సంపాదకీయం

“బడి అంటూ ఒకటి పెట్టి, అందులో పిల్లల్ని కూర్చోబెట్టి, చదువు అనే కసరత్తు నేర్పడం చరిత్రలో ఎప్పుడు మొదలైందో గానీ మానవేతిహాసంలో అది మాత్రం దుర్ముహూర్తాల్లోకెల్లా దుర్ముహూర్తం. ఈ బడి ఎన్ని భావోద్వేగాల్ని మంటగలిపిందో, ఎంత సృజనాత్మకతకు పాతర పెట్టిందో, ఎన్ని ఆలోచనలల్ని మొగ్గలోనే తుంచేసిందో ఎన్ని హక్కుల్ని కాలరాసిందో, ఎవ్వరూ తూకం వెయ్యలేని ఎంత విషాదాన్ని బాల్యానికి బలవంతంగా అంటగట్టిందో చెప్పగలిగిన వారెవరూ లేరు. ఇది మహా మహా ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన విషాదం కన్నా పెద్ద విషాదం. మహాప్రళయాలు సృష్టించిన బీభత్సం కన్నా పెద్ద బీభత్సం” ఈ మాటలు ఒక పిల్లల ప్రేమికుడన్నవి.

నాగరిక సమాజం ఏర్పడక ముందే ఏదో రూపంలో బడి వుంది. మనిషి చుట్టూ వున్న ప్రపంచం మారే కొద్దీ అదీ మారుతూ వస్తోంది. మధ్యయుగాల్లో నైతికబోధ పేరుతో మతవ్యవస్థలు దానిపై పట్టు బిగించాయి. ప్రజాస్వామ్య యుగంలో రాజ్యం దాన్ని మానవాభివృద్ధి పేరుతో గుప్పిట్లోకి తీసుకుంది. ఆయా రాజ్యాల్ని బట్టి వాటి పాలకుల్ని బట్టి బడి ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటోంది. అందులోని ఉపాధ్యాయుల తీరులో మార్పులొస్తున్నాయి.

ఇప్పుడు గత అర్ధశతాబ్దంగా బడి ఉనికినే ప్రశ్నించే గొంతులు వినబడుతున్నాయి.

బడి మీద వున్న మొదటి విమర్శ ఏమంటే అది పిల్లల సున్నిత సహజ స్వభావాన్ని ఏమాత్రం అర్థం చేసుకోదని. వాళ్లకు స్వేచ్ఛగా అక్కడుండే అవకాశం లేదని. క్రమంగా అది పిల్లల్ని మొద్దుబారుస్తుందని. అందులో ఏ సృజనాత్మకతకు చోటు వుండదని. అక్కడ ఉన్నదంతా కృత్రిమమని.

బడిలో ఉపాధ్యాయులూ, పిల్లలూ ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే పద్ధతి లేకపోవడం పెద్ద సమస్య అయితే పిల్లలందరినీ ఒకే గాట గట్టి చివరికి అందర్నీ బేబే అనే గొర్రెల్లా మార్చడం ఇంకా పెద్ద సమస్య. అందుకే ఐన్ స్టీన్ “బడి తాబేలును, కుందేలును, ఏనుగును, కోతిని ఒకటి చేసి చెట్టెక్కడమనే పరీక్ష పెడుతుం”దంటాడు. అసలు బడి వదిలాక పిల్లలకు ఏది మిగులుతుందో అదే జ్ఞానమంటాడు. ఫెయిల్ అవుతున్నది బడే తప్ప పిల్లలు కాదంటాడు.

రాజ్యం బడిని ఒక చట్రంలో ఇముడ్చుతుంది. తన రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టు ప్రతిదాన్నీ కంట్రోల్ చేస్తుంది. పిల్లల ఆలోచనల్ని నియంత్రిస్తుంది. అంతిమంగా వ్యవస్థను అంగీకరించి దానికి లోబడి వుండేలా మారుస్తుంది. టీచర్లు కూడా తమకు తెలియకుండానే ఈ పని సమర్థవంతంగా చెయ్యడంలో పోటీ పడతారు.

ఆధునిక యుగంలో అయితే మంచి పనిమంతుల్ని తయారు చెయ్డం విద్యాలక్ష్యంగా వుంటుంది. లేబర్ మార్కెట్లో సరఫరా అవసరానికి మించి వుండేలా చూడ్డం దాని ప్రధాన బాధ్యత అవుతుంది.పిల్లలు బడిని దాటి బయటి ప్రపంచాన్ని గురించి తెలుసుకోకుండా జాగ్రత్త పడుతుంది. సొంత సంస్కృతి నుంచి దూరం చేసి పరాయీకరించే పని చదువుల ద్వారా చేయిస్తుంది. అందుకే రూసో “మనిషి స్వేచ్ఛగా పుడతాడు. కానీ ప్రతి చోటా అతన్ని సంకెళ్ళు బంధిస్తాయి. పన్నెండేళ్ళ తర్వాత పిల్లల్ని సమాజానికి వదిలేయాలి. ప్రకృతిని బట్టి వారి వారి స్వంత పురోగతిని నిర్ణయించుకునే స్వేచ్ఛనివ్వాలి” అంటాడు

ఆధునిక యుగంలో అయితే విద్య అంటే పాశ్చాత్యీకరణ. వలసకారుల జ్ఞానాన్నే గాదు వారి సంస్కృతిని కూడా మన మెదళ్ళలో దట్టించడం. పారిశ్రామిక యుగానంతరం చర్చి నుంచి రాజ్యం విద్యను స్వాధీనం చేసుకున్నాక విద్యా స్వభావమే మారిపోయింది. నిపుణ కార్మికుల్ని తయారు చేయడం, పిల్లల్ని ప్రపంచానికి దూరం చేయడం విద్యకు లక్ష్యాలుగా పెట్టుకుంది. దీనికి తగ్గట్టు సిలబసు తయారవుతోంది. బోధనా విధానాలుంటున్నాయి. పరీక్షలు పెడుతున్నారు. అంతిమంగా వ్యక్తిత్వానికి, సృజనకు చెల్లు చీటీ ఇస్తున్నారు.మనిషిని మనిషి గాకుండా చేస్తున్నారు. పరీక్షలను ఏకైక లక్ష్యాలుగా మార్చి వల్లేవేతల్ని, నాలుక మీద గుర్తు పెట్టుకోవడాన్నిసర్వస్వంజేసి సహజ సామర్ధ్యాలను అణచివేసే కర్తవ్యాన్ని బడి వీలున్నంత సమర్థవంతంగా నిర్వహిస్తోంది. దీన్నిబట్టే దాని ప్రమాణాలను నిర్ణయిస్తున్నారు. అందుకే మన చదువులని రస్కిన్ “నెగటివ్ ఎడ్యుకేషన్ “అంటాడు.

బలవంతపు చదువుల్ని నెత్తిన రుద్ది ఆఫ్రికన్లని అమెరికా కెనడా సంస్కృతుల్లోకి మార్చడం చూశాక బడి మీద తిరుగుబాటు మొదలైంది. అసలు అందరికీ విద్య అవసరమా ? పుట్టిన ప్రతి బిడ్డా బడిలో చిక్కుకోవాల్సిందేనా? టీచర్ల దగ్గర మాత్రమే జ్ఞానమంతా రాసి పోసి వుందా? పిల్లలు కేవలం మైనపు ముద్దలా? బండారాళ్లా? టీచర్లే వీళ్ళని సకల లక్షణ సంపన్నులుగా మార్చగలరా? అనే ప్రశ్నలు తలెత్త సాగాయి.

 ఇలాంటి ప్రశ్నలు సంధించిన వాళ్లలో మొదటివాడు కాదు గానీ ఇవాన్ డొమినిక్ ఇల్లిచ్ ప్రముఖుడు. ఆయన Deschooling Society బడి పై తీవ్ర ధిక్కరణ. ఆయన దృష్టిలో ప్రస్తుత చదువులసారమంతా జీవితాన్ని వ్యవస్థీకృతం చేయడమే. అసలు పెట్టుబడిదారీ విధానమే యుద్ధాలకు అనివార్యంగా దారి తీస్తుందని సిద్ధాంతీకరించి అందుకు తగ్గ చదువుల్ని వ్యవస్థీకృతం చేయడమే దాని పని అని తీర్మానిస్తాడు. అందరికీ నిర్బంధ విద్య అనే నినాదంలోనే పెద్ద కుట్ర దాగి ఉందనేదాకా ఆయన వెళతాడు.

ఇక సమ్మర్ హిల్ లాంటి అద్భుత ప్రయోగం చేసిన ఏ ఎస్ నీల్ పిల్లల్ని బడి చూసే విధానాన్ని, బోధనా పద్ధతుల్ని, మొత్తంగా బడిని మార్చాలని జీవితమంతా ఖర్చు చేసి బడిని బాగుపరచడం అయ్యే పని కాదనే నిర్ణయానికి వస్తాడు. బడి వ్యతిరేకిగా మారతాడు. “పిల్లల్ని ఒంటరిగా వదిలేస్తే వారు సహజంగా ఎదుగుతారు. ఈ పనిని టీచర్లు ఎప్పటికీ చెయ్యలేరు. వ్యక్తిగత శ్రద్ధ చూపడం బడికి ఎప్పుడూ సాధ్యం కాద” ని వాదిస్తాడు.

ఇంకో అడుగు ముందుకేసి “ఈ బడికి బాగా సుస్తీ చేసింది దీనికి మరణమే మంచిది. బడిలో నేను నేర్చుకున్నది ఏమీ లేదు. Copy and Paste తప్ప” అంటాడు లార్క్. “నియతవిద్య అనేది సొంత విద్యను, సొంత అభ్యసన హక్కును నిరాకరిస్తుంది. మానవ హక్కులకిది భంగకరం” అంటాడు జాన్ కాల్ డ్వెల్ హోల్డ్. “

అమెరికాలో ఇప్పటికీ నాలుగో వంతు పిల్లలు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడనే నమ్ముతారు. మరి ఈ బడి ఏమి సాధించినట్టు? నాలుగు గోడల మధ్య రైమ్స్ వల్లించే పిల్లల కన్నా చేలగట్ల మీద తిరిగే పిల్లలకు తక్కువ మెదడు వికసిస్తుందని ఏ శాస్త్రం చెబుతుంది? ఆరోగ్య సంరక్షణా ఆసుపత్రి వైద్యం ఒకటేనా ? వ్యక్తిగత భద్రతా పోలీసు రక్షణా ఒకటేనా? జ్ఞానమూ బడీ కూడా ఇంతే అనే వాదాలూ వున్నాయి.

అక్కడితో ఆగక అమెరికా ఫెడరల్ కోర్టులో బడి మీదనే కేసులు వేసిన వారున్నారు. దీన్ని మూసెయ్యాలని యుద్ధం చేస్తున్న వారూ బయలుదేరారు. ఈ వాదాలకు ఫాలో ఫెయిరీ లాంటి వాళ్ళని తోడు తెచ్చుకునే వాళ్ళూ లేకపోలేదు.

మరి చదువు అక్కరలేదా ? ఈ ఆధునిక యుగంలో ఇది సాధ్యమా? బడి లేని నాగరిక సమాజాన్ని ఊహించగలమా? ఆధునిక శాస్త్ర సాంకేతిక యుగంలో మనిషి తానుగా నిలదొక్కుకొని శక్తివంతంగా భాగస్వామి కావాలి కదా ? సమర్థ ప్రాణిగా చెలామణీ కావాలి కదా. దీనికి తగ్గ జ్ఞానం బడిలో దొరకదనుకుంటే మరో దారి ఏమిటి? అంటే బడి లేని చదువు ఎలా అనే ప్రశ్నలకు సమాధానంగా ఇంటి చదువు(Home Schooling )ముందుకొచ్చింది. దీన్నిప్పుడు జీవన విద్య (Life Education) అని కూడా అంటున్నారు.

“మా ఇంటి పరిసరాల్లో ఎదిగినప్పుడే మా బిడ్డకు న్యాయమైన జ్ఞానం లభిస్తుంది. ఇక్కడ ఒత్తిడి వుండదు. సొంత అభ్యసనం ఉంటుంది. సృజనాత్మకత, స్వేచ్ఛ వుంటాయి. మన పిల్లలు మనకిష్టం వచ్చిన సిలబసుతో, మనకు నచ్చిన వేళల్లో సహజ పద్ధతిలో నేర్చుకోవచ్చు. వ్యక్తిగత శ్రద్ధ పెట్టవచ్చు. అన్నిటికంటే మించి పరిసర వాతావరణం నుంచి పరాయికరణ చెందరు” అనే నిర్ణయానికొస్తున్నారు.

మరి బిడ్డల సామాజికీకరణ ఎలా అంటే ” పిల్లల క్లబ్బులు. ఇంటిబడుల బృందాలు, క్రీడల టీములు, సామాజిక కార్యక్రమాలు దీన్ని బడికంటే సమర్థవంతంగా సాధిస్తాయి. ప్రకృతిలో పెరిగిన పిల్లలకే మానవ సంబంధాలు ఎక్కువ ” ఇలాంటి వాదాలు, నమ్మకాలు ఇంటి చదువుల చుట్టూ పెరుగుతున్నాయి. దీనికోసం తల్లిదండ్రులు కమిటీలుగా ఏర్పడుతున్నారు. ఇంటి వద్దనో, సామాజిక భవనాల్లోనో, పార్కుల్లోనో పాఠాలు ప్రారంభిస్తున్నారు.

క్రమంగా ఇలాంటివి వెల్లువలా వెలుస్తున్నాయి. మరీ మానసికంగా ఎదగని పిల్లలు వీటిపట్ల ఆకర్షితుల వుతున్నారు. ఒక్క బ్రిటన్ లోనే 50 వేల తల్లిదండ్రుల గ్రూపులు ఇలాంటివినడుపుతున్నామని ప్రకటించాయి. ఒక అంచనా ప్రకారం వీటిలో 1.75 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలన్నిటా ఈ వరవడి మొదలైంది. కరోనా తరువాత మరీ ఇది పుంజుకుంది.

ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నాయి. గుర్తింపునిస్తున్నాయి.బోర్డు పరీక్షలకు అనుమతిస్తున్నాయి. ఆన్లైన్ సదుపాయం వచ్చాక వీటి సేవలకు మార్గం మరింత సుగమం అయింది. ఈ మధ్య క్రమంగా వీటిలోకి విద్యా వ్యాపారులతోపాటు ఎడ్యుటెక్ కంపెనీలు కూడా జొరబడుతున్నాయి. అది వేరే సంగతి.

మన దేశంలోనూ ఈ ధోరణి పెరుగుతోంది. ప్రధానంగా బెంగళూరు, బొంబాయి, చెన్నై వంటి నగరాల్లో ఇలాంటి చదువును ఉన్నత మధ్య తరగతి వర్గాలు కోరుకుంటున్నాయి. విద్యార్థికురాళ్లయిన తల్లులు ఇందులో ముందుంటున్నారు. వీటిలో పనిచేస్తున్నారు. కావలసిన నిపుణుల్ని వీటి కోసం తెచ్చుకుంటున్నారు.

మన విద్యా హక్కు చట్టం ఈ తరహా చదువుల్ని ఒప్పుకుంటుందా అనే ప్రశ్న వచ్చినప్పుడు కోర్టు ” 14 ఏళ్ల లోపు పిల్లలకు విద్యనందించడం ప్రభుత్వ బాధ్యత అని విద్యా హక్కు చట్టం చెబుతోంది గానీ , తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా చదివించుకోవాలి అనేది వారి హక్కు మాత్రమే”నని తీర్పునిచ్చింది. CBSE, ICSE లాంటి బోర్డులు కూడా వీటికి తలుపులు బార్లా తెరిచాయి. ఇదంతా ఎంత దూరం వెళ్లిందంటే స్వయంగా తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు తగ్గడానికి ఇంటి విద్య కూడా ఒక కారణమని పేర్కొనాల్సి వచ్చింది.

మనం గుర్తించాల్సిందేమంటే ఇంటి చదువులనేవి విద్యను గురించిన ఒక కొత్త తాత్వికత నుంచి పుట్టుకొచ్చినవని. అవేమీ ఆషా మాషీగా మన ప్రస్తుత బడులపై విసుగుతోనో, పోటీగానో వచ్చినవి కావు. పిల్లల పట్ల, వారి సహజమైన ఎదుగుదల పట్ల, వికాసం పట్ల తీవ్రమైన ఆకాంక్ష నుంచి పుట్టుకొచ్చినవివి. ఇవి గొప్ప ప్రజాస్వామిక ఆకాంక్షలు. బలీయమైన మానవ హక్కుల అభిలాషలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *