథమిక లక్షణంగా ఆయన భావించాడు.పుస్తకప్రచురణ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ కు గొప్ప గుర్తింపును తీసుకురావడంతో పాటు ఆర్థిక పునాదిగా కూడా వుపయోగపడింది.
రెండోది నాకు తెలిసినంతవరకు ఎంపీ ప్రాణప్రదంగా నమ్మిందీ, కే ఎస్ ఎస్ పి రెగ్యులర్ గా ఆచరించిందీ “చర్చ”.

చర్చే ప్రాణం!
కనీసం ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశం ముందుకు వచ్చినప్పుడు 30-40 మంది మూడు నుంచి ఏడు రోజులు ఎక్కడో కూర్చుని నిర్మొహమాటంగా చర్చించుకోవడం, ఒక అభిప్రాయానికి వచ్చే మార్గాన్ని వెతుక్కోవడం ఆయనే అలవాటు చేశాడు. ఎవరో ఒక మేధావి. ఒక మహా నాయకుడు పైనుంచి రుద్దడం కాకుండా అందరూ భాగస్వాములయ్యే విధానాన్ని ఆయన సైన్సు ఉద్యమంలో ప్రవేశపెట్టాడు.
ఒక సజీవ సంస్థకు దేనికైనా కొత్త కొత్త అంశాలు ముందుకు వస్తాయి. అప్పటిదాకా మనం ఆలోచిస్తున్న విధానాన్ని సవాలు చేస్తాయి. ఈ సందర్భంలో భిన్నాభిప్రాయాలు సరే సరి. అది సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమమైనా, పర్యావరణ సమస్యలైనా, పంచాయతీ ప్లానింగ్ అయినా రోజుల తరబడి తర్జన భర్జనల తర్వాతనే కేరళ శాస్త్ర సాహిత్యపరిషత్ అజెండాలోకి వచ్చాయి. సవాలక్ష సందేహాల మధ్యే అవి ఒక కొలిక్కి వచ్చాయి. వీటిలో కొన్ని విఫలమయ్యాయి. అయినా ఉమ్మడి చర్చా, అవగాహనా ఫలితంగా చేపట్టినవి కావడంతో అవన్నీ పాఠాలుగా మారాయి తప్ప నిరాశలోకో,వివాదాల్లోకో నెట్టలేదు. సంస్థకు నష్టం తేలేదు.
ఈ చర్చ మనం అనుకున్నంత సులభమైందేమీ కాదు. ఎక్కడో రాసుకున్నంతమాత్రాన అమలయ్యేదీ కాదు. నిరంతరం మనలాంటి ఉద్యమ సంస్థలకు జీవలక్షణంగా అంతర్భాగంగా మారాల్సిన ప్రక్రియ ఇది. అసిధారావృతంగా చేపట్టాల్సిందిది. నేనైతే యంపి గొప్పదనాల్లో చాలా కీలకమైందని భావిస్తాను.
పరిషద్గతి
అన్నిటి కన్నా ముఖ్యం ప్రజల్ని ఒప్పించడం. దానికి మొదట మనం ప్రజల మనుషులంగా మారాలి.మనమీద వాళ్లకా నమ్మకం కలగాలి. మనం చెప్పేది వాళ్లకు ఇష్టం లేనిదైనా మనం మాత్రం వాళ్లకు ఇష్టపాత్రులంగానే వుండాలి. అలా వుండేందుకు పరిషద్గతి పేరుతో ఒక సంస్కృతిని ఎంపీ, ఆయన మిత్రులు కలిసి ప్రవేశపెట్టారు. నాయకులందరూ నిరంతరం చదువుతుండాలి. ఉత్తరాలు రాస్తుండాలి. తిరుగుతూ వుండాలి. చర్చల్లో పాల్గొంటుండాలి. నిరాడంబరంగా వుండాలి. పదవులతో నిమిత్తం లేకుండా పనిచేయాలి. ఇవన్నీ పరిషద్గతిలో అవిభాజ్య భాగాలు.యంపి ఈ పరిషద్గతికి ప్రతిరూపం.
కొత్త కలలు, కొత్త ఆలోచనలు
సమాజం పరిణామ శీలం సైన్సు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కేది. మరి సమాజాన్నీ, సైన్సునూ నమ్ముకుని పని చేస్తున్న మనం పాత పద్ధతులతో, ఆలోచనలతో, కాలం చెల్లిన ప్రయోగాలను పట్టుకుని వేలాడుతుంటే ఏం లాభం? ప్రజాసైన్సు ఉద్యమం నిత్యనూతనంగా వుండాలి. సృజనాత్మకంగా వుండాలి. ప్రజల్ని కదిలించగల్గాలి. ఈ మర్మాన్ని వొంట పట్టించుకోబట్టే కెఎస్ఎస్పీ కేరళలో ఎవరు కాదనలేని సంస్థగా ఎదిగింది. భారతదేశ వ్యాప్తంగా సైన్సు ఉద్యమ విస్తరణలో కీలక పాత్ర పోషించిన శాస్త్ర కళా జాతా, సాక్షరతా ఉద్యమం, ఆ తర్వాత చేపట్టిన హమారాదేశ్, దేశ్ కో జానో దేశ్ కో బదలో, సృజనోత్సవాలు దేనికవే వేలమంది కార్యకర్తలని కదిలించినవి. లక్షల మందిని చేరుకునేందుకు ఉపయోగపడ్డవి. వీటిలో ఏ ఒక్కదానిలో పాల్గొన్నా సైన్సు ఉద్యమ కార్యకర్తలు ఇప్పటికీ అదో గొప్ప అనుభవంగా చెప్పుకుంటారు. ఈ ఉత్తేజమే వేలాది కార్యకర్తలని పిఎస్ యంకు సమకూర్చి పెట్టింది. ఒక సజీవ సంస్థగా దాన్ని నిలబెట్టింది.

ఇందులో అద్భుతమైన పాత్ర పరమేశ్వరన్ ది. ఆయన ఏదో ఒక కొత్త ఆలోచన చేయకుండా వుండలేడు. దాని వెనక ఏదో ఒక పెద్ద స్వప్నం వుండి తీరుతుంది. ఏ కార్యక్రమాన్ని గురించి చెప్పినా అందులో వేల గ్రామాలు, లక్షల వాలంటీర్లు, కోట్ల జనాభా తప్ప చిన్నచిన్న ఆలోచనలు ఆయనకు వచ్చేవే కాదు. సమాజం మొత్తంగా కదిలితే తప్ప ఒక గుణాత్మక పరిణామం జరగదన్న నమ్మకమే ఆయన్నిలా ఆలోచింపజేసేది. చాలా మందికి మొదట ఇవి నమ్మశక్యంగా వుండేవి గావు. కొన్ని విఫలమయ్యేవి కూడా. అయినా మళ్ళీ మరో దానితో ముందుకు వచ్చేవాడే తప్ప వెనక్కి తగ్గేవాడు కాదు. మళ్లీ అలాంటి వ్యక్తి సైన్సు ఉద్యమానికి దొరకలేదన్నది వాస్తవం.
శిఖరం లాంటి వ్యక్తిత్వం
యంపి నుంచి నేర్చుకోవాల్సిన మరో అంశం ఏమంటే ఆయన ఏ కల గన్నా, ఏ ఆలోచనలన చేసినా కాగితం మీద పెట్టేవాడు. ఒక నోట్ రూపంలో అందరి ముందు వుంచేవాడు. గాలి కబుర్లు చెప్పేవాడు కాదు. ఇలాంటి పత్రాలు 300కు పైగా ఉంటాయని అంచనా. కలం పట్టుకోలేని వార్ధక్యంలో కూడా ఆయన కంప్యూటర్ సాయంతో ఈ పని కొనసాగిస్తూనే ఉండేవాడు. వీటన్నిటిని ఒక చోటికి చేర్చగలిగితే ఎంత బాగుంటుందో!
ప్రజాసైన్సు ఉద్యమం దేశవ్యాప్తంగా ఇంతగా విస్తరించిందంటే దీనికి పరమేశ్వరుని గారి కృషీ, వ్యక్తిత్వమూ కూడా కారణాలు. వామపక్ష సంస్థల ప్రమేయం సరేసరి అనుకోండి. ఆయన దేశమంతా తిరిగాడు. అక్కడి ప్రజా మేధావులతో, మిత్రులతో మాట్లాడాడు. పలు రూపాల్లో పని చేస్తున్న సంస్థల్ని కలిసాడు. ఎంపీ వ్యక్తిత్వం దానికి ఎంతో ఉపయోగపడింది. ఆయన్ని కాదనగల వాళ్ళు ఎవ్వరూ వుండేవారు కాదు. ఎక్కడికెళ్ళినా ఆయనకు ఉన్నతస్థానాల్లో వున్న మిత్రులుండే వారు. ఆయన ఓపిక కూడా దానికి తగ్గట్టే వుండేది.
దేశవ్యాప్తంగా పలు నేపథ్యాల నుంచి వచ్చిన సంస్థలన్నీ ఒక తాటి మీదికి వచ్చి” ఆలిండియా పీపుల్స్ నెట్వర్క్ “గా ఏర్పడ్డాయంటే అందులో ఎంపీ పాత్ర ఏ ఒక్కరి పాత్ర కన్నా గొప్పది. దేశంలో ఇంత వైవిధ్య సంస్థల నెట్వర్క్ మరొకటి లేదేమో!
మనతో అనుబంధం
చివరిగా ఆంధ్రప్రదేశ్ గురించి, యంపితో నా సాన్నిహిత్యం గురించి కూడా నాలుగు మాటలు చెపుతాను. జన విజ్ఞాన వేదిక ఏర్పడ్డానికి చాలా ముందే ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం వచ్చాడు. అక్కడి వామపక్ష విద్యార్థి సంఘ కార్యకర్తలతో సమావేశం అయ్యాడు. సైన్సు ఉద్యమాన్ని నిర్మించమని కోరాడు. విజయవాడ కూడా తర్వాత వచ్చాడు.ఇదే చెప్పాడు. ఇవన్నీ తొలి ప్రయత్నాలు.
శాస్త్ర కళాజాతా (1987) జరిగాక దీనికోసం కలిసి వచ్చిన సంస్థల్ని, వ్యక్తుల్ని కలుపుకొని జన విజ్ఞాన వేదిక (1988) ఏర్పడింది. దీనికి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదిక. దానికాయన హాజరు కాలేదు గానీ , ఆయన స్ఫూర్తి మాత్రం మరిచిపోలేనిది.
కేరళ బయట సాక్షరతా ఉద్యమం మొదట జరిగింది చిత్తూర్లో అయితే విజయవంతం అయింది నెల్లూరు జిల్లాలో. సారా వ్యతిరేక ఉద్యమానికి కూడా అది దారి తీసింది. భారతదేశంలోనే ఇలాంటి సందర్భం మరొకటి లేదు. అప్పుడు కూడా యంపీ నెల్లూరు వచ్చాడు. మాతోపాటు పాదయాత్ర కూడా చేశాడు. ఆయన కలల్ని నెల్లూరులో మేము కొంత సాకారం చేసి చూపించామని ముచ్చట పడ్డాడు. ప్రజల్ని అంటిపెట్టుకొని వుండాలనీ, ఇలాంటి ఉద్యమాలు వారే చేపడితే ప్రజాసైన్సుఉద్యమం కాటలిస్టు పాత్ర పోషించాలనీ సలహా ఇచ్చాడు. తర్వాత కూడా ఆయన ఒకటి రెండు సార్లు నెల్లూరు వచ్చాడు.

దేశ స్వావలంబన కోసం పెద్ద ఉద్యమాన్ని ఒక ఉత్సవంలా “హమారదేశ్” పేరుతో ప్రజాసైన్సు ఉద్యమం చేపట్టింది. దానికి ముగింపు ఉత్సవాలూ, ప్రజాసైన్సు ఉద్యమ (AIPSN) జాతీయ మహాసభలూ రెండూ కలిసి హైదరాబాదులో వారం రోజులు(1994లో) పాటు జరిగాయి. అదో అద్భుతమైన సందర్భం. దేశవ్యాప్తంగా మూడువేల మందికి పైగా కార్యకర్తలకు హైదరాబాదు సంగమస్థలంగా మారింది. అంతటి అనుభూతి నాకెప్పుడూ కలగలేదు. యంపీ దానికి పది రోజుల ముందు నుంచే మాతో హైదరాబాదులో వచ్చి ఉన్నాడు. ఆయనతో పాటు జాతీయ నాయకులందరూ వున్నారు. అప్పుడు నేను జెవివి ప్రధానకార్యదర్శిని. రోజూ యంపి చిన్న చిన్న సమావేశాలు (చర్చలు) చాలా మంది మేధావులతో నిర్వహించాడు. సిసిఎంబిలో సైంటిస్టులతో ఆయన జరిపిన సమావేశం నాకు ఇప్పటికీ గుర్తు. ఎంపి మేధో విశ్వరూపాన్ని అప్పుడు చూశాను. హైదరాబాదులోని శాస్త్రవేత్తలతో, శాస్త్ర పరిశోధనా సంస్థలతో ఆయనకు చాలా దగ్గర సంబంధాలుండేవి. వారిలో ప్రొ. డి బాలసుబ్రమణియన్, పీఎం భార్గవ (ఇద్దరూ సిసియంబి డైరెక్టర్లుగా పనిచేసిన వారు) ముఖ్యులు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కున్న ఈ అవకాశం ఏ రాష్ట్రానికి లేదని ఆయన చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ చెవుల్లో రింగుమంటున్నాయి. అనంతపురం జిల్లాలో తీవ్రమైన కరువు వచ్చినపుడు (2004) జెవివి పెద్ద ఎత్తున గంజికేంద్రాలు నిర్వహించింది. “గంజికోసం క్యూలో నిలబడే ప్రతి ఒక్కరూ ఒక కట్టెపుల్లను తీసుకొని రమ్మని చెప్పండి” అని యంపి చెప్పిన మాటలు గుర్తుకొస్తే ఇప్పుడు కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. గత సంవత్సరం మేము కొందరం పరమేశ్వరన్ గారిని పరామర్శించడం కోసం త్రిసూర్ వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మేము ఏమి చేస్తున్నామో అడిగాడు. మేము ఆ సభా, ఈ సదస్సూ జరిపామంటూ చెపుతుంటే వారించి “ఇవన్నీ సరే ప్రజలకు నేరుగా ఫలితం వచ్చేవి ఏం చేస్తున్నారు” అని నిలదీసినంత పని చేసాడు. మేము తలవంచుకొన్నాం.ఇదీ యంపి అంటే!
నేనూ ఒకడినిగా
ఆ రోజుల్లో భారత జ్ఞాన విజ్ఞాన సమితి బాద్యతల కోసం, దేశవ్యాప్త సాక్షరతా ఉద్యమం కోసం ఆయన ఎక్కువకాలం ఢిల్లీలో వుండేవాడు. ఒకరకంగా అక్కడే మకాం పెట్టాడు. నేను కూడా AIPSN, బిజివియస్ జాతీయ బాధ్యతల్లోకి వచ్చిన రోజులవి. మాకు కొంతకాలం ఎస్ ఆర్ శంకరన్ గారు అధ్యక్షులు. ఎంపీ తన కలలూ, ఆలోచనలూ కుమ్మరిస్తుండేవాడు. కృష్ణకుమార్ (కె కె) వాటికి సృజనాత్మక ఆచరణ రూపమిస్తుండేవాడు. శంకరన్ గారు నవ్వుతూనూ, గంభీరంగానూ వుంటూనే “మనం చేస్తున్న పని చాలా చిన్నదనీ, ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సివుందనీ హెచ్చరిస్తుండేవాడు. ఇక వినోద్ రైనా గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన గొప్ప దార్శనికుడు, హక్కుల యోధుడు, లోతైన మనిషి. విద్యాహక్కు చట్టం రూపకల్పనలో, దానికి ప్రజా సైన్సు సంస్థల మద్దతును, భాగస్వామ్యాన్ని కూడగట్టడంలో ఆయన చూపిన చొరవ అద్భుతమైనది. మూడు రోజుల పాటు అప్పుడు రాష్ట్రానికి ఒకర్ని పిలిచి NCERT లో జరిపిన చర్చ మరుపు రానిది. ఆంధ్రప్రదేశ్ నుంచి నేను దీనికి హాజరయ్యాను. యంపితో, వినోద్ రైనాతో ఆ చట్టంలోని కొన్ని క్లాజుల విషయంలో బాగా గొడవపడ్డాను.

నేను ఉపాధ్యాయ ఉద్యమం (యుటియఫ్) నుంచి సైన్సు ఉద్యమం లోకి వచ్చిన వాడిని. పరమేశ్వరన్ టీచర్ల వల్లనే తరగతి గదీ, సమాజమూ మారిపోతాయన్నంతగా ఆవేశపడిపోతుండేవాడు. కానీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం తమ ఆర్థిక సమస్యల చట్రంలో ఇరుక్కుపొయ్యాయని ఆవేదన పడుతుండేవాడు. ఆంధ్రప్రదేశ్ లో యుటియఫ్ అక్షరాస్యతా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం చూసి దేశంలో ఎక్కడా లేని ధోరణిగా దీన్నాయన చెపుతుండే వాడు. మరీ యుటియఫ్ నేత రామిరెడ్డి గారిని A deferment leader అనేవాడు!
ఆల్ ఇండియా స్థాయిలో బిజివిఎస్, AIPSN కమిటీల్లో 10- 12 మందికి మించి వుండేవారు కాదు. వాటిలో శంకరన్ లాంటి ఎంత గొప్పవారున్నా యంపినే అందరికీ అసలైన నాయకుడు. నాకూ వారిలో ఒకడిగా చాలా కాలం వారి మధ్య వుండే అవకాశం కలిగింది. ఏ విధంగా చూసినా వారితో పోలిస్తే నేను అంగుష్టమాత్రుడిని! మనకంటే గొప్పవారితో కలిసి పని చేస్తే కదా మనమెంత అల్పులమో తెలిసేది. మన అహంకారం చల్లబడేది. నిత్యం నేర్చుకునే అవకాశం కలిగేది.
నన్ను తీవ్రంగా ప్రభావితం చేసిన వారిలో ఇద్దరు ముగ్గురి పేర్లు చెప్పాల్సి వస్తే పరమేశ్వరన్ గారి పేరు చెప్పి తీరాలి. ఒక్క నేనే కాదు కేరళ నుంచి కాశ్మీర్ దాకా వేలాది మంది మా కార్యకర్తలందరూ, చిన్నాపెద్దా తేడాలేకుండా ఇదే చెబుతారు. ఇదీ యంపి వ్యక్తిత్వం. ఇదీ ప్రజాసైన్సు ఉద్యమంలో ఆయన పాత్ర!




