డా. నాగసూరి వేణుగోపాల్
డాక్టర్ బి.ఆర్. రావు గా ప్రఖ్యాతులైన వారి పూర్తిపేరు బెర్రి రామచంద్రరావు. ఆయన పేరెన్నిక గన్న భౌతిక శాస్త్రవేత్త, బోధన, పరిశోధనలలో రాణించడం విశేషం కాకపోవచ్చు. ఆయన విద్యారంగం, పరిపాలనారంగాల్లో కూడా సేవలందించారు; రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.
సత్యనారాయణ, సుభద్రమ్మ దంపతులకు రెండో సంతానంగా డా. రావు 1922 నవంబరు 21న విశాఖపట్నం జిల్లా యలమంచిలి గ్రామంలో జన్మించారు. విశాఖపట్నం మిసెస్ ఏవియన్ హైస్కూలులోనూ, తర్వాత అదే సంస్థకు చెందిన కళాశాలలో చదివారు. ఈ కళాశాలలోనే సి.వి.రామన్ చదవడం విశేషం. సి.వి.రామన్ వద్ద పరిశోధన చేసిన డా. సూరి భగవంతానికి పరిశోధనలో శిష్యుడు బి.ఆర్.రావు. 1941లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బి.ఎస్సీ. ఆనర్స్ పట్టా పొందిన తర్వాత 1944-45లో ఎం.ఎస్సీ (భౌతిక శాస్త్రం) పూర్తి చేశారు. ఆయన చేసిన కృషికి మెట్కాఫ్ మెడల్ లభించింది. పిమ్మట డా. సూరిభగవంతం వద్ద అతిధ్వనులు (Ultra Sonics) ప్రధాన అంశంగా పరిశోధన ప్రారంభించారు. ఎక్కువ పౌనఃపున్యంగల అతిధ్వని తరంగాల కాంతి వివర్తనం – అనే అంశంతో 1948లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డి.ఎస్సీ. పొందారు. డి.ఎస్సీ.తో ఆయన అతిధ్వనుల పరిశోధన ఆగలేదు, కొనసాగింది. కనుకనే చాలా ఉపయోగకరమైన కొత్త విధానాలు, పరికరాలను డా.బి.ఆర్.రావు రూపొందించారు. ఎం.ఎస్సీ. కాగానే అక్కడే డిమాన్ స్ట్రేటర్ గా చేరి మూడేళ్ళకు సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ అయ్యారు. 1950లో ఆంధ్ర విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగంలో లెక్చరర్ గా చేరి, 1953లో రీడర్, 1958లో ప్రొఫెసర్ అయ్యారు.
1951లో తొలి కామన్వెల్త్ సీనియర్ రీసెర్చి ఫెలోగా ఆస్ట్రేలియాలో ప్రొఫెసర్ డి.ఎఫ్. మార్జిన్ దగ్గర అయనోస్పియరిక్ స్పేస్ ఫిజిక్స్ లో పరిశోధన చేశారు. ఇది ఆయనకు పెద్ద మలుపు. ఈ రంగంలో భారతదేశంలో ఎంతో కృషి చేసిన డా.ఎస్.కె.మిత్రాతో పరిశోధనా పరిచయం కలిగింది. ఈ విభాగంలో డా.బి.ఆర్.రావు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రూపొందించిన ప్రయోగశాల అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. అక్కడ ఆ స్థాయి వనరులూ, నైపుణ్యం ఒనగూడాయి.
కేవలం పరిశోధన మాత్రమే కాక, ఏకకాలంలో బోధన గురించి కూడా ఎంతో దృష్టి పెట్టారు. స్నాతకోత్తర కోర్సులు రూపొందించి, భవిష్యత్ పరిశోధనలకు బాటలు వేశారు. అవసరమైన పాఠ్య ప్రణాళికనే కాదు. పాఠ్య పుస్తకాలను కూడా వెలువరించారు. ‘ఫిజిక్స్ ఆఫ్ సాలిడ్ స్టేట్’ అనే పుస్తకం ఎంతో గౌరవాన్ని పొందింది. అమెరికాకు చెందిన అకడమిక్ ప్రెస్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. వీరి నేతృత్వంలో కాంతి, అతిధ్వనులు వివర్తనం, ఘన పదార్ధాల స్థితి స్థాపకతాస్థిరాంకాలు, ద్రవ పదార్ధాల్లో అతిధ్వనుల వేగం, విక్షేపణం, శోషణం వంటివీ, పాలిమట్ల, విద్యుత్ విశ్లేషణలు మొదలైన అంశాలకు సంబంధించి ఎంతో పరిశోధన జరిగింది. వీటికి సంబంధించి 100కు పైగా పరిశోధనా పత్రాలున్నాయి. ఎన్నో పిహెచ్. డి. పరిశోధనలకు నిర్దేశకత్వం వహించారు. ట్రాన్సిస్టర్ లో విసరణం (డిఫ్యూషన్) మొదలైన పరిమితులను కొలవడానికి డా. రావు చాలా సరళమైన, మెరుగయిన విధానాలు రూపొందించారు. అతిధ్వనుల వేగాన్ని, శోషణాన్ని అధ్యయనం చేయడానికి కొత్త విధానం ఏర్పరచారు. అలాగే ద్రవ, వాయు పదార్ధాల్లో అతి ధ్వనుల ఉష్ణోగ్రత తేడాలను విశ్లేషించారు. సూర్యుని లోని మచ్చలకు సంబంధించి శోధన చేశారు. హారిజాంటల్ అయనోస్ఫియరిక్ గాలులకు సంబంధించి ఎంతో కృషి చేశారు.

పరిశోధనలు, వాటి ప్రణాళిక, ఫలితాల ప్రచురణ నూతన పరికరాల రూపకల్పన ఒకవైపు సాగగా; మరోవైపు బోధన, పాఠ్య ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకాల ప్రయోగశాలల ఏర్పాటు ఉన్నాయి. ఈ రెండూ కాక పరిశోధనకు సంబంధించి మరింత పై స్థాయిలో కృషి చేశారు. అందువల్లనే 1971లో ఆప్టికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ ప్రారంభమైంది. దీనికి అనుబంధంగా మూడు నెలలకోసారి ‘ది జర్నల్ ఆఫ్ ది ఆప్టికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ – ప్రచురణ ప్రారంభించారు. 1972లో ఇండియన్ ఫిజికల్ సొసైటీ విశాఖపట్నం శాఖను ప్రారంభించారు. 1977-’80 కాలంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. 1982లో తిరుపతిలో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షులు. అమెరికా, స్పెయిన్, బ్రెజిల్, జర్మనీ, మలేషియా, జపాన్ మొదలైన ఎన్నో దేశాలకు పరిశోధన నిమిత్తం పర్యటించిన డా.బి.ఆర్.రావు ఇండియన్ నేషనల్ కమిటీ ఆఫ్ ఇంటర్ నేషనల్ యూనియన్ ఆఫ్ రేడియో సైన్స్ ఛైర్మన్ గా ఉన్నారు.

1974-76 కాలంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ఉపాధ్యక్షులుగా ఎన్నో ఉపయుక్తమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితంగా విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీ సర్వీస్ సెంటర్, ఇన్ స్ట్రుమెంటేషన్ సెంటర్ వంటివి ఏర్పడ్డాయి. వీటిని సమన్వయం చేయడానికి ముంబయి, బెంగుళూరులలో ప్రాంతీయ కేంద్రాలు కూడా వెలిశాయి. సైన్స్ విద్య ఆధునికీకరణకూ, విశ్వవిద్యాలయాలు, కళాశాలల మధ్య అంతరాలు తగ్గడానికీ వీరు చాలా కృషి చేశారు. మన విశ్వవిద్యాలయాల్లో కంప్యూటర్లు వీరి హయాంలోనే ప్రవేశించాయి. యువశాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి అవార్డులు ప్రారంభించారు. ద్రవిడ విశ్వవిద్యాలయం ఏర్పాటు కావాలని ఎంతో తాపత్రయపడి, శ్రీ పి.వి. నరసింహారావు ప్రధానిగా, శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న కాలంలో విశేష కృషి చేసి విజయం సాధించారు.
1976-83 కాలంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీరు ఒక్క భౌతిక శాస్త్రంలోనే కాకుండా వ్యవసాయం, ఆరోగ్యం, జీవశాస్త్రం వంటి ఇతర రంగాలతో సంబంధ బాంధవ్యాలు కలిగి వుండేవారు. 2005 సంవత్సరం సెప్టెంబరు 24న కీర్తిశేషులైన డా. బి.ఆర్. రావు కృషి, పట్టుదల అపూర్వం, అజరామరం!
రచయిత : డా. నాగసూరి వేణుగోపాల్, ప్రముఖ సైన్స్ రచయిత & ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు.
మొబైల్: 9440732392



