డా. యం. గేయానంద్

చరిత్రలో, కొన్ని కొన్ని సామాజిక శక్తులు సైన్స్ కు అండగా నిలిచాయి. అవి చరిత్రను ముందుకు తీసుకుపోయిన శక్తులు కూడా. వాటి అండతో, సైన్సులో జరిగే ఆవిష్కరణలు, కొత్త సామాజిక మార్పులకు దారి తీస్తాయి. ఒక్కోసారి సైన్సు మౌలిక భావాలలో కూడా మార్పు తెస్తుంది. అప్పుడు సమాజం విప్లవాత్మక మార్పులకు సిద్ధపడుతుంది. కానీ సమాజ గమనం మందగించినప్పుడు, వైజ్ఞానిక పురోగమనము కూడా, అంతంత మాత్రంగానే ఉంటుంది.

మధ్యయుగాలు అంటే ఏవి? . 500CE నుండి 1500CE దాకా మధ్య కాలాన్ని, సాధారణంగా మధ్యయుగాలు అంటారు. భారతదేశంలో 600CE నుండి 1750CE దాకా మధ్య కాలాన్ని మధ్యయుగాలని ఇర్ఫాన్ హబీబ్ అన్నాడు. యూరోప్ లో 450CE నుండి 1150CE మధ్య ఉన్న 700 సంవత్సరాల కాలాన్ని ఒక సంధి కాలంగా బెర్నాల్ భావిస్తాడు.

ఈ 700 సంవత్సరాలలో, మధ్యయుగాలలో యూరోప్ లో ఏం జరిగిందో చూద్దాం. గ్రీక్ రోమన్ సామ్రాజ్యాల కాలంలో ఒక వెలుగు వెలిగిన యూరోప్ లో చీకట్లు ముసురుకున్నాయి. దీన్ని చీకటి యుగం అని కూడా అంటారు.బానిసల తిరుగుబాట్లు, ఉత్పత్తిలో స్తంభన, ఆటవికుల దాడులు, భారంగా మారిన మిలటరీ ఖర్చులు, పాలకుల విలాసాలు, పాలకవర్గాలలో ఘర్షణలు- ఇవన్నీ కలిసి రోమ్ సామ్రాజ్యాన్ని పతనం వైపు తీసుకుపోయాయి. సామాన్యశకం 5వ శతాబ్దంలో, యూరోప్ ను కలిపి ఉంచిన ఒక విశాల సామ్రాజ్యం ముక్కలు ముక్కలైంది. ఆర్థికంగా రోమ్ చితికిపోయింది. వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. కానీ ఇది మరొక పరిణామానికి దారితీసింది. వికేంద్రీకరింపబడిన రాజకీయ ఆర్థిక వ్యవస్థలు అనేకం ఏర్పడటానికి ఇది దారితీసింది. చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉనికి లోకి వచ్చాయి. పాత సమాజాన్ని మార్చుకోవాల్సిన అవసరం వాటికి రాలేదు. అవి ఆర్థికంగా, సాంకేతికంగా కూడా ముక్కలు, ముక్కలై ఉన్నాయి. మళ్లీ, వెనుకటి రోజుల ప్రాథమిక స్థాయికి వెళ్ళాయి. నాటి సాంకేతిక స్థాయి, ఇనుప యుగాల సాంకేతిక స్థాయి కంటే కొంచెం ఎక్కువ. వాటికి, కొత్త మేధో విజ్ఞానాలతో పెద్దగా పని లేకపోయింది. కానీ రోమ్ పై దాడి చేసిన జర్మానిక్ తెగలు, కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టారు. పశ్చిమ ఉత్తర యూరోప్ లోకి పెద్దపెద్ద ఇనుప నాగళ్ళను ప్రవేశపెట్టారు. కానీ, వ్యాపారాలు, పరిశ్రమలు, పట్టణ జీవితాలు దెబ్బతిన్నాయి. క్రీస్తుశకం అయిదవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం దాకా, యూరోప్ పట్టణాలు క్షీణించి పోయాయి. విజేతలైన ఆటవిక తెగలు తమ వెంట తెచ్చిన సామాజిక నిర్మాణాలు ఒక కేంద్రీకృత ప్రభుత్వానికి సాంస్కృతిక ఐక్యతకు వీలు కల్పించనివి. క్రమేణా జీవన ప్రమాణాలు తగ్గడం ప్రారంభమైంది. వ్యవసాయం సన్నగిల్లింది. విస్తృతంగా వ్యాపించిన రహదారులను పట్టించుకునే వారు లేక పోయారు. నీటిపారుదల వ్యవస్థలు, ఓడమార్గాలు దెబ్బతిన్నాయి. వీటన్నింటితో పాటు వైజ్ఞానిక మేధో కృషి తగ్గిపోయింది. ఇలా ఒక 500 సంవత్సరాలు కొనసాగింది. యూరోప్ నిరంతర యుద్ధాలలో మునిగిపోయింది. పట్టణ జీవితం లేకుండా పోయింది. కానీ కాలం గడిచే కొద్దీ, వలసదారులుగా, ఆక్రమణదారులుగా వచ్చిన ఆటవిక తెగలు (హాన్స్, గోత్, వాండల్, బల్గర్, అలాని, సూచి, ఫ్రాంక్స్ మొ.) యూరోప్ సమాజంలో కలిసిపోయి స్థిరపడ్డారు.

క్రమేణా, ఉత్పత్తి వ్యవస్థలలో మార్పులు వచ్చాయి. సంపన్నులైన బానిస యజమానుల, కూలీనుల పాలన కూలి, బానిసలకు కొన్ని వెసులుబాట్లు ఉండే ఫ్యూడల్ పాలన వచ్చింది. బానిస, అర్థ బానిసగా మారాడు. అతనిప్పుడు, భూఎస్టేట్ లకు కట్టుబడి చాకిరి చేయాల్సిన వాడు. పాలకులలో కూడా మార్పు వచ్చింది. జర్మానిక్ ఆటవిక తెగలు, తూర్పు ప్రాంతాల్లో ఉండే కూలీనులు, కొన్నిచోట్ల అరబ్బులు పాలకులయ్యారు. అర్థ బానిసలకు భూమిపై , పరికరాలపై, పంటపై, అంతకు ముందు లేని కొన్ని హక్కులు వచ్చాయి. అయితే వ్యవసాయం వల్లా సమాజం అవసరాలు బోటా బోటిగా తీరేవి. తూర్పు ప్రాంతాల్లో వచ్చే అదనపు ఉత్పత్తితో వ్యాపారం జరిగే అవకాశం ఉండేది. కానీ ఫ్యూడలిజంలో జరిగే ఉత్పత్తికి, సైన్సు సాంకేతికలతో పెద్దగా అవసరం పడలేదు. వ్యాపారంలో, నావికా ప్రయాణాలలో కొత్త అవసరాలు ఏర్పడినప్పుడు మాత్రమే, అంటే మరికొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల తర్వాత మాత్రమే సైన్స్ అవసరం ఏర్పడింది. ఈ లోపల మేధో కృషి అంతా, మత వ్యవస్థల విశ్వాసాల చుట్టూ తిరిగింది. సైన్స్ కూడా మత చట్రంలో పరిణామం చెందింది. రోమన్ సామ్రాజ్యంలో కష్టాలను కడగండ్లను ఎదుర్కొనే సామాన్య జనానికి క్రైస్తవం ఒక ఆశను ఆసరాను కల్పించింది. క్రీస్తును ఒక విప్లవకారుడుగా చూశారు. అందుకే తిరుగుబాటు స్వభావం ఉండే యూదుల్లోకి మొదట క్రిస్టియానిటీ ప్రవేశించింది. అధికారంతో రాజీపడకపోవడం, శిక్షలకు గురికావడం, క్రైస్తవాన్ని సాధారణ ప్రజలకు దగ్గర చేసింది. మొదటి రెండు శతాబ్దాలు క్రైస్తవ మంటే గొప్ప ఆకర్షణ కనిపించింది. పాత అణచివేతల నాగరికతలతో ఏ సంబంధం లేని, అందర్నీ కలుపుకొనే మతంగా, అణిచివేత గురయ్యే కింది తరగతుల ప్రతినిధిగా చూశారు. అధికారం చలాయించే గ్రీకు కూలీనులకు జవాబుగా క్రైస్తవాన్ని స్వీకరించారు. అయితే క్రైస్తవం కింది తరగతుల మతంగా ఎంతో కాలం నిలువలేదు. క్రమేణా, పైవర్గాల వారు క్రైస్తవంలో చేరారు. వారి భావాలు క్రైస్తవంలో భాగమయ్యాయి. ఈ ప్రపంచంలోని బాధల గురించి కాకుండా, పరలోకం గురించిన ఆలోచనలు ఎక్కువ అయ్యాయి. మధ్యయుగాల సంస్కృతిని,ఇవి ప్రభావితం చేశాయి. విద్యను పరిపాలనను చట్టాన్ని వైద్యాన్ని కూడా చర్చి ప్రభావితం చేసింది. మరో రెండు మూడు శతాబ్దాలలోనే రాజ్యానికి సమాంతర శక్తిగా చర్చి తయారయింది. శిక్షలు వేసి, చర్చిని విచ్ఛిన్నం చేయడం అసాధ్యమని తేలిపోయింది. ఇక రాజులే క్రైస్తవంలో చేరడం ప్రారంభించారు. రోమన్ క్యాథలిక్ చర్చి చాలా సంపద కలిగిన శక్తివంతమైన వ్యవస్థ. క్రమేణా క్రైస్తవం అధికారిక మతమైంది. చిన్న చిన్న మతాలేవైనా, అవి క్రైస్తవ బోధనలకు స్వతంత్రంగా ఉండకూడదనే, అసహనం ప్రారంభమైంది. ఈ ప్రభావం మొదట విజ్ఞాన శాస్త్రం మీదే పడింది. గణిత శాస్త్రజ్ఞురాలు హైపేషియాను హత్య చేశారు. క్రీస్తు శకం 529లో ఏథెన్స్ లో ఉండే స్కూళ్లను అప్పటి క్రైస్తవ చక్రవర్తి జస్టినియన్ మూసి వేయించాడు. మౌడ్యంగా మారిన క్రైస్తవం, అప్పుడప్పుడే కొత్తగా తల ఎత్తిన ఇస్లాంలు అనేక మేధో సవాళ్లను విసిరాయి. బానిస సమాజం విచ్చిన్నమై ఫ్యూడల్ సమాజంగా మారే క్రమంలో ఇవన్నీ జరిగాయి.

యూరోప్ లో మధ్యయుగాల్లో ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉండేవో చూద్దాము. గ్రీక్ రోమన్ కాలాలనాటి విజ్ఞానాలు కానరాని కాలమది. జనం భూమి బల్లపరుపుగా ఉంటుందని, సముద్రపు చివర్లలో పడవ ప్రయాణం చేస్తే పడిపోయే ప్రమాదం ఉందని అనుకునేవారట. సముద్రపు రాక్షసులు ఉంటారని, సముద్రానికి ఆవలి వైపున విచిత్ర మనుషులు ఉంటారని అనుకునేవారు. దేవుళ్ళనే కాక దయ్యాలను నమ్మేవారు. ఇహలోక జీవితం అంత ముఖ్యం కాదు అనుకునేవారు. చర్చికి భూములు ఉండేవి. ప్రజలు చర్చిలకు పన్నులు కట్టేవారు. చర్చి నియమాలను ఉల్లంఘించకుండా జీవిస్తే, స్వర్గంలో స్థానం ఖాయం అనుకునేవారట. డబ్బున్న వాడే పుస్తకాలు చదువుకునేవాడు. ఆ పుస్తకాలు లాటిన్ లో ఉండేవి. అత్యధిక ప్రజలు లాటిన్ మాట్లాడేవారు కాదు. యూరోప్ లోని భూములు అన్ని కొన్ని వందల కుటుంబాల చేతుల్లోనే ఉండేవి. భూస్వాములు పెద్ద కోటల లాంటి నివాసాల్లో ఉండేవారు. ఈ కోటల చుట్టూ భూములు చూసుకునే సాధారణ ప్రజలు ఉండేవారు. కూలీనులు ఏ పనులు చేసేవారు కాదు. తమ్ము తాము గొప్పవారు అనుకునేవారు. రైతులు తట్టుకోలేక తిరుగుబాట్లు చేస్తే వాటిని అణిచివేసేవారు.

పాత బానిసల వ్యవస్థ ఒక్కసారిగా కూలిపోలేదు. అది క్రమేణా జరిగింది. బానిసల కొరత చాలా ఉండేది. దాంతో ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి వచ్చింది. మానవ శ్రమను ఆదా చేసుకొనే సాంకేతికాల అవసరం ఏర్పడింది. ఇందుకు గుర్రం సాధనంగా ఉపయోగపడింది. గుర్రం తేలిక పనులకు ఉపయోగపడేది. కానీ గుర్రాన్ని యుద్ధంలోనూ శాంతి కాలంలోనూ అన్ని పనులకు ఉపయోగపడేట్టుగా చేయాలంటే, గుర్రం పని సులువు చేయాలి. గుర్రపు జీను, గుర్రపు నాడ, అశ్వికుల పాదాలకు పెట్టుకునే జోడు,- ఇవన్నీ ఆ అవసరాన్ని తీర్చిన మద్యయుగపు ఆవిష్కరణలే. ఇక గుర్రం ముందుకంటే ఎక్కువగా బరువులు లాగటానికి ఉపయోగపడ సాగింది. అశ్విక సైనికుడు యుద్ధంలో కీలకంగా మారేడు. వ్యవసాయంలో గుర్రం ప్రవేశం కొత్త పంటలకు, ఉత్పత్తులు పెరగడానికి, ఆహార వినిమయం పెరగడానికి దారితీసింది. ఈ చిన్న ఆవిష్కరణలే అనేక సామాజిక మార్పులకు కారణమయ్యాయి.

మధ్యయుగాల్లో, మానవ శక్తికి జంతు శక్తికి తోడు ప్రకృతి శక్తులను వాడే కొత్త పద్ధతులను కూడా కనుక్కోవాల్సి వచ్చింది. నీరు గాలి ఇందుకు ఉపయోగపడ్డాయి. రోమనుల కాలం నాటి నీటి యంత్రాల విజ్ఞానం మూలన పడినా, ఇంకా ఎక్కడో మిగిలే ఉంది. ఉత్తర దక్షిణ యూరోప్ లలో చక్రాలతో కూడిన నీటి యంత్రాలు కనిపిస్తాయి. ఇంగ్లాండులో 1086 AD లో ఇటువంటి యంత్రాలు 5624 ఉన్నట్టు రికార్డు చేశారు. వీటిని ధాన్యాన్ని పిండి చేయటానికి వాడారు. అట్లే బట్టల తయారీలో కలపకోతలో, గింజల నుండి నూనె తీయడానికి వాడారు.

గాలి మరలు 12వ శతాబ్దం దాకా యూరోప్ కు తెలియదు. కానీ పర్షియాలో చైనాలో ఇవి ముందే ఉన్నాయి. అయితే యూరోప్ లో స్థానికంగానే వాటిని ఆవిష్కరించి ఉండొచ్చు. పెద్దగా నీరు దొరకని కరువు ప్రాంతాలలో (స్పెయిన్, ఇంగ్లండ్ దిగువ ప్రాంతాలు, కొంత నెదర్లాండ్ లో) గాలిమరలు వాడి ఉంటారు. వీటన్నింటి వల్ల యాంత్రిక జ్ఞానం పై అవగాహన పెరిగి ఉంటుంది.

క్రీస్తు శకం 10వ శతాబ్దం వచ్చేసరికి, చిన్న చిన్న రాజ్యాలు స్థిరపడి యూరోప్ లో ఒక రాజకీయ స్థిరత్వం వచ్చింది. శతాబ్దాలుగా కనుమరుగైన, గ్రీక్ రోమన్లనాటి విజ్ఞానాలను మళ్లీ వెలికితీయడం ప్రారంభమైంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సాంకేతికతలను అందిపుచ్చుకోవడం ప్రారంభమైంది. యూరోప్ లోకి సిల్క్ ఆ విధంగా వచ్చిందే.

ఉత్పత్తిని మెరుగు చేసుకోవాలంటే కొత్త పద్ధతులను కనుక్కోవాలి. పదవ శతాబ్దం వచ్చేసరికి అడవుల్ని నరికే పద్ధతులు, నీరు తక్కువగా ఉన్న వ్యవసాయం చేయడం అర్థమైంది. తొలి మధ్యయుగాలలో ఇది కొద్ది కొద్దిగా జరిగినా, విస్తృతంగానే జరిగింది. అట్లే విజ్ఞానాలకు, సంస్కృతులకు ఇస్లాంవేదికగా (సిరియా ఈజిప్టు పర్షియా) మారడం తొలిమధ్యయుగాలలో జరిగింది. మరోవైపు ఇండియా చైనాలలో వైజ్ఞానిక వికాసం చూస్తాం.

(వచ్చేనెల.. ‘మధ్యయుగాలలో సైన్సు- వెలుతురు, చీకట్లు-2, భారత్ చైనా పర్షియా, ఇతర దేశాల్లో ఏం జరిగింది?’) 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *